బహుకళా నేర్పరి ‘డా. తూములూరి’

(సాతితీ ప్రస్థానంలో 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా : 1980-2020)

ఒకే వ్యక్తి సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష ప్రతిభ కలిగి ఉండటం అరుదైన విషయం. వృత్తి ఒకటిగా, ప్రవృత్తి మరొకటిగా – రెండింటికీ సమానంగా న్యాయం చేస్తూ ముందుకు సాగిపోతుంటారు కొందరు. ఆ కొందరిలో ఒకరే డా. తూములూరి రాజేంద్రప్రసాద్. ఒకే వ్యక్తిలో ఎన్నో కోణాలను మనం చూడొచ్చు. రచయితగా, కవిగా, కాలమిస్ట్ గా, సమీక్షకునిగా, జర్నలిస్ట్ గా, న్యాయనిర్ణేతగా, టి.వి. యాంకర్ గా, ఆకాశవాణి వార్తల చదువరిగా విభిన్న రంగాల్లో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటూ పలువురి ప్రశంసలందుకుంటున్న మేటి డా. తూములూరి. వారి విజయపరంపరను పరిశీలిద్దాం.
బాల్యం : గుంటూరు జిల్లా, ఊటుకూరు గ్రామంలో ది. 16-4-1962వ తేదీన స్వర్గీయ తూములూరి నారాయణదాసు, వినయాదేవి పుణ్యదంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. తన తండ్రి ఆనాడే ఎమ్.ఎ. బి.ఇడి. చదువుకున్నారు. స్వాతంత్ర్యం రాకమునుపు గుంటూరులోని ఎ.సి. కళాశాలలో బి.ఎ. చదువుతున్నప్పుడు సినీనటులు స్వర్గీయ ఎన్.టి. రామారావు, కొంగర జగ్గయ్య, ప్రముఖ కవి కొండవీటి వెంకటకవి గారితో తండ్రిగారికి మిత్రత్వం ఏర్పడింది. ఈ పరిచయమే ఆయన్ను పద్య, గద్య రచనలు చేయడం, నాటకాల్లో నటించే స్థాయికి తీసుకెళ్ళింది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం డా. తూములూరికి దక్కిందనే చెప్పాలి. తండ్రిగారు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా గుంటూరు జిల్లాలో పలుచోట్ల పనిచేయడంతో డా. తూములూరికి ఎంతో మందితో పరిచయం, పలుప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, గ్రామీణ నేపథ్యం బాగా అలవాటైంది.

విద్యాభ్యాసం : పరస త్యాళ్ళూరు గ్రామంలో పాఠశాల విద్యాభ్యాసం అనంతరం పెదనందిపాడు గ్రామంలోని కళాశాలలో 1983వ సం.లో బి.ఎస్సీ (వృక్షశాస్త్రంలో) పట్టా పొందారు. నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. (సోషియాలజీ) పట్టా, మధురై కామరాజు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. (జర్నలిజం) పట్టాలు పొందారు. న్యూఢిల్లీలోని సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ నుండి హిందీలో డిప్లొమా, హైదరాబాద్ లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి అగ్రికల్చర్ లో డిప్లొమా, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో టైపురైటింగ్ హయ్యర్ గ్రేడుల్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చెన్నైలోని దక్షిణ భారత హిందీ ప్రచార సభనుండి ప్రవీణ పూర్తిచేశారు. హిందీ టైపు పరీక్షలో గుంటూరు జిల్లా ప్రధమునిగా వచ్చి సత్కరించబడ్డారు. పాఠశాల స్థాయిలోనే చిత్రకళపై మక్కువ పెరిగింది. చిత్రకారునిగానే తన బాల్యమిత్రులకు సుపరిచితులు. ప్రకృతి చిత్రాలను గీయటంలో నేర్పరి.

ఉద్యోగాలు : డిగ్రీ పూర్తయిన వెంటనే 1984వ సం.లో టెలిగ్రాఫ్ శాఖలో చేరారు. ఆ తరువాత 1985వ సం.లో కృష్ణాజిల్లా పరిషత్ నిర్వహించిన ఉపాధ్యాయ నియామకాల్లో ఎంపికై హనుమాన్ జంక్షన్ సమీపంలోని రామకృష్ణాపురం, రామన్నగూడెం ప్రాధమిక పాఠశాలల్లోను, విజయవాడ సమీపంలోని పి.నైనవరం ప్రాధమికోన్నత పాఠశాలలోను ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1986వ సం.లో మద్రాసులోని బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా బ్యాంకు ఉద్యోగానికి ఎంపికై పశ్చిమగోదావరి జిల్లా, ద్వారకాతిరుమల ఆంధ్రాబ్యాంక్ శాఖలో చేరారు. తరువాత గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో ఆంధ్రాబ్యాంక్ శాఖల్లో పనిచేశారు. ఆంధ్రాబ్యాంక్ ను యూనియన్ బ్యాంక్ లో విలీనం చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో విజయవాడ గవర్నరుపేట శాఖలో పనిచేస్తున్న డా. తూములూరి జూన్ 2019లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 34 సం.ల పాటు బ్యాంకు విధులు నిర్వహించి ఖాతాదారుల అభిమానాన్ని చూరగొన్నారు. మరిముఖ్యంగా ఉన్నతాధికారుల మన్ననలు, ప్రశంసలు పొందారు.

రచయితగా : 1980 సం.లో కళాశాల విద్యాభ్యాసం సమయంలోనే రచనలు చేయడం ప్రారంభించారు. కవితలు, వ్యాసాలు, పాటలు, సమీక్షలు, పీఠికలు, నాటకాలు – తదితర ప్రక్రియల్లో ఆరితేరారు. ఇప్పటికి 28 పుస్తకాలు ప్రచురించారు. వీటిలో పర్యావరణం అంశంపై ‘పర్యావరణం X మానవుడు’, ‘మనం – మన పర్యావరణం’, ‘ప్రకృతి – పర్యావరణ పరిరక్షణ’, ‘పర్యావరణాన్ని కాపాడుకుందాం’ , ‘పర్యావరణ అధ్యయన శాస్త్రం’, ‘పర్యావరణ విజ్ఞానశాస్త్రం’, ‘పర్యావరణ శాస్త్రం’, ‘పర్యావరణం – ప్రకృతి’, ‘ప్రకృతిని రక్షించుకుందాం’ అనే 9 పుస్తకాలు ప్రచురించడం విశేషం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపై 9 పుస్తకాలు రచించి, ప్రచురించిన ఏకైక రచయిత డా. తుమూలూరి కావటం విశేషం.
సమీక్షకునిగా : ఎందరో కవుల పుస్తకాలను సమీక్షించారు. దాదాపు 500 పుస్తక సమీక్షలు చేసి హైదరాబాద్ లోని జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ చేత 2015వ సం.లో ‘ఉత్తమ సమీక్షకునిగా’ అవార్డు అందుకున్నారు. వీటిల్లో 100 సమీక్షలను ఎంపికచేసి ‘సమీక్షా సమీరాలు’ పేరుతో 2014వ సం.లో పుస్తకం ప్రచురించారు. ఈ పుస్తకాన్ని శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ మచిలీపట్నంలో ఆవిష్కరించారు. వీరు వ్రాస్తున్న సమీక్షలకు ఆకర్షితులైన కవులు, రచయితలు తమ రచనలను సమీక్షకోసం పత్రికలకు పంపేటప్పుడు ‘నా పుస్తకాన్ని డా. తూములూరి చేత సమీక్ష చేయించండి’ అని అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

పీఠికా లేఖకునిగా : డా. తూములూరి వర్ధమాన కవులను ప్రోత్సహించటంలో దిట్ట. కొత్తగా కవి, రచయిత పరిచయమై నేను కవిత్వం వ్రాస్తున్నాను అని చెప్పినప్పుడు ‘పుస్తకంగా ముద్రించుకోండి, సమాజానికి పనికొస్తుంది, మీ రచనలు మీ దగ్గరే ఉంటే ఫలితం ఏముంది’ – అని సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే దాదాపు 60 మందికి పైగా పీఠికలు వ్రాశారు. అంతేకాక వారికి ప్రచురణ విషయంలోనూ సహకరిస్తుంటారు. ఈ పీఠికలు పాఠకులకు చేరువ చేయాలన్న తలంపుతో ‘పీఠకా సౌరభాలు’ పేరుతో 2016 సం.లో పుస్తకాన్ని ముద్రించారు.

కాలమిస్ట్ గా : విశాలాంధ్ర దినపత్రికలో పర్యావరణం అంశంపై ఆదివారం అనుబంధంలో నాలుగేళ్ళపాటు వ్యాసాలు వ్రాశారు. అనంతరం ‘యువ తరంగం’ శీర్షికన రెండేళ్ళపాటు వ్యాసాలు వ్రాశారు.

ఆకాశవాణి వార్తల చదువరిగా : స్వచ్ఛమైన ఉచ్ఛారణ, వాగ్దాటి, మంచి కంఠస్వరం ఉండటం చేత 1997లో ఆకాశవాణిలో తెలుగు వార్తలు చదువరిగా ఎంపికయ్యారు. కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణల వద్ద తర్ఫీదు పొందారు. ‘ఆకాశవాణి – ప్రాంతీయ వార్తలు చదువుతోంది తూములూరి రాజేంద్రప్రసాద్’ అంటూ విజయవాడ కేంద్రం నుంచి ఉదయాన్నే గం. 6-45 ని.లకు, మధ్యాహ్నం గం. 1-20 ని.లకు వార్తలు చదువుతూ తెలుగు శ్రోతల హృదయాల్లో గూడు కట్టుకున్నారు. వార్తలు చదవటంలో తనకంటూ ప్రత్యేక బాణీని ఏర్పరచుకున్నారు.

దూరదర్శన్ యాంకర్ గా : ఆకాశవాణి అనుభవం, రచయితగా, కవిగా ఉన్న అనుభవంతో విజయవాడ దూరదర్శన్ (సప్తగిరి) ఛానల్ వారు స్క్రిప్ట్ రైటర్ గా వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. అందమైన ముఖవర్ఛస్సు ఉండటంతో యాంకర్ గా, మోడరేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

అందుకున్న ప్రపంచ రికార్డులు : చిత్ర మాసపత్రికలో ఒకే సమయంలో (2012 సెప్టెంబర్) డా. తూములూరి వ్రాసిన 12 సమీక్షలు ఏకమొత్తంగా ప్రచురించబడ్డాయి. ఇది ముద్రణా రంగంలో ఒక ప్రపంచ రికార్డుగా గుర్తించబడింది. ఒకే సమీక్షకుడు వ్రాసిన 12 సమీక్షలు గతంలో ఏ పత్రికలోనూ ముద్రించబడలేదు. ఇందుకుగాను ఎవరెస్ట్ వరల్డ్ రికార్డు, ఎసిస్ట్ వరల్డ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, వరల్డ్ ఎమేజింగ్ రికార్డు, మిరాకిల్ వరల్డ్ రికార్డులు వీరి స్వంతమయ్యాయి.

పొందిన బిరుదులు : 1995 సం.లో ‘Best Young Writer’, 2006 సం.లో ‘విశ్వదాత’, 2009 సం.లో ‘పర్యావరణ రత్న’, 2013 సం.లో ‘సంఘమిత్ర’ బిరుదులు అందుకున్నారు. 2012 సం.లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు వీరు చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘జీవ వైవిధ్య రక్షక్’ బిరుదును ఇచ్చి సత్కరించడం విశేషం. 2019 సం.లో రాజమండ్రిలోని ఆచార్య రాజాజీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ సంస్థ వారు ‘కళాసేతు’ బిరుదుతో సత్కరించారు.
గౌరవ డాక్టరేట్ ప్రదానం : వివిధ రంగాల్లో, విభిన్న అంశాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకుని తనదైన శైలిలో సాహితీ సాంస్కృతిక రంగాల్లో అహరహం కృషిచేస్తూ పర్యావరణ పరిరక్షణకు విశేషంగా పాటుపడుతున్న తూములూరికి ‘Jesus Christ Prayer Fellowship Ministries’ వారు ‘గౌరవ డాక్టరేట్’ను ఇచ్చి సత్కరించారు.

డాక్టర్ పట్టాభి కళాపీఠము స్థాపన : కవులు, కళాకారులు, రచయితలను ప్రోత్సహించాలనే దృక్పధంతో తాను పనిచేసిన ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకులైన డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో 2010 సం.లో ‘డా. పట్టాభి కళాపీఠము’ సంస్థను స్థాపించారు. ఆనాటినుండి పట్టాభి జయంతి ఉత్సవం, వార్షికోత్సవం, కవి సమ్మేళనాలతోపాటు వివిధ సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన తొమ్మిది మందికి ‘నవరత్నాలు’ పేరుతో ‘పట్టాభి అవార్డు’ ఇచ్చి సత్కరించడం జరుగుతోంది. పట్టాభి అవార్డును కేంద్రప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ అవార్డుతో సమానమని అవార్డు గ్రహీతలు భావించటం చెప్పుకోతగ్గ విషయం. డా. పట్టాభి కళాపీఠము అంటే ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఒక అభిమానం, ఒక నిజం అని కళాకారులు ఏర్పరచుకున్న విశ్వాసం. అతి తక్కువ కాలంలోనే తెలుగు సాహితీ అభిమానుల మనసులను చూరగొన్న సంస్థగా వాసికెక్కింది.
శతకవి సమ్మేళనాలు నిర్వహిస్తూ కవి సమ్మేళనంలో కవులు చదివిన కవితలను ఒక సంకలనంగా ‘కవితోత్సవం’ పేరుతో ముద్రించటం ఆనవాయితీగా వస్తోంది. కళాపీఠము ద్వారా ఇప్పటికి 10 పుస్తకాలను ముద్రించారు. వాటిల్లో ‘అవినీతిపై అస్త్రం’, ‘వారసత్వం’, ‘ప్రక్షాళన’, ‘భారతదేశంలో పార్టీ ఫిరాయింపులు’, ‘మన సంస్కృతి’ అంశాలపై ముద్రించిన సంకలనాలు ప్రముఖమైనవి.

న్యాయనిర్ణేతగా : ‘Vijayawada Tutorials & Private Schools Association’, గన్నవరంలోని పశువైద్య కళాశాల, విజయవాడలోని ఠాగూర్ స్మారక గ్రంధాలయంతో పాటు ఎన్నో సంస్థలు డా. తూములూరి నిజాయితీ పారదర్శకతను గుర్తించి వారు నిర్వహిస్తున్న పోటీలకు న్యాయనిర్ణేతగా ఆహ్వానించటం ముదావహం.

సౌకర్యాలు లేని గ్రామీణ వాతావరణంలో పుట్టి, పెరిగి అంచలంచెలుగా ఎదుగుతూ స్వయంకృషితో పట్టుదల, నిబద్ధత, కార్యదీక్ష, ఏకాగ్రతతో విజయాలు సాధించిన డా. తూములూరి రాజేంద్రప్రసాద్ మున్నుందు ఎన్నో రచనల ద్వారా, సాహిత్య కార్యక్రమాల ద్వారా సమాజాభివృద్ధికి పాటుపడాలని ఆశిద్దాం.

-కలిమిశ్రీ

2 thoughts on “బహుకళా నేర్పరి ‘డా. తూములూరి’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap