సంగీత సంచలనం ‘ఇళయరాజా’

(జూన్ 2 న సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టిన రోజు సందర్భంగా ….)

భారతీయ చలనచిత్ర చరిత్రలో సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక సంగీత మహాసముద్రం. సినిమా సంగీతానికి తనదైన ప్రత్యేకమైన, అద్భుతమైన రూపాన్ని కల్పించి, ఎవ్వరూ మళ్ళీ అనుకరించలేని మహోన్నతమైన స్థాయిని సృష్టించి అనిర్వచనీయమైన స్వరత్రయోక్త ఇళయరాజా !
తమిళ దర్శకుడు భారతీరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిన్న చిన్న కచేరీలు చేసుకుంటున్న దశలో ఇళయరాజాని తీసుకొచ్చి ఆయనకి పరిచయం చేశారు. అవకాశాల కోసం చాలా స్ట్రగుల్ అవుతున్న ఈ బ్రదర్స్ ‘నీ ట్రూప్ లో పెట్టుకో’ అని భారతీ రాజా సిఫార్సు చేయడంతో ఎస్పీ బాలుతో ఇళయరాజా ప్రయాణం ప్రారంభమైంది. బాలూగారి ఆర్కెస్టాలో హార్మోనిస్టుగా.. అలా ప్రారంభమైన ఇళయరాజా సంగీత యాత్రరెండు దశాబ్దాల పాటు జైత్ర యాత్ర పర్వంగా సాగింది. తమిళ్ లో చేసిన మొట్ట మొదటి చిత్రం ‘అన్నాకవి’ తోనే ఇళయరాజా అందరినీ ఆకట్టుకున్నారు. ఓప్రక్కన కె.వి.మహదేవన్, ఎం.ఎస్.విశ్వనాథన్, రాజన్ నాగేంద్ర లాంటి ఉద్దండులు స్వైర విహారం చేస్తున్న రోజుల్లో అడుగులు వెయ్యడం నేర్చుకున్న ఇళయరాజా రివ్వుమని తారాపథంలోకి దూసుకుపోయారు. ఎవ్వరూ ఊహించని సంచలనం ఆయన. ఎవ్వరికీ అంతుబట్టని ప్రభంజనం.

ఆయన మొదట్లో చేసిన టిక్.టిక్.టిక్, వయసు పిలిచింది. భద్రకాళి – కొత్తగా, వినడానికి మత్తుగా ఉంటూ, మిగతా పాటల నుంచి ఎంతో విభిన్నంగా, చాలా విలక్షణంగా వినిపించగానే మొత్తం పరిశ్రమ ముఖ్యంగా తెలుగు పరిశ్రమ దృష్టి ఇళయరాజా వైపు మళ్ళింది. ఆ మలుపులోనే అప్పుడే తలెత్తుతున్న సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ యువ నిర్మాత కె.ఎస్.రామారావు – ఇళయరాజాని- చిరంజీవిగారి తొలి హిట్ చిత్రాలు అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు ద్వారా తెలుగు పరిశ్రమకి అతికించేశారు. ఇంక అక్కడి నుంచి ఇళయరాజా వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇళయరాజా తీసుకొచ్చిన విప్లవాత్మకమైన ధోరణులు, బాణీలు కొత్త తరాన్ని, సంగీత ప్రియుల్ని సరికొత్తగా ఊరించాయి. గంధర్వ గాయకుడు ఘంటసాల గారి తర్వాత అన్ని రకాల రాగాలలో, అన్ని విధాల స్వరసుగంధాలతో పాటలను అలంకరించిన సంగీత దర్శకుడు మరొకరు లేరు. ‘కొండవీటి దొంగ’ మ్యూజిక్ సిట్టింగ్అ వుతుండగా ‘నిర్మాత గారు అన్ని పాటలు హిట్ కావాలని సుందర రామ్మూర్తి అన్నారు. దానికి ఇళయరాజా ‘ఘంటసాల గారికి తప్ప మరెవరికీ సాధ్యం కాద’ని చెప్పారు. తను ఎంత ఎత్తుకి ఎదిగినా, పెద్ద వాళ్ళ పట్ల ఇళయరాజాకి ఉన్న భక్తి ప్రపత్తులకి ఈ సంఘటన గొప్ప ఉదాహరణ. కీబోర్డులో అన్ని రకాల సౌండ్లు ఉంటాయని, వాటని కమర్షియల్ ట్యూన్స్ కి అంత బాగా ఉపయోగించుకోవచ్చని నిరూపించిన గొప్ప మ్యుజీషియన్ రాజాగారు. ఆయన సింఫనీ కంపోజ్ చేస్తే పాశ్చాత్య దేశాలు తుళ్ళిపడ్డాయి.  తను సంగీతం సమకూర్చిన సినిమాలన్నింటికీ తను కూడా ఓ హీరోగానే నిలబడిన ఘనత ఇళయరాజాదే.

SA: