“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

డాక్టర్ చిల్లర భవానీదేవిగారి కవిత్వం మానవత్వానికి మారుపేరుగా నిలుస్తుంది. ఈమె కవిత్వం చదువుతుంటే “నది అంచున నడుస్తూ..” ఆ నది అందచందాలు, పిల్లగాలుల హోరు, నదిపై ఆహ్లాదంగా విహరించే పక్షుల ఆనంద హెళి ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే మధురమైన అనుభూతిని, జీవన సత్యాలను మనం ఆస్వాదిస్తాం. వీరి కవిత్వంలో దేశభక్తి కూడా చాలా మెండుగా ఉంటుంది. ఈ “నది అంచన నడుస్తూ..” కవితా సంపుటిలో దేశం కోసం మట్టిలో నుంచే ఉద్యమం రావాలి అంటూనే దేశ ప్రేమికులతో చేతులు కలిపి దీక్షా హారతులు ఇవ్వండి అంటూ దేశభక్తితో వెలిగి పోతాయి కవితలన్నీ కూడా. గొప్ప విద్యావేత్త అయిన చిల్లర భవానీ దేవిగారికి సాహితీ మాత కటాక్షం కూడా మెండుగా ఉంది. భవానీ దేవి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెక్రటేరియట్ లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

మొదటిగా “కూతురు ఒక సేతువు” అనే కవితలో కూతురు పై ఉన్న మమకారాన్నంతా రంగరించి ఈ కవితలో విరబూయించారు. వీరు అంటారు చాలామంది కొడుకు పుడతాడని ఎదురుచూస్తూ కూతుళ్ళను కంటారే కానీ మనస్ఫూర్తిగా కనరు అంటారు. కానీ పట్టణాల్లో, గ్రామాల్లో అందరి కుటుంబల్లో కూతురే వంతెనలా ఉంటారు. అంటే నదికి అవతలి వైపుకి, ఇవతలి వైపుకి మధ్యన వంతెన ఎలా వారధిగా నిలుస్తుందో కూతురు కూడా కుటుంబంలో అంతే గొప్పగా నిలుస్తుంది అంటారు. మహాసముద్రం ఆటుపోట్లను భరిస్తున్నట్లుగానే తలకు మించిన భారాన్ని మోస్తూ కుటుంబంలో అందరి మధ్య దూరాలను తొలగిస్తూ బంధాలు అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తారు కూతుర్లు అంటారు. అందరికీ చైతన్య దీపికగా ఉంటూ ముందుకు సాగుతూ కొడుకులకు దీటుగా ఉంటూ నదీమతల్లిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటారని చక్కని ఉపమానాన్ని ఇచ్చారు కూతుళ్ళకి రచయిత్రి.

సముద్ర ముద్ర” కవితలో పెద్దలు సముద్రపు రూపురేఖల్ని మార్చుతున్న తీరుతెన్నుల్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు. జలంతో నిండి పోయిన భూగోళానికి నదీమతల్లి అందాల్ని వివరించన వసరంలేదు అంటారు రచయిత్రి. కానీ నదుల్ని రకరకాలుగా విభజిస్తూ రాజ్యమేలే పెద్దలకి నీటి భవిష్యత్ స్వప్నాలు ఎలా అర్థం అవుతాయి అంటారు. ఇంతటి అందచందాలను అల్లకల్లోలం చేస్తూ గునపాలతో గుచ్చుతున్నా కూడా నదీమతల్లి కన్నతల్లిలా కాపాడుతూనే ఉంటుందంటార. అలాగే మనం నిల్చున్న మట్టికి కూడా ఈ మహాసముద్రమే తల్లి లాంటిదన్న నిజాన్ని మరిచి దానిని కట్టడి చేయాలని చూస్తే మాత్రం ఏదో ఒక సందర్భంలో ఉగ్రవాదిలా విరుచుకుపడి మానవ తప్పిదాల్ని నదీమతల్లి తెలియజేస్తుందంటారు భవాని దేవి.

ఒంటరి తల్లి వేరు” కవితలో అమ్మతనంలోని మమకారాన్నంతా రంగరించి ఈ కవితలో ఆవిష్కరించారు రచయిత్రి. మరణం భయం వణికిస్తున్నా, కాలం వెంట పరిగెడుతున్నా ‘నా’అనే వాళ్ళు ఎంతమందికి మిగులుతారు. పూర్వం రోజుల్లో అయితే ప్రేమ ఆప్యాయతలతో ఉంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించేవారు. వీరందర్నీ పటిష్టంగా ఉంచేది తల్లి వేరే అంటారు. కుటుంబ వృక్షం లోనుంచి తల్లివేరు మట్టిలో కలిసిపోతే, ఉరుకుల పరుగుల జీవితంలో పిల్ల వేర్లు ఆధునిక పోకడలతో తల్లి వేరును కనీసం తలుచుకోకుండా అస్తిత్వ మూలాల్ని తెంచేచేసుకుంటున్నారని ఎంతో ఆవేదనగా చెప్పారు. కానీ తల్లి ఒంటరిదైనా ఎంతమంది పిల్లల్నయినా తన గుండెల్లో దాచుకొని సాకుతుంది. అంతటి ప్రేమామృత మూర్తి మాయమైతే పిల్ల వేర్ల గమనం అగమ్యగోచరం అంటూ తల్లిలేని లోటుని ఎంతో ఆవేదనగా కవిత్వీకరించి చెప్పారు. “విలువ” కవితలో మానవీయ విలువల్ని చాలా చక్కగా అక్షరీకరించారు. కొంతమంది డబ్బు సంపాదనే పరమావధిగా జీవిస్తూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు. డబ్బుతో పెద్దపెద్ద భవంతులు కడతారు. ఇంకా వాటిపై రైడింగులు కూడా జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు ధనార్జనే జీవితాశయంగా జీవిస్తు, ఆ తర్వాత రోగాల పాలై సంపాదించిన ధనాన్నంతా కార్పొరేట్ ఆస్పత్రులు దోచేస్తుంటే అప్పుడు బాధపడుతూ మన పిల్లలకి నా జీవితంలో విలువైన రోజులు ఇవే అంటూ ఫోటోలో నుంచి ఎంతో ఆవేదనగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎంతో హృద్యంగా చెప్పారు.

“నా కోసం” అంటూ మూగజీవమైన కుక్కకి మానవుల మీద ఉన్న విశ్వాసాన్ని ఈ కవితలో అందంగా కవిత్వీకరించి చెప్పారు భవానిదేవి. రచయిత్రి రోజుల కుక్క పిల్లని తెచ్చి పెంచుకుంటూ దానికి పాలపీక దగ్గర్నుంచి అందించి, దాని ఆరోగ్యానికి మందులు అన్నీ వేస్తుంటే అది సొంత బిడ్డలా కాపాడుతుందని ఎంతో ప్రేమగా చెప్పారు. ‘పోయిన జన్మలోని రుణానుబంధంతో జాతి భేదం మర్చిపోయి, “విశ్వాసం” అనే గొప్ప గుణంతో ప్రేమగా నా వెన్నంటే ఉంటుంది” అంటారు. అలాగే “ఆజన్మాంతరం నా కోసమే జీవించినా, నా ఆయువు కన్నా తన ఆయువె చిన్న” అంటారు. మానవ సంబంధాలు దూరమవుతున్న నేటి నేపథ్యంలో “నా ఆయువులో మరికొంత ఈ మూగజీవి కుక్కకు ఇవ్వగలిగితే తనని జీవిత కాలం కంటికి రెప్పలా కాపాడుతుందని” మూగజీవాలపై తనకున్న ప్రేమని భవానీ దేవి ఎంతో ప్రేమగా చెప్పారు.

చివరిగా “నది అంచన నడుస్తూ..” కవితలో నది అంటుందీ “నా తీరాలు ఒక దేశంవి కావు. నా ఆలోచనలు నిరంతరం సాగిపోతూ ప్రపంచాన్ని కూడా నాతో నడిపిస్తుంది” అంటుంది నది. “ఒకప్పుడు చిన్ననీటి పాయనయిన నేను అంతటా ప్రవహిస్తూ నిశ్శబ్ద మేఘాల్ని కూడా నెట్టేసి వెలుతురు ప్రవాహమై విస్తరిస్తూ అలల కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఆస్వాదించాను” అంటుంది నది. “ఓ మానవా! ఒక్కసారి నీ ఉరుకుల పరుగుల జీవితాన్ని పక్కకు పెట్టి నా సముద్రపు పొదరింటికి అతిథిలా విచ్చేసి ఇంద్రధనస్సు కాంతులీనే హోరు హోరును, ఇంకా సంగీత లయలు వింటూ నువ్వు నది అంచున నడుస్తూ… నా ఆత్మ రచించిన జీవన సందేశాన్ని ఆస్వాదిస్తూ ఇంకా ఈ అలల ఉధృతి నుంచి వచ్చే ఈ అరుదైన సంగీతాన్ని వింటుంటే నువ్వు ఇక్కడినుంచి విడిచి వెళ్ళలేవు” అంటూ అద్భుతంగా కవిత్వీకరించి చక్కని ముగింపు నిచ్చారు ఈ కవితా సంపుటికి భవాని దేవి.

ఇలా ఆసక్తిదాయకంగా సాగిపోతున్న ఈ “నది అంచనా నడుస్తూ..” కవితా సంపుటిలో “వలయం, మా అమ్మ ఉండేది, బాపు కోసం, పాటల పాట, వంటింటి కవిత, నల్లనమ్మ, చివరి చిరునవ్వు, పెన్సిల్, గుంటూరు గాలి….”లాంటి కవితలు ఉప్పొంగి ప్రవహిస్తు నదీమతల్లిలా అలరించే కవితలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా “నది అంచనా నడుస్తూ” చదువుతుంటే కలిగే అనుభూతిని పంచారు డాక్టర్ చిల్లర భవానీ దేవి గారు. వీరు నవలలు, వ్యాసాలు కథలు రూపకాలు బుర్రకథలు రాయడంలో సిద్ధహస్తులైన భవానీదేవి గారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా “ఉగాది పురస్కారం, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ పురస్కారం, రంజని కుందుర్తి ఉత్తమ కవితా అవార్డు, వంశీ బర్కిలీ” అవార్డులు సొంతం చేసుకొని అవార్డులకే వన్నె తెచ్చారు. ఇంకా ఈ కవితా సంపుటికి డా. రావిరంగారావు సాహిత్య కళాపీఠం తరపున “జనరంజక కవిప్రతిభా పురస్కారాన్ని” అందుకొన్న డాక్టర్ చిల్లర భవానీదేవిగారికి అభినందనలు.

పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు, రచయిత్రి
ఫోన్ : 9704725609

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap