కార్టూనిస్టుగా ‘బొబ్బిలి పులి’తో ఆరంగేట్రం- మృత్యుంజయ

‘మృత్యుంజయ’ పేరుతో గత 25 ఏళ్ల నుంచి పొలిటికల్ కార్టూన్లు గీస్తున్న మా స్వస్థలం నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి. పుట్టింది జనవరి 14న, 1974లో. స్కూల్ డేస్లో ‘చిలువేరు మృత్యుంజయ’ పేరుతో సోషల్ కార్టూన్లు గీసేవాడిని. నా మొట్టమొదటి సోషల్ కార్టూన్ నేను పదవతరగతి (1990)లో వుండగా ‘ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధం’లో అచ్చయ్యింది. నా ఎడ్యుకేషన్ ఎమ్మే పొలిటికల్ సైన్స్.

మా నాన్న చిలువేరు రామలింగం, ప్రఖ్యాత చేనేత కళాకారుడు. అగ్గిపెట్టెలో పట్టే చీరె నేయడం, కుట్టులేకుండా మూడుకొంగుల చీరె, రాజకీయనాయకుల పోట్రయిట్లు బట్టల్లో నేయడం, కొత్త కొత్త డిజైన్స్ సృష్టించడం లాంటి ప్రయోగాలు ‘టై అండ్ డై’లో చేసేవారు. మా అమ్మ చిలువేరు అనసూయ మంచి చదువరి. ఇప్పటికీ ఏ ఒక్కరోజూ పుస్తకంగానీ, పేపరుగానీ చదవకుండా వున్నట్టు నేను చూసి ఎరగను. మా అమ్మ నుండి చదవడం, మా నాన్న నుంచి బొమ్మలు గీయడం నేర్చుకోవడం వల్లేనేమో ‘చదవడం-గీయడం’తో ముడిపడి వున్న ఈ పొలిటికల్ కార్టూన్ రంగం నన్ను ఆకర్షించినట్టుంది.

మా అమ్మ కట్టెల పొయ్యిమీద చేసే వంటతో మా ఇంటి గోడలు నల్లగా మసిబారేయి. అవి బ్లాక్ బోర్డుగా నన్ను ఆకర్షించడంతో వాటిమీద బూడిదతో చిన్న చిన్న బొమ్మలు గీసేవాడిని. పొగచూరిన ఆ నల్లని గోడే నా వృత్తికి పునాది అనడంలో అతిశయోక్తి లేదు.

దాసరి నారాయణరావుగారి ఆధ్వర్యంలో 1996లో వచ్చిన ‘బొబ్బిలి పులి‘ పొలిటికల్ వీక్లీలో ఎడిటర్ కె.ఎన్.వై. పతంజలిగారు నాకు స్టాఫ్ కార్టూనిస్టుగా అవకాశం ఇచ్చారు. అక్కడ మూడేళ్లు పనిచేసిన తరువాత ఎం.వీ.ఆర్. శాస్త్రిగారి సంపాదకత్వంతో ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో అవకాశం వస్తే అక్కడ చేరి 2007 వరకు పనిచేసాను. ఆ తర్వాత ‘టివీ5’లో హెడ్ ఆఫ్ ది యానిమేషన్’గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బ్రహ్మనంద రెడ్డిగారు నాకు అవకాశం ఇవ్వడంతో అక్కడ చేరాను.

Mrityunjay cartoon

డైలీ పొలిటికల్ కార్టూన్లనే ‘యానిమేషన్’ రూపంలో 3D, 2D లో ‘రాజకీయ భేతాళం’, ఇదండి సంగతి’ పేర్లతో నాలుగు సంవత్సరాలు కొనసాగించడం జరిగింది.
దినపత్రికల్లో రోజూ గీసే కార్టూను క్యారెక్టర్లు , న్యూస్ ఛానల్ టీవీ తెరలమీద కదలడం, మాట్లాడంతో కొత్త అనుభూతినిచ్చింది. అదే సమయంలో తెలంగాణా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నది…. ఈ నేపధ్యంలో అల్లం నారాయణగారి సంపాదకత్వంతో ‘నమస్తే తెలంగాణ‘ పేరుతో ఓ దినపత్రిక వస్తున్నట్లు తెలిసి దాంట్లో 2011 ఉగాది రోజు జాయినయ్యి, రోజువారి ఉద్యమ అంశాలమీద రకరకాల భావోద్వేగాలతో కూడిన కార్టూన్లు గీసాను. నిజానికి అక్కడ ఉధ్యమ సమయంలో నేను చేసింది. ఉద్యోగం కాదు, ఉధ్యమమే! జూన్ 2న తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అదే జూన్ 8వ తేదిన కొత్త రాష్ట్రంలో మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమం కింద’ నా కార్టూన్ ప్రదర్శనఅరవైఏళ్లు – అరవై కార్టూన్లు‘ పేరుతో నా ఉద్యమ కార్టూన్లను ‘తెలంగాణ ప్రభుత్వ-భాషా సాంస్కృతికశాఖ’ వారు రవీంద్రభారతిలో ప్రదర్శించారు. ఇది నా కార్టూన్లకు దక్కిన గౌరవంగా భావిస్తాను. బెంగుళూరులో ‘లైన్స్ బిహైండ్ ది స్మైల్స్‘ పేరుతో ఐఐసీ వారు నా కార్టూన్, క్యారికేచర్ ప్రదర్శన ఏర్పాటు చేసి గౌరవించడం జరిగింది.

Mrityunjay illustration

నేను ఇరవైఐదేళ్ల నుంచి గీస్తున్న పొలిటికల్ కార్టూన్లు సుమారు పదహారువేలు వుంటాయి. సత్యం ఫౌండేషన్ వారి ‘యూత్ అండ్ ఎయిడ్స్’ నేషనల్ కార్టూన్ కాంటెస్ట్’ అవార్డుతో పాటూ, నవతెలంగాణా వారి ‘ఉత్తమ కార్టూనిస్టు‘ అవార్డు, ‘వంశీఆర్ట్స్’ నుంచి ‘కళారత్న‘ అవార్డు, బెంగుళూరు ‘మాయా కామత్’ అవార్డు, ‘హైబిజ్’ టీవీ వారిచే బెస్ట్ పొలిటికల్ కార్టూనిస్టు అవార్డు, కార్టూన్ వాచ్ పత్రిక వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ (2020)లతోపాటు చైనా, ఇటలీ, రొమేనియా, బ్రెజిల్స్, జర్మనీలోని కార్టూన్ ప్రదర్శనలలో నా కార్టూన్లు స్థానం సంపాదించుకోవడంతోపాటు అవార్డులు, పురస్కారాలు వరించాయి.
-మృత్యుంజయ

Mrityunjay cartoon
Mrityunjay cartoon
Mrityunjay cartoon
Mrityunjay cartoon

Caricatures by Mrityunjay
Mrityunjay with singer Chitra
Mrityunjay with VVS Laxman

3 thoughts on “కార్టూనిస్టుగా ‘బొబ్బిలి పులి’తో ఆరంగేట్రం- మృత్యుంజయ

  1. మన మృత్యుంజయ గారి ప్రస్థానం ఇంకా చాలా అద్భుతంగా, విజయవంతంగా సాగాలని ఆశిస్తూ ఉన్నాను…

  2. మృత్యుంజయ గారు మీ కార్టూన్లు బాగుంటాయి.మీ ప్రస్థానం బాగుంది.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link