“సినిమా అనేది ఒక వినోద సాధనం. ఏ సినిమా అయినా ప్రేక్షకుని మైమరపించాలి. అలా చెయ్యాలంటే మంచి జీవం గల కథలు రావాలి. అయితే అటువంటి జీవంగల కథలను తీసుకొని సినిమాగా మలిస్తే అది క్లాస్ చిత్రంగా ముద్రపడి డబ్బు రాదేమోనని నిర్మాతలు భయపడి, బయటి చిత్రాల కథలు తీసుకొని వాటిని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. దానితో ఆయా చిత్రాల్లో వున్న సంగీతం కూడా తెలుగులోకి దిగుమతి అవుతోంది. సంగీత దర్శకుడు కష్టపడి మంచి సంగీతాన్ని అందించాల్సిన అవసరం కూడా తగ్గిపోతోంది. సంగీత దర్శకునికి వ్యవధి ఇచ్చి, సందర్భానికీ పాత్రకూ తగిన పాటను తయారు చేయిస్తే ఆ పాటలు అజరామరమవుతాయి” ఇది యాభై సంవత్సరాలకు పూర్వమే తెలుగు సంగీతంలో వస్తున్న మార్పులను అంచనావేసిన సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు వెలిబుచ్చిన అభిప్రాయం. అందుకే పెండ్యాల స్వరపరచిన ‘రసికరాజ తగువారము కామా’ (జయభేరి), ‘శివశంకరీ శివానంద లహరి’ (జగదేకవీరుని కథ), ‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది’ (ఉయ్యాల జంపాల), ‘శేషశైలావాస శ్రీవేంకటేశా’ (శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం), ‘పాడవోయి భారతీయుడా’(వెలుగునీడలు) వంటి అద్భుతమైన పాటలు నేటికీ పోటీపాటలుగానిలుస్తున్నాయి. తెలుగు సినీసంగీతాన్ని తారాపథంలో నిలబెట్టిన ఘనత పెండ్యాలది. తెలుగు సినీరంగానికే కాదు, దక్షిణాది సినీరంగంలో గాయనీమణులుగా రాణించిన పి.సుశీల, ఎస్.జానకిలను పరిచయం చేసిన వ్యక్తిగా పెండ్యాలకు సమున్నత స్థానముంది. ముప్పై ఎనిమిదేళ్ళ క్రితం… అంటే 1984 ఆగస్టు 31న తన 67వ ఏట కాలంచేసి, అద్భుత సంగీత నిధిని ఈ తరం సంగీతాభిమానులకు మిగిల్చి వెళ్లిన ఆ సంగీత కళానిధి పెండ్యాలనాగేశ్వరరావును గూర్చి కొన్ని విశేషాలు పంచుకుందాం.
బాల నటుడు, గాయకుడిగా…
పెండ్యాల నాగేశ్వరరావు జన్మించింది 1917 మార్చి 6న కృష్ణా జిల్లా ఒణుగూరు గ్రామంలో. తరువాత వారి కుటుంబం కాటూరు గ్రామానికి మారింది. పెండ్యాల వెంకాయమ్మ, సీతారామయ్య అతని తల్లిదండ్రులు. నాగేశ్వరరావు పుట్టిన ఆరు మాసాలకే తల్లి కాలం చేశారు. తాత రామయ్య కూడా మంచి సంగీత విద్వాంసుడు. తండ్రి ఆడపిల్లల బడిలో సంగీత ఉపాధ్యాయుడు. నాటకాలకు, హరికథలకు హార్మోనియం వాయించే వారు. పిల్లలకు సంగీత పాఠాలు బోధించేవారు. అలా నాగేశ్వరరావుకు కూడా సంగీతం మీద ఆసక్తి పెరిగి తండ్రి వద్దే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. అలాగే హార్మోనియం వంటి సంగీత పరికరాలను ఉపయోగించడం కూడా నేర్చుకున్నారు. అంతే కాకుండా నటన మీద కూడా ఆసక్తి కనబరుస్తూ పాఠశాల స్థాయిలో ప్రార్ధనాగీతాలు పాడడంతోబాటు, చిన్నచిన్న వేషాలు కూడా వేసేవారు. కాలక్రమంలో మంచి హార్మోనిస్టుగా, నటుడుగా, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. సంగీత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ఇస్తామంటే ఒద్దన్నారు. ప్రముఖ నాటక, సినీ కళాకారుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పెండ్యాలకు సహాధ్యాయి. కాలు అందని పదమూడేళ్ల వయసులో ‘లెగ్ హార్మోనియం’ మీద సంగీతం అందించేవారు. పెండ్యాల రంగస్థల నటుడుగా రాణించిన తొలినాటకం ‘శ్రీకృష్ణ తులాభారం’. అందులో పెండ్యాల పోషించింది ‘జాంబవతి’ పాత్ర. తరువాత ఇదే నాటకంలో రుక్మిణి, నారద పాత్రలు కూడా పోషించారు. జొన్నవిత్తుల శేషగిరిరావు, ఋష్యేంద్రమణి, లక్ష్మీరాజ్యంలతో కలిసి పెండ్యాల నాటకాలు ప్రదర్శించేవారు. అప్పట్లో‘బెజవాడ నాట్యమండలి’పేరిట తుంగల చలపతిరావు, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలం వంటి కళాకారులు సతీ సక్కుబాయి’ నాటకాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూవుండేవారు. తుంగల చలపతిరావు తప్పుకున్నతర్వాత సక్కుబాయి పాత్ర పెండ్యాలకు దక్కింది. శ్రీకృష్ణ తులాభారంలోని తొలి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొనే 1966లో నిర్మాత రామానాయుడు నిర్మించిన ‘శ్రీకృష్ణతులాభారం’ సినిమాకు పెండ్యాల అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
సినీరంగ ప్రవేశం…
కడారు నాగభూషణం, పెండ్యాల తండ్రి మంచి స్నేహితులు. ఆయన నిర్మించిన ‘తల్లిప్రేమ’ (1941) చిత్రంలో సంగీత దర్శకుడు దినకరరావుకు, ‘సతీ సుమతి’(1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడుగా పెండ్యాలకు తొలి అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా సినిమాల నిర్మాణం ఆగిపోవడంతో పెండ్యాల మద్రాసు వీడి సొంతవూరు వచ్చేశారు. యుద్ధం ముగిశాక, సాలూరు రాజేశ్వరరావు వద్ద సహాయకుడిగా చేరి హిందూస్తానీ సంగీత పోకడలను తెలుగు సంగీతానికి అనువర్తించే మెలకువలను ఆపోశన పట్టారు. 1945లో దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం సారథి సంస్థ పతాకం మీద ‘మాయాలోకం’ సినిమా నిర్మించారు. అక్కినేని కాంభోజరాజ కుమారుడు శరాబందిరాజుగా ఒక చిన్న పాత్ర పోషించిన ఈ చిత్రానికి గాలి పెంచల నరసింహారావు సంగీత దర్శకుడు. అందులో కన్నాంబ పాడిన పాటలు, బెజవాడ రాజరత్నం ఆలపించిన జావళి, అక్కినేని వల్లించిన పద్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలో హార్మోనియం వాయించేందుకు పెంచల నరసింహారావు నుంచి పెండ్యాలకు ఆహ్వానం అందింది. ఆ సినిమా హిట్టయింది. చల్లపల్లి రాజా 1946లో నిర్మించిన ’గృహప్రవేశం’ చిత్రానికి బాలాంత్రపు రజనీకాంతరావు సంగీత దర్శకత్వం చేపట్టినప్పుడు కె.ఎస్. ప్రకాశరావు సిఫారసుతో పెండ్యాల సహాయ సంగీత దర్శకుడిగా రజనీకాంతరావుకు సహకరించారు. అప్పట్లో రజనీకాంతరావు ఆకాశవాణిలో స్టేషన్ డైరక్టర్‌గా తీరికలేకుండా ఉండడంతో, పెండ్యాలే ఈ చిత్ర సంగీత విభాగానికి పూర్తి బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చింది. పెండ్యాల సమర్థత కళ్లారా చూసిన కె.ఎస్.ప్రకాశరావు తను సొంతంగా నిర్మించిన ‘ద్రోహి’ (1948) చిత్రంలో పెండ్యాలకు సంగీత దర్శకునిగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. అందులో పెండ్యాల స్వరపరచిన ‘పూవు జేరి పలుమారు తిరుగుచు’(ఘంటసాల, జి.వరలక్ష్మి), ‘చక్కిలిగింతలు లేవా చక్కని ఊహలు రావా’ (జి.వరలక్ష్మి), ‘ప్రేమయే కదా సదా విలాసి’(ఎం.ఎస్. రామారావు, జి.వరలక్ష్మి) పాటలు బాగా పాపులర్ అయ్యాయి. సంగీత దర్శకుడుగా స్థిరపడే అవకాశాన్ని ‘ద్రోహి’ చిత్రం పెండ్యాలకు సహకరించింది. సన్నివేశానికి అనుగుణంగా పాటకు సంగీత బాణీలు కట్టడం అనే లక్షణం పెండ్యాలకు అప్పటి నుంచే అలవడింది. గాయనీగాయకుల పూర్తి స్థాయి ప్రతిభను ఉపయోగించుకుంటూ పాటలు రికార్డు చేయడం, పాట ఎవరిమీద చిత్రీకరణ జరుగుతుందో ముందుగా తెలుసుకొని ఆ పాత్రకు అనుగుణంగా వుండే గాయనీగాయకులకు పాడే అవకాశాలు కలిపించడం పెండ్యాల ప్రత్యేకత. ద్రోహి చిత్రం తరువాత ‘మేనరికం’, ‘కన్నతల్లి’, ‘జ్యోతి’ వంటి సినిమాలకు పెండ్యాల సంగీతం అందించారు. సినిమా నిర్మాత కాకపూర్వం దుక్కిపాటి మధుసూదనరావుకు ‘ఎక్సెల్సియర్ డ్రమెటిక్ అసోసియేషన్’ అనే నాటక సంస్థ వుండేది. అక్కినేని నాగేశ్వరరావు అందులో పాత్రలు పోషించేవారు. పెండ్యాల ఆ నాటకాలకు సంగీతం సమకూర్చుతూ, హార్మోనియం వాయించేవారు. ఆ పరిచయంతోనే దుక్కిపాటి ‘దొంగరాముడు’ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశాన్ని పెండ్యాలకు ఇచ్చారు. ఆ సినిమాలోనే పి. సుశీల చేత ‘బలే తాత మన బాపూజీ’ పాటను పాడించి ఆమెను చిత్రపరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశారు. తరువాత ‘ముద్దుబిడ్డ’(1956), ‘భాగ్యరేఖ’(19547) చిత్రాలు పెండ్యాల కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముద్దుబిడ్డలో ‘చూడాలని వుంది, అమ్మా చూడాలని వుంది’ అనే పాట ఆ రోజుల్లో ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించింది. భాగ్యరేఖలో ‘నీవుండేదా కొండపై నా స్వామీ నేనేనుండేదీ నేలపై’ పాట నేటికి సజీవమే. 1959లో వచ్చిన ‘జయభేరి’ చిత్రం సంగీత పరంగా అత్యన్నత ప్రమాణాలు అందుకుంది. అందులో ఘంటసాల ఆలపించిన ‘మది శారదాదేవి మందిరమే’, ‘రసికరాజ తగువారము కామా’, ‘రాగమయీ రావే అనురాగమయీ రావే’, ‘యమునా తీరమున సంధ్యాసమయమున’ పాటలు అజరామరమయ్యాయి. ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’లో ‘శేషశైలావాస శ్రీవెంకటేశా’ పాట తిరుమల శ్రీవారి సమక్షంలో చిత్రీకరణ జరిపినప్పుడు అందులో పెండ్యాల కూడా అగుపిస్తారు. 1960లో వచ్చిన ‘మహాకవి కాళిదాసు’ సినిమాలో ఘంటసాల చేత ఒకే టేకులో పాడించిన ‘మాణిక్య వీణా ముఫలాలయంతీ, మదాలసాం మంజుల వాగ్విలాసాం’ అనే దండకం పూర్తయ్యాక చలించిపోయిన పెండ్యాల ఘంటసాలను ఆలింగనం చేసుకున్నారు. భట్టి విక్రమార్క సినిమాలో ‘ఓ నెలరాజా, వెన్నెల రాజా’, ‘వాగ్దానం’లో ‘శ్రీనగజా తనయం సహృదయం’ హరికథ, వెలుగునీడలు చిత్రంలో ‘కలకానిదీ విలువైనది’, బావమరదళ్ళు చిత్రంలో ‘రావే నా చెలియా’, ‘ముక్కోటి దేవతలు ఒక్కటైనారు’, ‘జగదేకవీరుని కథ’లో ‘శివశంకరి శివానంద లహరి’, ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలో ‘తిరుమల తిరుపతి వెంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో ‘అలిగితివా సఖీ ప్రియా అలక మానవా’, ‘రాముడు భీముడు’లో ‘దేశమ్ము మారిందోయ్, కాలమ్ము మారిందోయ్’, ‘శ్రీకృష్ణ తులాభారం’లో ‘ఓహో మోహనరూపా కేళీ కలాపా’, ‘భూమికోసం’ చిత్రంలో ‘ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా’, ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో ‘చిత్రం భళారే విచిత్రం’ వంటి ఎన్నో పాటలకు ప్రాణంపోసిన పెండ్యాల సంగీత పటిమను తక్కువగా అంచనా వేయలేం. పెండ్యాల ఒక్క హార్మోనియమే కాకుండా, తబలా, డోలక్, మృదంగం, ఫ్లూటు, పియానో, గిటార్, వయోలిన్ వంటి వాద్యపరికరాలను చక్కగా వాయించేవారు. తన జీవితకాలంలో పెండ్యాల వందకుపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం నిర్వహించారు.
పెండ్యాల కార్యదీక్ష…
‘శ్రీకృష్ణ తులాభారం చిత్రం’లో సత్యభామ కోసం స్వరపరచిన స్థానం నరసింహారావు గీతం ‘మీరజాల గలడా నాయానతి’ పాటలో సుశీలకు కనీసం వూపిరి తీసుకునే వ్యవధి కూడా వుండదు. ‘పాటకు టెంపో రావాలంటే గుక్కతిప్పుకోకుండా ఉండేలా పాట కుదరాలి’ అనేవారు పెండ్యాల. అలా సుశీల ఆ పాటను ఎంతో శ్రమకోర్చి పాడాల్సివచ్చింది.
‘జగదేకవీరుని కథ’ సినిమాలో ‘శివశంకరి’ పాటను ఒకే టేకులో రికార్డు చేద్దామని ఘంటసాలతో చెప్పి, ‘ఎన్నిరోజులైనా రిహార్సల్స్ చెయ్యండి, కానీ పాట మాత్రం ఒకే టేకులో ఒకే అవ్వాలి’ అంటూ ఘంటసాలకు సవాల్ విసిరారు పెండ్యాల. మొదట 14 నిమిషాలు వున్న పాట నిడివిని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి పాటను ఖరారు చేశారు. ఘంటసాల వారం రోజులపాటు వేరే రికార్డింగుకు వెళ్లకుండా సాధనచేసి, పెండ్యాల అన్నట్లుగానే ఒకే టేకులో పాటను పూర్తి చేశారు. అందుకే ఘంటసాల ఈ పాటను ఏ పాట కచేరీలోనూ పాడే సాహసం చేయలేదు. ఆ పాట ఎంత పాపులర్ అయిందో చెప్పనవసరం లేదు.
‘ఎం.ఎల్.ఎ’ చిత్రం ద్వారా గాయని ఎస్.జానకిని తెలుగు చలనచిత్ర రంగానికి పెండ్యాల పరిచయం చేశారు. ‘నీ ఆశ అడియాస చేజారే మణిపూసా, బ్రతుకంతా అమవాస, లంబాడోళ్ళ రాందాసా’ అనే పాటను జానకి ఘంటసాలతో కలిసి పాడారు. అనుపమా సంస్థ అధినేత కొల్లిపర బాలగంగాధర తిలక్ (కె.బి.తిలక్) నిర్మించిన అన్ని చిత్రాలకూ పెండ్యాలే సంగీత దర్శకుడు.
తిలక్-ఆరుద్ర-పెండ్యాల కాంబినేషన్ అత్యద్భుతమని చిత్రపరిశ్రమ కీర్తించేది. ‘ముద్దుబిడ్డ’, ‘ఎం.ఎల్.ఎ’, ‘ఈడూజోడూ’, ‘అత్తా ఒకింటికోడలే’, ‘ఉయ్యాల జంపాల’, ‘భూమికోసం’, ‘కొల్లేటి కాపురం’ సినిమాలకు అద్భుత సంగీతం అందించింది పెండ్యాల- ఆరుద్ర జంటే!
పెండ్యాల మంచినటుడు కూడా. ‘కన్నతల్లి’ చిత్రంలో పెరుమాళ్ళు అనే రైతుబిడ్డగా, ‘మొదటి రాత్రి’ సినిమాలో నాటువైద్యునిగా, ‘పెంకిపెళ్ళాం’లో భావకవిగా, ‘దీక్ష’లో పల్లెటూరి రైతుగా, ‘భూమికోసం’లో ఊరిపెద్దగా, ‘కొల్లేటి కాపురం’లో బార్బర్‌గా నటించారు. ‘వెలుగునీడలు’లో ‘కలకానిది విలువైనది’ పాటకు సంగీతం నిర్వహిస్తూ, అలాగే ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రంలో ‘శేషశైలావాస శ్రీవేంకటేశా’ పాటకు సంగీతం అందిస్తూ కనపడతారు.
పాటకు వాద్యాలు సహాయకారిగా ఉండాలే కానీ, పాటను అతిక్రమించరాదు. ఎక్కువ వాద్యాలను వాడటం వలన పాటలో వుండే మాధుర్యాన్ని అనుభవించలేము. ఆర్కెస్ట్రా వలన పాట మాధుర్యం ఇనుమడించాలి. ముఖ్యంగా పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలకు సంగీతం అందించేటప్పుడు పాశ్చాత్య వాద్యాలను వాడకుండా వుండడం మంచిది. పాటలో తెలుగుదనం ఉట్టిపడుతూ వుండాలిఅనేది పెండ్యాల నిశ్చితాభిప్రాయం..
పెండ్యాల భార్య పేరు సీతాంసుముఖి. వారికి నలుగురు కూతుళ్ళు. తన సంగీత ప్రతిభతో నాటి తెలుగు సినిమాలలోని పాటలను అజరామరం చేసిన పెండ్యాల 1984 ఆగస్టు 31 న పరమపదించారు.
–ఆచారం షణ్ముఖాచారి