సజీవ సంగీతశిల్ప సుందరుడు…. టి.వి. చలపతిరావు

(టి.వి. చలపతిరావుగారి వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం…)

‘నిలువవే వాలుకనులదానా, వయారి హంస నడకదానా, నీ నడకలో హొయలున్నవి చానా’ అంటూ అరవయ్యో దశకంలో కుర్రకారుని ఉరకలెత్తించినా; ‘ఓ! సజీవ శిల్ప సుందరీ! నా జీవన రాగ మంజరీ!! ఎవరివో నీ వెవరివో ‘ అంటూ చిగురాకు హృదయంవంటి ఓ చిత్రకారుని ఊహాసుందరి ప్రమాద కారణంగా దగ్ధమైపోతే ఆ చిత్రకారుని కల్లోల హృదయం ఎలావుంటుందో కంటికి కట్టినట్టు చూపించినా; సి. నారాయణరెడ్డి సరదాగా రాసుకున్న ‘మబ్బులో ఏముంది నీ మనసులో ఏముంది’ గీతానికి అద్భుత స్వరాలల్లి, నారాయణరెడ్డి సినీగీత సంపుటాలకు ‘మబ్బులో ఏముంది’ అనే మకుటం పెట్టడానికి కారకులైనా; తాను గురువుగా బావించే సాలూరు రాజేశ్వరరావు మీద గురుభావనతో తన సొంత సినిమా ‘మంచి మనిషిలో’ ‘అంతగా నను చూడకు, వింతగా గురి చూడకు, వేటాడకు’ వంటి పాటలకు బాణీలు కట్టించినా; ‘సిగ్గెస్తోందా… సిగ్గెస్తోందా, మొగ్గలాంటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే’ అంటూ బికినీ డ్రెస్ లో జయలలిత అక్కినేనినే కాదు, ఆనాటి కాలేజీ కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేసినా; దాశరథి ‘వెన్నెలలో మల్లియలు, మల్లెలలో గుసగుసలు, గుసగుసలో ఘుమఘుమలు ఏవేవో కోరికలు’ అంటూ రచించిన ముక్తప్రద గ్రస్తానికి చిరుగంటల శబ్దాల సంగీతం సమకూర్చినా; ‘అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’ అంటూ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సంగీత పునాది నిర్మించినా; ‘ఓ!పరమేశ్వరి, జగదీశ్వరి, రాజేశ్వరి, మండోదరి, గుండోదరి, నీలాంబరి, కాదంబరి ఇకనైనా శాంతించవే’ అంటూ ప్రేయసిని దారిలోకి తెచ్చుకునే సూత్రాన్ని పాటలో విశదీకరింపజేసినా; ‘నేలతో నీడ అన్నది నను తాకరాదనీ, పగటితో రేయన్నది నన్నుతాకరాదని, నీరు నన్ను తాకరాదని గడ్డిపరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది’ అంటూ దేవులపల్లి రచించిన ప్రకృతిధర్మానికి ఆర్ద్రతతో నిండిన బాణీ సమకూర్చినా… వెంటనే సంగీత ప్రియులకు… ముఖ్యంగా పాతతరానికి మస్తిష్కంలో మెదిలేది తాతినేని చలపతిరావు. స్వాతంత్ర్యానికి పూర్వమే టిప్ టాప్ దుస్తుల్లో పాఠశాలకే కాకుండా, కపిలేశ్వరపురం గ్రామానికే ఠీవిని అందించిన చలపతిరావు, ఆ రోజుల్లోనే బొంబాయి నగరంలో చదువు సాగించి ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకోవడం ఓ గొప్ప విశేషం. సంగీత దర్శకుడుగా తెలుగు చిత్రరంగాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఆ స్టైలిష్ సంగీత స్ట్రష్ట వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు.

తొలిరోజులు:
డిసెంబరు 22, 1920 న చలపతిరావు పుట్టింది ఉయ్యూరు గ్రామానికి సమీపంలో వున్న నందమూరులో. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ద్రోణవల్లి మాణిక్యమ్మ, రత్తయ్య. చలపతిరావును చిన్నతనంలోనే కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన కోటమ్మ, కోటేశ్వరరావు దంపతులు దత్తు తీసుకున్నారు. బొద్దుగా, ఆకర్షణీయంగా వుండే చలపతిరావుకు తల్లి దిష్టి తీయని రోజే వుండేది కాదు. కపిలేశ్వరపురంలోనే చలపతిరావు హైస్కూలువిద్య పూర్తిచేశారు. తర్వాత తాడంకిలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తిచేశారు. తండ్రి కోటయ్యకు సంగీతం మీద మక్కువ. ఆయన హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. చలపతిరావుకు అలా సంగీతం మీద మక్కువ ఏర్పడింది. అది గమనించిన తండ్రి, చలపతిరావుకు కర్నాటక, హిందూస్తానీ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. చలపతిరావు స్కూల్ ఫైనల్ పాస్ కాగానే, తండ్రి, పదహారేళ్లకే అతనికి అన్నపూర్ణతో పెళ్లిచేశారు. ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేశాక, బొంబాయి నగరంలో వుండే వారి మేనమామ ఇంటిలో ఉంటూ బి.ఇ (ఎలెక్ట్రికల్) కోర్సు పూర్తిచేశారు.

స్వాతంత్ర్యోద్యమంలో ప్రజా నాట్యమండలికి:
పట్టభద్రుడై తిరిగి వచ్చాక భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన హిందుస్తాన్ ఐడియల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో మేనేజర్ గా చేరారు. అప్పుడే స్వాతంత్ర్య ఉద్యమం ఊపు అందుకుంటూవుంది. చలపతిరావు కూడా ప్రభావితుడై ఉద్యమంలో చేరారు. ఫలితంగా జైలు శిక్షను అనుభవించాల్సివచ్చింది. ఉన్నఉద్యోగం వదిలేసి సింగరేణి కాలరీస్ లో చేరారు. అప్పుడే కమ్యూనిస్టులు స్వాతంత్ర్య ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ‘ప్రజానాట్యమండలి’ని ఏర్పాటుచేశారు. నాటకాలద్వారా ప్రచారం చేసేందుకు ఉద్యమించినప్పుడు చలపతిరావు కూడా ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీలో చేరారు. డాక్టర్ గరికిపాటి రాజారావు ఆధ్వర్యంలో సందేశాత్మక నాటకాలు ప్రదర్శించినప్పుడు చలపతిరావు కూడా ‘ముందడుగు’, ‘మా భూమి’ వంటి నాటకాలలో పాలుపంచుకున్నారు. చలపతిరావుకు సంగీతంపట్ల వున్న పట్టు గమనించి నిర్వాహకులు నాటకాలకు సంగీతం అందించమని సంగీత దర్శకత్వం వహిస్తున్న మోహన్ దాస్ కు సహాయకునిగా నియమించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత జాతిపిత హత్యకు గురికావడంతో ప్రజామండలి సభ్యులు చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో చలపతిరావు కూడా వున్నారు. తర్వాత వారిని మద్రాసుకు సమీపంలో వున్న కడలూర్ జైలుకు తరలించారు. అలా చలపతిరావు దాదాపు మూడేళ్లు కారాగారవాసం అనుభవించారు. కారాగారశిక్ష అనంతరం చలపతిరావు మద్రాసుకు వెళ్లారు.

సాలూరు రాజేశ్వరరావు శిష్యరికంలో:
1953లో చలపతిరావు ఊరుకి సంబంధించిన పెందుర్తి సుబ్బారావు స్వీయసమర్పణ, దర్శకత్వంలో, ఎస్. లక్ష్మి నారాయణతో కలిసి ‘వయారిభామ’ అనే సినిమా నిర్మిస్తూ చలపతిరావుని ఆ చిత్రసంగీతదర్శకుడు సాలూరు రాజేశ్వరరావు వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. అలా చలపతిరావు కు సాలూరు వారివద్ద సహాయకునిగా పనిచేసే అవకాశం దొరికింది. రాజేశ్వరరావు చలపతిరావును బాగా ప్రోత్సహించేవారు. పెందుర్తి సుబ్బారావే 1956లో నిర్మించిన ‘బాలసన్యాసమ్మ కథ’ చిత్రంలో కూడా చలపతిరావు సాలూరు రాజేశ్వరరావు వద్ద సంగీత సహాయకునిగా పనిచేశారు. 1953 లోనే డాక్టర్ గరికిపాటి రాజారావు జమున, అల్లు రామలింగయ్య లను పరిచయం చేస్తూ తన దర్శకత్వంలోనే నిర్మిస్తున్న ‘పుట్టిల్లు’ చిత్రంలో, ‘ప్రజానాట్యమండలి’ సభ్యులకు ఆ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. అలాగే చలపతిరావుకు మోహన్ దాస్ తో కలిసి సంగీతం అందించే అవకాశాన్ని ఇచ్చారు. తర్వాత 1954 లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ‘పరివర్తన’ చిత్రానికి, మరికొన్ని చిత్రాలకు చలపతిరావు మోహన్ దాస్ తో కలిసి సంగీతం అందించారు.

తమిళ ‘అమరదీపం’తో స్వతంత్ర సంగీత దర్శకుడుగా…

1956లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించిన ‘అమరదీపం’ అనే తమిళచిత్రం రూపొందింది. అందులో శివాజీ గణేశన్, సావిత్రి, పద్మిని, నాగయ్య, నంబియార్, తంగవేలు ప్రధానతారాగణం. 1942లో వచ్చిన అమెరికన్ చిత్రం ‘రాండమ్ హార్వెస్ట్’ ఈ తమిళ సినిమాకు మాతృక. శతదినోత్సవం చేసుకున్న ‘అమరదీపం’ సినిమాకు స్వతంత్రంగా సంగీత దర్శకత్వం నిర్వహించే అవకాశం చలపతిరావుకు దక్కింది. అందులో జిక్కి, సుశీల, కోమల, వసంతకుమారి, ఏ.ఎం. రాజా, సౌందరరాజన్, గోవిందరాజన్ వంటి ప్రసిద్ధ గాయనీ గాయకులచేత చలపతిరావు పాటలు పాడించారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత ఏ.వి. సుబ్బారావు 1959 లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘ఇల్లరికం’ చిత్రాన్ని నిర్మిస్తూ సంగీత దర్శకుడుగా సాలూరు రాజేశ్వరరావును నియమించారు. అనివార్య కారణాలవలన రాజేశ్వరరావు తప్పుకుంటూ చలపతిరావుకు అవకాశమిప్పించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చలపతిరావు ఆ చిత్రానికి అద్భుత సంగీతం అందించారు. అక్కినేని, జమున, ఆర్. నాగేశ్వరరావు నటించిన ఈ సినిమా దిగ్విజయంగా ఆడి రజతోత్సవాలు చేసుకుంది. ఇందులో… ‘నిలువవే వాలు కనులదానా’; ‘నేడు శ్రీవారికి మేమంటే పరాకా’; ‘బలే ఛాన్సులే బలే ఛాన్సులే’; ‘ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్’; ‘చేతులు కలసిన చప్పట్లు’; ‘మధుపాత్ర నింపవొయీ’ పాటలు సూపర్ హిట్లయ్యాయి. దాంతో చలపతిరావు పేరు సంగీత ప్రపంచంలో మారుమ్రోగిపోయింది. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన అత్యధిక చిత్రాలకు చలపతిరావు ఆస్థాన సంగీత దర్శకుడుగా నిలబడిపోయారు. ముఖ్యంగా 1977 లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘ఆలుమగలు’ చిత్రంలో అక్కినేనికి బాలు చేత పాడించి విమర్శకుల నోళ్ళు మూయించారు. అందులో ‘ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను’; ‘చిగురేసే మొగ్గెసే’; ‘తెలుసుకో ఈ జీవిత సత్యం’; ‘పరుగెత్తి పాలు త్రాగేకంటే’; ‘రంకె వేసిందమ్మో రంగైన పోట్లాగిత్త’ అనే ఐదు పాటలు పాడించి హిట్ చేశారు. తర్వాత అక్కినేని, ఎన్టీఆర్ లకు బాలు పాడటం మొదలెట్టిన సంగతి తెలిసిందే! ప్రజానాట్యమండలి సంస్థలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా వుండేవారు. తరవాతిరోజుల్లో ఆయన సారథి స్టూడియోలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరించారు. ఆయన తొలిప్రయత్నంగా 1963లో ‘లక్షాధికారి’ సినిమా నిర్మిస్తూ చలపతిరావును సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. వారి అనుబంధం ధర్మదాత, బంగారు గాజులు, జమీందార్, దత్తపుత్రుడు, డాక్టర్ బాబు, సిసింద్రీ చిట్టిబాబు తదితర రవీంద్ర ఆర్ట్స్ చిత్రాలు అన్నిటికీ చలపతిరావు సంగీత దర్శకులుగా పనిచేసేలా బలపడింది. నిర్మాతలు సుందర్లాల్ నహతా, డూండీ 1966 లో నిర్మించిన తొలి జేమ్స్ బాండ్ తరహా స్పై చిత్రం ‘గూఢచారి 116’ కి చలపతిరావు వెస్ట్రన్ బీట్ తో సంగీతం అందించడం విశేషం. పైగా ఘంటసాలతో ‘డీరి డిరి డిరి డీరిడీ’, ‘నువ్వు నా ముందుంటే’ వంటి వెస్ట్రన్ బీట్ పాటలు పాడించి హిట్ చేశారు. ఎస్. జానకి చేత ఎన్నో వైవిధ్యమున్న పాటలను తెలుగు, తమిళ సినిమాలలో పాడించి ఆమెకు స్టార్డమ్ వచ్చేందుకు దోహదం చేసింది చలపతిరావు అని వేరేచెప్పనవసరం లేదు. చలపతిరావు ఎక్కువగా పాట సాహిత్యం పూర్తయ్యాకే ట్యూన్ చేసేవారు. అలా గేయ రచయితలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత రమేశ్ నాయుడు, మహదేవన్ ల తర్వాతి స్థానం చలపతిరావుదే! ఇక శాస్త్రీయ సంగీత బాణీలు కలిగిన ‘పవిత్ర హృదయాలు’ చిత్రంలోని ‘కరుణామయీ శారదా’ అనే పాటను మంగళంపల్లి బాలమురళి, నూకల చిన సత్యనారాయణ లతో పాడించడం చలపతిరావు ప్రత్యేకత. బాలీవుడ్ సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్ లాగే చలపతిరావు కూడా క్రమశిక్షణకు మారుపేరు. ఎవరైనా మ్యూజీషియన్ ఆలస్యంగా రికార్డింగ్ స్టూడియో కి వస్తే వారిని లోనికి రానిచ్చేవారుకాదు. నాణేనికిమారో కోణం… మ్యూజీషియన్ అసోసియేషన్ ను ప్రారంభించి మ్యూజీషియన్లకు రికార్డింగ్ పూర్తయిన వెంటనే పారితోషికం ముట్టేలా చేసిన ఘనత చలపతిరావుది కావడం మరో విశేషం. తన గురువు సాలూరు రాజేశ్వరరావు చేత తను సొంతంగా 1964లో నిర్మించిన ‘మంచిమనిషి’ చిత్రంలో ‘అంతగా నను చూడకు వింతగా గురి చూడకు’; ‘రాననుకున్నావెమో ఇక రాననుకున్నావెమో’ అనే రెండు పాటలు ట్యూన్ చేయించి రికార్డ్ చేశారు. సినిమా టైటిల్స్ లో తొలుత రాజేశ్వరరావు పేరు తర్వాతే తన పేరు వేయించి గురువు గారి మీద వున్న భక్తిని చాటుకున్నారు. ‘చల్లని నీడ’ చిత్రానికి కూడా చలపతిరావు నిర్మాత.

1975 ప్రాంతంలోయి హైదరాబాద్ రవీంద్రభారతిలో చలపతిరావు చలనచిత్ర రజతోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి సాలూరు రాజేశ్వరరావు, సాలూరు హనుమంతరావు, పెండ్యాల, మాస్టర్ వేణు, మహదేవన్, జి.కె. వెంకటేష్, సుసర్ల దక్షిణామూర్తి, సత్యం, రాజన్-నాగేంద్ర, చక్రవర్తి లతోబాటు నేపథ్య గాయనీ గాయకులందరూ పాల్గొన్నారు. బ్రెయిన్ హ్యామరేజ్ తో బాధపడుతూ ఫిబ్రవరి 22, 1994 న మద్రాసులో చలపతిరావు కన్నుమూశారు.
-ఆచారం షణ్ముఖాచారి

3 thoughts on “సజీవ సంగీతశిల్ప సుందరుడు…. టి.వి. చలపతిరావు

  1. టీవీ చలపతి రావు గారి గురించి ఈ కాలం వారిలోనే కాదు, పాత వారిలో కూడా చాలా మందికి తెలియదు. అటువంటి వారికీ కూడా అందంగా తెలిసేటట్లు రాశారు. వెరీ గుడ్ ఆర్టికల్ డియర్ కళాసాగర్ గారూ..

  2. చలపతిరావు గారి సంగీతం మనసుకు ఆహ్లాదంగా, వీనుల విందుగా ఉంటుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap