‘బుద్ధం శరణం గచ్ఛామి” అనేది అనాదిగా వినిపిస్తున్న సంస్కృత పద బంధం. ఇప్పుడు మన కార్టూనిస్టు యం.యం. మురళి ‘హాస్యం శరణం గచ్ఛామి’ అంటున్నాడు.
నిజమే… మనిషికి జ్ఞానం ఎంత.. అవసరమే…!
హాస్యం కూడా అంతే.. అవసరం కదా…!!
ఎందుకంటే…?
నవరసాలను ఒలికించగల ఏకైక రసం హాస్యమే. ఎవరి నవ్వు వారిదే, ఎవరి అనుభూతి వారిదే కనుక నవ్వును అరువు తెచ్చుకోలేము. నవ్వులో అద్భుత ఆకర్షణ శక్తి వుంది. దానిలో ఆత్మీయత ఉంది. అప్యాయత వుంది. నవ్వులో మనిషి ఆత్మదాగివుంది. అందుకే ‘హాస్యం శరణం గచ్ఛామి’ అనడం సబబు కదా..!
మురళి మంచి కార్టూనిస్టే కాదు, జీవన సంఘర్షణలతో నిత్యం అంతర్యుద్ధం చేస్తూ, తనలోని భావాభినివేశాన్ని కవితా చిత్రాలుగా మార్చగల గొప్ప సృజనశీలి. గత సంవత్సరమే “నిశాచరుడి దివా స్వప్నం” పేరుతో తను ప్రచురించిన కవితా సంపుటికి తెలుగు సాహితీరంగంలో సముచిత స్థానమే లభించింది.
గత మూడు దశాబ్దాలుగా కార్టూన్లు గీస్తున్న మురళి ప్రచురిస్తున్న మొదటి కార్టూన్ సంపుటి ఈ “హాస్యం శరణం గచ్ఛామి”. తెలుగు కార్టూన్ మరో రెండేళ్ళలో (2027 నాటికి) శతసంవత్సరోత్సవం’ జరుపుకోనున్నది. సుమారు రెండొందల మంది కార్టూనిస్టులున్న మన తెలుగు కార్టూన్ రంగం సుసంపన్నమైనది. నాటి తలిశెట్టి నుండి నేటి నాగిశెట్టి వరకు ఒక్కొక్కరిది ఒక్కోశైలి. వివిధ సందర్భాలలో అనేక పత్రికలలో ప్రచురితమైన కార్టూన్లతో తమ-తమ కార్టూన్ సంపుటాలను ప్రచురించిన కార్టూనిస్టుల జాబితాలో ఇప్పుడు మురళి కూడా చేరుతాడు. ప్రస్తుత రోజుల్లో కార్టూన్లు ప్రచరించే పత్రికలే కరువయ్యాయి. సోషల్ మీడియాలోను, ఈ-మేగజైన్ల లోనూ కార్టూన్లు ప్రచురించుకోవలసిన పరిస్థితి నెలకొంది.
మురళి కవిగా ‘ఎక్ష్ రే ‘ సాహిత్య మాస పత్రిక నిర్వహిస్తున్న వార్షిక కవితా పోటీల్లో… విజేతల్లో ఒకడిగా నిలిచి తనో కవిని అంటూ… తనలోని బహుముఖీయతను చాటుకున్నాడు. 2021 సంవత్సరంలో నేను ప్రచురించిన “కొంటె బొమ్మల బ్రహ్మలు’ పుస్తకంలో స్థానం సంపాదించి, ఎందరో ఉద్దండులైన కార్టూనిస్టుల సరసన నిలబడ్డాడు.
తను వృత్తి రీత్యా అనేక ఉద్యోగాలు చేస్తూ.., ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. ‘ఎలాగో అలా జీవించేస్తే చాల్లే’ అన్నట్లు కాకుండా తన చుట్టువున్న “ఆనందాన్ని ఆస్వాదిస్తూ.., అనుభవాలను అవలోకిస్తూ.. తనలోని భావుకతను ప్రవృత్తి గా మరల్చుకొని, మనసులోని భావనలకు అక్షర రూపం, చిత్ర రూపం కల్పిస్తున్నాడు. తన కార్టూన్లతో నవ్వులు పూయిస్తూ.. ఆలోచింపజేస్తూ… తనదైన సొంత గీతలతో.. ఈ కార్టూన్ సంపుటితో మన ముందు కొచ్చాడు యం.యం. మురళి.
ఇక ఈ పుస్తకంలోని కార్టూన్ల విషయానికొస్తే… సునిశితమైన హాస్యంతో, చక్కని బొమ్మలతో మనుషులతోనే కాకుండా… జంతువులతోనూ.., దేవతా మూర్తులతోనూ, అందునా సగం పేజీలు రంగుల కార్టూన్లతో నింపి పండిచాడు. హాస్యాభిమానులందరూ కొని చదవాల్సిన పుస్తకం ఇది.
–కళాసాగర్ యల్లపు
పేజీలు : 120
వెల: రూ. 250/-
ప్రతులకు : యం.యం. మురళి – 88611 84899
