ఇసైజ్ఞాని ‘సినీ’ పద్మవిభూషణం

“చిత్రగాన కల్పవృక్షానికి ఫలపుష్పభరితమైన కొమ్మలెన్నో! అందులో ఇళయరాజా ఒక చిటారుకొమ్మ. నాభిహృత్కంఠ రసనల ద్వారా ఉద్భవించి ఉరికివచ్చే సప్తస్వర సుందరులను భజించిన నాదయోగులలో ఇళయరాజా ఒకరు’ అంటూ ఇళయరాజా ప్రాభవాన్ని, ప్రాశస్తిని కొనియాడింది ప్రముఖ సినీ గేయరచయిత వేటూరి సుందరరామమూర్తి. ఈ ఉపమానం చాలు ఇళయరాజా గొప్పతనాన్నిచెప్పడానికి. “సహజమైన సంప్రదాయ వాద్యపరికరాలతో సంగీతం సమకూర్చితే అందులో మనకు ఆత్మ కనిపిస్తుంది. యంత్రాలతో సంగీతం అంటే ఎప్పుడూ యాంత్రికంగానే వుంటుంది. యాదృచ్చికంగా వచ్చేదే సంగీతం. దానికో సమయం అంటూ వుండదు. అప్పుడే పుట్టిన పసిపాపలా ఉండేదే సంగీతమంటే. వినగానే కొత్తగా వుండాలి… వినే శ్రోతకి కొత్త అనుభూతిని పంచాలి” అనేది ఇళయరాజా నమ్మిన సిద్ధాంతం. మనసుకు నచ్చని పని ఇళయరాజా ఎప్పుడూ చెయ్యలేదు. హింసానేపథ్యంతో వుండే ఒక కథను కమలహాసన్ రాజాకు వినిపిస్తే రాజా ఆ సినిమాకు సంగీతం చెయ్యలేనని చెప్పాడు. తనను ఒప్పించలేని కథకు రాజా ఎప్పుడూ సంగీతం ఇవ్వలేదు. అటువంటి సంగీత మేస్ట్రో ఇళయరాజా 79వ జన్మదినం సందర్భంగా రాజా గురించిన కొన్ని విశేషాలు మనకోసం.

ఎవరు వీరు ?

అది మద్రాసు నగరం రాయపేటలోని ముత్తుమొదలి వీధి. ఆవీధి చివర ఒక చిన్నగదిలో అల్లినగరం చిన్నసామి అనే యువకుడు ఉండేవాడు. దగ్గరలోని పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తూ సినిమా ప్రయత్నాలు సాగిస్తూ ఉండేవాడు. 1968లో ఒకరోజు తలవని తలంపుగా ముగ్గురు అన్నదమ్ములు ఆ చిన్నసామి గదికి వచ్చారు. మదురై పరిసరప్రాంతాల్లో చిన్నసామి నాటక ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఈ ముగ్గురూ ఆ ప్రదర్శనలకు సంగీతం అందించేవారు. ఆ సోదరుల్లో పెద్దవాడిని ‘’మద్రాసు వచ్చిన కారణం ఏమిటి’’ ఆని చిన్నసామి ప్రశ్నించాడు. ’’సినిమాల్లో సంగీతం చెయ్యాలని’’ అంటూ ఎంతో సాహసవంతమైన జవాబు చెప్పాడు ఆ వాచ్చినవారిలో పెద్దవాడు. చిన్నసామికి ఆశ్చర్యమేసింది. సినిమాలకు సంగీత కూర్చడమంటే, మాట చెప్పినంత సులువు కాదని అటు చిన్నసామికి, ఇటు ఆ సోదరులకీ తెలుసు. కానీ ఆ పట్టుదలే వారికి స్పూర్తినిచ్చింది. అక్కడే, చిన్నసామి దగ్గరే వుంటూ వారు మువ్వురూ వివిధ రకాల వాద్యపరికరాలను ఉపయోగించడం నేర్చుకుంటూ, చిన్నచిన్న నాటకాలకు వాద్యసహకారం అందిస్తూ బ్రతుకీడ్చారు. ఉన్నరోజు తిండి, లేనిరోజు పస్తులుండడం అలవాటు చేసుకున్నారు. వీరి అవస్థ గమనించిన చిన్నసామి వారిని ఒక గాయకునికి పరిచయం చేశాడు. ఆ గాయకునికి ఒక ఆర్కెస్ట్రా బృందం వుండేది. పెళ్లిళ్లకు, ఇతర శుభ కార్యాలకు అతడు పాటకచేరీలు నిర్వహించేవాడు. ఆ గాయకుడు మరేవరోకాదు. సినీ సంగీతనిధి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆ చిన్నసామి కూడా ఎవరోకాదు ప్రఖ్యాత దర్శక నిర్మాత భారతీరాజా. ఆ ముగ్గురిలో పెద్దవాడు కూడా మరెవరో కాదు ఇసైజ్ఞాని ఇళయరాజా. ఆ మిగతా ఇద్దరూ రాజా సోదరులు గంగై అమరన్, భాస్కర్ లు. బాలు ఇళయరాజాను ‘’సంగీతం వచ్చా’’ అని అడిగారు. ‘’నేర్చుకోలేదు. కానీ హార్మోనియం వాయిస్తాను’’ అని బదులిచ్చాడు రాజా. బాలు అడిగిందే తడవు, రాజా హార్మోనియం అందుకొని డాక్టర్ ఝివాగో చిత్రంలోని అత్యంత క్లిష్టమైన లారా థీమ్ మ్యూజిక్ వాయించి ఆశ్చర్యపరచాడు. ‘సంగీత జ్ఞానం లేకుండా ఎలా వాయించగలిగావు’’ అని బాలు ప్రశ్నిస్తే, ‘’మ్యూజిక్ విని వాయించాను’’ అని రాజా ఇచ్చిన సమాధానం బాలుకు మతిపోయేలా చేసింది. రాజా హార్మోనిస్టుగా, గంగై అమరన్ గిటారిస్టుగా, భాస్కర్ డ్రమ్మర్ గా అలా బాలు ట్రూప్ లో చేరిపోయారు. బాలు గాయకునిగా సినిమాల్లో స్థిరపడిన తరవాత బాలు నిర్వహిస్తున్న ట్రూప్ ను కొనసాగిస్తూ ‘పావలార్ బ్రదర్స్’ అనే పేరుతో ఇళయరాజా కొన్ని వందల కచేరీలు చేశాడు. తరవాత పాశ్చాత్య సంగీతంలో మెళకువలు నేర్చుకోవాలని ధనరాజ్ మాస్టర్ వద్ద చేరి, వెస్ట్రన్ సంగీతం తోబాటు నొటేషన్లు రాయడం కూడా నేర్చుకున్నాడు. ధనరాజ్ మాస్టర్ రాజా నైపుణ్యాన్ని, గ్రహణ శక్తిని చూసి సంగీత దర్శకుడు జి.కె. వెంకటేష్ వద్ద అతణ్ణి సహాయకునిగా కుదిర్చాడు. అక్కడ 1969 నుంచి 1974 వరకు దాదాపు వంద సినిమాలకు పైగా రాజా సహాయకుడిగా పనిచేశాడు.

Illayaraja

రాళ్ళెత్తిన కూలీ

ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. తమిళనాడు లోని తెన్ని జిల్లా పణ్నైపురంలో జూన్ 2, 1943 న రాజా జన్మించాడు. వారి తండ్రి రామసామి, తల్లి చిన్నత్తాయమ్మాళ్. వారిది తమిళనాడు-కేరళ సరిహద్దు గ్రామం కావడంతో రామసామి కేరళ తేయాకు తోటల్లో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. అతనిపై అధికారి ఆంగ్లేయ దొర. అతని ప్రోద్బలంతో రామసామి క్రైస్తవ మతం స్వీకరించాడు. అప్పడు జ్ఞానదేశికన్ పేరును డేనియల్ రాజయ్య(రాజా)గా మార్చాడు. రాజా తన మేనమామ ఇంటివద్ద ఉంటూ చదువుకోసాగాడు. కుటుంబ ఆర్ధిక పరిస్థితి సహకరించక పోవడంతో చదువుకు స్వస్తి చెప్పి కూలీ పనిచేశాడు. మదురైలో వైగై నది మీద ఆనకట్ట నిర్మాణం జరిగినప్పుడు, ఆ ఆనకట్టకోసం రాళ్లెత్తిన కూలీలలో రాజయ్య కూడా ఒకడు. అప్పుడే వ్యవసాయ కూలీలు పాడుకొనే ఏలపాటలు, కార్మికులు పాడుకొనే జానపద గీతాలు రాజయ్యకు కంఠోపాఠమయ్యాయి. రాజా పాడడం గమనించిన ఒక ఇంజనీర్ అతణ్ణి తనవద్ద నౌకరుగా నియమించుకొని వారానికి 7 రూపాయల జీతం ఇచ్చేవాడు. ఈ రోజు రాజా కోట్లకు పడగెత్తినా తన మొదటి సంపాదన ఇచ్చిన ఆనందం మరచిపోలేనిదని ఎప్పుడూ అంటుంటారు. తరవాత కమ్యూనిస్టు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలను ఉత్తేజపరచేలా రాజా పాటలు పాడేవాడు.

ఇళయరాజా గా మారిన డేనియల్ రాజా
జి.కె. వెంకటేష్ బృందంలో రాజా తోబాటు ప్రఖ్యాత వయోలిన్ వాద్యకారుడు ఎల్. వైద్యనాదన్ కూడా సహాయకుడిగా పనిచేస్తుండేవాడు. 1974లో జి.కె. వెంకటేష్ సంగీత విభావరి మైసూరులో జరిగింది. అప్పుడు రాజా జ్వరానపడ్డాడు. వైద్యనాదన్ రాజాను మెల్లిగా కొల్లూరు లోని మూకాంబిక ఆలయానికి తీసుకెళ్ళాడు. సౌపర్నికా నదిలో స్నానంచేసి మూకాంబికా మాతను దర్శనం చేకోగానే రాజా జ్వరం క్షణంలో మాయమైంది. సరస్వతీ మంటపంలో కూర్చొని వైద్యనాదన్ వయోలిన్ వాయిస్తుండగా, రాజా రెండు కీర్తనలు ఆలపించాడు. అప్పుడు ఆలయ పూజారి గణపతిభట్ రాజా పేరును ‘ఇళయరాజా’ (యువరాజు అని అర్ధం)గా మార్చాడు. మూకాంబికామాత దర్శనం తరవాత ఇళయరాజా ఆహార్యంలో మార్పు వచ్చింది. జుబ్బా, అడ్డపంచ కు ఆయన పరిమితమయ్యాడు.

*సంగీత దర్శకునిగా రాజా తొలి అడుగులు *
ఇళయరాజాకు తొలిసారి ‘దీపం’ అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించే అవకాశం వచ్చినా దాని నిర్మాణం ఆగిపోయింది. జెమినీ సంస్థ చిత్రానికి సంగీతం అందించే అవకాశం కూడా అందినట్లే అంది దక్కకుండా పోయింది. 1976 లో పంజు అరుణాచలం అనే నిర్మాత గ్రామీణ నేపథ్యంలో ‘అణ్ణక్కిళి’ సినిమా నిర్మిస్తూ ఇళయరాజాకు తొలి అవకాశం ఇచ్చాడు. శివకుమార్, సుజాత నటించిన ఆ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం వినూత్నంగా, విభిన్నంగానూ వుండడంతో సంగీతాభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అందులో ఎస్. జానకి ఆలపించిన ‘మచ్చానై పార్తింగళా మలైవాళ తోప్పుక్కుళ్ళే’ (తెలుగులో ‘మావయ్య వస్తాడంటా మనసిచ్చి పోతాడంటా’- రామచిలక సినిమాలో) పాటకు ప్రేక్షకులు లేచి నిలబడి డ్యాన్స్ చేసేవారు. పియానో, గిటార్ వంటి పాశ్చాత్య వాద్య పరికరాలమీద హంసధ్వని, రీతి గౌళ, మోహన వంటి కర్నాటక సంప్రదాయ రాగాలను మేళవించి స్వరపరచడంతో సంగీత ప్రియులకు యేదో కొత్తదనం గోచరించి, క్రమంగా రాజాకు అభిమానులై పోయారు. ‘నిళల్గళ్’, ‘ఆరిళిరిందు అరువత్తువరై’, ‘నేట్రికన్’, ’మూదుపాణి’, ‘నింజత్తై కిలాత్తే’ వంటి సినిమాల్లోని పాటలు సూపర్ హిట్లుగా నిలవడంతో రాజా పేరు తమిళనాట మారుమ్రోగిపోయింది. భారతీరాజా-ఇళయరాజా కాంబినేషన్లో ఎంతో అద్భుతమైన పాటలు వచ్చాయి.

Singing

తెలుగు తెరమీద ఇళయరాజీయం
ఇళయరాజా 1977లో వచ్చిన ‘భద్రకాళి’ సినిమాతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు. అందులో జేసుదాస్, సుశీల ఆలపించిన ‘చిన్నిచిన్ని కన్నయ్యా’ పాట తెలుగు ప్రేక్షకులను అలరించింది. తరవాత వచ్చిన ‘వయసు పిలిచింది’ సినిమాలోని అన్ని పాటలూ యువతరానికి కొత్త సంగీత టానిక్ ను ఎక్కించి మత్తులోకి నెట్టేశాయి. హిందీలో విజయవంతమైన ‘డాన్’ సినిమాను మేకప్ ఆర్టిస్టు పీతాంబరం తెలుగులో ‘యుగంధర్’ పేరుతో నిర్మిస్తే, ఇళయరాజా తనదైన శైలిలో సంగీతం అందించి ఆ సినిమాను సూపర్ హిట్ చేశారు. ఎర్రగులాబీలు, అజేయుడు, పంచభూతాలు, కాళరాత్రి సినిమాలలోని పాటలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక 1981లో వచ్చిన సీతాకోకచిలక సినిమా పాటలు సంగీత అభిమానులను ఇళయరాజా మత్తులోకి దించిపడేశాయి. వసంతకోకిల, అమరగీతం, మధురగీతం, టిక్ టిక్ టిక్, పూలపల్లకి, కొత్తజీవితాలు సినిమాలలో పాటలు మారుమ్రోగిపోయాయి. సరికొత్త బాణీలు, వైవిద్యభరిత సంగీతం యువతరాన్ని గంగవెర్రులెత్తించింది. శివ, సాగరసంగమం, అభిలాష, రాజకుమార్, మంత్రిగారి వియ్యంకుడు, సంకీర్తన వంటి సినిమాలలోని పాటల సంగతి చెప్పాల్సిన పనేలేదు. 1984లో దర్శకుడు వంశీతో ఇళయరాజాకు పరిచయమైంది. సితార సినిమా అతనికి రెండవచిత్రం. రీరికార్డింగ్ కాకుండా డబుల్ పాజిటివ్ వేసి చూపిస్తే శ్రేయోభిలాషులు పెదవి విరిచారు. వంశీ నిరాశ చెందాడు. వంశీని రాజా ఓదార్చుతూ ఆ సినిమాకు అద్భుతంగా రీరికార్డింగ్ చేసి విడుదలచేస్తే ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక వంశీ సినిమాలు లేడీస్ టైలర్, అన్వేషణ, ప్రేమించు-పెళ్ళాడు, మహర్షి, చెట్టుకింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, శ్రీ కనక మహాలక్ష్మి డ్యాన్స్ ట్రూప్ అన్నీ సంగీతపరంగా సూపర్ హిట్లే. ఛాలెంజ్, మాంగల్యబంధం, గీతాంజలి, శ్రీషిర్డీ సాయిబాబా మహాత్మ్యం, జ్వాల, రాక్షసుడు, ఒకరాధ ఇద్దరుకృష్ణులు పెద్ద హిట్ సినిమాలు. శివ సినిమాకు ఇళయరాజా వినూత్నమైన సంగీతాన్ని అందించారు. సినిమా విజయవంతం కాదని తనకు అనిపించిన సందర్భాల్లో, ఇళయరాజా నిర్మాతల్ని రీరికార్డింగ్ వంటి పనులకు ఎక్కువగా ఖర్చు పెట్టనిచ్చేవారు కాదు. 1988 తరవాత విడుదలైన సినిమాలలో ఇళయరాజా సంగీత పోకడలు కొత్త పుంతలు తొక్కాయి. రక్తాభిషేకం, జమదగ్ని, వారసుడొచ్చాడు, అభినందన, రుద్రవీణ, ఆఖరి పోరాటం, స్వర్ణకమలం, మరణమృదంగం, ఇంద్రుడు చంద్రుడు, ప్రేమ, విచిత్ర సోదరులు, బొబ్బిలిరాజా, కొండవీటి దొంగ, కూలీ నెంబర్ 1, ఆదిత్య 369, అంజలి, ఓ పాపా లాలి, స్వాతిముత్యం, ప్రేమ, తూర్పు సిందూరం వాటిలో కొన్ని మాత్రమే. తమిళనాడులో సినిమా విడుదలరోజున హీరోలతో సమానంగా ఇళయరాజా కటవుట్లు వెలిసేవి. ఆరోజుల్లో మ్యూజిక్ షాపులు ఇళయరాజా పాటలు నింపుకునేవాళ్ళతో నిండిపోయేవి. భారతీరాజా తొలిచిత్రం ‘పదునారు వయదినిలే’(పదహారేళ్ళ వయసు)లో ఉత్తమ గాయనిగా ఎస్. జానకి కి జాతీయ పురస్కారం లభించింది ఇళయరాజా సంగీత దర్శకత్వంలోనే. అలాగే గాయని చిత్రకు తొలి జాతీయ పురస్కారాన్ని తెచ్చి పెట్టిన ‘సింధుభైరవి’ చిత్రానికి సంగీతం సమకూర్చింది కూడా ఇళయరాజానే. రాజా పాటల పల్లవులు ఉటంకించాలంటే స్థలం చాలని పరిస్థితి.

వేటూరి తో తొలి అనుభవం
ప్రౌఢ సమాసాలతో, శబ్దసౌందర్యానికి పెద్దపీటవేసి పదలాలిత్యంతో పల్లవులల్లిన అభినవ శ్రీనాథుడు వేటూరి. వీరిద్దరి కాంబింనేషన్ లో ఎంత మధురమైన సూపర్ హిట్ పాటలు వచ్చాయో ప్రతి సంగీత అభిమానికి తెలిసిన విషయమే! సంగీత దర్శకుడు ఇళయరాజాతో వేటూరి గారి తొలి సమావేశపు ఉదంతాన్ని ఇక్కడ ఉదహరిస్తాను. 1981లో కమల్ హాసన్ తొలిసారి నిర్మాతగా మారి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తమిళంలో ‘రాజా పార్వై’ అనే చిత్రాన్ని, అదే సినిమాను తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ పేరుతో సమాంతరంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా. వేటూరికి ఇళయరాజాతో అదే తొలి సినిమా. ఇళయరాజా సాధారణంగా దర్శకుడు చెప్పే సన్నివేశంవిని ఆ భావానికి ట్యూన్ ఇస్తారు. ఆ ట్యూను కు సరిపడేలా కవులు సాహిత్యాన్ని జతకూరుస్తారు. రాజా పద్ధతి ట్యూనుకి పాట రాయించే విధానమే! రాజా ఇచ్చే ‘తతకారాల’కు పదాలు కూర్చి పాట రాయాలంటే చాలా కష్టం. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. పైగా ఇళయరాజాది రాజీ పడని తత్వం. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్ కి వేటూరి వెళ్లేసరికి రాజా యిచ్చిన తమిళ ట్యూన్ కి వైరముత్తు తమిళ పల్లవి రాయడం జరిగిపోయింది. “అందిమళయ్ పొడిహిరదు…. మన్మద నాట్టక్కు మందిరియే” అనే పల్లవిని వైరముత్తు రాసిచ్చారు. అప్పుడే వచ్చిన వేటూరిని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇళయరాజాకి పరిచయం చేశారు. ఇళయరాజా వేటూరిని చూస్తూ “వైరముత్తు వచ్చినప్పుడే ఈ కవిగారు వస్తే బాగుండేది కదా. నేను చాలా బిజీగా వున్నాను. తమిళకవి ఇలా ట్యూన్ ఇవ్వగానే అలా పల్లవి రాసిచ్చారు. ఇప్పటికే నాకు లేట్ అయ్యింది” అంటూ సింగీతంతో కొంచెం పుల్లవిరుపుగా మాట్లాడారు. ప్రక్కనేవున్న వేటూరికి కోపం వచ్చింది. వెంటనే వేటూరి కల్పించుకొని “నేనూ బిజీగా వుండే కవినే! అలా మాట్లాడడం మంచి పధ్ధతి కాదు. సెలవు” అంటూ లేవబోయారు. అయితే సింగీతం వేటూరిని వారించి పరిస్థితిని చక్కబెట్టారు. విషయం అర్ధం చేసుకున్న రాజా వేటూరికి ‘సారీ’ చెప్పి ట్యూన్ వినిపించారు. ‘’తమిళకవి ఇలా ట్యూన్ ఇవ్వగానే అలా పల్లవి రాసిచ్చారు’’ అంటున్న రాజా మాటలు వేటూరికి రోషాన్ని తెప్పించాయి. వెంటనే ఇళయరాజాతో “పల్లవి రాసుకుంటారా” అన్నారు వేటూరి. రాజాకి ఆశ్చర్యం వేసింది. “ఏంటి ఇంత త్వరగా చెప్పేస్తారా! అయితే చెప్పండి” అంటున్న ఇళయరాజాకి వేటూరి ఆశువుగా ‘’సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో…మలయజ మారుత శీకరమో మనసిజ రాగ వశీకరమో’’ అంటూ పల్లవి చెప్పేశారు. వేటూరి చెప్పిన పల్లవి ఇళయరాజా వినిపించిన ట్యూన్ లో వచ్చే హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలతో సహా అతికినట్టు మీటర్ కు సరిపోయింది. వెంటనే ఇళయరాజా లేచివచ్చి వేటూరిని ఆలింగనం చేసుకుంటూ “ఎంత మధురంగా వుంది పల్లవి. అందుకే మా సుబ్రమణ్య భారతి మహాకవి ‘సుందర తెలుంగు’అని ప్రశంసించా”రని కొనియాడారు. తర్వాత కాలంలో వేటూరి – ఇళయరాజా జంట కలిసి ఎన్ని సినిమాలకు ఎన్ని అద్భుతమైన పాటల్ని సృష్టించారో మీకు తెలియంది కాదు.

మరిన్ని విశేషాలు*
o 2005లో ఆసియా ఖండం నుంచి అఖండ వాద్యబృందంతో లండన్ లోని రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా తో సింఫనీ నిర్వహించిన తొలి సంగీత దర్శకుడిగా ఇళయరాజా పేరు చరిత్రపుటలకెక్కింది. ‘తిరువానగం’ పేరుతో నిర్వహించిన ఈ సింఫనీ ప్రాచీన తమిళ సంప్రదాయ సాహిత్య నేపథ్యంగా సాగింది. ఐదుసార్లు గ్రామీ పురస్కారం అందుకున్న సౌండ్ ఇంజనీర్ రిచర్డ్ కింగ్, ఆస్కార్ పురస్కార గ్రహీత స్టీఫెన్ షెనార్ట్జ్ రాజా వాద్యబృందంలో వుండి సింఫనీకి సహకరించడం, రాజాకు గొప్ప అనుభూతినిచ్చింది. లండన్ నగరం లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి బంగారు పతకం సాధించిన సంగీత స్రష్ట (ఇసైజ్ఞాని)ఇళయరాజా.

o ‘బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ సంస్థ 155 దేశాలనుండి పది గొప్పపాటలను ఎంపిక చేస్తే, ‘దళపతి’ సినిమాకోసం ఇళయరాజా స్వరపరచిన ‘రుక్కమ్మా కైయ్య తట్టు’ (తెలుగులో చిలకమ్మా చిటికేయంగా) పాట నాలుగో స్థానంలో నిలవడం గొప్ప విశేషం.

o ఇళయరాజా సంగీతం అందించిన సాగరసంగమం(తెలుగు), సింధుభైరవి (తమిళం), రుద్రవీణ (తెలుగు), కేరళవర్మ పళస్సిరాజా(మలయాళం) చిత్రాలకు జాతీయస్థాయిలో ఇళయరాజా ఉత్తమ సంగీత దర్శకుని బహుమతులు అందుకున్నారు. సీతాకోకచిలక, రుద్రవీణ, జగదేకవీరుడు-అతిలోక సుందరి, శ్రీరామరాజ్యం సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతులు, ఆరుసార్లు తమిళ చిత్ర ఉత్తమ సంగీత దర్శకుని బహుమతులు ఇళయరాజాకు దక్కాయి. మూడు కేరళ ప్రభుత్వ బహుమతులు, రెండు ఫిలింఫేర్ బహుమతులు కూడా ఇళయరాజాకు పుచ్చుకున్నారు. 1988లో తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ బిరుదుతో రాజాను సత్కరించింది. 2010 లో రాజాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో, 2018 లో పద్మవిభూషన్ బిరుదుతో సత్కరించింది. పంచముఖి’ పేరుతో కొత్తరాగాన్ని సృశించిన ఘనత కూడా ఇళయరాజాదే. 2013లో భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా CNN-IBN సంస్థ నిర్వహించిన సర్వేలో 49 శాతం వోట్లతో ఇళయరాజా ప్రధమ స్థానంలో నిలిచి సంగీత నాటక అకాడమీ బహుమతి అందుకోవడం విశేషం.

o ఇళయరాజా-వంశీలది ముప్పై సంవత్సరాల అనుబంధం. వంశీకి రాజా అంటే భక్తి. ఇళయరాజాకు వంశీ అంటే వాత్సల్యం. రీరికార్డింగ్ జరుగుతున్నప్పుడు వంశీతో ‘నువ్వేమీ చెప్పనఖ్ఖరలేదు. నీకేం కావాలో నీ రీల్ చెబుతుంది’ అనేవాడట. వీరిద్దరి అనుబంధం భారతీరాజా ‘సీతాకోకచిలక’ సినిమా తీస్తున్నప్పుడు మొదలైంది. ఆ సినిమాకు వంశీ సహాయ దర్శకునిగా పనిచేశాడు. ప్రేమించు పెళ్ళాడు చిత్రానికి దరువు లేకుండా కేవలం గిటార్ తంత్రిని మీటి పాటరాయమని రాజా వేటూరిని కోరారు. సన్నివేశానికి అదే మ్యూజిక్ బిట్ అవుతుందనికూడా చెప్పారు. అలా వెలువడిందే ‘గోపెమ్మ చేతిలో గోరుముద్ద… రాధమ్మ చేతిలో వెన్నముద్ద’ పాట. తన సంగీత గురువు జి.కె. వెంకటేష్ కు అవకాశాలు తగ్గిన రోజుల్లో తనవద్దే వుంచుకొని ప్రతిరోజూ తొలి గౌరవ పారితోషికాన్ని అతనికి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్న మహామనీషి ఇళయరాజా.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap