గురుభ్యోనమః

‘నా పేరు నారాయన్రావ్ ‘ అని నాకు నేను వ్యక్తీకరించుకుంటే తప్ప, ఎవరికీ తెలియదు, తెలిసినా అయితే ఏంటని భ్రుకుటి ముడుస్తారు. నేనే కాదు చాలామంది సంగతి ఇంతే! కానీ, ఒక్క గీత గీసి, అలా పలకరించి, ఫక్కున నవ్వించి, కవ్వించి, వెక్కిరించి, గీతా రహస్యాన్ని రంగరించి, హృదయోల్లాసం గావించే ఆ వ్యక్తికి సంతకం అక్కరలేదు, ఇంట్రడక్షన్ అఖ్కర లేదు. ఆయనే శ్రీ జయదేవ్.
అవి 1972వ సంవత్సరము త్యాగరాయ కళాశాల చెన్నైలో బి.కాం. ఫస్టియర్ చదువుతున్నాను. శ్రీ జయదేవ్ గారు మా కళాశాలలో జువాలజీ ప్రొఫెసర్ మృత్యుపరాన్న భుక్కులపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన విద్యాసంపన్నుడు.
సాహిత్య పిచ్చితో ఓ కథను రాసి, బుద్ధాశెట్టి వీధిలో వున్న ఆయన యింటికి వెళ్ళాను. ఆయన యిల్లు గరల్స్ హైస్కూలు ఆనుకుని వుండేది. భలే భలే అమ్మాయిలతో కళకళలాడుతూ వుండేది. నేను మాత్రం ఆయన కోసమే వెళ్ళాను. నిజం! ఒట్టు!
ఆయనో పెద్ద కార్టూనిస్టుట. చాలా ఫేమస్! వెళ్ళి నంగి నంగిగా పరిచయం చేసుకున్నాను. నా చేతిలో వున్నది చూసి “ఏమిటది?” అన్నారు. ‘కథ’ నేను రాసింది నా అభిప్రాయం కోసం అన్నాను భయంగా.. కథ చదివి చాలా బావుంది. కార్టూన్ కథ రాసి పట్రా బొమ్మలు వేస్తాను” అన్నారు.

మర్నాడు ఒక కామెడీ కథను రాసి పట్టుకెళ్లి యిచ్చాను. ఆయన చదివి యిలా కాదు రాయడం, కార్టూన్ కథ అంటే పూర్తిగా సంభాషణల్లో వుండాలి అని దాన్ని మార్చి రాశారు. అదే ‘సిన్మాటిక్’ కార్టూన్ కథగా 4 పేజీలో ఆంధ్రభూమిలో వచ్చింది. ఆయన్ని కలసిన ముహుర్తబలం వల్ల ఆ తర్వాత లెక్కలేనన్ని కార్టూన్ కథలు వేశాము. అప్పుడు అమెరికా వారి రోదసీనౌక స్కైలాబ్ లో ఏదో, చెడి పడిపోతుందని అన్నారు. దాన్ని ఆధారం చేసుకుని ‘శకలభుడు’ అన్న కార్టూన్ కథ వేస్తే, చాలా రెస్పాన్స్ వచ్చింది.
ఆంధ్రభూమి ఎడిటర్ శ్రీ సి.కనకాంబరరాజుగారు కార్టూన్ సీరియల్ మొదలు పెట్టమని జయదేవ్ గారిని అడిగారు. నన్ను పిలిచి, కథ టైటిల్ ను చెప్పి, కానివ్వమన్నారు అదే ‘కర్పగవల్లి’ కార్టూన్ సీరియల్ అందులో జయదేవ్ గారి బొమ్మలు అద్భుతంగా వుంటాయి. చాలా వారాలు సీరియల్ గా వచ్చింది తర్వాత, “తంగారావూ వుపావు వాహు” డుండర్ క్లంపిన్, నేపాళం, భూపాళం’కార్టూన్ సీరియల్స్ వేశాము. విపరీతమైన ఫ్యాన్ మెయిల్ జయదేవ్ గారికి వచ్చేవి అన్ని సూపర్ హిట్ సీరియల్స్” , కుమారి రాగతి పండరి ఈ సీరియల్స్ కి బాగా యింప్రెస్ అయి, మనమూ కార్టూన్ సీరియల్స్ వేద్దామని అన్నాది. నా అదృష్టం కొద్దీ నాకు లభించిన మంచి స్నేహమూర్తి కుమారి రాగతి పండరి. ఓ యాభై కార్టూన్ కథలు వేసివుంటాము అరడజను సీరియల్స్.
అనుగ్రహమో, నవగ్రహమో, రచయిత్రి, కవయిత్రి, పాత్రలలో కార్టూన్ సీరియల్స్ వేశాము. రాగతి పందరి జయదేవ్ గారి శిష్యురాలు నిరంతరం జయదేవ్ గారికి ఉత్తరాలు రాస్తూ వుండేది. కార్టూన్స్ లో ఎన్నో మెలుకువలు ఆయన రాగతి పండరికి చెప్పేవారు.

జయదేవ్ గారి కార్టూన్ కథల్లో పాత్రలు చాలా వరకూ నిజజీవితంలోంచి ఎన్నుకున్నవే! అందులో అబ్బాయి, బాబాయి “ఫీచర్స్ ఒకటి, బాబాయి పాత్ర జయదేవ్ గారే. అబ్బాయి పాత్ర మా కళాశాలలో తెలుగు ప్రొఫెసర్ శ్రీ గోపాల్ గారు, మనిషి తెల్లగా మల్లెపూవులా ఉండేవారు. పొట్టి పొడుగు కాంబినేషన్లో కథలు వచ్చేవి. శ్రీ గోపాల్ గారు తెలుగు సాహిత్యంలో వుద్దండులు. బాపుగారి వంశవృక్షం, త్యాగయ్య చిత్రాలకు తెరవెనుక వీరి సహాయం చాలా వుంది. జయదేవ్ గారు గోపాలం గారు యిద్దరూ సెన్సార్ బోర్డు మెంబర్స్ ” బ్రహ్మం” అన్నది ……… క్యారెక్టర్. మా కాలేజ్ ముందుండే ప్రెస్ యజమాని. మందు ప్రియుడు ఒకసారి జయదేవ్ గారు, గోపాలంగారు, నేను ప్రెస్సుకి వెళ్ళితే, నేనొక పాట రాశాను వినమని, తూలుతూ పాడ్డం మొదలు పెట్టాడు, చిన్న చిన్న మాటలకేమి చినదానా!! ఆ బ్రహ్మస్త్రానికి హడలిపోయి, శరణుజొచ్చాము. ఆ చిత్రహింసను గుర్తుచేసుకుంటూ బాపు కార్టూన్ కథల్లో బ్రహ్మం పాత్రను ప్రవేశపెట్టాము. మందు ప్రియుడు కాబట్టి “జిన్ జిన్ మాటల జిదానా!!
ఆయన క్యారెక్టర్ మత్తులో కళ్ళలో లోకకళ్యాణం చేస్తున్నట్టు వుంటుంది. జయదేవ్ గారు బొమ్మల్ని చాలా వేగంగా వేస్తారు. ఆయన యింటి ముందు గదిలో, డ్రాయింగ్ టేబుల్, కుర్చీ, అవి ఆయనే స్వయంగా స్కెచ్ గీసి, కార్పెంటర్ తో చెప్పి చేయించుకున్నారు. అదే ఆయన “నిరుపహతి స్థలములు” ఒకప్రక్క బొమ్మలు గీస్తూ వుంటారు. వచ్చిన వాళ్ళతో నాన్ స్టాప్ గా మాట్లాడుతూ వుంటారు. ప్రతి రోజు సాయంత్రం ఆయన దగ్గరే వుండేవాడిని, నాకు అక్కడే ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ చంద్ర, గోపీగారు పరిచయంఅయ్యారు. “బావగారు,
బావగారు” అంటూ శ్రీశంకుగారు అక్కడ నాకు కనిపించేవారు.
జయదేవ్ గారు మాటల్లో సంస్కారం, సభ్యత వుట్టి పడుతూ వుండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివారి మనస్సును నొప్పొంచేవారుకారు. అనుకున్న సమయానికి ఎదుటి వ్యక్తి రాకపోయినా, చికాకు పడేవారు కాదు. సదరు వ్యక్తి క్షమాపణలు చెబితే, అబ్బే అదేం లేదండి. నేనూ యిప్పుడే వచ్చాను, వర్రీ కాకండి! అనేవారు అదేమిట్సార్! గంటనుండి వెయిట్ చేస్తున్నాం కదా అంటే, “ఎదుటివారిని ఎప్పుడూ అతని దోషాన్ని చూపించి నొప్పించకూడదు, ఇది నేను మా నాన్నగారి దగ్గర్నుంచి నేర్చుకున్నది అని అనేవారు.
కొత్తగా బొమ్మలు వేస్తున్నవాళ్ళు చాలామంది యింటికి వచ్చేవాళ్ళు! ఎప్పుడు వచ్చినా విసుక్కునే వారు కారు. వాళ్ళకి బోల్డన్ని కార్టూన్ టిప్స్ యిచ్చేవారు. అందరినీ ప్రోత్సాహించేవారు. ఆయన మంచి తనమే ఆయనకు చాలా మంది శిష్యుల్ని తయారుచేసింది.
మద్రాసులో సినిమా పత్రిక పెడుతున్నాం విలేఖరిగా వుండాలని కనకాంబర రాజుగారు నన్ను అడిగారు. సినిమా వాళ్ళతో ఇంటర్యూలు, ఆ గోల ఏంటో నాకు తెలియదు. జయదేవ్ గారు వున్నారన్నా ధైర్యంతో విలేఖరిగా చేరాను. రేపు నటి లక్ష్మిగారితో యింటర్యూ ఉంది ఏమడగాలి అని జయదేవ్ గారిని అడిగితే కొన్ని ప్రశ్నలు చెప్పారు. కోరుకున్న మొగుడు చిత్రం షూటింగ్ వి.జి.పి గార్డన్ లో జరుగుతుంటే, లక్ష్మిగారిని ప్రశ్నలు అడుగుతూ, “ఏమండీ! మీరు యింకా లక్స్ సబ్బునే వాడుతున్నారా? అని అడిగి, ఈ ప్రశ్న మా ప్రొఫెసర్ శ్రీ
జయదేవ్ అడగమన్నారు అన్నాను.. ఓ పరి నిముషాలు నవ్వుతూనే వుండిపోయింది లక్ష్మి. బాపుగారిని, ముళ్లపూడి గారిని, జయదేవ్ గారిలోనే చూశాను. ఆయనే నాకు పరిచయం చేశారు. వాళ్ళ చిత్రం షూటింగ్ కవరేజీకి వెళ్లినా, దూరం నుండే వారిని చూసేవాడిని నా దృష్టిలో వాళ్ళు యిద్దరూ ఋషులు, దూరం నుండి నమస్కరించడమే!

జయదేవ్ గారికి అపారమైన సినిమా పరిజ్ఞానం వుంది. బర్గ్ మెన్, కుర్సీవా, ఫెలినీ, కుపాలా, బాపు మొదలగు దర్శకుల ప్రతిభ గురించి చాలా సేపు చెబుతూవుండేవారు.
హెర్డ్ సృష్టించిన “టిన్ టిన్” కార్టూన్ కథలంటే ఆయనకు చాలా యిష్టం. జయదేవ్ గారి శ్రీమతి రాజ్యలక్ష్మిగారు చాలా సౌమ్యురాలు. వాళ్ళ యింట్లో ఎన్నిసార్లు భోజనం చేసానో లెక్కలేదు.
బాపుగారి ముందు జయదేవ్ గారు కూర్చుని వుండే ఫోటోని చూడండి. ఎంత అణకువగా, భక్తితో, గౌరవముగా కూర్చుని కనిపిస్తారో! బాపుగారంటే ఆయనకు అంత భక్తి!
జయదేవ్ గారికి బాపుగారు గురువు. నా చేత అక్షరాలు దిద్దించి, సాహితీరంగంలో పదిమందితో పరిచయం కల్పించిన శ్రీ జయదేవ్ గారు నాకు గురువు. అందుకే శ్రీ గురుభ్యోనమః
-ఎల్యూ. నారాయణరావ్

1 thought on “గురుభ్యోనమః

  1. మీ సీరియల్ కార్టూన్ కధలు ఎంథ బాగుండేవో నారాయణరావు గారు. ఆ రోజుల్లో మీ కార్టూన్ కధలు సీరియల్స్ సూపర్ హిట్

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link