నాన్న ఎందుకో వెనుకబడ్డాడు…

మన జీవితానికి మనమే హీరో.. అవును! మనకి ఈరోజు అన్నీ ఉన్నాయి.. చదువుంది, డబ్బుంది, పేరుంది, ఆస్తి వుంది.. వాటి నుంచి వచ్చే ఆనందముంది. అవన్నీ మనకి ఇచ్చి మనల్ని హీరోగా చేసి.. మన ఎదుగుదలను, ఆనందాన్ని చూస్తూ.. చిన్న చిరునవ్వు నవ్వుతూ ఒక మూల నిల్చుని ఉండిపోయారు మనల్ని హీరోలు గా చేసిన నిజమైన హీరో అయిన నాన్న!! అమ్మ నీడలో.. నాన్న పడిన కష్టం కనపడదు మనకి.. అయినా ఆయన కష్టం చూడాలని, ఆయన పడినన్ని కష్టాలు మనల్ని కుడా పడమనా నాన్న తలచెదీ.. మన ఆనందమేగ ఆయన ఆనందం… కానీ మనమెప్పుడు ఆయన్ని గుర్తించం, ఆయన్ని గౌరవించం… అవును!! నాన్న ఎందుకో వెనుకబడ్డాడు…

ఈమధ్య తనికెళ్ళ భరణి గారు చిన జీయర్ స్వామి వారి సమక్షంలో  మాట్లాడుతూ నాన్న గొప్పతనాన్ని నాన్న వెనుక బడిన విధానాన్ని తనకి వాట్సాప్ లో వచ్చిన, బాగా విస్తృతమవుతన్న ఒక కవిత తో చెప్పారు… చాలా భావోద్వేగానికి గురయ్యారు ఆయన ఆ కవిత చదువుతూ… మనకి కుడా కళ్లు చెమ్మగిల్నై ఆ కవిత వింటే…

____________________________________________________________________

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు

అమ్మ తొమ్మిది నెలలు మోస్తే!
నాన్న పాతికేళ్ళు !!
రెండు సమానమే అయిన నాన్న ఎందుకో వెనుకబడ్డాడు!!!

ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ !
తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న !!
ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు !!!

ఏది కావాలంటే అది వండిపెడుతూ అమ్మ !
ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న !!
ఇద్దరి ప్రేమ సమానమే అయిన అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు !!!

ఫోన్లోను అమ్మ పేరే !
దెబ్బతగిలినపుడు అమ్మా అని పిలవడమే !
అవసరం వచ్చినపుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్నేమైనా భాదపడ్డాడా…ఏమో !!!

ఇద్దరు సమానమే అయిన పిల్లల ప్రేమని పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు !!!

అమ్మకి, మాకు బీరువానిండా రంగురంగుల చీరలు, బట్టలు !
నాన్న బట్టలకు దండెం కూడా నిండదు !!
తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు !!!

అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు !
నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచె ఒకటి !!
కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలొ నాన్నెందుకో వెనుకబడ్డాడు !!!

పిల్లల ఫీజులు, ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఈ పండుగకు చీర కొనొద్దు అంది అమ్మ !
ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న !!
ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు !!!

వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికి వస్తుంది నాన్న అయితే ఎందుకు పనికి రాడు అని మేం తీర్మానం చేసుకున్నపుడు కూడా వెనుకబడిందీ నాన్నే…!!!

నాన్న ఇలా వెనుకబడి పోవడానికి కారణం…..!!!

ఆయన ఇలా అందరికి వెన్నెముక కావడమే….!!!

వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం…!!!

ఇదేనేమో బహుశా నాన్న వెనుకబడి పోవడానికి గల కారణం……!!!!!!

___________________________________________________________________

ఆ కవితని రాసింది శ్రీ పనసకర్ల ప్రకాశ్ నాయుడు గారు. ఇది వరకు ఆయన ఎన్నో కవితలని రాసారు. అందులో ఎప్పుడో తను రాసుకున్న ఈ కవిత వాట్సాప్ లో విస్తృతమై తనికెళ్ళ భరణి గారి ద్వారా చిన జీయర్ స్వామి వారి వరకు చేరింది. ఆయన ప్రశంస కూడా పొందింది.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link