నాగరాజు గంధం గారి జీవితం ఒక గొప్ప గ్రంథం. బతికింది తక్కువ కాలమే అయినా, సాహిత్యంలో శాశ్వత ముద్ర వేసి వెళ్ళిపోయాడు. గమ్యం, బాణం, గాయం – 2 లాంటి సినిమాలకు సంభాషణలు అందించిన రచయిత. చదువు, శేషార్ధం, ఓ క్రైం కథ లాంటి నాటికలు రాసిన గొప్ప రచయిత. నాగరాజు సాహిత్య విశిష్టతను గస్మరించుకుంటూ మిత్ర క్రియేషన్స్, మై మూన్ మకాన్ ఆధ్వర్యంలో నరసరావుపేట హైస్కూల్ లో మే 28 న, ఆదివారం నాగరాజు గంధం గారిని గుర్తు చేసుకునే అవకాశం కలిగింది. ఈ సందర్బంగా నాగరాజు రాసిన నాటకాలు, రెండు నాటికల సంకలనాలను ముద్రించి విడుదల చేశారు.
సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ విచ్చేసి నాగరాజు గ్రంధాలను ఆవిష్కరించారు. నాగరాజును సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు క్రిష్ గారి ద్వారానే తాను కూడా సినీ రంగంలోకి ప్రవేశించానని, ఒకరకంగా నాగరాజు ఖాళీ చేసిన కుర్చీలో తాను కూర్చొన్నానని ఆయన చెప్పుకున్నారు. గమ్యం సినిమా సంభాషణలు తనకు కంఠస్థ వచ్చునని, అంతటి అద్భుత రచయిత నాగరాజు అని గుర్తు చేశారు.
నాగరాజు గంధం ను దీక్షిత్ మాష్టారు నాకు పరిచయం చేశారు. స్పార్క్ ఉంది కుర్రాడిలో కాసేపు మాట్లాడండి అంటూ. మాట్లాడిన కాసేపటికే నిజంగా నాగరాజు చిన్న వయసులోనే గొప్ప తత్వవేత్త అనిపించాడు. కళ్ళల్లో మెరుపు, చెదరని చిర్నవ్వుతో మాట, స్టైలిష్ డ్రెస్ వెరసి ఒక అద్భుతం అనిపించాడు. అప్పుడప్పుడు తన సక్సెస్ గురించి, చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ఫోన్ లో చెబుతుండే వాడు. అతను చనిపోతాడని తెలిసి కూడా అతనిలో నైరాశ్యం కనిపించనివ్వలేదు. మృత్యువును హాయిగా స్వీకరించాడు. చనిపోయి 12 ఏళ్ళు అయినా నాగరాజును సాహితీ ప్రియులు ముఖ్యంగా నాటక అభిమానులు మరచిపోలేదు. అంతటి గొప్ప నాటకాలు అందించారు. అతను రాసిన నాటకాలను ఎక్కువగా కరణం సురేష్ పరిషత్ లలో ప్రదర్శించేవారు. ఆయనా చనిపోయారు. నాగరాజు నాటకాలను దర్శకత్వం వహించి విరివిగా ప్రదర్శించిన దర్శక నట ప్రయోక్త ఎస్.ఎం.బాష గారు ఇప్పుడు నాగరాజు గ్రంధాలను ముద్రించి అందుబాటులోకి తెచ్చారు. నాగరాజు మిత్రుడు మృత్యుంజయరావుగారు ఈ గ్రంధాలను సమీక్షించారు అద్భుతంగా.
ఈ వేడుకలో నాయుడు గోపి, ఈశ్వర్ రెడ్డి, డాక్టర్ మహ్మద్ రఫీ, వల్లూరి శివప్రసాద్, నాగరాజును పెంచిన యాజ్ఞశర్మ, బొప్పన బుజ్జి, వై. అంజిబాబు, నాగరాజు భార్య శైలజ, వారి బంధుమిత్రులు తదితరులు పాల్గొని నాగరాజుతో వున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా ఎస్.ఎం. బాష దర్శకత్వంలో మిత్ర క్రియేషన్స్ బృందం ఇంపోస్టర్స్ నాటిక ప్రదర్శించారు. నరసరావుపేట రంగస్థలి అధ్యక్షులు షేక్ బాజీ, ఎస్. ఎం. బాష సమన్వయం చేశారు.
-డాక్టర్ మహ్మద్ రఫీ