అంతర్జాతీయ శాస్త్రీయ సంగీత నృత్య సదస్సు

*ఈ నెల 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు హైదరాబాద్, శిల్పకళావేదికలో
*స్వాతి సోమనాధ్ బృందంచే కామసూత్ర కూచిపూడి నృత్యరుపకం
*నల్లాన్ చక్రవర్థుల మూర్తి, అలేఖ్య పుంజాల, కౌశికి చక్రవర్తి లకు విపంచి జీవన సాఫల్య పురస్కారాలు

భారత శాస్త్రీయ సంగీత నృత్య కళలను ప్రోత్సహిస్తూ పరిరక్షిస్తూ పరివ్యాప్తి చేస్తున్న విపంచి సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీ నుంచి రెండు రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ శాస్త్రీయ సంగీత నృత్య సదస్సు(Music and Dance Symposium) నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు త్రిపురనేని తెలిపారు. భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఒరిస్సా గవర్నర్ కె. హరిబాబు ఈ సదస్సును ప్రారంభిస్తారని ఆయన వివరించారు. బుధవారం (22-7-26) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా విశేషాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు ప్రముఖ కూచిపూడి నాట్యగురు డాక్టర్ ఎస్.పి. భారతితో కలసి డాక్టర్ రాజారావు త్రిపురనేని సదస్సు బ్రోచర్ ను ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలకు చెందిన సంగీత నృత్య కళాకారులు పాల్గొంటున్నారని మహీంద్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు త్రిపురనేని తెలిపారు. రోజూ ఉదయం తొమ్మిది గంటలకు నాదస్వరంతో సదస్సు ప్రారంభమై రాత్రి 10 గంటలకు ప్రముఖ కళాకారుల నృత్య ప్రదర్శనలతో ముగుస్తాయని ఆయన వివరించారు. శనివారం ఉదయం పది గంటలకు జరిగే ప్రారంభ సదస్సులో ఎం. వెంకయ్యనాయుడు, గవర్నర్ కె.హరిబాబు, సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉప సభాపతి కె. రఘురామ కృష్ణంరాజు, సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎల్. వి. సుబ్రహ్మణ్యం, మహారాష్ట్ర తెలుగు సంఘం చైర్మన్ పుచ్చా వెంకటరమణ, మహీంద్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మేడూరి వెంకట సోమయాజులు, కాంటినెంటల్ కాఫీ ఎండి చల్లా రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొంటారు. కర్ణాటక సంగీతంలో టార్చ్ బేరర్ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల మూర్తి, ప్రఖ్యాత హిందూస్థాని శాస్త్రీయ గాయని కౌశికి చక్రవర్తి, ప్రముఖ కూచిపూడి నర్తకీమణి ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల లను విపంచి జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరిస్తారు. సంగీత నృత్య అభినయ ఉపన్యాస సదస్సులో సెంట్రల్ యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ అనూరాధ జొన్నలగడ్డ, సితార విద్వాంసురాలు డాక్టర్ అనుపమ భగవత్, సంగీత దర్శకులు డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం, పద్మశ్రీ దీపికారెడ్డి, డాక్టర్ కళాకృష్ణ, డాక్టర్ అయ్యగారి శ్యామ సుందర్, వయోలిన్ డాక్టర్ అశోక్ గుర్జాలే, డాక్టర్ రాఘవాచారి, డాక్టర్ రాజ్యలక్ష్మి సేథ్, డాక్టర్ రమాప్రభ యర్రమిల్లి, డాక్టర్ శైలజా దేశాయ్ (ముంబయి) తదితర ప్రముఖులు పాల్గొంటున్నారు. కళాపోషకులు మండవ ఆశాప్రియ, పద్మప్రియ కాసరనేని హాజరవుతున్నారు.

తొలిరోజు సదస్సులో ‘కామసూత్ర’ నృత్య నాటకం

విపంచి అంతర్జాతీయ సదస్సులో తొలి రోజు సాయంత్రం 6 గంటలకు ప్రముఖ నాట్య గురు డాక్టర్ స్వాతి సోమనాథ్ “సంప్రదాయం” శిష్య బృందం రచయిత బ్నిమ్ రచించిన కామసూత్ర నృత్య రూపకం ప్రదర్శిస్తారు. కాట్రగడ్డ హిమాన్షి, పద్మప్రియ అశాప్రియ నృత్య ప్రదర్శనలు, బెంగళూరుకు చెందిన అనుపమ భగవత్ సితార్ నాదం, పద్మజా విశ్వాస్ బృందం జానపద సంగీత ప్రదర్శనలు జరుగుతాయి. ముగింపు సదస్సులో మలేషియాకు చెందిన నర్తకీమణి గీతా గోవర్ధనం హజారే తన బృందంతో ఆంధ్ర నాట్యం ప్రదర్శిస్తారు. చెన్నైకు చెందిన ఉప్పలపు జయ విఘ్నేశ్వర్, పెద్ది రాజు బృందం మాండోలిన్ కచేరి, సత్యనారాయణన్ కృష్ణబాబు కీ బోర్డు విన్యాసం, బెంగళూరుకు చెందిన అర్చన మిశ్రా కథక్, సోనాలి మొహంతి ఒడిస్సి, హైదరాబాద్ కళాకారుడు హరి మంగళంపల్లి బృందం భరతనాట్య ప్రదర్శనలు ఉంటాయి. కళాప్రియులు, కళాకారులు, పరిశోధకులకు ఉచిత ప్రవేశం. కానీ, ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే టీ టిఫిన్లు, భోజన సౌకర్యం కల్పిస్తామని, ప్రత్యేక కిట్ అందిస్తామని, ఆసక్తిగలవారు విపంచి వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డాక్టర్ రాజారావు త్రిపురనేని కోరారు.

ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం 98499 91499 నంబరు వాట్స్ యాప్ లోనూ సంప్రదించి సంబంధిత రిజిస్ట్రేషన్ లింక్ ను పొందవచ్చు.

మహమ్మద్ రఫీ

Share via
Copy link
Powered by Social Snap