నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, సాంస్కృతిక రంగ సేవకుడిగా, వ్యాఖ్యాతగా బహుముఖ రంగాల్లో రాణిస్తూ, గత 27 సంవత్సరాలుగా ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా సేవలదించి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి సీనియర్ అనౌన్సర్ గా ఈ అక్టోబర్ 31న పదవీ విరమణ చేస్తున్న బి. జయప్రకాష్ గారికి 64 కళలు.కాం శుభాకాంక్షలు అందిస్తూ సమర్పిస్తున్న అక్షరాభినందన.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం లో జన్మించిన జయప్రకాష్ గారు ఇంటర్మీడియట్ వరకు జంగారెడ్డి గూడెం లో చదువుకొని, న్యాయశాస్త్రంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. హైస్కూలు విద్యార్థిగా ఉన్న రోజుల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ వారోత్సవాల సందర్భంగా 1977 సంవత్సరంలో ‘ఆశాజీవి ‘ నాటికలో నటించడం తో వీరి నాటక రంగ ప్రవేశం జరిగింది. అలా ప్రారంభమైన నటన డిగ్రీ పూర్తీయ్యే నాటికి అంతర్ కళాశాలల పోటీల్లో పాల్గోనడం, బహుమతులు పొందడంతో పరిణితి చెందింది. ఏలూరులో న్యాయవాదిగా వ్రుత్తి నిర్వర్తిస్తూ, మరో వైపు నాటక పరిషత్ లో విరివిగా పాల్గొని నటనలోనే కాకుండా, దర్శకత్వంలో కూడా ప్రవేశించారు. మీరైతే ఏం చేస్తారు, కూతురు పెళ్లి, అడ్రస్ లేని మనుషులు ఇవి వీరు నటించి దర్శకత్వం వహించిన నాటకాలలో ముఖ్యమైనవి.
విద్యార్థి దశ నుండి లలిత కళల పట్ల ఉన్న మక్కువతో 1992 వ సంవత్సరంలో ఆకాశవాణి నిజామాబాద్ కేద్రంలో అనౌన్సర్ గా ఉద్యోగంలో చేరారు. మాతృ సంస్థ ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ నాటికలు, రూపకాలు రూపొందించి ఆకాశవాణి నిర్వహించే జాతీయ పోటీలలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. వీరి నిర్వహణలో ఆకాశవాణి జాతీయ పోటీలలో బహుమతి పొందిన ‘హింసధ్వని ‘నాటిక ఆకాశవాణి నుండి 2001 సంవత్సరంలో అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడింది, ఒకే రోజు ఒకే సమయానికి జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. ఒక తెలుగు నాటిక కు లభించిన అరుదయిన గౌరవమిది.
వ్యాఖ్యాతగా: 2014లోనూ, 2019 లోనూ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఉగాది పురస్కార కార్యక్రమానికే కాకుండా, వివిధ సాహిత్య సాంస్కృతిక, నాటక, సభలకు వ్యాఖ్యాతగా, సభ నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. 2017 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నుండి ఉగాది పురస్కారం, ‘జాషువా ‘ పురస్కారం అందుకున్నారు.
కృష్ణవేణి క్రియేషన్స్ పేరుతో సాహితీ సాంస్కృతిక వేదికను స్థాపించి తెలుగు భాష సంస్కృతులను ప్రతిబింబించే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తెలుగు సౌరభం : పరాయి భాష పై మోజు తో మాతృభాష పట్ల నిర్లక్ష్యం చూపుతున్న ఈనాటి యువతరానికి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పాలనే సదుద్దేశంతో తెలుగు సౌరభం కార్యక్రమాన్ని రూపొందించారు. కళాశాల, పాఠశాల విద్యార్థులకు పోటీలు, వ్యాసరచన, కథలు చెప్పడం వంటి పోటీలు నిర్వహిస్తూ మనదైన తీయనయిన తెలుగు భాష పట్ల మక్కువను విద్యార్థులలో పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
సంక్రాంతి సంబరాలు: 2007 వ సంవత్సరం నుండి ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు పేరుతో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనదైన సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పదవీ విరమణ తర్వాత నాటక, సాంస్కృతిక రంగాలకు మీ పూర్తి కాలాన్ని వినియోగించి మరెన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ …
-కళాసాగర్
Congrats sir
Congrats Jayaprakash garu.