పుట్టింది హనుమాజీపేట అనే ఒక మారుమూల పల్లెటూరిలో. ప్రాధమిక విద్య ఒక చిన్న వీధి బడిలో. సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో మాధ్యమిక విద్య. కరీంనగరంలో ఉన్నత పాఠశాల విద్య కూడా ఉర్దూ మాధ్యమంలోనే. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీలో చేరాక తెలుగు పాఠ్యాంశంగా తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తెలుగు సాహిత్యంలోనే డాక్టరేటు సాధించిన అసామాన్య విద్యాధికుడతడు. సాహిత్య సేద్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న సాహిత్య కృషీవలుడు. గ్రాడ్యుయేషన్ కు ముందువరకు ఉర్దూ మాధ్యమంలో కొనసాగిన ఎంతటి విద్యార్ధికైనా ఇంతటి గొప్ప పురస్కారం లభించడం అసాధ్యమే. అయినా అసాధ్యాన్ని సాధ్యంచేసిన అంబుజనాభుడు ఈ విశ్వంభరుడు… పద్యకావ్యాలు, గేయకావ్యాలు, వచన కవితలు, గద్యకృతులు, చలనచిత్ర గీతాలు, గజళ్ళు, విమర్శనా గ్రంధాలు ఒకటేమిటి, సాహిత్యానికి సంబంధించిన వేటినీ ఆపోశన పట్టకుండా వదలని సాహితీ సామ్రాట్టు సినారె అని ముక్తసరిగా ముద్దుగా పిలిపించుకున్న ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి. ఆధునిక ఆంధ్ర కవిత్వ సంప్రదాయ ప్రయోగాలపై సినారె విరచించిన పరిశోధనా గ్రంధం నేటికీ ప్రామాణికమే. ‘’మరణం నను వరించివస్తే పాలుపట్టి జోలపాడి పడుకోబెడతాను’’ అంటూ ప్రవచించిన ఈ సాహితీమూర్తి సింహద్వారం నుండే సినీరంగ ప్రవేశం చేసి ఎనభై ఆరేళ్ళ వయసులో 2017 జూన్ 12న సాహిత్యాభిమానులను దుఃఖసాగరంలో ముంచి సుదూరలోకాలకు పయనమయ్యారు. సినారె సినీ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేద్దాం. ఒకవైపు ఆత్రేయ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, కొసరాజు, ఆరుద్ర వంటి మహామహులు తెలుగు సినీ సాహిత్యాన్ని శాసిస్తూవుంటే, పాటకు కొత్త నగిషీలు చెక్కేందుకు విద్యాధికుడైన ఆచార్య నారాయణరెడ్డి రంగప్రవేశం చేసి తనదైన ముద్రను కళాత్మకంగా తీర్చిదిద్దడం ఒక చరిత్ర.
తొలిరోజులు…
సింగిరెడ్డి నారాయణరెడ్డి జన్మించింది 1931 జూలై 29 న కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామం. ఆయన తల్లిదండ్రులు బుచ్చమ్మ, మల్లారెడ్డి. తండ్రి ఆ వూరులో మోతుబరి రైతు. నిజాం పరిపాలంలో ఆరోజుల్లో తెలుగు మాధ్యమం ఉండేదికాదు. అందుచేత డిగ్రీ స్థాయివరకు ఉర్దూ మాధ్యమంలోనే చదవాల్సివచ్చింది. అయితే తెలుగు భాష మీద వున్న అభిమానంతో హైస్కూలులో చదువుతున్నప్పుడు సిరిసిల్లాలో శేషాద్రి పండితునివద్ద తెలుగు భాషను అభ్యసించారు. తర్వాత 1949లో హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో B.A పూర్తిచేసారు. 1954లో తెలుగులో M.A పూర్తిచేసి 1955లో కాలేజీలో తెలుగు భాషాచార్యునిగా ఉద్యోగపర్వాన్ని ప్రారంభించారు. 1959-61 ప్రాంతంలో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలకు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రిన్సిపల్ గా పనిచేసినప్పుడు తరచూ వారిని కలిసి తెలుగు భాష మీద చర్చలు జరుపుతూ భాషమీద పట్టు సాధించారు. ఆ ప్రేరణతో 1962లో ‘ఆధునిక తెలుగు సాహిత్య సంప్రదాయాలు’ అనే విషయాన్ని ప్రధానాంశంగా తీసుకొని పరిశోధన చేసి P.Hd తీసుకున్నారు.
సాహితీవేత్తగా…
కళాశాల విద్యార్థి దశనుంచే ‘రోచిష్’, ‘సింహేంద్ర’ అనే కలం పేర్లతో నారాయణరెడ్డి కవితలు రాసేవారు. ‘శోభ’ అనే పత్రికకు సంపాదకత్వం కూడా నిర్వహించారు. అప్పుడే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్యనాటికలు, బలే శిష్యులు వంటి సాంఘిక నాటకాలు రచించారు. సినారె రాసిన తొలి కవిత ‘నవ్వని పువ్వు’ 1953లో ప్రచురితమైంది. ఆ తర్వాత ‘వెన్నెలవాడ’, ‘దివ్వెల మువ్వలు’, ‘’మధ్యతరగత మందహాసం’, ‘మంటలు-మానవుడు’, ‘రుతుచక్రం’, ‘అజంతాసుందరి’, ‘విశ్వగీతి’, ‘జలపాతం’ రచనలు వెలువరించారు. 1980లో ‘విశ్వంభర’ కావ్య సాహిత్యాన్ని ప్రచురించారు. అది భూమ్యాకాశాల పుట్టుకనుంచి మొదలై కాలస్వరూపాన్ని, మనిషి వికాసాన్ని, చైతన్యాన్ని అనేక విధాలుగా ఆవిష్కరించింది. తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో పనిలేని మనిషి కథ ‘విశ్వంభర’ ఇతివృత్తం. ప్రకృతి నేపథ్యంలో ఈ కావ్యరచన సాగుతుంది. ‘’నేను పుట్టకముందే నెత్తిమీద నీలితెర (అంటే ఆకాశం), కాళ్ళకింద ధూళి పొర (అంటే నేలతల్లి)… ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్ళల్లో మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి’’ అంటూ ప్రారంభమయ్యే ‘విశ్వంభర’ కవిత ‘’మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి, ఇదే విశ్వంభర తత్వం … ఇదే అనంత జీవిత సత్యం’’ అంటూ ముగింపు పలికారు సినారె. ‘విశ్వంభర’ కవితాప్రబంధం వివిధ భాషల్లోకి తర్జుమా అయింది. ఈ గ్రంధాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు M.A స్థాయిలో పాఠ్యగ్రంధంగా నిర్ణయించాయి. ‘విశ్వంభర’ ను ఆచార్య బీమసేన్ నిర్మల్ హిందీలోకి, డాక్టర్ అమరేంద్ర 1986లో ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించారు. దీనిమీద కొందరు ఔత్సాహిత సాహితీ ప్రియులు పరిశోధన చేసి P.Hd పట్టాలు అందుకున్నారు. ‘విశ్వంభర’ రచనకు 1988లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈ గ్రంధానికి కలకత్తా భిల్వారా అవార్డు, కుమారన్ ఆసాన్ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డులు లభించాయి. యుగోస్లేవియాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారత ప్రతినిధిగా సినారె పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలతోబాటు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు సినారె ను వరించాయి. ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘ అధ్యక్షులుగానే కాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తొలి ఉపకులపతిగా సినారె వ్యవహరించారు. నారాయణరెడ్డి స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో ఎన్నో కవితలు రాశారు. సినారె రచించిన రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ‘నాగార్జున సాగరం’ కవితా సంపుటికి మంచి స్పందన వచ్చింది. అందులో శాంతిశ్రీ అనే మహిళ బౌద్ధమత పరిశోధనకు వచ్చి ఒక శిల్పాచార్యుని ప్రేమలో పడడం ఈ కవితా సంపుటి నేపథ్యం.
సింహద్వారం గుండా సినీ రంగానికి…
సినారె కు పాట, మాట రెండు కళ్ళు. తన మాట పాటై మోగాలని, ఆ పాట చరిత్రలో నిలిచిపోవాలని కలలుగన్న సాహిత్య సంగీతాభిమాని. ‘మాటకు దండం పెడతా… పాటకు దండం పెడతా… మాటను పాటను నమ్మిన మనిషికి దండం పెడతా’ అంటూ పాటలోనే తన ప్రాణాలున్నాయని నమ్మిన వ్యక్తి సినారె. పల్లెటూరిలో మొక్కజొన్న చేలమీద కదలాడే పైరగాలులు సినారె చేత శ్రుతులు పలికించాయి. హరికథలు రాగాలు నేర్పాయి. శిష్ట వ్యావహారిక భాషను వశపరచాయి. చిన్నతనంలో చూసిన లవకుశ, వేంకటేశ్వర మహాత్మ్యం వంటి సినిమాలు చూసి, వాటిలో పాటలూ, పద్యాలు ఆశువుగా వినిపించే గుణాన్ని అలవరచుకున్నారు. సినారె రచించిన నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు దీర్ఘ కావ్యాలను ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్. రెడ్డికి వినిపించినప్పుడు సినారె ను సినిమా రంగానికి పరిచయం చేయాలని బి.ఎన్ సంకల్పించారు. కర్పూర వసంతరాయలు కావ్యాన్ని సినిమాగా మలచాలని విజయా గార్డెన్ లో పెద్దసభ కూడా ఏర్పాటు చేశారు. రాజమకుటం సినిమా నిర్మాణం జరుగుతున్న రోజుల్లో సినారె కు ఎన్.టి. రామారావుతో పరిచయమైంది. అయితే సినారె కు కవిగా ఎదగాలని, తెలుగు అధ్యాపకుడిగా రాణించాలనే సంకల్పం తప్ప చిత్రరంగానికి వెళ్లాలనే ధ్యాస లేదు. ‘పెళ్లి సందడి’, ‘శభాష్ రాముడు’ సినిమాలలో పాటలు రాసేందుకు నిర్మాతలు ఆహ్వానించినా సినారె పెద్దగా ఆసక్తి చూపలేదు. 1959లో ఎల్.వి.ప్రసాద్ ‘కొడుకులు-కోడళ్ళు’ సినిమాకు అన్ని పాటలూ రాయమని సినారె కు ఆహ్వానం పలికారు. ప్రబల కారణాలవలన ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. 1960 ప్రాంతంలో సారథి స్టూడియోలో ‘కలసివుంటే కలదు సుఖం’ సినిమా నిర్మాణం జరుగుతుండగా, ఎన్.టి.రామారావుకు పరిచయం చేయాలని ఒక కళాకారుణ్ణి సినారె తీసుకెళ్ళారు. అప్పుడే రామప్ప సంగీత రూపకంలోని ‘ఈ నల్లని రాలలో’ పాటను పాడి ఎన్టీఆర్ కు సినారె వినిపించారు. అది వినిన రామారావు “సినిమాల్లో పాటలు రాస్తారా” అని అడిగితే, “తొలిచిత్రంలో అన్ని పాటలూ రాసే అవకాశం వస్తే తప్పకుండా రాస్తాను. ప్రవేశిస్తే సింహద్వారం గుండానే!” అంటూ చమత్కరించడంతో ఎన్టీఆర్ “ఆ అవకాశం మాకే వస్తుంది త్వరలో” అంటూ చిరునవ్వులు పంచుకున్నారు. వెంటనే ‘గులేబకావళి కథ’ సినిమాలో పాటలు రాసేందుకు సినారె కు సింగిల్ కార్డ్ ఎంట్రీ లభించింది. అంతే కాదు సినారె ను స్వాగతించడానికి ఎన్టీఆర్ స్వయంగా మద్రాసు సెంట్రల్ స్టేషన్ కు వెళ్ళారు. ఆ పరంపరలో ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’, ‘కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై’ పాటలను తొలిరోజే రాయగా ‘నన్ను దోచుకుందువటే’ పాటను సంగీత దర్శకద్వయం వేలూరి కృష్ణమూర్తి, జోసెఫ్ మొదట రికార్డు చేశారు. ముఖ్యంగా వన్నెల దొరసాని, కర్పూర కళిక వంటి పద ప్రయోగాలు ఎన్టీఆర్ కు ఎంతగానో నచ్చాయి. అలా గులేబకావళి సినిమాలో ఆణిముత్యాలవంటి అన్నిపాటలన్నీ సినారె రాశారు. సినారె సినీరంగ ప్రవేశాన్ని తెలియజేస్తూ ముళ్ళపూడి వెంకటరమణ ఆంధ్రపత్రికలో ‘సినీ కినారే సినారె’ అనే శీర్షిక ప్రచురించడంతో సినీనిర్మాతల దృష్టి సినారె మీద పడింది. గులేబకావళి పాటలగురించి తెలుసుకున్న సారథి స్టూడియోస్ నిర్మాత రామకృష్ణ ప్రసాద్ ‘ఆత్మబంధువు’ సినిమాలో ’అనగనగా ఒకరాజు అనగనగా ఒకరాణి’, ‘చదువురానివాడవని దిగులు చెందకు’, ‘తీయని ఊహలు ఊయలలూగే ప్రాయం మనకుంది’ అనే మూడు పాటల్ని సినారె చేత రాయించారు.
తెలుగు సినిమాలలో పాటల వెల్లువ
నారాయణరెడ్డి రాసిన సినిమా పాటలు జనరంజకమవడానికి ఆయనకు స్వతహాగా లయజ్ఞానం వుండడం సహకరించింది. భాషా ప్రయోగాలు చేసేందుకు సినారె కు సినిమా పాటలు ఉపకరించాయి. పాటలే కాదు ‘ఏకవీర’, ‘అక్బర్ సలీం అనార్కలి’ సినిమాలకు సంభాషణలు కూడా నారాయణరెడ్డి సమకూర్చారు. బి.ఎన్. రెడ్డి స్వాగతించిన అవకాశాన్ని సినారె పూజాఫలము సినిమాలో ఉపయోగించుకున్నారు. ఆ చిత్రంలో రాసిన ‘పగలే వెన్నెలా జగమే ఊయల’ పాట జనాదరణ పొందింది. అంతేకాదు ఈ పాటమీద వి.ఎ.కె. రంగారావుతో పత్రికా ముఖంగా చర్చోపచర్చలు కూడా జరిగాయి. పూజాఫలము సినిమాలోనే సినారె మరికొన్ని అందమైన పాటలు రాశారు. ‘నిన్నలేని అందమేదో నిదురలేచేనెందుకో’ పాటను ఒక అద్భుత ప్రయోగంగా చెప్పుకునేవారు. అందులోనిదే ‘ఎందు దాగివున్నావో బృందావిహారి’ పాట కూడా. శ్రీక్రిష్ణ పాండవీయం సినిమా కోసం ఎన్టీఆర్ రెండు వింతైన పాటల్ని రూపొందించమని సినారె ను కోరారు. ఒకటి రాక్షసాంగన హిడింబ భీముని వరిస్తూ పాడే పాట. అందులో వాడుకలో లేని పదాలతో జానపద రీతిలో పాట రాయమని ఎన్టీఆర్ చెప్పగా ‘చాంగురే బంగారు రాజా’ పాటకు రూపం కలిపించారు సినారె. చాంగురే, మజ్జారే, అయ్యారే, అమ్మకచెల్ల, మగరేడు, మొలకమీసం, వగకాడు, సింగపునడుము, పచ్చలపిడిబాకు, కైదండ, మచ్చెకంటిచూపు అంటూ వాడుకలో లేని అచ్చ తెలుగు మాటలతో ఆ పాటను సినారె ఆడుకున్నారు. ఇక రెండవ పాట సుయోధనుణ్ణి ఆహ్వానిస్తూ ఆలపించే గీతం. సంస్కృత ప్రౌఢసమాసాలతో సాగే ఈ స్వాగతగీతం ప్రసంశలందుకుంది. ‘ధరణిపాల శిరోమకుట మణితరుణ కిరణ పరిరంజిత చరణ’ ‘కదనరంగ బాహుదండ ధృతగదాప్రకట పటుశౌర్యాభరణా’ వంటి సమాసాలు బాగా పేలాయి. అలాగే అమరశిల్పి జక్కన్న సినిమాలో ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ అనే పాట నిజానికి రామప్ప కావ్యంలోనిది. ఆకాశవాణిలో తరచూ వినిపించే ఈపాట సాహిత్యాన్ని బి.ఎస్.రంగా అర్ధవంతంగా వాడుకున్నారు. ప్రశ్న సమాధానాలతో కూడుకున్న లక్షాదికారిలో ‘మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది’ పాట కూడా అంతకుముందు సినారె రాసుకున్నదే. గులేబకావళి కథలో ‘కలల అలలపై తేలెను’ పాట, అనురాగం సినిమాలో ‘పదేపదే కన్నులవే బెదరునెందుకు ఎదోఎదో చక్కిలిగింత కలిగినందుకు’ పాట కూడా ప్రశ్న, సమాధానాల పాటే. తొలిసారి అక్కినేని నటించిన కులగోత్రాలు సినిమాకోసం రాసిన ’చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేర రావేలా’ పాటలో ‘నీ అందమే శ్రీగంధమై’ అనే పద ప్రయోగం, ‘చిలిపి కనుల తీయని చెలికాడా’ పాటలో ‘నీలికురుల జవరాలు’, ‘నీడలో వెలుగుల మేడ’ ‘అలలే కలలై కలలే అలలై’ వంటి గండు ప్రయోగాలు ఎన్నిచేశారో చెప్పలేం. అగ్గిపిడుగు సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ పాత్రల్లో ఒకరికి అవ్యక్తానురాగ అనుభూతి కలుగుతూ వుండే సన్నివేశంలో వచ్చే ‘ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది’ పాటలో ‘కురులలో ముంగురులలో అంటూ భాషాప్రయోగం చేసిన దిట్ట సినారె. ఉర్దూ గజళ్ళ పోకడులు సినారె పాటల్లో ప్రతిబింబిస్తూ వుంటాయి. దొరికే దొంగలు సినిమాలో ‘ఎవరన్నారివి కన్నులని అరెరే మధువొలికే గిన్నెలవి’ పాట గజల్ ప్రయోగమే. సంస్కృత పదప్రయోగాలు సాంఘిక చిత్రాల్లో కూడా సినారె చేసి చూపించారు. చెల్లెలి కాపురం సినిమాలో ‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన’ అనే పాటలో ‘వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించి పోగా’ వంటి సమాసాలను అలవోకగా వాడి ఆ పాటకు సొబగులద్దారు.
సినారె రసరమ్య గీతాలు
రాముడు భీముడు సినిమాలో పెండ్యాల పాశ్చ్యాత్య శైలిలో స్వరపరచిన ‘అదే, అదే నాకు అంతు తెలియకున్నది, ఎదో లాగు మనసు లాగుతున్నది’ అనే సినారె గీతంలో హిందీ పాటల ప్రభావం కనిపిస్తుంది. సినారె కు హిందీ పాటల్లో వుండే విరుపుల సరళి అవగతమే. అందుకే ఈ పాటను ‘అదే అదే’ అనే పదాలతో మొదలుపెట్టారు. నారాయణరెడ్డి పాటల్లో హితోక్తులు, సూక్తులు కూడాకనిపిస్తాయి. ‘నిండు సంసారం’ సినిమాలో ‘ఎవరికీ తలవంచకు గుండెబలమే నీ ఆయుధం’; ఆత్మబంధువు లో ‘ఏమిచదివి పక్షులు పైకెగురగలిగెను, ఏ చదువువలన చేపపిల్లలీదగలిగెను.. చదువు రానివాడవని దిగులు చెందకు’ ; గోరంత దీపం లో ‘గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంతా వెలుగు’ ప్రయోగాలు ఈ విషయాన్ని రుజువుచేస్తాయి. సినారె రాసిన మరికొన్ని పాటల్ని గుర్తు చేసుకుందాం…
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే పదేపదే సవ్వడి చేయుచున్నదే (మంగమ్మ శపథంలో నురగ వయసులోని చిన్నది ఉరకలెత్తుతూ పాడే పాట)
సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా మొగ్గలాంటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా (మనుషులు మమతలు సినిమాలో అక్కినేనిని ఉడికిస్తూ జయలలిత భరతం పట్టిన పాట. ఇందులో అక్కినేని సమాదానమిస్తూ ‘నీడలో లేదులే నీటిలో లేదులే అది నీ వయసులోన ఆరిపోని వేడిలే’ అంటూ దాటవేసే విధానం పాటకే హైలైట్ )
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఇంతుల సంగతి పూబంతుల సంగతి (దొరికితే దొంగలు సినిమాలో ఎన్టీఆర్ జమునను అందంగా ఆట పట్టించే పాట. ఈపాటలో జడలో మల్లెపూల జాతర చేస్తుంటారు అనేది సినారె చేసిన గొప్ప ప్రయోగం)
పలుకవే నా రామచిలుకా పలుకవే నాలోన పన్నీరు తొణకగా (అగ్గిబరాటాలో విరహంలో కలలు కంటున్న కథానాయిక చిలుకను సంబోధిస్తూ ఆలపించే సినారె మార్కు గీతం. ఈ పాట వింటుంటే మల్లీశ్వరి లో భానుమతి ఆలపించిన కృష్ణశాస్త్రి గీతం ‘ఎందుకే నీకింత తొందర’ గుర్తురాక మానదు)
పలకరించితేనే వులికివులికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏంచేస్తావో మనసు పెనవేస్తే ఏమౌతావో(ఇందులో మొలకనడుము హొయలు, జిలుగు పైట నీడ, పువ్వునై కురులలో పొంచియుండటం, పూలతో ప్రియుణ్ణి ముడుచుకోవడం, పెదవిపైన అదిమి కదలనీయకుండడం వంటి శృంగార ప్రయోగాలు సినారె కు వెన్నతోబెట్టిన విద్య)
నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకోయీ స్వామీ బృందావనాలు (శ్రీకృష్ణావతారం సినిమాలో కృష్ణుడు ఇటు రుక్మిణితో, అటు సత్యభామతో పాడే త్రిగళ గీతం. చరణ కమలాల నీడ చాలని రుక్మిణి అంటే నయన కమలాల్లో తానుంటే చాలు అని కృష్ణుడు అంటాడు. అదే సత్యభామ వద్ద ‘నీ హృదయ గగనాన నేనున్నచాలు ఎందుకే ఓ దేవి బృందావనాలు’ అంటూ సత్యభామ ఆధిక్యతకు చోటిస్తాడు)
మల్లియలార మాలికలారా మౌనముగా వున్నారా నా కథయే విన్నారా ( నిర్దోషి చిత్రంలో హీరో శోభనం గదిలో మానసిక సంఘర్షణను ఎదుర్కొనే సన్నివేశంలో రాసోద్వేగంలో వచ్చే పాటను సినారె ట్యూనుకు రాసి మెప్పించిన విధానం…. అహో…వర్ణించలేం)
సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు సురవైభవాన భాసుర కీర్తిలోన, సరిలేరు నీకెవ్వరు రతిరాజసుందరా, సరిలేరు నీకెవ్వరు సిరిలోనగాని మగసిరిలోనగాని సరిలేరు నీకెవ్వరు (కంచుకోట సినిమాలో రాజు ప్రజారక్షకుడు. అయితే అతని తమ్ముడు సురాపాన ప్రియుడు. వీరిద్దరి సమక్షంలో ఇద్దరు నర్తకిలు విడివిడిగా నృత్యం చేసే పాట ఇది. ఒక చరణం సంస్కృత పదగుంభనంగా సాగితే మరొకటి జానుతెలుగు మాటల్లో జాలువారుతుంది. ఇదే సినారె ప్రతిభకు తార్కాణం)
నీ జిలుగుపైట నీడలోన నిలువనీ నన్ను నిలువనీ..నీ అడుగులోన అడుగువేసి నడవనీ నన్ను నడవనీ (పూలరంగడు సినిమాలో ఈ పాట పాశ్చాత్య పరిధినుంచి సంప్రదాయ పరిధిలోకి జారిపోతుంది. అందుకు అనుగుణంగా సినారె రాసిన పాట ఇది)
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి (మంచిమిత్రులు చిత్రంలో విభిన్న వ్యక్తిత్వాలు గల ఇద్దరు మిత్రులు కలుసుకున్నప్పుద్ఫు వచ్చే పాట ఇది. పల్లవిలో ఎప్పుడు తెలవారుతుందా అనే ఉత్కంఠ గోచరిస్తే, చరణాల్లో వారి ఆలోచనా సరళిని వ్యక్తపరచేలా సినారె ఈ పాటకు రూపమిచ్చారు)
భలే మంచిరోజు పసందైనరోజు వసంతాలు పూచే నేటిరోజు (జరిగిన కథ కోసం రాసిన ఈ పాట ఉత్సవ వేదికలకు, పెండ్లి వేదికలకు ప్రారంభ గీతంగా ప్రాచుర్యం సంతరించుకుంది)
చక్కని తిలకమ్ము ముక్కున జారింది ఏమమ్మా అది ఏమమ్మా (వరకట్నం సినిమాలో వదిన మరదళ్ల సంవాద పాట గొప్పగా వుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానంగా వల్లమాలిన చెమట గల్లంతు చేసింది లేవమ్మా అని వదిన చెబుతుంది. జామురాతికాడ జడపూలు వాడేయి ఎందుకంటే పక్క ఒత్తిడికి అవి సొక్కిపోయాయి అని వదిన సమాధానం. ఉన్నపాటున రైకముడి వీడిపోయింది వైనమేమిటంటే ఎదలోని పొంగుతో సడలిపోయిందేమో అంటూ వదిన నీకు తెలియని గుట్టు ఏముంది అని మరదల్ని సర్దబెడుతుంది. వస్తువైవిధ్యమున్న పాట ఇది)
మానవజాతి మనుగడకే ప్రాణంపోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ (మాతృదేవతలో సినారె మగువ త్యాగ నిరతిని ప్రశంసిస్తూ రాసిన పాట ఇది. సీతగా, ధరణి జాతగా సహనశీలం చాటిందని, రాధగా ప్రణయ గాధలు మీటీందని, మొల్లగా కవితలల్లి తేనెజల్లు కురిపించిందని, ఝాన్సిలక్ష్మిగా సమరరంగాన దూకినదని, అటువంటి కలకంఠి కంట కన్నీరొలికితే సిరులు తొలిగిపోతాయని గొప్పగా ఈ పాటను మలిచారు)
తోటలో నారాజు తొంగిచూచెను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు (ఏకవీర సినిమాకు మాటలు రాయడమే కాకుండా అద్భుతమైన పాటలు కూడా రాశారు సినారె. ఇందులో సినారె రాసిన పాటలు కృష్ణశాస్త్రి రాశారని, కృష్ణశాస్త్రి రాసిన పాటలు సినారె రాసినవిలా వున్నాయని ఆరోజుల్లో అనుకునేవారు)
ఆడవే జలకమ్ములాడవే కలహంసలాగ జలకన్యలాగ ఆడవే (విచిత్రకుటుంబంలో రష్యాలో పుట్టిపెరిగిన వనితను శోభన్ బాబు పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు భారతీయ సంస్కృతిని తెలియజెప్పే పాట ఇది).
–ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)