దేశానికి కూడెట్టే రైతు గోడును నాగేటి గోడుగా వినిపించిన కర్షక కవి, బహుగ్రంథ కర్త శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి హృదయాన్ని పిడికిట పట్టి పిండుతున్న శోకం నుండి పుట్టిన కావ్యం-నాగేటి గోడు. కవి- చిత్రకారుడు, విమర్శకుడు అయిన కొండ్రెడ్డి రైతు విముక్త స్వాప్నికుడై తన నిజనైజమైన దృశ్య చిత్ర రచనను అక్షరీకరించి పదచిత్రాలుగా కంటి ముందు ఉంచిన కావ్యం-నాగేటి గోడు.
ఆచార్య కె. హేమచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ తన ముందుమాటగా “కర్షకలోక చైతన్యానికి కావ్య రూపం ‘నాగేటి గోడు’. దీర్ఘ కవిత అనే ప్రక్రియను వచన కావ్యంగా సుప్రసిద్ధ పండితులు పేర్కొన్నారు. రైతు మూలాల్లో నుంచి వచ్చిన కొండ్రెడ్డి రైతుల పక్షాన నిలిచి ఎన్నో కవితలను వెలువరించారు. కర్షకలోక చైతన్యానికి కావ్యరూపంగా “నాగేటి గోడు”ను చెప్పుకోవచ్చు” అంటారు.
“ఇది పద్యమా? అక్షర సేద్యమా? కన్నీటి చుక్కలను సిరాలోకెక్కించుకున్నాడా? లేదా సిరల్లో పొంగుతున్న నెత్తుటి వేడిని సిరాలోకి చేర్చి ఈ అక్షరాగ్నుల్ని ప్రయోగించాడా? వ్యవసాయాన్ని దగా చేస్తున్న ఈ వ్యవస్థపై కొండ్రెడ్డి అక్షర విస్ఫులింగాలను విసిరిన తీరు చూస్తే ఆయన హృదయంలో దాగిన బడబాగ్నుల్ని మనం గుర్తించవచ్చు” అంటారు పి. విజయ బాబు, అధికార భాషా సంఘం అధ్యక్షులు.
ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి పలికిన పలుకుల్లో “దగాపడ్డ చెమట చుక్క కన్నీటి పోరు” గా అభివర్ణించారు.
“అప్పులతో కునారెళుతున్న రైతు మీద ప్రపంచీకరణ వచ్చిపడి ఆత్మహత్యలకు పురికొల్పింది. కొండ్రెడ్డి స్వయంగా రైతు. రైతు పక్షపాతి. వీరు రాసినంత రైతు కవిత్వం ఇటీవల కాలంలో ఏ కవి రాయలేదేమో” అంటారు… ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
కవి విమర్శకులు ఆచార్య పులికొండ సుబ్బాచారి “ఎలుగెత్తిన సైరిక సమరం” నేటి రైతు జీవితాన్ని నీరు నిండిన కళ్ళతో దర్శించి, వగచెంది, కుపితుడై కురిపించిన అగ్నివర్షం ఈ కావ్యం” అంటారు.
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్. “రైతు కవిత్వంలో మరో కలికి తురాయి-నాగేటి గోడు” అంటారు.
“కష్టజీవి స్వేద బిందువు / అమృతం నిండిన సింధువు / సజీవశక్తినిచ్చే బంధువు / రైతు స్వేదాన్ని రక్తక్షేత్రంగా మార్చి రణక్షేత్రం చేయకండి” అనే హెచ్చరికను దిక్కారస్వరంగా వినిపించిన కవి కర్షక లోకం చైతన్యానికి కావ్య రూపంగా నాగేటి గోడుగా చెప్పుకోవచ్చు. దగా పడుతున్న రైతులోకం అవగాహించుకుని కష్టాలను ఎదిరించి, వారి హక్కులను రక్షించుకుంటుందని ఆశిద్దాం. అక్షరం అక్షరంలోను తన ఆవేదనను, ఆవేశాన్ని, అనురాగాన్ని, ఆత్మీయతను, ఆర్ధ్రతను నిక్షిప్తం చేస్తూ ఆవిష్కరించిన దీర్ఘకవితగా “నాగేటి గోడు” నిలుస్తుంది.
ఆరు అధ్యాయాలుగా సాగిన ఈ గ్రంథంలో కవితా శిల్పం, శైలి, పద ప్రయోగం, శబ్ధబంధాలతో నిండిన కవిత్వాన్ని చదివిన తర్వాత- రైతుకు పోరాటం… పొలంతో కాదు, ప్రకృతితో కాదు, తన చుట్టూ ఉన్న సమాజంతోనే అన్న విషయం పాఠకునికి క్షుణ్ణంగా అర్థమవుతుంది.
“మనది కాకి బ్రతుకని కార్పొరేట్ హీరోలంతా అవహేళన చేస్తుంటారు. కాని మనకు లేనిదే అదని, కాకుల సమిష్టి బ్రతుకుని కాంక్షిద్దాం” అంటారు కవి. రైతుకు లేనిదే సఖ్యత, సమిష్టి వ్యవసాయం నేటికీ సాకారం కాలేక పోయింది కదా అన్నది మనముందున్న వ్యథ! రైతును విమర్శించే వారి బ్రతుకులను చీకొట్టేలా జీవించి చూపమంటాడు కవి.
ఆరుగాలాలు శ్రమించే రైతు గురించి రాసిన ఈ కావ్యాన్ని ఆరు అధ్యాయాలుగా ఉద్యేశ్య పూర్వకంగానే మలిచారు. సామాజిక స్పృహ ఉన్న కళాకారుడు ఎవడైనా, కళాక్షేత్రం ఏదైనా వ్యవసాయం చేసే కృషీవలునిలా ఒకటే విధానం… కలుపు తీయడం, మందు కొట్టడం.
నాగేటి గోడు కావ్యంలో కవి రైతు సమస్యలతోపాటు మానవ మనోగతాలను, మానవ సంబంధాలను, నీతి నిజాయితీతో కూడిన నిస్వార్థ జీవన విధానాన్ని, అసంతృప్తి, అస్థిరభావాలతో గడిపే అయోమయ జీవితాన్ని ప్రకృతి ధర్మాన్ని ప్రస్తావించారు. ప్రపంచీకరణ ఫలితంగా ఈ దేశం ఆత్మ లోతుల్లోకెళ్ళి తన దృక్పథాన్ని కర్షక లోకానికి అందించే వాక్యాల్ని మెండుగా ఆవిష్కరించారు.
“మనం మెల్లమెల్లగా / మరణించడం మొదలుకాకముందే / మనలను మనం చదువుకోవాలి… అప్పుడు జీవితంలో / ధ్వనులు, ప్రతిధ్వనులు / ప్రతీకార ధ్వనులేవో అర్థం అవుతాయి!”
“కలలు పగుళ్ళు బారి, ఆశలు అడుగంటి / దుఃఖపు మడుగులైన జీవితాలు గోదాడుతూనే ఉన్నాయ్!”
“సూర్యుడు భూమితో నెరపే / రహస్య సంభాషణకు అనువాదకుడు అన్నదాత! / ఆకలై చుట్టుకునే దిగులు బాధల్ని / అన్నం ముద్దై తెగటార్చే తెగువరి కృషీవలుడు!” ఈ మాటల్ని భద్రంగా గుండె గూటిలో దాచుకుని చదువుకుంటూ కష్టాల్ని కన్నీళ్లలో చూసుకుంటూ నీరుగారిపోకుండా తమను తాము బతికించుకోవడమే బ్రతుక్కి మనమిచ్చే బహుమానం అంటూ… రైతులు తమ బాధామయ జీవితానికి విసిగి, వేసారి ఆత్మహత్యలు వద్దని మహోదయాన్ని నూరిపోస్తాడు కవి.
కరోనా కష్టకాలంలో ప్రతి మనిషి గృహ వాసాల్లో నిర్భందించుకుని బయటకు రాని పరిస్థితుల్లో అత్యవసర విధులను నిర్వహించిన కొన్ని రంగాలకుమల్లే గుర్తింపుకోరని ప్రధాన రంగం వ్యవసాయ రంగం. రైతు తన కార్యక్షేత్రంలో సైనికుడై శ్వేదాన్ని చిందించి జీవుల నోటికి ఆహారాన్ని అందించి జీవుల ప్రాణాలను నిలిపిన సాహసి. తన ప్రాణాలను లెక్కచేయక చేసిన కృషికి కృతజ్ఞతగా కవి ఈ నాగేటి గోడు కావ్యాన్ని వెలువరించి తన కృతజ్ఞతగా హృదయ స్థానాన్ని ఇచ్చాడు.
సమీక్షకుడు: ఆత్మకూరు రామకృష్ణ
192 పేజీల ఈ “నాగేటి గోడు” కావ్యాన్ని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్ స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ (VVIT) వారి 27వ ముద్రణ.
ప్రతులకు: 99487 74243
ధన్యవాదాలు. నూతన పుస్తకాలను పాఠకులకు పరిచయం చేయటంలో మీ ప్రోత్సాహం అమోఘం