లలిత కళల్లో చిత్రలేఖనం (ఫైన్ ఆర్ట్స్) మహత్తరమైంది. చిత్రకళను ముందు వైపు నుంచి మాత్రమే దర్శించగలం. అందువల్లనే దాన్ని ఏకదిక్ సౌలభ్యంగల కళ అంటారు. సాహిత్య కళకు వ్యాకరణం ఉన్నట్లుగా చిత్ర రచనలకు కూడా ఒక విధమైన వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణ నియమాలను పాటించి చిత్ర రచనలు చేస్తే ప్రేక్షకునికి రూపానందం కలుగుతుంది. అమలాపురంలో పి.సి.ప్రసాద్ ఆర్ట్ గ్యాలరీ మొదటి వార్షికోత్సవ సందర్భంగా 25 మంది జాతీయ చిత్రకారులతో నేషనల్ ఆర్ట్ క్యాంప్ జనవరి 19 నుండి 21 వరకు నిర్వహించారు. ఈ ఆర్ట్ క్యాంప్ ను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు సుక్లా ప్రారంభించారు. ఆర్ట్ క్యాంప్ ముగింపు రోజున ఏ.పి. దృశ్య కళల అకాడెమీ చైర్ పెర్సన్ శ్రీమతి కుడిపూడి సత్య శైలజా భరత్ పాల్గొని చిత్రకారులను సత్కరించారు. ఈ ఆర్ట్ క్యాంప్ లో సీనియర్ చిత్రకారులు ఎస్.ఎం. పీరన్ , సుభాష్ బాబు, సిరాజుద్దీన్, కె. పరమశివం గార్లతో పాటు స్టాలిన్, కంది నర్శింలు, శేష బ్రహ్మం, భరత్ యాదవ్, రవి శాస్త్రి, బాబు పేరుపల్లి, సురేష్ పనికర్, అర్చన గాలి, నిర్మల బిలుక తదితరులు పాల్గొన్నారు.
రెండవ ప్రదర్శన రాజమహేంద్రవరంలో….
ఈ ఆర్ట్ క్యాంప్ లో చిత్రించిన చక్కని చిత్రాలను ఇటీవల రాజమహేంద్రవరంలో నన్నయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శించి మన్ననల్ని పొందారు ప్రముఖ చిత్రకారులు పి.సి. ప్రసాద్. కోనసీమలోని అమలాపురం ప్రాంతానికి చెందిన పిసి ప్రసాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ. ఫైన్ ఆర్ట్స్ అభ్యసించారు. అమలాపురంలో ఆర్ట్ గ్యాలరీ మరియు స్టూడియో స్థాపించి విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్స్ లో శిక్షణ ఇస్తున్నారు. ఆర్ట్ గ్యాలరీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని ప్రముఖ కళాకారులను ఆహ్వానించి లైవ్ క్యాంప్ జరిపి అందులోని చిత్రాలను ప్రదర్శనగా ఉంచారు. వాటిని నన్నయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల, అధ్యాపకుల సందర్శనార్థం విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయంలో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయడం పట్ల విశ్వవిద్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రం కొన నున్న కోనసీమకు అనేక ప్రాతాల నుండి చిత్రకారులను పిలిపించి అమలాపురంలో ఆర్ట్ క్యాంప్ ను నిర్వహించిన పి.సి. ప్రసాద్ అభినందనీయులు.
–కళాసాగర్
………………………………………………………………………………………………
విద్యార్థులు కళలను అభ్యసించాలి…
కలలకు కాణాచి, సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో నన్నయ గారి పేరిట వెలసిన విశ్వవిద్యాలయంలో విద్యార్థి లోకం ఆర్ట్ గ్యాలరీలోని ఈ చిత్రాలను చూసి ప్రేరణ పొందుతారని, కళా ప్రపంచం సౌందర్యాన్ని తెలుసుకొని జీవితానికి అన్వయించుకోవడంలో ఆత్మానుభూతిని పొందుతారని నేను భావిస్తున్నాను. విశ్వవిద్యాలయంలో లలిత కళలలో ఒకటైన నృత్యకళకు సంబంధించి కూచిపూడి డిప్లమా కోర్సుగా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగిన విషయం. అలాగే విద్యార్థులకు మానసిక ఆనందాన్ని కలిగించే ప్రవృత్తిగా చిత్రకళ ద్వారా ఎంతో అనుభూతిని పొందే ఫైన్ ఆర్ట్స్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా విశ్వవిద్యాలయంలో ఒక ఆర్ట్ గ్యాలరీ లాంటి మ్యూజియం కూడా ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అందుకు నా సహకారాన్ని కూడా అందించగలుగుతాను. ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసినందుకు అనుమతి ఇచ్చిన విశ్వవిద్యాలయ అధికారులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
–పి.సి. ప్రసాద్, ఆర్టిస్ట్, అమలాపురం
మిత్రులు పి.సి.ప్రసాద్ గారికి… చిత్రకళను ప్రోత్సహిస్తు.. చిత్రకారులను అభినందిస్తూ… వారు చేసిన అద్భుత కార్యక్రమం…
మిత్రులు శ్రీ కళాసాగర్ గారికి ధన్యవాదములు