
తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రనాట్యం సృష్టికర్త, పేరిణి పునరుద్ధరణ నాట్యగురు పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ 102వ జయంతి ఉత్సవాలను శుక్రవారం (21-3-2025) హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, సదస్సు, పత్ర సమర్పణల అనంతరం సాయంత్రం జరిగే వేడుకలకు తెలంగాణ బి.సి. సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కానున్నట్లు తెలిపారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు నటరాజ రామకృష్ణ గారి లఘుచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. “పునరుజ్జీవనం-పునర్ వికాసం తెలుగు నాట నృత్య రీతులు – నటరాజ రామకృష్ణ చేసిన కృషి” అంశం పై ఆచార్య డా.జొన్నలగడ్డ అనూరాధ కీలకోపన్యాసం చేయనున్నారు. పేరిణి వికాసం పై ఆర్.ఎల్.ఎన్.రమేష్, నటరాజ రామకృష్ణ పేరిణి శిక్షణా విధానం పై డా.పేరిణి కుమార్ ప్రసంగిస్తారు. పేరిణి శబ్ద తరంగాలు అంశంపై డా. కళాకృష్ణ అభినయ పూర్వక ప్రసంగం చేస్తారు. ఆంధ్ర నాట్యం ఆవిర్భావ వికాసం గురించి డా. గంధం శంకరరావు, నటరాజ రామకృష్ణ నృత్యరూప కల్పనల గురించి సాత్విక పెన్నా వివరిస్తారు. సాయంత్రం 6 గంటలకు నటరాజ నృత్యా రామం మీర్ పేట విద్యార్థుల నవగ్రహ స్తోత్రం, వాగ్డేవి ఆర్ట్స్ అకాడమీ వారు అర్ధ నారీశ్వరం ప్రదర్శిస్తారు. సభకు ముందు బెంగళూరు కు చెందిన ప్రముఖ నాట్యగురు రమా భరద్వాజ్ “అవతరణ – ది స్టోరీ ఆఫ్ నాట్య” ప్రదర్శన ఉంటుందని డా. అలేఖ్య పుంజాల తెలిపారు.
నవ జనార్దనం, ఆంధ్ర నాట్యం, పేరిణి శివతాండవ నృత్య వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహా నాట్య గురువు నటరాజ రామకృష్ణ కు తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న నృత్య నివాళి అని ఆమె అభివర్ణించారు. తారామతి బారాదరిని అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత నటరాజ రామకృష్ణకు దక్కుతుందన్నారు. ఎన్నో నాట్య గ్రంథాలు రచించి తరతరాలకు నాట్య విజ్ఞానాన్ని అందించారని ఆమె కొనియాడారు. ఉచిత ప్రవేశమని, నృత్య కళాకారులు నాట్యాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
డా. మహ్మద్ రఫీ