గుంటూరులో ఐదురోజుల పాటు జరిగిన ‘అంతర్జాతీయ నాటక ఉత్సవం’ కార్యక్రమాల సమీక్ష.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు వేదిక-తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం ఎడ్లపాడు వారు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ నాటక ఉత్సవం భారత్ రంగ్ మహోత్సవం ఫిబ్రవరి నెల 6 నుండి 10 తేదీలలో గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగాయి. వీటితోపాటు మధ్యాహ్నం ప్రతిరోజు మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బాలల చేత కళా ప్రదర్శనలు నాటకోత్సవాల జరిగిన అన్నిరోజులలో మొత్తం 1100 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీ, 1975లో కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి విడివడి స్వతంత్ర పాఠశాలగా మారింది. భారతరంగ్ మహోత్సవ్ 2026, ఆ క్రమంలో 25వ వార్షిక మహోత్సవం. ఇవి దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో, అలాగే ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఒక్కో దేశం చొప్పున జరుగుతూ ఉంది. 136 భారతీయ 12 విదేశీ నాటకాలు 258 భాషలు మరియు మాండలికాలలో ఈ ప్రదర్శనలు జరుగుతుంటాయి. నాటక రచయితలను ప్రోత్సహించడానికి, గౌరవించడానికి ఇందులో ‘థియేటర్ బజార్ సెగ్మెంట్’ కింద 17 పుస్తకాలు విడుదల చేయబడ్డాయి. అలాగే మహిళా దర్శకుల 37 ప్రదర్శనలు ఇందులో చోటు చేసుకున్నాయి. స్వాతంత్ర సమరయోధులు సామాజిక సంస్కర్తలకు, ధియేటర్ నిపుణులకు నివాళులర్పించే ప్రత్యేక ప్రదర్శనలో కూడా ఇందులో ఉంటాయి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీ, నిర్వహించే ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్ భారత్ రంగ్ మహోత్సవం. ఈ ఉత్సవాలు గత రెండేళ్లుగా మన రాష్ట్రంలో రాజమండ్రి విజయవాడ తర్వాత ఇప్పుడు మూడవసారి గుంటూరులో జరుగుతున్నాయి. “వేదిక” – తెలుగు రాష్ట్రాల్లో అనేక పరిషత్తులను ఏకం చేసి ఒక వేదికగా ఏర్పడి చురుకైన కార్యక్రమాలను ప్రారంభిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నది. వేదిక, పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు కళల గొప్పతనాన్ని తెలియజేస్తూ కళారూపాలైన కోలాటాలు జానపద నృత్యాలు సంగీతం అనేక రకాల కళల విభాగాలలో వారు పాల్గొనేలా చేయడమే కాక వారి కళారూపాలను ప్రజలకు చేరువ చేస్తున్న బాలోత్సవాల నిర్వహణలో వేదిక సహకారాన్ని అందిస్తూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా భారత్ రంగ్ మహోత్సవం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ‘వేదిక’వారితో భాగస్వామియై, తెలుగు నాటక కళాభిమానుల ముందుకు తీసుకువస్తూ ఉంది ఈ ఉత్సవాలను.
ఆరో తేదీ సాయంత్రం మూడు గంటల నుండి ప్రారంభమైన కోలాటాలు, జానపదాలు, చెక్కభజనలు, డప్పలు.. ఇలా వివిధ రకాల బాలల కళారూపాలతో ప్రారంభమై జ్యోతి ప్రజలన సభా కార్యక్రమం జరిగింది. ఇందులో రాష్ట్ర మంత్రివర్యులు శాసనసభ్యులు నాటక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల కళాపరిషత్ నిర్వాహకులకు ప్రతిరోజు వేదిక వారు గౌరవ సత్కారాన్ని అందించారు.
మొదటి రోజు మణిపురి వారి నాటకం “కోరస్ రిపర్టరి థియేటర్” కనుప్రియ అనే నాటకాన్ని ప్రదర్శించారు రచన ధరమ్ వీర్ భారతి. దర్శకత్వం పద్మశ్రీ రతన్ థియామ్. కృష్ణ ప్రేమ కాలాతీతమైనది. దేశకాల హద్దులను దాటి కృష్ణ ప్రేమ చైతన్య స్రవంతిగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కృష్ణ ప్రేమికులు రాధా సుదర్శనలు కృష్ణుడితో ప్రత్యక్షంగా ప్రేమ వ్యవహారం నడప లేకపోయినా ఆ విరహంలో కృష్ణడు సమక్షంలో ఉన్నట్లుగా ఇందులో ఒక ప్రధాన పాత్రధారి దాదాపు రెండు గంటల పాటు ‘సోలిలోక్వి’ పద్ధతిలో తన మానసిక ఆంతరంగిక మనోవ్యధను మణిపురి నాట్య శైలి భంగిమలలో ప్రేక్షకుల ముందు అభినయిస్తుంది. నాటకం ముగిసే వరకు కృష్ణ పాత్రధారి బదరీ వృక్షం నీడలో ఆసీనుడై ఉంటాడు. వేణు వాయిస్తూ మౌనంగా తిలకిస్తూ ఉంటాడు.
రెండవ రోజు పోలాండ్ దేశం వారి ఉమాదేవి/ వాండా డైనోస్కా ప్రదర్శింపబడింది. రచన దర్శకత్వం లూకాస్ చోట్ స్కి ఇది పోలీసష్/ ఇంగ్లీష్ భాషలలో సాగింది. మహాత్మా గాంధీ చేత “ఉమాదేవి” అనే నామకరణం చేయబడ్డ వాండా డినోస్కా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశానికి వచ్చి ఇక్కడి సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్తలతో కలిసి, ఆ తరువాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో టిబిటెన్ శరణార్థులకు తన అమూల్యమైన సేవలు అందిస్తుంది. ఇది పోలాండ్ తోలుబొమ్మల ఆట శైలిలో పాత్రలు మాట్లాడుతూ నాటకాన్ని ముందుకు నడిపిస్తుంటాయి. ఇది ఈ నాటకం యొక్క ప్రత్యేకత.
మూడో రోజు నట మిత్రారు హవ్యాసి కళా సంఘ తిరుత్తహళ్లి కర్ణాటక వారి ఆవూరు – ఈ ఊరు రచన జి.బి జోషి. దర్శకత్వం హుళుగప్ప కట్టిమాని.
హళల్లి, నాగరకొట్టే కు చెందిన రెండు బ్రాహ్మణ కుటుంబాల నేపథ్యంలో జరిగే స్వాతంత్ర పూర్వపు కుటుంబ కథా వస్తువే ఈ నాటిక ఇతివృత్తం. ముఖ్యంగా కోడలు సుశీల, అత్త గంగాబాయ్ తో ఆమె ఆధిపత్య అజమాయిషీ ధోరణికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. భర్త, మరిది మానసికమైన రుగ్మతలు కలిగిన వారు రిపేరి సీనప్ప ఆ ఇంట్లోని గోడ గడియారాన్ని తిరిగి పనిచేయించినట్లే, కుటుంబ వ్యవహారాన్ని కూడా ఒక దారిలోకి తీసుకు వస్తాడు. చరమాంకంలో డబ్బు మనిషి అయిన అత్త గంగాబాయి ఒంటరిగా మిగిలిపోతుంది. ‘దూకుడు కంటే ఓర్పు మంచిది’ అనే సందేశంతో ఈ నాటిక ముగుస్తుంది.

ఫిబ్రవరి 9 సోమవారం రాత్రి ఎ వెరీ సింపుల్ స్టోరీ రష్యన్ నాటకం ప్రదర్శించబడింది. దర్శకత్వం అలెక్సి బ్లాకిన్. ఇది మా పెట్రీ శైలిలో.. అంటే జంతువులను తలపించే రూపాలు కలిగిన మనుషులు ఆయా పాత్రల్లో నటిస్తూ ఉండటం దీన్ని ప్రత్యేకత. పేదరికం కారణంగా, తండ్రి తాగుబోతు అన్న కారణంగా తమ కుమార్తె ప్రేమించిన యువకుడితో పెళ్లికి నిరాకరిస్తారు అల్యోషా తల్లిదండ్రులు. ఆమె తాను గర్భవతిని అని చెప్పినప్పుడు గర్భస్రావం చేయించుకోవడానికి బలవంతం చేస్తారు. అయితే జంతువులు మనుషుల కంటే మానవీయ ప్రవర్తనతో ఆ ఆలోచనను విరమించుకునేలా చేయడం ఇందులోని సారాంశం. జంతువుల ప్రత్యేకగా కనిపించే మనుషులు, పాత్రలు రంగస్థలం ఒక ఆటల మైదానంగా మార్చేశాయి. విశ్వాసం నిజాయితీతో కూడిన పెంపుడు జంతువులు తమ యజమానుల కోసం ఏకమై ఒక యువతి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయడం ఈ కథలో అత్యంత కీలక ఘట్టం. ఇది కేవలం హాస్య ధోరణిలో మాత్రమే కాక కరుణ స్నేహం పరస్పర అవగాహన ఎంత ముఖ్యమో చెప్పే కథాశంగా కలిగిన రష్యన్ నాటకం. ఇది మాస్కో లోని డిటిస్ విశ్వవిద్యాలయ రంగస్థల కళల విభాగం విద్యార్థుల ప్రొడక్షన్.
పదో తేదీ మంగళవారం రాత్రి వన్స్ ఇన్ ఇండియా అప్స్టేజ్ ఆర్ట్ గ్రూప్ ఢిల్లీ వారిది ఈ ప్రదర్శన. దయా ప్రకాష్ సిన్హా దర్శకత్వం. ఆయుషీ త్రిపాఠి. ఈ నాటకోత్సవంలో ఇది ఒక మహిళ దర్శకురాలి ప్రొడక్షన్. ఇది ఇంగ్లీషు భాషలో సాగింది
దాదాపు 22 శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రక ఘటన ఆధారంగా రూపొందించబడిందీ నాటకం. గ్రీకు సంస్కృతి మరియు మౌర్య సామ్రాజ్యం యొక్క ప్రాతినిధ్యం మనకు కనిపిస్తుంది. బౌద్ధం పేరిట బృహద్రధ మౌర్య చక్రవర్తి శాంతిని కోరుకుంటూ గ్రీకు దేశస్తుడైన సెల్యూకస్ నికేటర్ తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి పంపిన వారి చేతిలో కీలుబొమ్మైపోతాడు. సైన్యాధ్యక్షుడు పుష్యమిత్ర శుంగ ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే పరిస్థితులు విషమించడంతో చక్రవర్తిని చంపి వేస్తాడు. అహింస ఉత్తమమైన మార్గమే కానీ అన్ని సమయాల్లోనూ కాదు. అవసరమైనప్పుడు హింస ద్వారా అయినా శాంతిని నెలకొల్పమని సందేశం ఇస్తుంది ఈ నాటకం. ఇలా ఈ ఐదు రోజుల భారత్ రంగ్ మహోత్సవంలో రెండు విదేశీ నాటకాలు చూసే అవకాశం గుంటూరు పరిసర ప్రాంత ప్రేక్షకులకు లభించడం చెప్పుకోదగ్గ విషయం. అలాగే భారతీయ భాషల్లోని ఇతర నాటకాలు కూడా ఉన్నత ప్రమాణాలతో సాగి తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి నాటకం యొక్క సెట్ డిజైన్ సెట్ ప్రాపర్టీస్ లైటింగ్ మ్యూజిక్ నృత్యాన్నో కోరస్ నో మేళవింపుగా సాగిన ప్రదర్శనలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి

దాదాపు ప్రతిరోజు 2000 మందికి భోజనము బయటి నుంచి వచ్చిన ప్రతినిధులకు వసతి ఏర్పాటు చేయడం ద్వారా వేదిక ఏ ఒక్క విమర్శకు తావివ్వకుండా సమర్థవంతంగా నిర్వహించి భవిష్యత్తులో మరిన్ని విలువలు కలిగిన ఉత్తమమైన నాటక ప్రదర్శనలకు అలాగే పాఠశాల కళాశాలల విద్యార్థులకు స్ఫూర్తిగా ప్రేరణ నిచ్చే కార్యక్రమాలు చేపడుతుందని ఒక నమ్మకాన్ని కలిగించింది.
మొత్తం కార్యనిర్వహణలో వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున నాగార్జున యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ ప్రొఫెసర్ ఎల్వీ భూషణ్ గార్ల పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా భారత్ రంగ్ మహోత్సవ్- అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు విజయవంతంగా, సంతృప్తికరంగా ముగిశాయి.
–మల్లేశ్వరరావు ఆకుల (7981872655)

