నఖచిత్ర కళాతపస్వి – రవి పరస

ఆయనకు కుంచెతో పనిలేదు.. రంగుల అవసరం అసలే లేదు.. ఆయనకో చిన్న కాగితం ముక్క ఇస్తే చాలు.. దానినే అద్భుతమైన చిత్రంగా తీర్చిదిద్దుతారు. తన చేతి వేళ్లకున్న గోటినే కుంచెగా మార్చుకొని అద్భుతమైన చిత్రాలు గీయగలిగే నైపుణ్యం వారిసొంతం. ఇప్పటివరకూ తన చేతిగోటితో 90వేలకు పైగా చిత్రాలు గీసారు, ప్రముఖ అంతర్జాతీయ నఖచిత్ర కళాకారులు రవి పరస. రాజమండ్రికి చెందిన రవి పరస గారి జన్మదినసందర్భంగా వారి కళాయాణం గురించి తెలుసుకుందాం…

కళాప్రస్థానం: రవి పరస పుట్టింది ఆగస్ట్ 1 న 1968 లో తూర్పు గోదావరి జిల్లా, చిడిపి గ్రామంలో. తల్లిదండ్రులు శ్రీమతి శకుంతల, సత్యం గారు. ఆంధ్రా యూనివర్సిటి నుండి పోస్ట్ గ్రాడ్యుషన్ చేసారు. చిన్నప్పటి నుండి కళల పై ఆశక్తితో నఖ చిత్రకళను నఖచిత్ర కళాబ్రహ్మ కీ.శే. శిష్ట్లా రామకృష్ణారావు గారి వద్ద మెళకువలను నేర్చుకున్నారు.

రాష్ట్రం.. దేశం సరిహద్దులు దాటి.. అంతర్జాతీయ స్థాయిలో నఖచిత్రకళను విశ్వవ్యాప్తి చేయడానికి రవి కృషి చేస్తున్నారు. ఓంకార గణపతి రూపాన్ని తన గోటితో చిత్రీకరించేందుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. జీసస్ ప్రతిమను గీసేందుకూ అంతే ఆసక్తిని చూపిస్తారు. ముస్లిం పండగల వేళ వారి సంస్కృతి.. సంప్రదాయాలకు సంబంధించిన చిత్రాలను తీర్చిదిద్దుతారు. ఇప్పటివరకు వేసిన రూపం వెయ్యకుండా 3456 గణేశుని అవతారాలు తన గోటితో చిత్రీకరించారు. జీసస్, శిలువకు సంబంధించిన చిత్రాలను వందల సంఖ్యలో గీశారు. దీని కోసం దేశంలోని అనేక చర్చిలను సందర్శించి.. ఆయా ప్రతిమలను చిత్రీకరించారు. దేశంలోని ప్రముఖులు, శాస్త్రవేత్తలు, స్వాతంత్ర్య సమరయోధులు, ఆధ్యాత్మిక చిత్రాలు, ప్రదేశాలు, ప్రకృతికి సంబంధించిన వేల చిత్రాలను గీశారు.

సామాజిక స్పృహ :  ప్రపంచంలో రోజు వారీ జరిగే సంఘటన, వేడుక, వేదన, ఆనందం, పరిశోధనలు.. ఇలా ఏ పరిణామమైనా రవి పరస తన చేతి గోటికి పనిచెబుతారు. ఓ చిత్రాన్ని గీసి తన మనసులోని భావాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారు. ఇస్రో పరిశోధనలు జరిగే ప్రతిసమ యంలోనూ సఫలమవ్వాలని కోరుతూ ఓ గ్రీటింగ్ కార్డును తన గోటితో  గీసి పంపిస్తుంటారు. 16 భారతీయ భాషల్లోని ప్రతి అక్షరంలోనూ ఓ గణపతి చిత్రాన్ని చిత్రీకరించిన ఘనత ఆయనకు దక్కుతుంది.

సాంకేతికతను అందిపుచ్చుకుంటూ..
ప్రస్తుతం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. తన చిత్రకళను విశ్వవ్యాప్తం చేయడానికి రవి పరస కృషి చేస్తున్నారు. తన పేరుతో ఫేస్ పేజీని ఏర్పాటు చేసి.. నిత్యం తాను గీనే చిత్రాలను అందులో పోస్ట్ చేస్తున్నారు. అలా వేలాది మందికి వీరి కళ చేరుతుంది. తన కళ ఇంతటితో ఆగిపోకూడదని.. రాష్ట్రం, దేశానికి సైతం ప్రత్యేక ఖ్యాతిని తీసుకురావాలనే తపనతో  ‘నెయిల్ ఆర్ట్ రవి ‘పేరుతో ఒక వెబ్సైట్ ను కూడా రూపొందించారు. నేటి యువతకు అత్యంత ఇష్టమైన సామాజిక మాధ్యమాలపై అవగాహన పెంచుకుని, వాటితోనే వారికి చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

అరుదైన కళలో అందెవేసిన చేయి ….
మనుషుల ముఖచిత్రాలను తన గోటితో గీయడంలో రవి దిట్ట. నిత్య జీవితంలో ఎదురయ్యే వ్యక్తుల్లో తనను ఆకర్షించే వారందరి చిత్రాలను అక్కడికక్కడే చిత్రీకరించి వారికి బహుకరిస్తారు. సాధారణంగా వ్యక్తి రూప చిత్రాలను గోటితో గీయడం కస్టతరమయిన విషయం. కాని రూప చిత్రాల్లో కూడా వీరి సృజన అబ్బురపరుస్తుంది. భారతదేశ పటం పైభాగంలో మూడు మతాలను కలగలిపిన చిత్రం లక్షల మందిని ఆకట్టుకుంటోంది. ఇలాంటి చిత్రాలు కోకొల్లలున్నాయి. తన ప్రతిభకు కళారత్న, నఖచిత్ర కళానిధి, నఖచిత్ర విధాత, నఖచిత్ర కళాతపస్వి, నఖచిత్ర కళారత్న, నఖచిత్ర కవిధాత వంటి బిరుదులు అందుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తో పాటు ఏడు వరల్డ్ రికార్డులు సాధించారు. దేశ విదేశాలలో అనేక సంస్థలనుండి వందలాది సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు రవి పరస.

చేతిరాత నిపుణుడు గా: చేతిరాత (దస్తూరి) అనేది కేవలం చదువుకు సంభంచినది మాత్రమే కాదు, అది కూడా ఒక కళ అంటారు రవి గారు. విద్యార్థులకు అందమయిన చేతిరాతను నేర్పేందుకు ‘రైట్ కర్సివ్ ‘ అనే సంస్థను స్థాపించి ఎందరో విద్యార్థులకు (మూడవ తరగతి నుండి డిగ్రీ వరకు) చేతిరాతలో శిక్షణ ఇస్తున్నారు. చేతి రాత మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందంటారు రవి పరస. అనేక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి వేలమంది చిన్నారులకు తమ చేరాతను మెరుగు పర్చుకునేందుకు మెళకువలు నేర్పారు.

రవి పరస గారికి 64కళలు.కాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది….

-కళాసాగర్ యల్లపు (9885289995)

_________________________________________________________________________
ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.

మరి కొన్ని నఖచిత్రాలు క్రింది లింక్ లో చూడగలరు…
https://nailartravi.weebly.com/

SA:

View Comments (1)

  • అద్బుత నఖ చిత్రకారులు శ్రీ పరస రవి గారి గురించి సమగ్ర సమాచారం అందించిన కళాసాగర్ గారికి ధన్యవాదములు... చిత్రకారులు రవి గారికి అభినందనలు తెలియజేస్తూ..

    అంజి ఆకొండి