
(అక్టోబర్ 2 న కన్నుమూసిన కళాబంధు, న్యాయవాది, సంగీత కళాకారులు, స్నేహశీలి, ఆంధ్ర చిత్ర కళోద్ధీప వైతాళికుడు, రాజమండ్రి చిత్ర కళా నికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరి శివానంద కుమార్ గారిని స్మరించుకునేందుకు చిరు ప్రయత్నం…)
రాజమహేంద్రిలో రంగుల రసమయ జగతిని నిరామయం చేసి నిర్దయగా మానుండి మా పెద్దను వెంట తీసుకుపోయాడు ఆ భగవానుడు. భువి నుండి దివికేగి కళలను అనాథలను చేసి సంగీత, చిత్రకళా రంగాల చీకటులను నింపి అభిమానుల హృదయాల తడి ఆరని అశ్రుధారలు ప్రవహింపజేసిన మాననీయ మహనీయ వదాన్యునికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఏంచేసినా తిరిగి వారిని తెచ్చుకోలేము.
ఆనాడు చేదోడై అధ్యక్ష పదవిని అలంకరించి మమ్మల్ని అలరించారు. అంతులేని భరోసానిచ్చారు, ధీర గంభీర స్వరంతో సూచనలను, సలహాలను ఇచ్చి నడిపించారు.
రాజమండ్రి చిత్రకళా దారుల ఆనంద విద్యుల్లతలతో వెలుగులు తెప్పించారు. ఆర్యుల తలపులతో… స్మారక పురస్సరములతో…ప్రతి సంవత్సరమూ నలుదిక్కుల మేలు నగధీరులైన కళా తపస్వులను రప్పించి, అభినందించి.. సత్కరించి.. కళా వేడుకను పర్వదినముగా నడిపించారు.

బాల, యువ కళాకారులకు చేయూతగా తన ఇంటిలోనే తరగతులు నడిపించి అవగాహన కల్పించేందుకు ఆదర్శమయ్యారు.
చిత్రకళా వార్షిక మహోత్సవాలకు అండదండగా ఆర్థిక చేయూత, హార్దిక భరోసా తానై,
గొప్ప వేదికలను ఉచితంగా అందించి..చిత్రకళా సంబరాల వైభవానికి కారణమయ్యారు.
ఏమీ చేసినా.. ఏ లోటూ లేకుండా ఉండాలని, అతిథులతో పాటు ఆహూతులకు కనువిందు, కమ్మని విందూ అందించారు.
నిరంతరమూ వృత్తి బాధ్యతలో మునిగున్నా, కళను ఆస్వాదించాలని రెక్కలు కట్టుకుని వాలేవారు.
త్యాగరాయ సంగీత సభలను సంబరంగా నిర్వహించి లక్షలాది అభిమానుల వీనులకు శాస్త్రీయ సంగీతాన్ని పక్ష, మాస ఉత్సవాలుగా గోదావరితో పాటు ప్రవహింపజేసి రాజమహేంద్రవర పుర జనులకు సంగీత జల్లులను చిలకరిస్తూ పులకలొత్తించారు.
శివానంద గారి విహారాలన్నీ కళాపూర్ణాలే..
ప్రాంతీయ భేదం పాటించక ఎల్లలు లేని ఆప్యాయతతో సకల కళల….కలాల రూపాల సేకరణాలే. వీణాపాణి సరస్వతి పంచముఖ ప్రవీణతకు అలరించిన హృదయం తో కళామతల్లికి అర్పించిన నీరాజనాలే.
తోటంటా విరబూసి పచ్చగా వివిధ విరుల మయంగా.. కళల పరిమళాలు నిండిన చోట.. నేడు కూకటి వేళ్ళతో వెలికి పెకలించినట్టు మా ఆశల తరు సమూహం… కళా జగతిలో అల్లంత దూరం వరకూ కనిపిస్తున్న నిబిడాంధకారం.. నిరామయం.
కానీ.. అది అంతా వేదనా వెల్లువల సుడిలో మునిగిపోయిన మదికి తోచిన భ్రమల స్వప్నాలే అంటూ…. అదిగో.. అల్లంత దూరాన చిరు చిరు మొలకలు శివానందమయంగా శిరమెత్తి తనను గమనించమంటున్నవి.
అందుకున్న స్ఫూర్తి, పొందిన ప్రగతి, ధైర్యాన్నిచ్చిన ఒక ఆత్మ విశ్వాసం, ముందుకు నడిపించిన పథమూ, అన్ని కలసి ఆ మొలకలము మేమే అంటున్నాయి. ఇక వాటిని పెంచి పోషించాల్సిన బాధ్యత మాది. ఆ మొలకలను చిగురులెత్తించి, మొగ్గలేయించి, విరులు పూయించి, ఆ విరుల పరిమళాలు కళా జగతిలో పరిభ్రమించి… పైపై దాకా సాగి మా పెద్దయ్య శివానందుని చేరాలి. అప్పుడు కానీ వారు మాకందించిన చేయూతకు రుణం తీరదు. ఇది మా ఆజన్మాంతం నిర్వహించవలసిన బాధ్యత. అప్పుడే వారికైనా మాకైనా ఒక సంతృప్తి.
ఆ శక్తిని ప్రసాదించమని…భగవంతునికి మా విజ్ఞప్తి.
-పద్మ,
భగీరధి ఆర్ట్ ఫౌండేషన్, రాజమండ్రి.
ముందుగా మీకు కృతజ్ఞతలు
నాటి మిత్రులు ధనరాజు ,పైడారావు ,వీరభద్రాచార్యులు ,కృష్ణ తదితర మిత్రులను మరియు గురువర్యులు చెకోవి గార్ల ఫోటోలను ఇన్నేళ్ల తరువాత మీ ఆర్టికల్ ద్వారా వీక్షించే భాగ్యం కల్గించారు . Thank యు somuch కళా సాగర్ గారు