అనగా అనగా ఓ ఎమ్మార్ ప్రసాద్

ప్రముఖ పంచాంగ కర్త, జ్యోతిశ్శాస్త్ర పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారన్న వార్త నా మనసుని ముప్ఫై ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లిపోయింది.


అప్పుడు నేను విశాఖపట్నం ఆంధ్రభూమి ఎడిషన్ కి న్యూస్ ఎడిటర్ గా ఉండేవాణ్ణి. అనకాపల్లిలో ఆడారి కొండల రావు మా ఆంధ్రభూమికి రిపోర్టర్ గా ఉండేవాడు. కొండలరావు సారధ్యంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ 1992 సంవత్సరం, జూలై నెల 18,19 తేదీల్లో అనకాపల్లిలో జర్నలిస్టుల పునశ్చరణ తరగతులు నిర్వహించింది. విశాఖ రూరల్ జిల్లా నుంచి ఎందరో విలేకరులు హాజరయ్యారు. వారికి పాఠాలు చెప్పడానికి విజయవాడ నుంఛి విశాలాంధ్ర సంపాదకులు రాఘవాచారిగారు, విశాఖపట్నం నుంచి నేను, ఇంకా శశాంక మోహన్ (ఈనాడు), రమణమూర్తి (వార్త), నరసింహారావు (ఆంధ్రజ్యోతి), ఎపియుడబ్ల్యుజే రాష్గ్త్ర నాయకులు శ్రీనివాస రెడ్డి, అమర్నాథ్, జిల్లా నాయకులు ఎం. సుబ్రహ్మణ్యం, పివి సత్యనారాయణ రావు హాజరయ్యారు. తరగతుల ప్రారంభ,ముగింపు సమావేశాలకు మంత్రి గుడివాడ గురునాథ రావు, ఎంపి కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు హాజరయ్యారు.

తరగతులు ఎంత అట్టహాసంగా జరిగాయో చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను.
ఆనాటి వినోద కార్యక్రమాల్లో భాగంగా ఒక కుర్రాడు స్టేజి ఎక్కి మిమిక్రీ ప్రదర్శన ప్రారంభించాడు. ప్రముఖ సినీ నటీనటుల్ని అనుకరిస్తూ అతడు మిమిక్రీ చేస్తుంటే చప్పట్లు, హర్షధ్వానాలతో ఆద్యంతం సభ మారుమోగిపోయింది. నేనయితే ఆ మిమిక్రీ కి డంగై పోయాను. కొండల్రావుని పిలిచి ‘ఎవరా కుర్రాడు’ అని అడిగాను.
“ప్రసాద్ అని గుంటూరు కుర్రాడండీ.. చాలా బాగా మిమిక్రీ చేస్తున్నాడని తెలిసి పిలిపించాం” అన్నాడు కొండలరావు.
మీటింగ్ తర్వాత ఆ కుర్రాడిని నాకు పరిచయం చేశాడు కొండలరావు.
“సార్.. నా పేరు ఎమ్మార్ ప్రసాద్.. జర్నలిస్టుల మీటింగుల్లో ప్రోగ్రాం ఇమ్మంటే ఎన్ని పనులైనా మానుకుని వచ్చేస్తా సార్.. ఎందుకంటే నా గురించి బాగా రాస్తారని. దయచేసి నా గురించి మీరు మీ పేపర్లో రాయండి సార్!’ అని అభ్యర్ధించాడు.
అతడి భుజం తట్టి చెప్పాను. “ చూడు ప్రసాదూ.. నువ్వు ప్రత్యేకంగా అడగక్కరలేదు. నీలో అద్భుతమైన మిమిక్రీ టాలెంటు ఉంది. ఆ టాలెంటే మా అందరి వెంటపడి మరీ రాయిస్తుంది. అతి తొందరలోనే నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావు ”.
ప్రసాద్ నాకు థాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు.
కొంత కాలం తర్వాత ప్రసాద్ ఏదో ప్రోగ్రాం పని మీద అనకాపల్లికి వెళ్లి , మర్యాదపూర్వకంగా కొండలరావు ఇంటికి వెళ్లాడు. (ఇదంతా కొండలరావు చెప్పిన సమాచారం). కొండలరావు అప్పుడే ఏదో వార్తా సేకరణ కోసం పొలీస్ స్టేషన్ కి వెళ్ళబోతున్నాడు. “దారిలో మాటాడుకుందాం, పదా” అని ప్రసాద్ ని స్కూటర్ మీద ఎక్కించుకుని పొలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళాడు.

ఆ పొలీస్ స్టేషన్ ఆవరణలో షటిల్ ఆడుకునే ఏర్పాటు ఉంది. రోజూ సాయంత్రం అక్కడ షటిల్ ఆడటం ఎస్ ఐ కి అలవాటు. కొండలరావు, ప్రసాద్ వెళ్లేసరికి ఎస్ ఐ లేడు. షటిల్ కోర్టు దగ్గర వేసిన కుర్చీల్లో వీళ్ళు కూర్చున్నారు. కాసేపట్లో ఎస్ ఐ వచ్చి, అక్కడే తన బండి ఆపి, తల మీద క్యాప్ తీసి బండి మీద పెట్టి, సిగరెట్టు వెలిగించి, రెండు దమ్ములు పీల్చి నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకి వచ్చాడు. “ఈ అబ్బాయి ఎవర”ని కొండల్రావుని అడిగాడు. కొండల్రావు ప్రసాద్ ని పరిచయం చేశాడు. వెంటనే ఎస్ ఐ కుర్చీ లాక్కుని కూర్చుని, “ఇవాల్టికి షటిల్ కేన్సిల్.. ఇప్పుడు ఈ అబ్బాయి ప్రోగ్రాం విందాం” అని అందర్నీ దగ్గరకి రమ్మని పిలిచాడు. స్టేషన్ సిబ్బంది వీళ్ల చుట్టూ గుమికూడారు. ప్రసాద్ తన మిమిక్రీ ప్రారంభించాడు. ఎస్ ఐ తో సహా అందరూ పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేశారు.

చివరిలో ప్రసాద్ ఎస్.ఐ. ని అడిగాడు. “సార్, మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని ఇమిటేట్ చేస్తా”
ఎస్ ఐ ఆశ్చర్యపోయి సరేనన్నాడు. అప్పటికి ఎస్ ఐ ప్రసాద్ కి పరిచయమై అరగంట కూడా కాలేదు. ఇంతలోనే ఎలా అనుకరిస్తాడబ్బా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రసాద్ లేచి ఎస్ ఐ బండి దగ్గరికి వెళ్లాడు. అంతక్రితం ఎస్ ఐ చేసినట్టే, క్యాప్ తీసి, బండి మీద పెట్టి, సిగరెట్ వెలిగించి, రెండు దమ్ములు పీల్చినట్టు అభినయించి, అచ్చం ఎస్ ఐ నడిచినట్టే నడుచుకుంటూ వచ్చి ఎస్.ఐ. కంఠాన్నిఅనుకరిస్తూ మాట్లాడేడు. సిబ్బంది చప్పట్లతో, ఈలలతో స్టేషన్ మారుమోగిపోయింది. ఎస్ ఐ అయితే గభాల్న లేచి, ప్రసాద్ ని కావలించేసుకున్నాడు. “ నీ టాలెంటు అద్భుతం ప్రసాదూ.. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది” అని పొగిడాడు.
ఆ రోజుల్లోనే ఎమ్మార్ ప్రసాద్ చేసిన “శ్రీదేవి పెళ్లి” కేసెట్ విడుదలైంది. ప్రముఖ సినీ నటుల కంఠాలని అనుకరిస్తూ ప్రసాద్ చేసిన కామెడీ స్కిట్ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపింది. కొన్ని వేల కేసెట్లు క్షణాల్లో అమ్ముడై పోయాయి. నా మట్టుకు నేనే ఒక కేసెట్ కొనుక్కుని కొన్ని డజన్ల సార్లు విన్నాను. అచిరకాలంలోనే ఎమ్మార్ ప్రసాద్ మిమిక్రీ రంగంలో మెగాస్టార్ అయ్యాడు.
ఎందరెందరో దీవించినట్టే ప్రసాద్ కి ఎంతో మంచి భవిష్యత్తు లభించింది. అయితే అది మిమిక్రీ రంగంలో కాదు.

Sridevi Pelli Mimicry

నాలుగేళ్ల తర్వాత నేను విశాఖ నుంచి హైదరాబాద్ కి ట్రాన్స్ ఫర్ మీద వచ్చేశాను. ఈ మధ్యకాలంలో నేను ప్రసాద్ గురించి ఎక్కడా వినలేదు. ఓ రోజు ఆఫీసులో యధాలాపంగా వార్త పేపరు తిరగేస్తుంటే దినఫలాల కింద “ములుగు రామలింగేశ్వర వర ప్రసాదు” అని కనిపించింది. ఈ కొత్త జ్యోతిష్య పండితుడు ఎవరబ్బా అని వాకబు చేస్తే నాకు మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవం తెలిసింది.
ఆనాటి మిమిక్రీ కళాకారుడు ఎమ్మార్ ప్రసాదే ఈనాటి జ్యోతిష్య శాస్త్ర పండితుడు ములుగు రామలింగేశ్వర వర ప్రసాదు. (ఆయన తన పేరు ‘ప్రసాద్’ అని రాసుకోకుండా ‘ప్రసాదు’ అని రాసుకోవడం నాకు నచ్చింది).
“నా గురించి రాసి నాకు పబ్లిసిటీ ఇవ్వండి సార్” అని ఒకప్పుడు జర్నలిస్టుల్ని అభ్యర్ధించిన ఎమ్మార్ ప్రసాద్ నాలుగైదు ఏళ్లకే ఒక ప్రముఖ దినపత్రికలో దినఫలాలు, వారఫలాలు కాలం ని తన పూర్తి పేరుతో నిర్వహించడం చూసి షాకయ్యాను.

అది మొదలు ములుగు వారి ప్రస్థానాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను.ఇంతలో శాటిలైట్ చానల్స్ రావడంతో ములుగు వారు టీవీల్లో రాశిఫలాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆయన పెట్టిన ములుగు డాట్ కాం వెబ్ సైట్ కి విపరీతమైన జనాదరణ వచ్చింది. “ములుగు రామలింగేశ్వర వర ప్రసాదు” కాస్తా “ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి” అయ్యారు.
ములుగు వారి జ్యోస్యాలు మనసారా నమ్మిన వారు ఉన్నారు. ‘అంతా ట్రాష్” అని కొట్టి పారేసినవారూ ఉన్నారు. ఏది ఎలా ఉన్నా ములుగువారికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు వారున్న ప్రతి దేశంలోనూ వేలాది ఫాలోయర్స్ ఏర్పడ్డారు. మిమిక్రీ రంగంలో మెగా స్టార్ అయినట్టే జ్యోతిష్య రంగంలోనూ ములుగు వారు మెగాస్టార్ అయ్యారు.
అయితే, మిమిక్రీ సామ్రాజ్యాన్ని రారాజుగా ఏలుతున్న ఎమ్మార్ ప్రసాద్ ఆ రంగాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జీవనం వైపు, జ్యోతిష్య రంగం వైపు ఎందుకు వచ్చాడో, అతడిని అటువైపు నెట్టిన పరిస్థితులేమిటో నాకు ఇప్పటికీ తెలియదు.

ములుగు రామలింగేశ్వర వర ప్రసాదు అనే ఎమ్మార్ ప్రసాద్ నాకు ముప్ఫై ఏళ్ల కిందట పరిచయమయ్యాడు. అప్పుడు అతడికి పాతికేళ్లు ఉంటాయి. అంటే కన్ను మూసిన నాటికి ములుగు వారికి షష్టిపూర్తి కూడా జరిగి ఉండదు. మిమిక్రీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే ఎమ్మార్ ప్రసాద్ జీవితం అర్ధాంతరంగా ముగిసినట్టే జ్యోతిష్య రంగంలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే ఆయన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం విధి వైపరీత్యం కాక మరేమిటి?

– మంగు రాజగోపాల్

1 thought on “అనగా అనగా ఓ ఎమ్మార్ ప్రసాద్

  1. ఆయన జాతకంలో అలా అర్ధాంతరంగా చనిపోవాలని రాసిపెట్టుందేమో మరి. జాతకాలని పిచ్చిగా నమ్మకూడదు. ఎన్నో మానసిక, ఆర్దిక ఇబ్బందులని ఎదుర్కొని రావాల్సిఉంటుంది. మంచి వ్యాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap