హాస్య నటుడు నాగేష్ పేరు చెప్పగానే నవ్వు వచ్చేస్తుంది. అతడు దక్షినాది చార్లీ చాప్లిన్. గొప్ప రంగస్థల నటుడు, సాహిత్యాభిలాషి. తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి హాస్య నటుడిగా సుస్థిరస్థానం సంపాదించినవాడు. నటిస్తూనే యేడిపించగల నటనా సమర్థత నాగేష్ సొత్తు. సర్వర్ సుందరం సినిమాతో నటప్రస్థానానికి కొత్త భాష్యం చెప్పిన నాగేష్ నటించిన ఎక్కువ సినిమాలు తెలుగులోకి అనువదించబడి నిర్మాతలకు కాసులు రాల్చాయి. నవ్వు నాలుగు విధాల చేటు అనే నానుడికి ‘నవ్వు నాలుగు విధాల గ్రేటు’ అనే కొత్త నిర్వచనానికి నాంది పలికిన నవ్వుల రేడు నాగేష్. “కోపానికి విరుగుడు నవ్వు” అని అందరికీ చెబుతుండేవాడు నాగేష్. బాలచందర్ గుర్తించిన ఈ నటమణి ని ‘నీర్ కుమిళి’ చిత్రం ద్వారా ఆయన వెండితెరకు పరిచయం చేశారు. జనవరి 31 నాగేష్ వర్ధంతి సందర్భంగా ఆ నవ్వులరేడు గురించి కొన్ని విశేషాలు…
నాగేష్ బాల్యం…
హాస్య నటుడు నాగేష్ అసలు పేరు చెయ్యూరు కృష్ణ నాగేశ్వరన్. నాగేష్ పుట్టింది సెప్టెంబరు 27, 1933. అయితే నాగేష్ పుట్టుక గురించి, అతని జన్మనామం గురించి భిన్న కథనాలున్నాయి. నాగేష్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు చెయ్యూరు కృష్ణారావు గుండురావు అని, స్కూలు రికార్డులలో పుట్టింది ఫిబ్రవరి 8, 1931 అని, కానీ అతని పాస్ పోర్టులో 27 ఆగస్టు 1933 అని వుందని మనకు లభించిన సమాచారం వలన తెలుస్తోంది. అయితే నాగేష్ జనన తేది ఫిబ్రవరి 8, 1931 (లేక) ఆగస్టు 27 1933 (లేక) సెప్టెంబరు 27, 1933 అనే విషయం మీద నిర్ధారించ తగిన సమాచారం అలభ్యం అనేది వాస్తవం. తండ్రి కృష్ణన్… తల్లి రుక్మిణి అమ్మాళ్. తమిళనాడు లోని తిరుప్పూర్ జిల్లా ధరాపురం నాగేష్ జన్మస్థలం. నాగేష్ వారి కుటుంబంలో అందరికన్నా చిన్నవాడు. చిన్నతనంలో నాగేష్ తన యీడు పిల్లల్ని చుట్టూ చేర్చుకుని ఆడించేవాడు. ఊళ్ళోకి సర్కస్ వచ్చినా సరే, నాగేష్ స్నేహితులు మాత్రం సర్కస్ నైనా చూడకుండా వుండేవారు కానీ నాగేష్ ని మాత్రం వదిలి వుండేవారు కాదు. స్నేహితులను కూర్చోబెట్టుకుని నోటికొచ్చిన ఇంగ్లీషు పదాలతో పాటలు పాడేవాడు. నోటితో ట్రంపెట్ వాయిస్తూ వారిని అలరించేవాడు. అలా ఆడుతూ పాడుతూ స్కూలు ఫైనల్ పూర్తిచేసి నాగేష్ కోయంబత్తూరు లో ఇంటర్మీడియట్ లో చేరి దానిని పూర్తిచేశాడు. తండ్రికి నాగేష్ ని బి.కాం చదివింఛి అకౌంటెంట్ గా చూడాలని ఆశగా వుండేది. కానీ నగేష్ చదువుకు స్వస్తి చెప్పి మద్రాసు చేరుకొని రైల్వేలో గుమాస్తా వుద్యోగం సంపాదించాడు.
నాటక రంగం నుంచి వెండితెరకు…
మద్రాసులో నాగేష్ ఉంటున్న అద్దెగదిలో ప్రముఖ రచయిత వాలి, మరో ప్రముఖ దర్శకుడు సి. వి. శ్రీధర్ వుండేవారు. అప్పట్లో వారు సినిమా అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తుండేవారు. తనతోబాటు పనిచేసే రైల్వే వుద్యోగులు ‘కంబ రామాయణం’ వంటి నాటకాలు ప్రదర్శిస్తుండేవారు. రైల్వే సాంస్కృతిక సంస్థ ఒకసారి నగేష్ కు నటించే అవకాశం కల్పించింది. ఆ నాటకానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం.జి. రామచంద్రన్ నాగేష్ నటనను మెచ్చుకున్నారు. దాంతో నాగేష్ కు ఎక్కువ నాటకాల్లో నటించే అవకాశాలు మెరుగయ్యాయి. 1958లో పద్మా ఫిలిమ్స్ వారు నిర్మించిన ‘మనముళ్ళ మరుథ్ధారం’ సినిమాలో నగేష్ ఒక చిన్న పాత్రను పోషించే అవకాశాన్ని హీరో కె. బాలాజీ ఇప్పించాడు. డబ్లియు. ఆర్. సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయవంతం కాలేదు. 1960లో పద్మిని పిక్చర్స్ నిర్మాత బి.ఆర్. పంతులు తమిళ, కన్నడభాషల్లో ఏకకాలం లో నిర్మించిన ‘కుళందైగళ్ కంద కుదియరాసు’ (కన్నడంలో‘మక్కళ రాజ్య’) చిత్రంలో నగేష్ నటించాడు. తరవాత 1961 లో ప్రసాద్ మూవీస్ పతాకం మీద ఎల్.వి. ప్రసాద్ నిర్మించిన ‘తాయిళ్ళ పిళ్ళై’లో నాగేష్ మోహన్ పాత్ర పోషించాడు. అయితే 1962 లో చిత్రాలయ పిక్చర్స్ అధినేత, దర్శకుడు సి.వి. శ్రీధర్ నిర్మించిన సూపర్ హిట్ మూవీ ‘నెంజిల్ ఒరు ఆలయం’ (తెలుగులో మనసే మందిరం-1966) లో పీటర్ పాత్రలో జీవించి నటించడంతో నాగేష్ పేరు బాగా తెలిసివచ్చింది.
సర్వర్ సుందరం తో స్టార్డం చేరుకొని…
ప్రముఖ దర్శకనిర్మాత కె.బాలచందర్ చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టకముందు అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిచేస్తూ, నాటక రచనలుచేసి ప్రదర్శనలు ఇస్తుండేవారు. 1964లో ఎం.జి. రామచంద్రన్ సలహామేరకు సినిమా రచయితగా అడుగుపెట్టి ‘దైవత్తాయ్’ సినిమాకు సంభాషణలు సమకూర్చారు. బాలచందర్ నాగేష్ ని దృష్టిలో వుంచుకొని ‘సర్వర్ సుందరం’ అనే రంగస్థల నాటకం రచించి తనే ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ నాటకం చూసి ప్రభావితమైన ఎ.వి.ఎం సంస్థ అధిపతి మెయ్యప్పన్ బాలచందర్ వద్దనుంచి ఆ కథా హక్కులు కొని, కృష్ణన్ పంజు దర్శకత్వంలో అదేపేరుతో 1964 లో సినిమాగా నిర్మించారు. నాటకంలో నాగేష్ పోషించిన టైటిల్ పాత్రను సినిమాలో కూడా నాగేషే పోషించాడు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయచిత్ర బహుమతి తోబాటు ఫిలింఫేర్ బహుమతి కూడా దక్కింది. సినిమా సూపర్ హిట్టై నాగేష్ కు స్టార్డం పెంచింది. తొలి అర్ధభాగంలో నవ్వులతో ముంచెత్తిన నాగేష్ మలి భాగంలో తనదైన రీతిలో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాడు. ఈచిత్రాన్ని తెలుగులోకి డబ్ చేస్తే అదికూడా విజయవంతమైంది. సర్వర్ సుందరం విజయంతో నాగేష్ ఆ మరుసటి సంవత్సరం ఏకంగా 35 సినిమాల్లో బుక్ అయ్యాడంటే, ఆ సినిమాలో నాగేష్ నటన యెంత గొప్పగా వుందో ఊహించవచ్చు. అంత బిజీలో కూడా నాగేష్ ఒకేరోజు ఆరు చిత్రాల షూటింగుల్లో పాల్గొన్న సంఘటనలు ఎన్నో వున్నాయి. అదే సంవత్సరం చిత్రాలయ పిక్చర్స్ అధినేత సి.వి. శ్రీధర్ ‘కాదలిక్క నేరమిల్లై’ (తెలుగులో ప్రేమించి చూడు చిత్రం) సినిమా నిర్మిస్తే నాగేష్ అందులో కామెడీ పండించాడు. తమిళంలో తొలి ఈస్టమన్ కలర్ లో నిర్మించిన ఈ చిత్రం హాస్యరసానికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. నాగేష్ పోషించిన పాత్రనే తెలుగులో చలం పోషించాడు. ఈ చిత్రం వజ్రోత్సవం జరుపుకుంది. ఇందులో నాగేష్ తను తీయబోయే హారర్ సినిమా కథను తండ్రికి వివరించే సన్నివేశాన్ని ఒకే షాట్ లో పూర్తిచేసి శ్రీధర్ మెప్పు పొందాడు. దర్శకుడు దాదా మిరాసి కథ చెప్పే విధానాన్ని అనుకరిస్తూ నాగేష్ కథ చెప్పడం సినిమాలో బాగా పండింది. తరవాత నాగేష్ నటించిన ‘అన్బే వా’, ‘శాంతి నిలయం’, ‘వియత్నాం వీడు’ వంటి విజయవంతమైన సినిమాల్లో కామెడీ పాత్రలు పోషించాడు. బాలచందర్ రాసిన మరొక నాటకం ‘మేజర్ చంద్రకాంత్’ కూడా మంచి పేరు తెచ్చుకోవడంతో, సత్యం-నంజుండన్ కలిసి ఫణిమజుందార్ దర్శకత్వంలో ‘ఊంచే లోగ్’ (1965) పేరుతో హిందీలో సినిమాగా నిర్మించారు. ఆ సినిమా హిందీలో హిట్ కావడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ద్వితీయ చిత్ర బహుమతి అందుకుంది. ఈ చిత్రం బాలచందర్ సినీరంగ ప్రవేశానికి బాటలు పరచింది. తను రాసిన మరోనాటకం ‘నీర్ కుమిళి’(1965) సినిమాతో తొలిసారి దర్శకునిగా మారారు. రంగస్థలం మీద నటించిన నాగేష్, షావుకారు జానకి, మేజర్ సుందరరాజన్ లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. అలా తను రాసిన నాటకాలు ‘నానల్’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘బామావిజయం’, ‘ఎదిర్ నీచల్’ లను బాలచందర్ సినిమాలుగా మలిచి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. నీర్ కుమిళి, నానల్ సినిమాల తరవాత పరంపరలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మూడవ సినిమా ఎ.వి.ఎం. వారు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’ (1966). ఈ సినిమా తమిళంలో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఎన్.ఎన్. భట్ ఈ సినిమా హక్కులు కొని తెలుగులో ‘సుఖదుఃఖాలు’ సినిమాను నిర్మించారు. ’మేజర్ చంద్రకాంత్’ సినిమాలో మోహన్ పాత్ర పోషించిన నాగేష్ నటన వర్ణనాతీతం. నగేష్ తెరమీద కనిపిస్తేనే నవ్వులు పూయిస్తాడని నమ్మిన ప్రేక్షకులకు బాలచందర్ నటుడుగా నాగేష్ లో వున్న మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఈ సినిమా కథను నాగేష్ ని దృష్టిలో వుంచుకొనే రాశానంటారు బాలచందర్. అందుకు నాగేష్ కు మంచిపేరే వచ్చింది. నాగేష్ ప్రక్కన ఎక్కువగా మనోరమ జంటగా నటించేది. 1967లో నాగేష్ కు హిందీ సినిమా ‘ఫర్జ్’ (తెలుగులో గూఢచారి 116)లో నటించే అవకాశం దక్కింది.
మనోరమ తో జత కట్టి…
1960-70 మధ్యకాలంలో హీరో ఎం.జి. రామచంద్రన్ నటించిన అనేక సినిమాల్లో నాగేష్-మనోరమ కలిసి నటించారు. వాటిలో తాళి బాగ్యం, ఎణ్ కందమై, కణ్ణిత్తాయ్, కడళ్ వాగనం, చంద్రోదయం, అన్బే వా, పడగొట్టి, కావల్ కారణ్, కాదల్ వాఘనం, వివసాయే, తనిపిరవై సినిమాలు కొన్ని మాత్రమే. మనోరమతో కలిసి ఇతర దర్శకుల సారధ్యంలో మరెన్నో సినిమాల్లో నాగేష్ నటించాడు. వాటిలో విజయవంతమైనవి, చెప్పుకోతగినవి… కుంగుమం, రక్త తిలగం, నవరాత్తిరి, పుదియ పారవై, అంబు కరంగళ్, సరస్వతి సబడం, గౌరీ కల్యాణం, గలాటా కల్యాణం, దైవతిరుమగళ్, దైవత్తిన్ దైవం, శాంతి, ఆణ్ణవిన్ ఆశై, ఆశ, మణి మకుటం, కాలం వేళ్ళుమ్, కణ్ణయిరమ్ సినిమాలు. అయితే సూపర్ హిట్లయిన మద్రాస్ టు పాండిచేరి, తిరువురళ్, బొమ్మలాట్టమ్, నన్ బార్గల్, తిల్లాన మోహనంబాళ్ చిత్రాల్లో నాగేష్ మనోరమ సరసన నటించలేదు. ఇరు తిరువం అనే సినిమాలో నాగేష్ నెగటివ్ పాత్ర పోషించాడు. అలాగే నరయ్త కాసు అనే చిత్రంలో ద్విపాత్రాభినయం కూడా చేశాడు. నాగేష్ కు ‘చో’ రామస్వామి జతగా కలిసి నవ్వులు పండించిన నినైవిళ్ నింద్రావళ్, ఉళగమ్ ఇవ్వళవుద్ధాన్, బొమ్మలాట్టం సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. హాస్యనటి రమాప్రభతో పుదియ భూమి,శాంతి నిలయం వంటి సినిమాలే కాకుండా పన్నెండు తెలుగు సినిమాల్లో నగేష్ నటించాడు. మరొక నటి గీతాంజలి తో పణమ్ పడైట్టవన్, సనగమమ్ వంటి సినిమాల్లో నటించాడు. అలాగే అమ్మకుట్టి, విజయ, సచ్చు ల సరసన కూడా నాగేష్ నటించాడు. 1970 లో బాలచందర్ నిర్మించిన ‘నవకిరగమ్’ సినిమాలో నాగేష్ సరసన మనోరమను తీసుకుందామంటే కారణాంతాల వలన నాగేష్ ఒప్పుకోలేదు. దాంతో మనోరమకు కోపమొచ్చింది. కొంతకాలం ఇద్దరూ కలిసి నటించలేదు. అయితే ఎం.జి. రామచంద్రన్ వారిద్దరికీ సంధి కుదిర్చి ‘అన్నమిత్త కాయ్’ సినిమా లో నటింపజేశారు. తరవాత రామన్, తదియ సేథై, కణ్ మలర్, గోమాత ఎన్ కులమాత, దీపం, రుద్ర తాండవం వంటి సినిమాల్లో మనోరమ ప్రక్కన నటించినా సినిమా సంభాషణలేగాని ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. తరవాత ఇద్దరూ కలిసిపోయారు. 1985 తరవాత మైఖేల్ మదన కామరాజన్, ఇమిసై అరసన్ 23 పులకేశి వంటి సినిమాల్లో నటించారు. వివిధ దక్షినాది సినిమాల్లో నాగేష్ వెయ్యి సినిమాలకు పైగా నటించాడు.
తెలుగు చిత్రసీమలో నాగేష్…
తెలుగు చలనచిత్రసీమకు నాగేష్ చిరపరచితుడే. అతడు నటించిన సర్వర్ సుందరం, కన్నెపిల్ల, సరస్వతి శపథం, భామావిజయం, కాలచక్రం, నువ్వే, శివలీలలు, వీర ప్రతిజ్ఞ, అనుమానం పెనుభూతం, ధనమే ప్రపంచలీల, అంతులేని హంతకుడు, ప్రేమకథ, అనుభవించురాజా అనుభవించు (ద్విపాత్రాభినయం), విధి, పోస్ట్ మ్యాన్ రాజు, బస్తీలో భూతం, పెళ్ళంటే భయం, ముగ్గురు మిత్రులు, కోయంబత్తూరు ఖైదీ, ముద్దుపాప, నవయువతి, డబ్బారాయుడు సుబ్బారాయుడు, దెబ్బకు దెబ్బ, నామాటంటే హడల్, గలాటా పెళ్ళిళ్ళు, భయంకర బడా చోర్, అగ్గిరవ్వ, శ్రీమంతులు (త్రిపాత్రాభినయం), విచిత్రసోదరులు, మద్రాస్ టు హైదరాబాద్, డ్రైవర్ మోహన్, ప్రేమ మనసులు, దొరలా దొంగలా, కోటీశ్వరుడు, భయంకర గూఢచారి, స్వర్గం, బొమ్మలాట, సింగపూర్ హంతకులు, గూఢచారి 003, గూఢచారి 115, పగ, మనసిచ్చి చూడు, విచిత్ర ప్రేమ, జగత్ కంత్రీలు, తల్లిని మించిన తల్లి, శ్రీ మహావిష్ణు మహిమ, సికింద్రాబాద్ సిఐడి వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా నాగేష్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 1967లో నాగేష్ ‘క్రూ కటింగ్’ పేరుతో హెయిర్ స్టైల్ ప్రవేశపెడితే కాలేజీ కుర్రాళ్ళంతా ఆ ఫ్యాషన్ ని అనుకరించారు. సున్నితమైన హాస్యాన్ని అందించడంలో నాగేష్ దిట్ట. వెకిలితనం అనేదే నాగేష్ నటనలో కనిపించని కోణం. అందుకే డబ్బింగ్ చిత్రాలైనా నాగేష్ కడుపుబ్బ నవ్వించి తెలుగు ప్రేక్షకుడికి గుర్తుండిపోయాడు. విజయా వారు నిర్మించిన ‘బృందావనం’ సినిమాలో నాగేష్ హాస్యం టైమింగ్ అద్భుతంగా వుంటుంది. ‘అడవిరాముడు’ చిత్రంలో ఎన్టీఆర్ కు సహచరుడిగా నాగేష్ పండించిన హాస్యం మరువలేనిది. కమల్ హాసన్ కు అభిమాన నటుడు నాగేష్. కమల్ హాసన్ నిర్మించిన సొంత సినిమాల్లో నాగేష్ కు తప్పనిసరిగా పాత్రను కల్పించేవారు కమల్. అతడు నిర్మించిన ‘నమ్మవార్’ చిత్రంలో ప్రిన్సిపాల్ పాత్ర పోషించినందుకు నాగేష్ కు జాతీయబహుమతి లభించింది. సురేష్ రామానాయుడు ‘మొరటోడు’ అనే సినిమా తీశారు. ఆ చిత్రానికి నాగేష్ దర్శకత్వం వహించడం విశేషం. నాగేష్ సహచర నటీనటులకు చిట్కాలు చెప్పి సన్నివేశాన్ని పండింపజేసేవాడు. ‘సర్పయాగం’ సినిమాలో ఒక కోర్టు సీను వుంటుంది. అందులో ఒక తల్లి తన బిడ్డను ఉరితీయండి అని చెప్పాలి. ఆ పాత్రలో శివపార్వతి నటించింది. ఆమె టెన్షన్ పడుతుంటే, నాగేష్ దగ్గరకు వెళ్లి ‘నువ్వు ఎవరు అనే విషయం కాసేపు మరచిపో. పాత్రలోకి పరకాయ ప్రవేశం చెయ్యి. సన్నివేశం పండుతుంది” అని సలహా ఇచ్చాడు. ఆ సన్నివేశం అలాగే పండింది. సురేష్ పిక్చర్స్ వారు నిర్మించిన ‘సోగ్గాడు’ చిత్రంలో సన్యాసిరావు పాత్రలో ఒదిగిపోయి నటించాడు నాగేష్. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రంలో గణపతి పాత్రలో గొప్పగా నటించాడు. ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’, ‘బ్రహ్మపుత్రుడు’, ‘సావాసగాళ్ళు’, ‘ఇంద్రధనుస్సు’, ‘కన్నవారిల్లు’, ఒక చల్లని రాత్రి’, ‘కారు దిద్దిన కాపురం’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘విచిత్ర సోదరులు’, మేడమ్’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘దశావతారం’ వంటి తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో నటించి తన ఉనికిని చాటుకున్న నాగేష్ తెలుగు వెండితెరకు దొరికిన మరో మాణిక్యం.
ఒడుదుడుకుల జీవితం…
నాగేష్ మంచి హాస్యనటుడే కాని అతడొక అంతర్ముఖుడు (ఇంట్రావర్ట్). పత్రికలవారికి దూరంగా ఉండేవాడు. ‘హిందూ పత్రిక’ ప్రతినిధి మాలతీ రంగరాజన్ కు ఇంటర్వ్యూ ఆరేళ్ళవరకు ఇవ్వలేదు. ‘సిరిథు వాళ వేండుం’ (నవ్వుతూ బతకాలి) పేరుతో ఆత్మకథ రాసుకున్నాడు. నటుడుగా ఎదిగిన తరవాత నాగేష్ తన సంపాదన లో సింహభాగం స్థిరాస్తి వ్యాపారంలో పెట్టాడు. అతనికి వ్యాపార దృష్టి లేదు. ఆ వ్యాపారంలో నమ్ముకున్న వాళ్ళు తనని నట్టేట ముంచినంతపని చేశారు. ఆరోజుల్లో మద్రాసు లో ‘నాగేష్’ పేరిట మంచి సినిమా హాలు నిర్మించాడు. తన కుమారుడు ఆనందబాబు హీరోగా ‘పార్థ గాబగం ఇళ్ళయో’ అనే సినిమా నిర్మించి అప్పులపాలయ్యాడు. అప్పుడే ఎం.జి.రామచంద్రన్ తో విభేదాలు తలెత్తాయి. ఎమ్జీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాగేష్ ని నిర్మాతలు సినిమాల్లో తీసుకోవడం మానేశారు. వ్యాపారం దెబ్బతింది. తరవాత ఎమ్జీఆర్ దగ్గరకు తీశారు. ఆయన సహకారంతో వ్యాపారంలో కోల్పోయిన నష్టాన్నికొంతవరకుపూడ్చుకోగలిగాడు. కష్టాలను ఎప్పుడూ చెప్పుకునేవాడు కాదు. తల్లిని కారులో తిప్పుతూ వుంటే ఆమె తుది శ్వాస విడిచింది. ఆ సంఘటన నాగేష్ ను తొలచివేసింది. తరవాత నటించిన పంచతంతిరం, వసూల్ రాజా MBBS, ఇమ్సై అరసన్, దశావతారం సినిమాలు నాగేష్ నటనను మరొకసారి ఆస్వాదించగలిగాయి. ‘కొచ్చెడియాన్’ యానిమేషన్ చిత్రంలో దివంగతుడైన నాగేష్ పాత్రను చూపించడం విశేషం. నాగేష్ కు ధూమపానం, మద్యపానం వంటి ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లు మెండుగా ఉండేవి. తను విపరీతమైన అనారోగ్యం పాలైనప్పుడు కొంతవరకు వాటికి దూరంగా జరిగాడు. ఎమ్జీఆర్ నాగేష్ కు మంచి వైద్య సహాయం అందించారు. కానీ 2008లో నాగేష్ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో 2009 జనవరి 31 న గుండెపోటుతో మరణించాడు. నాగేష్ కి ఆనంద్ బాబు, రమేష్ బాబు అనే ఇద్దరు కుమారులు. నాగేష్ భార్య 2006 లోనే చనిపోయింది.
–ఆచారం షణ్ముఖాచారి
(94929 545256)