నాటకం, నాటకీయత… వినడానికి ఒకే మూలం నుంచి పుట్టిన పదాల్లా అనిపించినా, రంగస్థల వ్యాకరణంలో ఈ రెండింటి మధ్య ఉన్న అర్థ తాత్పర్య భేదాలు చాలా సూక్ష్మమైనవి, గంభీరమైనవి. నాటకం అనేది ఒక ప్రక్రియ (Form) అయితే, నాటకీయత (Dramatic quality/Tension) అనేది ఆ ప్రక్రియకు జీవం పోసే ఆత్మ (Soul). రచనలో నాటకీయత లోపిస్తే, ప్రదర్శనలో ఎంతటి గొప్ప నటుడైనా నాటకీయతను రక్తి కట్టించలేడు.
దేహానికి, ప్రాణానికి ఉన్నంత అనుబంధం:
ఒక నాటక ప్రదర్శనను మనం స్థూలంగా పరిశీలిస్తే… నటుల హావభావ ప్రకటనలు, కరచరణ విన్యాసాలు (ఆంగికాభినయం), వాచికాభినయం (పద్య పఠనంతో సహా), ఆహార్యం ఇవన్నీ నాటకానికి ఒక రూపాన్ని ఇస్తాయి. వీటిని నాటకానికి ‘బాహ్య శరీరం’గా భావించవచ్చు.
కానీ, ఆ శరీరంలో చలనం తీసుకువచ్చే ‘ప్రాణం’ రచనలో ఉంటుంది. రచయిత కలం నుంచి జాలువారే చమత్కారం, సునిశితమైన వ్యంగ్యం, సమాజాన్ని ప్రశ్నించే అధిక్షేపం, పాత్రల అంతరంగాలను, మనస్తత్వాలను (Psychology) ఆవిష్కరించే సంభాషణల పొందిక – ఇవన్నీ నాటకీయతను నిర్మిస్తాయి. అవసరమైన చోట ప్రేక్షకులకు కథా గమనాన్ని సూచించే ప్రకటనలు (Statements), ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే అనూహ్య సంఘటనలు (Twists) రచనలో నిక్షిప్తమై ఉన్నప్పుడే ఆ నాటకానికి ఒక నిండుదనం వస్తుంది. నాటకీయత పుష్కలంగా ఉన్న రచన మాత్రమే కాలక్రమాన్ని తట్టుకుని నిలబడుతుంది.
నాటక శిల్పంలో ‘గండం’ (Foreshadowing/Dramatic Irony)
రచనా శిల్పంలో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన ప్రక్రియ ‘గండం’. ఇది కేవలం భౌతికమైన ప్రమాదం కాదు; కథలో రాబోయే పెనుమార్పుకు లేదా విపత్తుకు రచయిత ముందుగానే వదిలే ఒక సూచన.
సాంఘిక నాటకాల్లో కూడా ఈ గండ ప్రక్రియను వాడుకున్న అద్భుతమైన రచనలు అనేకం ఉన్నాయి. ఇది కథలో పైకి కనిపించకుండా, అంతర్లీనంగా ప్రవహిస్తూ ప్రేక్షకుడిలో ఒక తెలియని ఉత్కంఠను రేపుతుంది. కల్లూరి సుబ్బారావు గారి ‘వరవిక్రయం’ లాంటి సాంఘిక నాటకాల్లో ఈ నాటకీయతను స్పష్టంగా చూడవచ్చు. వరకట్న దురాచారం వల్ల రాబోయే అనర్థాలను, పాత్రల నడుమ జరిగే మానసిక సంఘర్షణను రచయిత అత్యంత నాటకీయంగా మలిచారు. అయితే, దురదృష్టవశాత్తూ నేటి అత్యాధునిక రచనల్లో ఈ ‘గండం’ లేదా ముందస్తు సూచన అనేది ఒకటి ఉందన్న సంగతి కూడా గుర్తించడానికి వీలులేకుండా పోయింది. తక్షణ వినోదం (Instant gratification) మీద ఉన్న ధ్యాస, నాటక నిర్మాణ శిల్పం మీద కొరవడింది.
సంప్రదాయ నాటకాల్లో ఈ నాటకీయ వక్రతకు, వ్యంగ్యానికి, గండానికి పెద్ద పీట వేశారు. ఇవి లేకపోతే నాటకానికి పరిపూర్ణత లేదని నాటి కవులు భావించారు.
సత్య హరిశ్చంద్రలో ‘గండం’ అద్భుతం
బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రచించిన ‘సత్య హరిశ్చంద్ర’ నాటకాన్ని గమనిస్తే ఈ నాటకీయత ఎంత ఉత్కృష్టంగా ఉంటుందో అర్థమవుతుంది. వేట దృశ్యంలో పగటిపూట నిద్ర పనికిరాదు అనే రాజధర్మాన్ని సూచించడమే కాకుండా.. ఆ సమయంలో హరిశ్చంద్రుడికి వచ్చిన కల రాబోయే కథకు ఒక బ్లూ ప్రింట్ లాంటిది.
“నిద్రయన్న స్ఫురణకు వచ్చినది…” అంటూ, భవిష్యత్తులో తను సింహాసనాన్ని వదిలిపెట్టి, సర్వం కోల్పోయి అడవుల పాలయ్యే వృత్తాంతాన్ని ఆ కలలోనే రెండు లైన్లలో చెప్పేస్తాడు. నాటకం అంతా ఆ కల చుట్టే తిరుగుతుంది. నాటకం సారాంశం, రాబోయే గండం ముందే చెప్పేసి, ప్రేక్షకుడిని ఆ మానసిక ప్రయాణంలో తనతో పాటు తీసుకెళ్లడం నాటకీయతకు పరాకాష్ట.
పాదుకా పట్టాభిషేకంలో చమత్కారం
పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ‘పాదుకా పట్టాభిషేకం’ నాటకంలో అయితే అడుగడుగునా గండాలే. ముఖ్యమైన పాత్రల ద్వారా రాబోయే గండాలను కవిగారు వ్యంగ్యంగా, అత్యంత నాటకీయంగా సూచిస్తారు.
పట్టాభిషేకానికి ముందు దశరథుడికి, వశిష్ఠుడికి మధ్య జరిగే సంభాషణ చూడండి:
దశరథుడు: ఈ పట్టాభిషేకం నిర్విఘ్నముగా జరుగునా?
వశిష్ఠుడు: పురుష ప్రయత్నము చేత (జరుగుతుంది).
దశరథుడు: ఇందు పురుష ప్రయత్నము కాక స్త్రీ ప్రయత్నం ఏమున్నది?
ఎంతటి నాటకీయత! ఆ తర్వాత కైక అనే ‘స్త్రీ ప్రయత్నం’ చేతనే ఆ పట్టాభిషేకం విఘ్నమైంది అని ప్రేక్షకులకు తెలుసు కాబట్టే, ఆ డైలాగ్ వినగానే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దశరథుడి అమాయకత్వానికి జాలి కలుగుతుంది. ఇదే అసలైన నాటకీయత!
పోటీలలో ఉత్తమ రచనకు బహుమతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు న్యాయనిర్ణేతలు కేవలం ఇతివృత్తాన్ని మాత్రమే కాకుండా, రచనలోని ఈ ‘నాటకీయత’ను, శిల్పాన్ని గుర్తించాలి. ఉత్తమ ప్రదర్శనగా బహుమతి అందుకున్న నాటకం, కచ్చితంగా ఉత్తమ రచనగా కూడా అవార్డు పొందినప్పుడే ఆ ప్రదర్శనకు, ఆ బహుమతికి సార్థకత చేకూరుతుంది. బాహ్య శరీరానికి (ప్రదర్శనకు) ఎంత ప్రాధాన్యం ఇస్తామో, అంతర్గత ప్రాణానికి (నాటకీయమైన రచనకు) అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే తెలుగు నాటకం మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
-సుబ్బరాజు
