గుంటూరు, బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై 02-11-2024, శనివారం సాయంత్రం నవ క్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాదు వారిచే ప్రదర్శన విజయవంతంగా జరిగినది.
ఈ ‘ప్రేమ శిఖరం’ నాటకానికి కథా మూలం కావ్య రూపంలో రచించిన సాహిత్య బ్రహ్మ కీర్తిశేషులు వి.వి.ఎల్. నరసింహారావు గారు రచించిన ఆనంద భిక్షువు కావ్యాన్ని ఆధారంగా ప్రేమ శిఖరం పేరుతో సాహితీ పురస్కార గ్రహీత చిటిప్రోలు వెంకటరత్నం గారు పద్యనాటకంగా రచించారు.
వెంకటరత్నంగారు రచించిన ప్రేమ శిఖరం నాటకాన్ని నవ క్రాంతి కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. అర్జున్ రావు గారి దర్శకత్వంలో ఈ నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది. నాటకం మొదల నుంచి చివరిదాకా ఆలయ ప్రాంగణం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. నాటకం చూస్తున్నంత సేపు ప్రేక్షకులందరూ ముగ్ధులయ్యారు.
దర్శకులు మామిడాల అర్జున్ రావు గారు ఎన్నో నాటకాలను రంగస్థలం వేదికపై నటీనటులచే ప్రదర్శనలు ఇచ్చారు. సన్మానాలు సత్కారాలు పొందారు. కళాపరిషత్తు పోటీలలో ప్రథమ ద్వితీయ ఉత్తమ నటుడుగా ఉత్తమ దర్శకుడుగా నగదు బహుమతులను అందుకున్నారు. అటువంటి వారికి డమరుకం లలిత కళాసమితి వారిచే మామిడాల అర్జున్ రావుగారికి “నట దర్శకాగ్రేసర” అన్న బిరుత ప్రధానం చేస్తూ ప్రశంశాపత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించింది.
డమరుకం లలిత కళా సమితి వ్యవస్థాపకులు మల్లికార్జున ఆచారి, అధ్యక్షులు గన్నేవాసుదేవరావు గారు ఆలయ అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య గారి చేతుల మీదుగా బిరుదు ప్రధానోత్సవం జరిగింది. డమరుకం లలిత కళాసమితి అధ్యక్షులు గన్నే వాసుదేవరావు గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి రంగస్థలంపై మక్కువతో జీవితాన్ని మొత్తం నాటకానికే అంకితం చేసి జీవన గమ్యంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తట్టుకుంటూ, ఎంతోమంది కళాకారులకు శిక్షణ ఇస్తూ వారిని స్టేజి మీద ప్రదర్శనకు అవకాశాలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతూ అంచలంచెలుగా ఎదుగుతూ సన్మానాలు సత్కారాలు అందుకున్నటువంటి అర్జున్ రావు గారికి మా డమరుకం లలిత కళా సమితి తరపున “నటదర్శకాగ్రేసర” అన్న బిరుదును ఇచ్చి సత్కరించుకోవడం మాకెంతో గర్వకారంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సాహిత్య బ్రహ్మ కీర్తిశేషులు వి.వి.యల్. నరసింహారావు గారి కుమారులు శ్రీ విద్యాసాగర్ రావుగారు పాల్గొని మా నాన్నగారు రచించినటువంటి కావ్యాన్ని వారి శిష్యులైన వెంకటరత్నం గారు నాటక రూపంలో రచించి రంగస్థలంపై నాటక ప్రదర్శన చేయటం మాకెంతో ఆనందంగా గర్వంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనటం ఎంతో సంతోషకరమని చెప్పారు.
ఇక చిటిప్రోలు వెంకటరత్నంగారు మాట్లాడుతూ నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో మా గురువుగారైనటువంటి వి.వి.ఎల్. నరసింహారావు గారిని ఆదర్శంగా తీసుకొని నేను లెక్చరర్ అవ్వాలనేటువంటి పట్టుదలతో లెక్చరర్ అయ్యాను పదవీ విరమణ అనంతరం గురువుగారు రచించినటువంటి ఆనంద భిక్షువు కావ్యాన్ని పద్య నాటకంగా రచించాను.
ఈ నాటకాన్ని రంగస్థలంపై ప్రదర్శన జరిపి గురువు రుణం తీర్చుకోవడానికి అవకాశం కలిగిందని సంతోషంగా తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ చిటిప్రోలు జయప్రదగారి ఆధ్వర్యంలో జరిగింది.
-మల్లికార్జున ఆచారి