భారత సినీ ప్రముఖులు అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం నాడు అట్టహాసంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి దాదాపు అన్ని భాషలకు చెందిన పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. 2019 సంవత్సరానికి గాను సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన పలు చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా టాలీవుడ్ కు చెందిన దర్శక నిర్మాతలు అవార్డులు అందుకున్నారు. తెలుగు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’, నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రాలకు అవార్డులు లభించాయి. మహర్షి సినిమాకు గాను నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోగా.. జెర్సీ సినిమాకు గాను నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, ఎడిటర్ నవీన్ నూలి అవార్డులు అందుకున్నారు. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవం అనంతరం డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆయన నివాసంలో కలిశారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఈ మహర్షి సినిమా రైతుల ప్రయోజనాలను మరియు వారి శ్రేయస్సును పట్టించుకోవాల్సిన అవసరాన్ని చూపిందని పేర్కొన్నారు. ఇక వంశీ పైడిపల్లి కుటుంబం వెంకయ్య నాయుడుతో కలిసి ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ గౌరవానికి ధన్యవాదాలు అంటూ మహేష్ బాబు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
సినీ కుటుంబానికి అంకితం:
ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురసారాన్ని సోమవారం ఢిల్లీలో రజనీకాంత్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. 2019 సంవత్సరానికి గాను ఆయన ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డ్‌ను తన గురువు, స్నేహితులు, సినీ కుటుంబానికి అంకితం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘ఈ అవార్డ్‌ను నాలోని నటుణ్ణి గుర్తించి ప్రోత్సహించిన కె. బాలచందర్‌గారికి, నా పెద్దన్నయ్య సత్యనారాయణ, స్నేహితుడు రాజ్ బహుదూర్, నా సినీ కుటుంబానికి చెందిన దర్శక నిర్మాతలు తమిళ ప్రజలకు అంకితం ఇస్తున్నాను’’ అని లేఖలో రజనీకాంత్ తెలిపారు.
-కళాసాగర్