సాహితీ తపస్వి ‘మునిసుందరం’

ప్రముఖ రచయిత, కథలు, కథానికలు, నవలలు, నాటకాలు విస్తృతంగా రాసిన
చిత్తూరు జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపకులు శింగు మునిసుందరం గారి స్మృతి దినం ఈ రోజు !

—————————————————–

ఆ యువకుడి వైపు అలానే చూస్తూ ఉండిపోయారు గరికిపాటి రాజారావు. తనను చూడడానికి వచ్చిన ఆ విద్యార్థి కళ్ళలో కన్పిస్తున్న వినయం, నిలబడిన పద్ధతిలో ప్రకటితమయ్యే వినమ్రత, అభివాదం చేసే చేతుల్లో కన్పించే ఆదరం, వేసుకొన్న తెల్లని దుస్తుల్లో విన్పించే స్వచ్ఛతా రాగం . . . ఇవన్నీ… చూస్తూ; ఆయన ఏదో తెలియని ఆత్మీయతా భావనకి లోనయిపోయారు.

గరికిపాటి రాజారావు తెలుగు నాటకానికి అదృష్టవశాత్తూ లభించిన వరప్రసాదుడు. పద్యరాగాల్ని ఆలపించడమే నాటకమని సర్వులూ భావిస్తున్న ఒకానొక కాలంలో జన్మించి, నాటకమంటే ఏమిటో తెలియజెప్పిన గొప్ప ప్రయోక్త రాజారావు. తెలుగు నాటకానికి నవ్యతను, నాణ్యతను ప్రసాదించి, నాటక ప్రదర్శనకు సవ్యదిశను, భవ్యదశను చూపిన దర్శకోత్తముడు రాజారావు. ముఖ్యంగా సాంఘిక నాటకానికి ఎనలేని గౌరవం కల్పించిన మహనీయుడు రాజారావు. రాజమండ్రిలో విశ్రాంతి లేకుండా ఒకవైపు వైద్యవృత్తి చేస్తూనే, మరొకవైపు అనవతరం నాటక సేవ చేస్తూన్న గరికిపాటి రాజారావు అలా … ఆరోజు… తనని చూడడానికి వచ్చిన ఆ యువకుడ్ని చూసి, ఎంతగానో సంతోషించాడు. మనసారా ఆదరించాడు. తన పేరు మునిసుందరమని, రాయలసీమలో చిత్తూరు జిల్లాలోని పారకాల్వ గ్రామవాసిననీ, హిందీ పండిత శిక్షణ కోసం ఈ రాజమండ్రి వచ్చాననీ…. ఆ యువకుడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. అన్నింటికన్నా మిన్నగా తనకున్న రచనాసక్తి గురించి, నటనా ప్రవేశం గురించి చెప్పగానే నాటకమే ఊపిరిగా భావించే రాజారావు మనసు పరవశించింది. మునిసుందరాన్ని తన ఆత్మీయ సహచరుడ్ని చేసుకొన్నారాయన.

నాటక రచనలో మునిసుందరానికి తొలిపాఠం గరికిపాటి రాజారావు దగ్గరే ఆరంభమైంది. ఎప్పుడు కలసినా ఎంత తీరిక లేకపోయినా, మునిసుందరాన్ని ప్రేమతో ఆదరించేవారు రాజారావు. ఆయన ప్రేరణ మీదే “రాతిగుండె” అనే నాటికను రాజమండ్రిలోనే రచించి ఇచ్చారు మునిసుందరం. భవిష్యత్ లో నీవొక గొప్ప రచయితవు అవుతావని దీవించారు రాజారావు. నిండు మనసుతో అందించిన ఆయన దీవెన కాలక్రమంలో అక్షరసత్యమయ్యింది. మునిసుందరం నాటకరచయితగా సుప్రసిద్ధులయ్యారు.

దివ్యక్షేత్రమైన తిరుపతి పేరు తలచుకోగానే భక్తిభావంతో హృదయం ఉప్పొంగిపోయి, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుడు గుర్తొస్తాడు. స్వామి మన స్మృతి పథంలో మెదలుతూండగానే గోవింద రాజులు, అనంతరం పద్మావతీ దేవి ప్రత్యక్షమవుతారు. వారందరికీ భక్తితో మనస్సులో నమస్కరించి, ఆ దేవదేవుడి సృష్టిలోని మానవుల గురించి, అందునా కళాస్రష్టల గురించి, కవి రచయితల గురించి, మరీముఖ్యంగా నాటక రచయితల గురించి, ఆలోచించగానే తొలిగా గుర్తొచ్చే పేరు, సహృదయులైన మునిసుందరం మాస్టారిది. కవిగా, రచయితగానే కాదు, అంతకు మించి మానవీయత నిండిన ప్రేమైకమూర్తిగా ఆయనకు మనకు కన్పిస్తారు. దానితో మాటల్లో చెప్పలేని ఆత్మీయతా పరిమళమేదో మనల్ని ఆవరించినట్లనిపిస్తుంది.

మన దేశంలో స్వరాజ్య సమరం ముమ్మరంగా సాగుతున్న కాలంలో మునిసుందరం జన్మించారు. 1937వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ ఆయన జన్మదినం. ఇందులో తెలియకుండానే ఒక ప్రత్యేకత ఉంది. మునిసుందరం మాస్టారు వృత్తిరీత్యా హిందీ అధ్యాపకుడు. హిందీలో విద్వాన్ డిగ్రీ పొంది, ఎమ్.ఎ. చేసి, ముప్పై ఆరు సంవత్సరాలు హిందీ లెక్చరర్‌గా పనిచేసారు. అయితే ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 14వ తేదీయే మనదేశంలో హిందీని రాజభాషగా ఆమోదించిన రోజు. అందుకే దేశమంతా సెప్టెంబర్ 14వ తేదీన, హిందీ దినోత్సవ వేడుకల్ని వైభవంగా జరుపుకుంటారు. అలా ఒక హిందీ అధ్యాపకుడి పుట్టినరోజు, భారతదేశ హిందీ భాషాదినోత్సవం ఒక్కనాడే జరగడం యాదృచ్ఛికమే కావచ్చు కానీ, నిస్సందేహంగా ఆనందించాల్సిన విషయం.

మునిసుందరం మాస్టారి జీవితంలో మరో విచిత్రముంది. ఆయన ప్రధానంగా హిందీ అధ్యాపకుడు. జీవితంలో సుదీర్ఘకాలం వృత్తిరీత్యా హిందీ భాషా బోధనా వ్యాసంగంలోనే గడిచింది. కానీ వారి సాహిత్య సృష్టిలో అత్యధిక శాతం తెలుగులోనే సాగింది. మహామహులందరి జీవితాలలోనూ ఈ వైచిత్రి కనబడుతూనే ఉంటుంది. మహాకవి గురజాడ అప్పారావు కూడా, విజయనగరంలో ఇంగ్లీషు పాఠాల్ని బోధించారు, కానీ తెలుగులోనే అజరామరమైన సాహితీ సంపదను అందించి, చిరస్మరణీయులయ్యారు.

తిరుపతి పట్టణానికి సమీపంలోని రామచంద్రాపురం మండలంలో, పారకాల్వ గ్రామంలో సంపన్న కుటుంబీకులైన లక్షుమమ్మ, నాదముని నాయుడు దంపతులకు జన్మించిన, మునిసుందరం బాల్యమంతా ఆ చిన్ని గ్రామంలోనే గడిచింది. భూస్వామ్యవ్యవస్థలో, అందునా గ్రామీణవ్యవస్థలో అంతస్థుల అడ్డుగోడలు ఎక్కువ. ఆత్మీయపు పలకరింపు కన్నా, అంతరాలను తెలిసి మసలడమే అవసరం. అనురాగపు దగ్గరితనం కన్నా, అధికారపు వినమ్రతకే గౌరవం. మునిసుందరం బాల్యానికి అదే వేదిక. అటువంటి వ్యవస్థలో నుండి, వెలుగుచూసిన భావుకుడైన ఆ పిల్లవాడి మనస్సు నిండా చెప్పలేనంత బాధ, చెప్పుకోలేనంత ఆవేదనా కన్పిస్తాయి. మునిసుందరం తొలినుండీ అంతరాలెరుగని వాడు. అధికారం కన్నా, ఆ పేక్షకే పెద్దపీట వేసినవాడు. సహజసిద్ధంగా కళాకారుడికుండే ప్రేమానురాగాలు పుష్కలంగా ఉన్నవాడు. లోకాన్ని, లోకుల్ని మనసారా ప్రేమించినవాడు, నేటికీ ప్రేమిస్తున్నవాడు. అందుకే ఆ చిన్న నాటి రోజుల్లో ఆ పల్లెలో కన్పించిన కృత్రిమమైన వ్యవస్థమీద ఆయన ఇంత కాలం తన రచనల ద్వారా తిరుగుబాటు చేసి నిష్కల్మషమైన తన అంతరంగాన్ని నిర్భయంగా ఆవిష్కరించి చూపించాడు. దాదాపుగా మునిసుందరం రచనలన్నిటా ఈ ఆర్తి, ఆవేదన, వాటి సంఘర్షణ, తత్ఫలితంగా ఆవిర్భవించిన పరిష్కారాలు కన్పిస్తాయి. తన స్వేచ్ఛా ప్రవృత్తికి, స్వాతంత్ర పిపాసకు అనుగుణమైన ఇతివృత్తాలనెన్నుకొని తనదైన రచనా పాటవంతో రూపుదిద్ది గొప్ప కళాఖండాలుగా తీర్చిదిద్దారు. ఆయన సుప్రసిద్ధ రచన ” ఏ వెలుగులకీ ప్రస్థానం” నాటికలో నాయకుడు సిద్ధార్థుడు. అతడే బోధివృక్షం క్రింద, ముక్తుడై బుద్ధుడవుతాడు. మునిసుందరం అంతరంగ ప్రయాణం ఇదే. హృదయక్షేత్రంలో రగిలిన ఈ భావాన్నే సిద్ధార్థుడి నోటివెంట సూటిగా విన్పిస్తాడాయన.

Muni Sundaram written books

“పిచ్చివాడా! మీ రాజు రమ్యహర్మ్యాలలో వుంటున్నాడే, మృష్టాన్న భోజనాలారగిస్తున్నాడే, హంసతూలికా తల్పంపై శయనిస్తున్నాడే. మరి ప్రజలో….? వాళ్ళకీ సుఖాలు లభిస్తున్నాయా? లక్షలాది శ్రమజీవులు తమ సుఖాల్ని బలిపెట్టి ఏ ఒక్కడికో సౌఖ్యం కట్టబెట్టాలా ? ఒక్కడికోసం ఇందరు దుఃఖాంబుధిలో మునగాలా? ఈ ప్రశ్న వేసింది సిద్ధార్థుడే కానీ, దాని వెనుక మునిసుందరం హృదయావిష్కరణ విస్పష్టంగా కన్పిస్తుంది. మునిసుందరం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరా ఓరియంటల్ కళాశాలలో హిందీ విద్వాన్ చదివి, 1956లో విశ్వవిద్యాలయంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రాజమండ్రిలోని బి.ఇడి. శిక్షణా కళాశాలలో పండిత శిక్షణ పొందడం, వెనువెంటనే కడపలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ఆరంభించడం జరిగిపోయాయి. 36 సంవత్సరాలు హిందీ లెక్చరర్ గా వేలాదిమందికి విద్యాబోధన చేసారు. ఆరునెలలు కాలం పాటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పూర్తి అదనపు బాధ్యతను నిర్వహించారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కి ఛైర్మన్‌గా తొమ్మిదేళ్ళ కాలం సహకారం అందించారు. 1968 నుండి 1971 వరకూ చిత్తూరు జిల్లా రచయితల సంఘానికి సారధ్యం వహించారు. 1992లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అధ్యాపకుడి అవార్డును 1989లో ఉత్తమ హిందీ అధ్యాపకుడిగా హిందీ అకాడమీ అవార్డును అందుకొన్న మంచి అధ్యాపకుడు మునిసుందరం మాస్టారు.

ఈ మునిసుందరం నాటక రచయిత కావడానికి ముందే, నటుడయ్యారు. వారి అన్న మేఘవర్ణం నాయుడు ప్రోత్సాహంతో కొన్ని నాటకాలలో మంచి పాత్రల్ని పోషించారు. ఆయన రంగస్థల ప్రవేశం “స్త్రీ ” పాత్రతో జరిగింది. ఆ తరువాత పల్లెపడుచులో గోపి, పేదరైతులో కధానాయకుడిగా, అన్నాచెల్లెలు లో సత్యం, దొంగవీరడులో రాంబ్రహ్మం, అమరత్యాగిలో గోవిందామాత్యుడు, నిరపరాధిలో ప్రతినాయకుడు, మనిషిమారలేదులో లక్ష్మీపతి, దేశం నీ సర్వస్వంలో హుమయూన్, ఇది కథ కాదులో సి.ఐ.డి. సుందరం వంటి ఎన్నో పాత్రల్లో నటించి, ప్రేక్షకుల ప్రశంసలందుకోవడం జరిగింది. అంతేకాక “అచ్చి” అనే స్త్రీ ఏకపాత్ర కూడా ప్రదర్శించారుట. నటుడిగా ప్రారంభమైన రంగస్థలయాత్ర, కాలక్రమంలో ప్రసిద్ధ నాటకరచయితగా రూపొంది నలుగురిమెప్పును పొందింది.

వారి నాటకరచనల్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించవచ్చు. మొదటివి చారిత్రక పౌరాణిక రూపకాలు, రెండోవి సాంఘిక రూపకాలు మూడోవి లఘు రూపకాలు నాల్గోని హాస్యరూపకాలు. మునిసుందరం మాస్టారి సాహితీ సృష్టి విస్తృతమైనది, బహుముఖీనమైనది. మాస్టారి గురించి చెప్పగానే తొలుత గుర్తొచ్చేవి ఆయన చారిత్రక పౌరాణిక నాటికలు. అందులో బహుప్రసిద్ధమైనది. “ఏ వెలుగులకీ ప్రస్థానం”. రెండో నాటిక “ వరూధినీ గాంధర్వం”. అల్లసాని పెద్దనామాత్యుడి మనుచరిత్ర కథ నేపధ్యంగా వ్రాసిన అందమైన నాటిక ఇది. దేశభక్తి ప్రేరితమైన మరొక గొప్ప రచన ” దేశం నీ సర్వస్వం” రాణా ప్రతాప్ కథాంశంతో సాగే ఈ నాటిక ప్రేక్షకుల్ని అడుగడుగునా ఉత్తేజపరుస్తుంది. చరిత్రలో అశోకుడి గురించి, జనానికి ఒక విధంగానే తెలిసుంటుంది. ఆ అశోకుడి కధలో మరొక కోణాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించిన నాటిక “ చరిత్రలో చినిగిన పుట”. ఇందులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సంభాషణలు ఎడనెడ ప్రయోగించారు మాస్టారు. ఈనాటికలో ప్రధానపాత్ర తిష్యరక్షిత. ఆమె అశోకుడితో మాట్లాడుతూ జీవితాన్ని ఒక్క వాక్యంలో ఎంతో అందంగా విశ్లేషిస్తుంది. “జీవితం దేవుడు మానవుడికిచ్చిన గొప్ప వరం. మబ్బుల్లో మెరుపులా దానికి వయసు తక్కువ! ” – ఎంత అందమైన భావం. ఎంత అద్భుతమైన ఉపమానం. మరొక చోట రాధాగుపుడనే మంత్రి నోట మాస్టారు పలికించిన సంభాషణలో ఒక అందం, ఒక లయ, అంతకు మించిన ఒక గొప్ప భావం ఒకచోట చేరి ఎంత అందంగా కన్పిస్తాయో చూడండి” ఈ విశాల మౌర్య సామ్రాజ్యాన్ని ఆవరించిన శాంతి తెరలలో ఎంతో భయంకరమైన క్రాంతి పురుడు పోసుకొంటుందేమోనని నా భయం” పద ప్రయోగంలో ఆయనకు ఆయనే సాటి. మునిసుందరం వ్రాసిన మరోనాటిక “మహాదాత”. అందులో భారతకథలోని కర్ణుడి అంతిమ ఘడియల్ని, ఆస్థితిలో కర్ణుడి దానశీలతని నాటక రూపంగా తెలుగువారికి అందించి, శెభాష్ అనిపించుకొన్నారు.

మునిసుందరం మాస్టారి పద్ధతి ఒకే వరవడిలో సాగిపోయే రచనా విధానం కాదు. అది భిన్న ప్రాతిపదికమీద కట్టుకొన్న సుందర సౌధం. అందుకే పౌరాణిక, చారిత్రక నాటికల రచనలో, ఆయన ప్రయోగించిన కరుణ రసం, సాంఘికాల కొచ్చేసరికి హాస్యరసానికి ఆలంబనం అయ్యింది. అయితే సంభాషణల సూటిదనం మాత్రం ఎక్కడైనా ఒక్కటే. అదే ఆయన ప్రత్యేకత. వారి పేరొందిన సాంఘిక నాటిక “అహం బ్రహ్మ అనే జనతాక్లబ్”. ఇది ప్రతీకాత్మక ధోరణి (సింబాలిక్ సైల్)ని, అనుసరించే నాటిక. మేధావులు నిర్లిప్తతతో వ్యవహరిస్తే దేశానికి అరిష్టం అంటూ, ప్రబోధించిన ఈ నాటిక, 1977లో వెలువడినా, నేటికాలానికి గొప్ప సందేశం అందిస్తోంది. ఇందులో ఎలియనేషన్ (తాదాత్మ్య విచ్ఛిత్తి) కన్పిస్తూ, ప్రేక్షకుల్ని నాటకంలో భాగస్వాముల్ని చేస్తుంది. మాస్టారి మరోనాటిక ” ఇది కథకాదు ”. ఆర్థిక అసమానతల అడ్డుగోడల మధ్య నలిగిపోయిన ప్రేమ, ఈ నాటికకు ఊపిరి. నాటికనిండా, గొప్ప సస్పెన్స్ కన్పిస్తుంది. ప్రేక్షకులలో అంతు తెలియని ఉత్కంఠ కన్పిస్తూ, నాటికను ఆద్యంతం గొప్పగా నడిపిస్తుంది.

1976 జూలైలో ఆకాశవాణి, విజయవాడ నుండి ప్రసారం చేయబడి, మునిసుందరం మాస్టారికి గొప్ప గౌరవం తెచ్చిన నాటిక “సింగారం” బ్రతుకు తెరువుకోసం కష్టపడి బ్రతికే స్త్రీని, ప్రపంచం ఎన్ని విధాలుగా వేధిస్తుందో, ఈ నాటికలో ఎంతో హృద్యంగా చూపించాడు రచయిత. నిజంగా ఇది గొప్ప నాటిక. మునిసుందరం మాస్టారి సంభాషణాచాతుర్యానికి ప్రతీకగా నిలబడే మరో సాంఘిక నాటిక “ఇదో రకం ప్రేమకథ”.

ఈ నాటికలో ఎన్నో సంభాషణలు…. ఎంతో అందంగా…. ఎంతో బలంగా…. అడుగడుగునా కన్పిస్తాయి.
“ప్రేమకు స్వార్థం తోడయితే ప్రేమ బలహీనతగా మారుతుంది”, ” మనం రైలు ఎక్కగలమే కానీ, దాన్ని టయానికి గమ్యం చేర్చలేం కదా”, “తెలుగువాడు కదండీ …. ఎదుటివాడు ఏడుస్తుంటే చూడలేడు”.

మాస్టారి నాటికా రచనల్లో “నిజం కాటేసింది” ఓ మంచి నాటిక. హిందీ రచయిత వినోద్ రస్తోగీ వ్రాసిన నాటికకు అనువాదం “ శిథిలాలు ” నాటిక. వారి మరో రచన “భయం” మొత్తం ఇరవై ఒక్క నాటికలు, నాటకాలు అందించి, తెలుగునాటకాన్ని సంపన్నవంతం చేసిన మహనీయులు మునిరత్నం. భయం నాటికతో ఆయన రచనా ప్రస్థానం ఆరంభమై, ఏ వెలుగులకీ ప్రస్థానంతో మహాభినిష్కమణ చేసింది. ఆయన రచించిన చివరి నాటిక ” ఏ వెలుగులకీ ప్రస్థానం” అదీ 1983లో.
నాటకమే కాదు, కవిత్వం కూడా ఆయన అభిమాన విషయమే.

వెన్నెల ముళ్లు” అనే ఆయన కవితా సంకలనం, మాస్టారి హృదయాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరిస్తుంది. వెన్నెలలోని ఆర్ధతని, ప్రేమలోని సౌకుమార్యాన్ని, మానవతలోని మృదుత్వాన్ని అక్షరరూపంగా మార్చి తన కవితలలో చూపించారు మునిసుందరం. వెన్నెలముళ్ళులో ఓ వైపు గొప్ప ప్రణయభావన కన్పిస్తుంది. మరోవైపు అంతర్లీనంగా ఎంతో తాత్త్వికత కన్పిస్తుంది. ఈ కవితలన్నిటా వైచిత్రి, వైవిధ్యం మనోజ్ఞంగా దర్శనమిస్తాయి. ఓ కవితలో జీవితం గురించి కవి ఇలా అంటాడు.

జీవితం అగ్గిపువ్వు ఎద ఎదలో అగ్గి పువ్వులు పూయించిన వాడే జీవించినట్టు లెక్క…. మునిసుందరం మంచి కథారచయిత కూడా! ఆణిముత్యాలనదగిన పదిహేను కథల్ని అందించారాయన. తన కథల్లో, ఓ పన్నెండు కధల్ని ఎంచుకొని, “జవాబు తెలియని వాడు” అనే పేరుతో ఓ కథా సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో దాదాపుగా అన్నికథలూ, మానవజీవితాన్ని ఎంతో హృద్యంగా ప్రతిబింబిస్తాయి. మానవుల ఆర్థిక, సామాజిక జీవనాన్ని నేపథ్యంగా తీసుకొని, రూపుదిద్దిన ఈ కధలలో ఎంతో వైవిధ్యం కన్పిస్తుంది. కానీ అంతఃసూత్రం మాత్రం ఒక్కటే. అదే మనిషి. వివిధ కోణాలలో కన్పించే మానవ జీవనాన్ని ప్రతిబింబించడం సమస్యల్ని, సంఘర్షణల్ని విశ్లేషించడం, సరైన పరిష్కారాన్ని ప్రతిపాదించడం…. మునిసుందరం మాస్టారి కథలకున్న ప్రత్యేక లక్షణాలు. అందుకే ఆయన కథలన్నీ పాఠకులకు ప్రీతిపాత్రాలయ్యాయి… అవుతూనే ఉన్నాయి.

మాస్టారి మరో ప్రయోగం ” లఘురూపకాలు” తక్కువ సమయంలో, కొద్ది శ్రమతో, కొద్ది మంది పాత్రధారులతో ప్రదర్శించేవి లఘురూపకాలు. ఇటువంటి రచనా విధానంలో వీరి ప్రత్యేకత వీరిదే. చిత్తూరు ఆర్ట్ లవర్స్ సారధి, ప్రముఖనటుడు, దర్శకుడు కీ.శే. వి. జయరాం కోరికమీద వ్రాసి ఇచ్చిన రూపకాలివి.
ఈ రూపకాలన్నింటా ఓ వైపు క్లుప్తత, మరోవైపు సూటిదనం, ఇంకో వైపు సంభాషణా చతురత విస్పష్టంగా కన్పిస్తాయి. ఈ రూపకాలు కూడా గమ్మత్తుగా ప్రారంభం అవుతాయి. అప్పటి వరకూ ఏదో జరిగిపోయినట్లు, అప్పుడే ఆ సన్నివేశంలో ఆ సంభాషణ ఆరంభమవుతుంది. ఇదొక విలక్షణమైన పద్ధతి. వీరి అన్ని లఘురూపకాలూ సంఘర్షణా ప్రధానాలు. సంభాషణా విలసితాలు.

Koneti Rayudu CD inauguration

ఇంత విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించిన మునిసుందరం మాస్టారు శ్రీవేంకటేశ్వరుడిపై ఎన్నో మధురమైన గీతాల్ని కూడా రచించారు. ఆ గీతాలన్నీ ప్రఖ్యాత గాయని డా. శోభారాజు స్వరపరచి, గానం చేసి, ఒక సి.డి. రూపంలో అందించారు. అదే “కోనేటిరాయ”. స్వామివారికి అక్షరాలతో పదార్చన చేసే అదృష్టం అందుకొన్న మాస్టారు నిజంగా ధన్యులు.
ఇలా మునిసుందరం మాస్టారి సాహితీ ప్రయాణం బహుముఖీనమైన ఆధ్యాయం. నాటకం, రూపకం, కథ, నవల, వచనకవిత, మినీకవిత, త్రిపద, లలితగీతం, చరిత్ర, వ్యాసం, ప్రసంగం… నిజంగా అదొక విస్తారమైన సాహితీ సృజన. విస్తృతమైన సాహితీ ప్రయాణం. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో, మద్రాస్ విశ్వవిద్యాలయంలో మునిసుందరం మాస్టారి రచనలపై జరిగిన పరిశోధనలకు ఒక పి. హెచ్ డి., రెండు ఎమ్. ఫిల్ డిగ్రీలు అందుకొన్నారు సాహితీ పరిశోధకులు. “మునిసుందరం-మానవతా వాదం” అన్న అంశంపై మరొక పరిశోధన సాగుతోంది కూడా!

Muni Sundaram with Kallakuri Narayanarao

ఇలా….. ఇంత ఇష్టంగా ….. ఇంత హృదయపూర్వకంగా…. ఇంత సత్యైక దృష్టితో….. ఇంతటి సమన్వయ శక్తితో… ఈనాటికీ సాహితీ ప్రయాణాన్ని సాగిస్తూన్న…. మునిసుందరం మాస్టార్ని గతంలో ఎన్నో పురస్కారాలు వరించాయి. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు అయిన శ్రీ నందమూరి తారక రామారావు స్వయంగా ఉగాది పురస్కారంతో మాస్టార్ని సత్కరించారు. అంతటి గౌరవం పొందిన మాస్టారికి ఈనాడు ఒక కొత్త పురస్కారం లభించింది. హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నాటకరచయితగా గౌరవిస్తూ, 2010వ సంవత్సరానికి, నాటక రచనా పురస్కారాన్ని వారి సాంఘిక నాటకాలకు ప్రకటించింది. ఇది నిస్సందేహంగా బంగారానికి సువాసన అబ్బినట్లే.
మునిసుందరం గారు మధుమేహంతో బాదపడుతూ… తిరుపతి కోటకొమ్మల వీధిలోని తన స్వగృహంలో ఫిబ్రవరి 13, 2015 శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
-వాడ్రేవు సుందర రావు
(ఈ వ్యాసం వారి మరణానికి ముందు రాయబడింది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap