బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

చలనచిత్ర కళలో సంగీతమనేది ఒక ముఖ్యమైన అంతర్భాగం. తెలుగు సినిమాల్లో సంగీతానికి ఒక విశిష్టత వుంది, ఒక చరిత్ర కూడా వుంది. జాతీయ స్థాయిలో మంచి సంగీతంగల తెలుగు పాటలు ఎన్నోవున్నాయి. అయితే రాను రాను అనుకరణ ప్రభావంతో తెలుగు సినిమా పాటల్లో మాధుర్యం తగ్గడమే కాదు, సృజనాత్మకతకు గండి కొడుతోంది. అందుకే మంచి పాటలు అని చెప్పుకోవలసివస్తే అలనాటి పాత సినిమా పాటలనే ఉదహరించవలసి వస్తోంది. నాటి స్థాయిని, నాటి మధురిమను గుర్తు చేసుకోవాలంటే సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి మహనీయులు సృష్టించిన పాటల్ని వినాలి. అటువంటి అద్భుత సంగీతాన్ని తెలుగు సంగీత ప్రియులకు పంచిన మహనీయుల్లో రమేష్ నాయుడు కూడా ఒకరు. అతడు ముందు రచ్చ గెలిచి తరవాత ఇంట గెలిచి పెద్దల నానుడిని తారుమారు చేసిన ప్రత్యేక కళానిధి. లక్ష్మికాంత్ ప్యారేలాల్ ను సంగీత దర్శకులుగా బాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత కూడా రమష్ నాయుడుదే! అటువంటి రమేష్ నాయుడు జయంతి (27 జూన్) సందర్భంగా అతని సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి…

డబ్బుల్లేకుండా బొంబాయి వెళ్లి…

ఆ కుర్రాడికి పద్నాలుగేళ్ళు. విజయవాడకు దగ్గరలోని కొండపల్లి అతడి వూరు. పాటలు పాడడం అతనికి సరదా. హార్మోనియం మెట్లమీద సుతారంగా వ్రేళ్ళు కదిలించేవాడు. విజయవాడ, గుంటూరు నగరాల్లో చదువుకుంటున్నప్పుడు పదిమంది మిత్రులను చేరదీసి హార్మోనియం వాయిస్తూ పాటలు పాడి వారిచేత శహభాష్ అనిపించుకునేవాడు. అతడికి సంగీతం మీద అభిమానం పెరగడానికి అతని తాతగారే కారణం. అతడు వయోలిన్ బాగా వాయించేవారు. ఇంటిలో అందరూ పాటలు పాడేవారు. అయితే అతడు సంగీతం నేర్చుకోలేదు. నేర్చుకుందామనే ధ్యాసకూడా లేదు. కానీ, ఎందుకో బొంబాయి వెళ్ళాలనిపించింది. అనుకున్నదే తడవుగా విజయవాడలో బొంబాయి వెళ్తున్న రైలు ఎక్కేశాడు. హిందీ భాష రాదు. జేబులో ఐదు రూపాయలకు మించి చిల్లర లేదు. రైలు బండయితే ఎక్కాడేగాని బొంబాయి వెళ్లి యేమిచెయ్యాలో ఆలోచించలేదు. అయితే అతడికి తన ఆప్తమిత్రుడు బోధించిన మాటలే గుర్తుకొస్తున్నాయి. “నువ్వు ఈ వూళ్ళో వుంటే లాభంలేదు. నువ్వు పాటలు బాగా పాడుతావు. బొంబాయి వెళ్ళావంటే మహమ్మద్ రఫీలా మంచి గాయకుడివైపోతావు. నేను నీకు తోడు. బయల్దేరు” అంటేనే రైలు బండెక్కాడు. అతడే… అతి తక్కువ వ్యవధిలో అద్భుత సంగీత దర్శకుడిగా రూపాంతరం చెందిన పసుపులేటి రమేష్ నాయుడు. అతడు పుట్టింది జూన్ 27, 1933 న కొండపల్లిలో. బొంబాయి స్టేషన్లో దిగి స్టూడియోల వెంట, సంగీత దర్శకుల ఇళ్ళ వెంట కాళ్ళు అరిగేలా తిరిగారు. తిండి లేదు, ఉండటానికి ఆసరా కూడా లేదు. ఓ చెట్టు మూలన కూర్చొని ఏడవసాగాడు. దారినపోయే ఒక పెద్దాయన ఆగి “ఎవరు బాబూ. ఎందుకేడుస్తున్నావు” అంటూ హిందీలో ప్రశ్నించాడు. రమేష్ నాయుడు తెలుగులో చెప్పిన సమాధానం అతనికి అర్ధం కాలేదు. తనకు తెలిసిన ఒక తెలుగాయన వున్నాడు. అక్కడకు పదమని రమేష్ ను తీసుకెళ్ళి బసంత్ స్టూడియోలో కెమెరామన్ గా పనిచేస్తున్న రావు కు పరిచయం చేశాడు. అయన పుణ్యమా అని బసంత్ స్టూడియోలోనే కెమెరా విభాగంలో చిన్న పని దొరికింది. తరవాత సౌండ్ విభాగానికి మారాడు. బసంత్ స్టూడియోలో పాటల రికార్డింగు కూడా జరుగుతూ వుండేది. తన లక్ష్యం కూడా గాయకుడిగా రాణించాలనే! కోరస్ లో పాడేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. ఆ స్టూడియోకి దగ్గరలోని ఒక కాందిశీకుల కాలనీలో రమేష్ మకాం. అక్కడ రమేష్ నాయుడుకి ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు సినిమాల్లో పాటలు రాయాలని వచ్చాడట. అతడు రమేష్ తో “నేను పాటలు రాస్తాను. వాటికి బాణీలు కట్టి నువ్వు పాడు. ఇద్దరం సినిమా నిర్మాతలను కలుద్దాం. నేను రాసే పాటల సాహిత్యం వారికి నచ్చితే, ఆ పాటలు నువ్వే పాడాలని షరతు పెడతాను” అంటూ ప్రోత్సహించి, ధైర్యంచేసి బి.ఆర్. చోప్రా వద్దకు వెళ్ళారు. చోప్రా ఏ మూడ్ లో వున్నాడో ఒక పాట ఇచ్చి బాణీ కట్టి పాడమన్నాడు. రమేష్ కు భగవంతుడు ఇచ్చిన యోగం అదే…. సాహిత్యం ఎటువంటిదైనా వరసలు కట్టి పాడడం. చోప్రాకు ఆశ్చర్యం వేసింది. మరో పాట సాహిత్యాన్ని ఇస్తే రమేష్ నాయుడు ఆ పాటకు కూడా బాణీ కట్టి పాడేశాడు. “నిన్ను సంగీత దర్శకుణ్ణి చేస్తాను. నీ హిందీ భాష బాగలేదు. హిస్ మాస్టర్స్ వాయిస్ వారికి వుత్తరం ఇస్తాను. అక్కడికెళ్ళి వాద్యపరికరాలు ఎలా వాడాలో నేర్చుకో” అంటూ సిఫారసు లేఖ ఇచ్చాడు. ఇంకేముంది రమేష్ ఆ కంపెనీలో చేరాడు. అక్కడ జోషి అనే సంగీతకారుడు రమేష్ ను బాగా ప్రోత్సహించి, పాటలకు వరసలు కట్టడంలో, వాద్యాలు వాయించడంలో కూడా మంచి శిక్షణ ఇచ్చాడు. జోషికి రమేష్ ప్రతిభ మీద నమ్మకం కుదిరింది. అప్పట్లో శంషాద్ బేగం గాయనిగా మంచి ప్రాచుర్యంలో వుంది. సినిమాలలో తప్ప ఆమెకు ప్రైవేటు రికార్డులు లేవు. అందుకు కారణం… ఎవరు స్వరాలు కట్టినా ఆమెకు నచ్చేది కాదు. అలాంటిది రమేష్ నాయుడు బాణీలు కట్టిన రెండు పాటలు పాడేందుకు ఆమె ఒప్పుకుంది. రమేష్ నాయుడుకి ధైర్యం వచ్చింది. కారణాంతరాలవలన శంషాద్ బేగం పాటలు పాడలేదు. కానీ, కొన్ని మరాఠీ సినిమాలకు వరసలు కట్టే అవకాశాలు కల్పించే సాయం చేసింది. అలా రమేష్ నాయుడు స్వరాలు సమకూర్చిన మరాఠీ పాటల్ని మోహన్ తారా అనే గాయకుడిచేత రమేష్ నాయుడు పాడించాడు. ఈలోగా ఒక మరాఠీ సినిమాకు కొత్త సంగీత దర్శకుడు కావాలని ప్రకటన ఇచ్చి, వచ్చినవారి చేత ఒక పాట ఇచ్చి బాణీలు కట్టమన్నారు. ఆ పందెంలో రమేష్ నాయుడు గెలిచాడు. “భాండివల్ పాహిజే” అనే ఆ మరాఠీ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చాడు. సంగీత దర్శకుడిగా అతడికి అదే తొలి చిత్రం. పైగా తొలి పాటను రికార్డింగ్ చేసింది అతని పుట్టినరోజు కావడం యాదృచ్చికం. అప్పుడు రమేష్ నాయుడు వయసెంతో తెలుసా… కేవలం పదహారేళ్ళు.

తరలి వచ్చిన అవకాశాలు…

ఆ మరాఠీ చిత్ర విజయంతో రమేష్ నాయుడుకు అవకాశాలు రాసాగాయి. కొన్ని పంజాబీ, గుజరాతీ చిత్రాలకు, ఒక నేపాలీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఆల్ ఇండియా రేడియోలో కూడా కొన్ని లలిత గీతాలకు సంగీతం నిర్వహించి ప్రసారం చేశాడు. అప్పుడే రమేష్ నాయుడుకు ఎస్.కె. పాటిల్ తో పరిచయం అయ్యింది. ఆయన ద్వారా ప్రముఖ దర్శక నిర్మాత, రచయిత, నటుడు కిషోర్ సాహుతో సాంగత్యం ఏర్పడింది. అప్పుడు కిషోర్ సాహు షేక్ స్పియర్ నాటకం ‘హ్యామ్లెట్’” ను హిందీలో సినిమాగా తీసే ప్రయత్నంలో వున్నాడు. రమేష్ నాయుడు ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లీషు నాటకాన్ని పోలిన చిత్రంకావడంతో పాశ్చాత్య ధోరణిలో పాటలు రూపొందించడానికి రమేష్ నాయుడు అహోరాత్రాలు చాలా కష్టపడ్డాడు. దాంతో అతడి ఆరోగ్యం దెబ్బతింది. పుణే శానటోరియంలో చేరి తొమ్మిది నెలలపాటు క్షయ వ్యాధికి చికిత్స తీసుకున్నాడు. హామ్లెట్ చిత్రం పరాజయం పొందింది. అనారోగ్యం వలన కొన్ని సినిమా అవకాశాలను రమేష్ నాయుడు వదలుకోవాల్సి వచ్చింది. దాంతో రమేష్ ను నిరుత్సాహం ఆవరించింది. అతనికి సినీ ప్రపంచం కొత్తగా అనిపించసాగింది. ఆ సమయంలో బొంబాయిలో ఒక సాంకేతిక నిపుణుల సమావేశం జరిగింది. రమేష్ నాయుడు అందులో పాల్గొన్నాడు. ఆ సమావేశానికి తెలుగు సినీ దర్శకుడు, ఎన్.టి. రామారావు మిత్రుడు అయిన డి. యోగానంద్ హాజరై రామారావు సొంత చిత్రం “తోడుదొంగలు” చిత్రాన్ని ప్రదర్శించాడు. యోగానంద్ తో పరిచయం రమేష్ నాయుడుని మద్రాసుకు రప్పించింది. మద్రాసులో ప్రముఖ నటీమణి, నిర్మాత సి. కృష్ణవేణితో రమేష్ నాయుడుకి పరిచయమై, ఆమె రాజశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మించనున్న “దాంపత్యం” (1957) సినిమాకు సంగీత దర్శకత్వం నిర్వహించే అవకాశం వచ్చింది. రమేష్ నాయుడు కి తెలుగులో అదే తొలి చిత్రం. ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఆరుద్ర రచించిన “ఈనాటి అమ్మాయిలూ బాబో గడుగ్గాయిలు”, “తానేమి తలంచెనో, నా మేనే పులకించెను”, ‘’లేదేమో ఆనందం ఇపుడీ విచారము నాదేమో ఈ నేరం’’, ‘’ఇటువంటి హాయి లేదే లేదే ఈ నటనలు నీకొరకే’’, “నడి వీధిలో జీవితం సుడిగాలిలో దీపము”,
“మా ఇల్లు స్వర్గసీమ, మధురాతి మధురసీమ” పాటలు బాగా పాపులర్ అయ్యాయి. తరవాత యోగానంద్ పర్యవేక్షణలో శోభనాద్రిరావు దర్శకత్వం వహించిన ‘స్వయంప్రభ’, ‘మనోరమ’, ‘శాంత’ చిత్రాలకు రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం నిర్వహించారు. ‘స్వయంప్రభ’ (1957) లో “ఆనంద మధురమీ లీలా, యమునా తటి రాధా మాధవుల”, ”గారాల బాలా నిదురించవేలా”, “నన్నేలరా మరులు కొన్నానురా”, “మగరాయ కతమేమిరా నీ నగుమోమె వెరపించురా ఈ వేళ” పాటలు హిట్టయ్యాయి. 1959 లో కమల్ ఘోష్ దర్శకత్వంలో భాస్కరరావునిర్మించిన ‘మనోరమ’ చిత్రంలో హిందీ గాయకుడు తలత్ మెహమూద్ చేత రమేష్ నాయుడు ఇదు పాటలు పాడించడం విశేషం. “అందాల సీమా సుధా నిలయం ఈ లోకమే దివ్య ప్రేమమయం”, “గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి బాబయ్యా గంజికొక్క ధర్మమెయ్యి బాబయ్యా”, “మరచి పోయావేమో మాయని బాసలు మనకివే ఓ సఖీ”, “అనురాగము లేనే లేదులే”, “విరబూసే ఈ పూవు నీ పూజకోరకే” పాటలు తలత్ చేత పాడించి హిట్ చేశారు “చందమామ రావే జాబిల్లి రావే” పాట నేటికీ మంచి జోలపాటగా పేరు తెచ్చుకుంది. మానాపురం అప్పారావు నిర్మించిన ‘శాంత’ (1961) సినిమాలో ”అట్టు అట్టు పెసరట్టు ఉల్లిపాయ పెసరట్టు”, “ఓ పలువన్నెల పావురమా ఈ పరుగేలనే”, “కలలోని కవితా లతా కళలూర”, “నా పాప ఫలమో, నా ప్రేమ వరమో ఓ పాప నిన్నేమందును” మొదలైన పాటలను హిట్ చేశారు.

Ramesh naidu music sitting

చెన్నపట్నంలో పునః ప్రవేశం…

రమేష్ నాయుడుకి కలకత్తా వెళ్లి వాళ్ళు నిర్మించే కళాత్మక, సందేశాత్మక చిత్రాలకు సంగీతం అందించాలనే కోరిక కలిగింది. వెంటనే కలకత్తా పయనమయ్యారు. అక్కడ ‘దాదు’ అనే బెంగాలీ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఆ చిత్ర విజయంతో మరో ఎనిమిది వంగభాషా చిత్రాలకు సంగీతం అందించారు. రమేష్ నాయుడుకి కలకత్తా నగరం, వాతావరణం నచ్చింది. అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. విజయలక్ష్మి మూవీస్ అధినేత జి.వి.ఎస్. రాజు ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు రమేష్ నాయుడుని కలిసి “తెలుగు సినిమాలకు మీరు ఎందుకు సంగీతం అందించడం లేదు. మీకు మద్రాసులో మంచి పేరున్నది. రండి మద్రాసుకు” అంటూ ఆహ్వానించారు. తెలుగు వాతావరణాన్ని, తెలుగు జనాన్ని దూరం చేసుకుంటున్నానా అనే ఆలోచనలో పడ్డారు రమేష్ నాయుడు. మద్రాసు వచ్చి జి.వి.ఎస్. రాజు నిర్మించిన ‘అమ్మమాట’ (1972) చిత్రానికి సంగీతం సమకూర్చారు. అందులో “ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా”, “ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్”, “మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు”, “సద్దు మణగనీయవోయి చందురూడా” వంటి పాటలతో రెండవ ఇన్నింగ్స్ భారీగానే మొదలెట్టారు రమేష్ నాయుడు. ఈ సినిమాకు పని చేస్తుండగానే రమేష్ నాయుడుకి నిర్మాతలు కె. రాఘవ, గిరిబాబు తో పరిచయమయ్యింది.. శ్రీధర్ ప్రొడక్షన్స్ క్రింద కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో గిరిబాబు నిర్మించిన ‘జీవితం’ (1973) సినిమాలో పాటలన్నిటినీ రమేష్ నాయుడు హిట్ చేశారు. “ఇక్కడే కలుసుకున్నాము…ఎప్పుడో కలుసుకున్నాము”, “తొలిరేయి ఇది తొలి రేయి, ఇద్దరమూ చేరి సగమూ”, ‘’మామిడి తోపుల్లోనా మాపటేల మాటేసి” వంటి పాటలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. సినిమా కూడా విజయవంతమైంది. తరవాత రాఘవ నిర్మించిన ‘తాత మనవడు’ (1973) చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించారు. ఈ సినిమా సిల్వర్ జూబిలీ చేసుకుంది. “అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం”, “ఈనాడే బాబూ నీ పుట్టినరోజు”, “నూకాలమ్మను నేనే మీ పీకలు నొక్కేస్తానే” పాటలు జనంలోకి చొచ్చుకొని పోయాయి. ఈ సినిమాలకు పనిచేస్తూ ఉండగానే విజయా సంస్థ నిర్మించిన ‘గంగ మంగ’(1973), కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) చిత్రాలకు సంగీతం నిర్వహించే అవకాశాలు వచ్చాయి. వాటి విజయంతో సంసారం సాగరం, చందన, మీనా, రాధమ్మ పెళ్లి, బంట్రోతు భార్య, ఇంటింటి కథ, దేవదాసు (కృష్ణ), చదువు సంస్కారం, ముద్దబంతి పువ్వు, తూర్పు పడమర, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, కల్యాణి, హేమాహేమీలు, మంగళతోరణాలు, మేఘసందేశం, మల్లెపందిరి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనంద భైరవి, అహ! నా పెళ్ళంట, స్వయంకృషి వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలకు అద్భుత సంగీతాన్ని అందించి అమరుడయ్యారు రమేష్ నాయుడు. దర్శకులు దాసరి నారాయణరావు, జంధ్యాల, విజయ నిర్మల తాము నిర్మించిన అధిక శాతం చిత్రాలకు రమేష్ నాయుడునే సంగీత దర్శకునిగా నియమించుకున్నారు. కవులు రాసిన పాటలకు బాణీలు కట్టేవాడే కానీ ముందుగా బాణీ ఇచ్చి పాటలు రాయించేవారు కాదు రమేష్ నాయుడు. అలా తెలుగులో కె.వి. మహదేవన్ తరవాత రమేష్ నాయుడు పేరే చెపాల్సి వుంటుంది. గాయకుడిగా స్థిరపడాలని బొంబాయి వెళ్ళిన రమేష్ నాయుడు అలా తెలుగు సినిమారంగంలోనే సంగీత దర్శకుడిగా స్థిరపడ్డారు. అంతేకాదు తనలోని గాయకుడికి పని చెబుతూ “ఓ రామసక్కని బంగారు బొమ్మా”, “తల్లి గోదారికి ఆటు పోటుంటే తప్పుతుందా మనిషికి తలరాత” అనే నేపథ్య గీతాలను పాడి ప్రేక్షకులను అలరించారు. ఒక అద్భుత సంగీత దర్శకుడిగా వెలిగిన రమేష్ నాయుడు సెప్టెంబర్ 1, 1987 న విశ్వనాథ్ చిత్రం “స్వయంకృషి’ విడుదలకు రెండ్రోజులముందే మరణించడం దురదృష్టమే.

అలరించిన కొన్ని రమేష్ నాయుడు పాటలు…

రమేష్ నాయుడు తెలుగులో వంద చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలలో పాటలుకొన్ని…

శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి (మీనా)
దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా (దేవుడు చేసిన మనుషులు)
ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు ( రాధమ్మ పెళ్లి)
దీపానికి కిరణం ఆభరణం (చదువు సంస్కారం)
ఈ కాలం పది కాలాలు బ్రతకాలని (దేవుడే గెలిచాడు)
శివరంజనీ నవరాగిణీ (తూర్పు పడమర)
చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు (చిల్లరకొట్టు చిట్టెమ్మ)
జోరుమీదున్నావు తుమ్మెదా (శివరంజని)
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా (కల్యాణి)
ప్రణయ కావ్యమున ప్రధమ పంక్తిలో (జయసుధ)
అలివేణీ ఆణిముత్యమా (ముద్దమందారం)
ముందు తెలిసేనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా (మేఘ సందేశం)
కొలువైతివా రంగశాయి (ఆనంద భైరవి)
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు (శ్రీవారికి ప్రేమలేఖ)
కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది (దేవదాసు)
సిగ్గు పూబంతి సీతామాలక్ష్మి (స్వయంకృషి)

… ఆచారం షణ్ముఖాచారి
(94929 542556)

1 thought on “బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

  1. He is one of the music maestros in film industry. Unfortunately, the movie field couldn’t give proper recognition to his creativity and originality. He never copied the tunes of others. It’s our luck, this creative genius was born in Andhra Pradesh.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap