నందమూరి తారక రాముని శత జయంతి సందర్భంగా సృజనకారులు ఎవరి శక్తికి తగ్గట్లు వారు స్పందించారు. తమసత్తాను చాటుకున్నారు. ఆక్రమంలో అందరికంటే ముందుగా స్పందించిన కవి, రచయిత, చిత్రకారుడు- శివకుమార్ పేరిశెట్ల. రామారావు గారి జీవితాన్ని కాచివడపోసినట్లు తనదైన భావాలను శతాధిక పద్యాల సు‘మాల’గా చేసి శకపురుషుడైన నందమూరి తారక రామునికి సమర్పంచారు తన అభిమానాన్ని చాటుకున్నారు.
తన తలిదండ్రులకు అంకిత మిచ్చిన ఈ శతకంలో13 అద్యాయాలుగా రూపొందించిన 108 పద్యాలు ఉన్నాయి. “బసవ తారకరాముడు భవ్య గణుడు” అన్న పలుకులు మకుటంగా అద్భుతంగా కుదిరాయి. సరళమైన తేటతెలుగు పదాలతో తారక రామారావు మొత్తం జీవితచరిత్రను విహంగవిక్షణం చేయించారు- కవిగారు.
రామారావు జీవితం తెరిచిన పుస్తకం. పెరిశెట్లవారి పద్య శతకం చదువుతున్నప్పుడు నిత్య పారాయణ గ్రంథంలా అభిమానుల కొరకు తీర్చిదిద్దినట్లుగా అనిపిస్తుంది. ఏకబిగిన పుస్తకం మొత్తాన్ని చదివిస్తుంది. కథను నడిపిన తీరు, కఠినమైన విషయాలను సున్నితంగా చెప్పిన విధానం – సూక్యమైన విషయాలను సైతం, పరిశోధించి పరిచయం చేసిన తీరు ప్రశంసనీయం.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతులు ఆచార్య మసన చెన్నప్ప గారి ముందుమాటలో… “అభినయంలో తెలుగు నేలకే వెలుగయ్యాడని శివకుమారు పల్కిన పల్కులు యథార్థమైనవి. రామారావే నాయకుడు. తనకు తానే ప్రతి నాయకుడు. నవరసాలొలికించే నటకళాస్రష్ట. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసిన మహా నటుడు! ” అంటారు.
“శివకుమార్ సహజంగా వస్తుకవి. వాస్తవాన్ని విస్మరించని కవి. విషయాన్ని అద్దంలో బాగా చూపెడుతాడు. శబ్ద రచనలో ఔచిత్యాన్ని పాటిస్తాడు. ఒకరి జీవిత చరిత్రను సౌందర్యం చెడకుండా శతకంగా అల్లడమంటే సామాన్యం కాదు. శివకుమార్ రామారావులోకి పరకాయ ప్రవేశం చేశాడా అనిపిస్తుంది ఈ శతకంలోని ప్రతి పద్యాన్ని చదివినప్పుడు. వచనకవితా ధురీణుడైన శివకుమార్, పద్య రచనలోను అందెవేసిన చేయి” అంటారు.
అమెరికా నుండి అవధాని కోట రాజశేఖర్ విశ్రాంత సంస్కృత అధ్యాపకులు – వైద్యవృత్తిలో వుంటూ, గ్రామీణ ప్రజలకు గొప్ప సేవలందిస్తూ, పద్య, గద్య, గేయ రచయిత శివకుమార్ గురించి ఇలా అంటారు… “ఈ ‘నందమూరి శతకం’ వ్రాసేందుకోసం శ్రీ శివకుమార్ గారు తేటగీతి ఛందస్సును ఎంచుకొన్నారు. తేట తెలుగు మాటలలో నందమూరివారి గుణగణాలను వర్ణించారు. తారకరాముని జననము, బాల్యము, విద్య, ఉద్యోగము, వివాహము, చలనచిత్రరంగ ప్రవేశము, పురస్కారాలు, సమాజసేవ, రాజకీయరంగ ప్రవేశము, సతీవియోగము, వెన్నుపోటు, ద్వితీయవివాహము, రాజకీయ సంక్షోభము, నందమూరి వారు స్వర్గస్థులైన అనంతర సన్నివేశాలు – అనే శీర్షికలతో 108 పద్యాలను రచించి శివకుమార్ గారు భక్తి ప్రపత్తులతో తారకరామునికి అష్టోత్తర పూజను చేశారని చెప్పవచ్చు” అంటారు.
డా. రాధేయ అనంతపురం నుండి “ప్రజలే దేవుళ్ళని భావించి/అన్నార్తుల కన్నీళ్ళు తుడిచిన/ఒక మానవీయ మూర్తి జీవిత కథను/ తేటగీతి పద్యసుమాలతో అర్చించిన కవీ…!” అంటారు.
“శివకుమార్ పేరిశెట్ల NTR ఆశయాలు వ్యక్తిత్వానికి ప్రతిస్పందన ఈ శతకం అంటారు. తేటగీతి పద్యాలతో విశ్వవిఖ్యాత నటసార్వభౌముని ఆత్మను అవిష్కరించారు. పదబలంపై ఉన్నపట్టు ఈ పద్య రచనకు ఆయువు పట్టుగా కనిపిస్తుంది” అంటారు -డా. సుంకర గోపాల్.
“ఆవేదన, అభిమానము లేనిదే ఆక్షరం పుట్టదు. పేరిశెట్లవారి అభిమానంలోంచి పెల్లుబికి జల పాతంలా మన మనసులను తడుపుతుంది, శతక రూప జీవిత చరిత్ర రాయటం అరుదైన ప్రయోగం” అంటారు -డా. పెళ్ళూరు సునీల్.
“ఒక సాధారణ మనిషి ఎలా ఎదగాలో, ఎదిగిన మనిషి ఎలా ఒదగాలో, ఒదిగిన మనిషి జాతికోసం అవసరమైతే ఎలా రొమ్ము విరవాలో, తనకెంతో ఇచ్చిన సమాజానికి తిరిగి తనేమివ్వాలో, సమయపాలన ఎలా పాటించాలో ఆయన జీవితం మనకు చెబుతుంది. అదే ఆయన మనకిచ్చిన సందేశం. ఆయనలోని ఈ ప్రత్యేకతలే ఈ శతక రచనకు నన్ను ఉసిగొల్పాయి. కొన్ని శతాబ్దాలకు ఏ ఒక్కరో ఇలాంటి కారణజన్ములు పుడతారు.” వందేళ్ళ క్రితం పుట్టిన ఈ ‘మహా మనీషి’ తన శతకానికి ప్రేరణగా నిలిచినట్లు కవి తన ముందుమాటలో చెప్పుకున్నాడు.
మొత్తం పుస్తకం 36 పెజీలు. ఒక్కొక్క పద్యం చదువుతుంటే తెలుగు భాషలోని మాధుర్యం కొత్తగా పరిచయం అవుతుంది. చదువుతున్నంత సేపు పదాల అల్మిక జిగిబిగి, విశ్వవిఖ్యాతమైన NTR కథలోని మైలు రాళ్ళను తడిమి చూసుకున్నట్లుగా అనుభూతి చెందుతాము ప్రతి ఒక్కరము.
NTR జీవిత విశేషాల్లో కవి స్పృసించిన ప్రతి సన్నివేశం పాఠకునికి గతాన్ని గుర్తుచేస్తుంది… తెలుగు కొరకు వారు చేసిన కృషి ప్రతి తెలుగువాడి గుండె పొంగేలా చేస్తుంది. మనలను NTRకు మరింత దగ్గర చేస్తుంది.
“రామమందిర మేలేని గ్రామమల్లె/ రామరావు నెఱుంగని ప్రజలుగలరె? / స్వాతిముత్యమై వెలుగొందు నేతగనుక/ “భరతరత్న”మె యతనికి బిరుదమగుత/ బసవ తారకరాముడు భవ్యగుణుడు !!! ”
NTR జన్మన క్షత్రం – స్వాతి. వారి చరిత్రను స్వాతి ముత్వంలా చేసుకుని వెలుగొందిన నేత కనుక భారత రత్న అందుకొని తెలుగువారి ఖ్యాతిని మరింతగా ప్రపంచానికి చాటాలని… ఇది తన ఆకాంక్ష మాత్రమే కాదు, ప్రతి ఆంధ్రుని/ తెలుగువాని ఆకాంక్షగా ఈ శతాబ్ధికి తీరని కోరికై యున్నదంటూ రచయిత తన అభిప్రాయాన్ని ఎలుగెత్తి(కలమెత్తి) చాటారు. తనదైన భావాలను చతుష్పాదాలతో108 పద్యా(అశ్వా)లను కదం తొక్కించిన కవి శివకుమార్ పేరిశెట్ల ధన్యుడు. వారికి నా అభినందనలు.
సమీక్షకుడు: ఆత్మకూరు రామకృష్ణ
ప్రతులకు: శివకుమార్ పేరిశెట్ల (పుస్తక రచయిత)
చరవాణి: 98482 64047
నూతన రచనలకు, రచయితలకు మీరిస్తున్న ప్రోత్సాహము ప్రశంసనీయం. సకాలంలో సమీక్ష ముద్రించి రచయితను ప్రోత్సహించిన మీకు ధన్యవాదములు.🙏💐