నేటి ప్రతిభామూర్తి శ్రీ ముక్కెర సైదారావు (73) గారు, రామలింగేశ్వర పేట, తెనాలి.
వీరు చిన్నతనం నుండి సంగీతంలో సాధన చేసారు. రంగస్థలంలో సంగీత కళాకారుడిగా 50 ఏళ్ల ప్రస్థానం కలిగి, ప్రసిద్ధిగాంచిన “నాటక-సంగీత కళాకారుడు” సైదారావు గారు. రక్తకన్నీరు నుంచి పడమటిగాలి దాకా వందలాది సంగీత ప్రదర్శనలతో, ‘నంది ‘ నాటక ప్రయాణంలో ఏకంగా “పది” నంది అవార్డులను సాధించిన ఘనచరిత్ర వీరిది. డెభై ఏళ్ల వయసులో కూడా నవ యువకుడిగా ప్రయోగాలు, ప్రదర్శనలు చేయడానికి సిద్ధం అంటున్న నాటక-సంగీత దర్శకుడు సైదారావు గారు.
వీరి తండ్రి పిచ్చయ్య గారు క్లారినెట్ వాద్యంలో నిష్ణాతులు. తండ్రే వీరికి తొలిగురువుగా భావించి పన్నెండవ ఏట క్లారినెట్ నేర్చుకోవడం ప్రారంభించారు. అలాగే రెండ్ళేళ్లు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు.
1958లో బ్రతుకుతెరువు కోసం చెన్నైలో సినీ నటుడు పద్మనాభం తమ్ముడు మధుతో కలిసి అద్దెకు ఉండేవారు. ఆరోజులలో ప్రజానాట్యమండలి వ్యవస్థాపకల్లో ఒకరైన డాక్టర్ గరికపాటి రాజారావు గారి “అల్లూరి సీతారామరాజు” నాటకానికి క్లారినెట్ వాయించడం ద్వారా వీరి ప్రస్థానం మొదలయింది. తర్వాత ప్రముఖ సినీ నటులు నాగభూషణం గారు రక్తకన్నీరు నాటకానికి పిలిచారు. రక్తకన్నీరు నాటక ప్రదర్శన జరిగినన్నాళ్లూ క్లారినెట్ కళాకారుడు సైదారావు గారే. తర్వాత పద్మనాభం, సంగీత దర్శకుడు ఎస్ పి కోదండపాణి ప్రదర్శించిన శాంతినివాసం నాటకానికి పనిచేసారు. పరిషత్ నాటకాలకు సంగీతం అందజేయడంతో మొదలు, పి.ఎల్.నారాయణ, కె.ఎస్.టి.సాయి గార్లతో కలిసి రూపొందించిన చాణక్య-చంద్రగుప్త నాటకంతోపాటు, అనేక పరిషత్ నాటకాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు.
హైదరాబాద్, ఆకాశవాణిలో ప్రముఖ ఆర్టిస్టు శారద భర్త శ్రీనివాసన్ గారి దగ్గర వేణువు నేర్చుకున్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, మరియు బిస్మిల్లాఖాన్ గారి షెహనాయిని తెప్పించుకుని నేర్చుకున్నారు. కీబోర్డ్, క్లారినెట్, ఫ్లూట్, షెహనాయి వాద్యాలలో నైపుణ్యం సాధించారు. అంతేకాదు కర్ణాటక, హిందూస్తానీ సంగీతం రెండింటికీ సంగీతం అందించే స్థాయికి ఎదిగారు సైదారావు గారు.
1989-90 సంవత్సరాలలో నంది నాటక పోటీలు మొదలయ్యాయి. “పృథ్వీ స్తూపం” నాటకానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా తొలి నంది అవార్డ్ ను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత రావణకాష్టం, ఎక్కడ ఉన్నా ఏమైనా, మిథునం, వందేమాతరం, రాచపుండు, సై సై జోడెడ్ల బండి, పుణ్యభూమి నా దేశం, జో అచ్యుతానంద, పడమటి గాలి ఇలా ఎన్నో నాటకాలకు సంగీతం అందించి, ఉత్తమ సంగీత దర్శకుడిగా పది నంది అవార్డులను 1999, 2000, 03, 04, 06, 06,07, 08, 09, 2010 లో ఇలా వరుసుగా పది నంది అవార్డులు, రెండు సార్లు గరుడ అవార్డులు అందుకున్న ఘనత సైదారావు గారిదే. ఆలిండియా రేడియోలోను, దూరదర్శన్ లలో పలుసార్లు కార్యక్రమాలు ఇచ్చారు. వీరు హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, కలకత్తా, గుంటూరు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, మరియు తెనాలిలోను ఇలా పలుచోట్ల ప్రదర్శనలలో పాల్గొన్నారు.
త్వరలోనే హైదరాబాద్ లో “జుగల్ బందీ” ప్రయోగం చేయ్యడానికి సిద్ధమవుతున్నానని తెలిపారు. గతంలో ఈ ప్రయోగం రాజమండ్రి, తెనాలిలో విజయవంతంగా జరిగిందని తెలిపారు. షెహనాయి, బేస్ ఫ్లూట్, కీబోర్డ్ ను వీరే అందిస్తారు. తబలా మాత్రం వేరే కళాకారుడు వాయిస్తారు. ఇదో వినూత్నమైన ప్రయోగమని, అలాగే నాటకాలకు సంగీతం అందించడంలో ఎనలేని తృప్తిని పొందుతున్నానని అన్నారు.
తెనాలిలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని, నాటక సమాజాల వారితో సహకరిస్తున్నారు. అంతేకాదు “SRI SAI DREAMS SCHOOL” పేరుతో మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ లలో ఔత్సాహికలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు కూడా.
చివరిగా “ఆనాటి రక్తకన్నీరు నుంచి, నేటి పడమటిగాలి దాకా ఎన్నో గొప్ప గొప్ప నాటకాలకు సంగీతం అందించానన్న తృప్తిని సంపాదించుకున్నాను. ఒక కళాకారుడికి ఇంతకన్నా మించిన తృప్తి ఏముంటుందని” నవ్వుతూ అన్నారు శ్రీ సైదారావు గారు.
డా. దార్ల నాగేశ్వర రావు