పుస్తక జగతిలో ‘నవోదయం’

నవోదయానికి దారి – రామ్మోహనరావు అట్లూరి

ఆరు దశాబ్దాలకు పైగా పుస్తక ప్రపంచానికి సేవలందించిన నవోదయ పబ్లిషర్స్ రామమోహనరావు (86) విజయవాడలోని తన స్వగృహంలో 15-12-2019, ఆదివారం కన్నుమూసారు.
విజయవాడలోని ఏలూరు రోడ్డులో అన్నీ పుస్తకాల యాలే, అందులో అన్నీ ఉద్దండుల పుస్తకాలే. అన్ని ప్రచురణల మధ్య రెండు చేతులు జోడించి నమస్క రిస్తూ కనిపిస్తుంది, నవోదయ సంస్థ. తెలుగు వారంతా తెల్లకాగితాలతో ఉన్న ఒక పుస్తకాన్ని ప్రదర్శిస్తే దానికి కూడా నిశ్శబ్దంగా నవోదయ ముద్ర పడుతుంది. ఈ ముద్ర వెనుక కథ చాలా పెద్దదే. రామమోహనరావు చిన్నబావ కొండపల్లి రాఘవరెడ్డి గుడివాడలో ‘నవోదయ పబ్లిషర్స్’ స్థాపించిన ఏడాదికే ఆ కార్యాలయాన్ని విజయవాడకు మార్చడంతో నవోదయ ప్రస్థానం మొదలైంది. 60 ఏళ్ల క్రితం సువిశాల ప్రాంగణంలో ప్రారంభమై, కొత్త పోకడల పెనుతుఫాను తలవంచి, తన పరిధిని తగ్గించుకుంది. నవోదయ సంస్థ ఆర్థికంగా చిక్కినా, లక్ష్యాన్ని విడిచి పెట్టలేదు. ప్రచురణలు ఆపారు. విక్రయాలు జరిపారు.
1934లో కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా ఉంగుటూరు గ్రామంలో ముగ్గురు ఆడపిల్లల తరవాత జన్మించిన అట్లూరి రామమోహనరావు, ఎస్సె స్సెల్సీ వరకు చదువుకున్నారు. 1955లో పర్వతనేని ఝాన్సీతో దండల వివాహం చేసుకున్నారు. పుస్తక వ్యాపారాన్ని గౌరవప్రదమైన వృత్తిగా భావించిన రామమోహనరావు, ‘చదువుకున్న వారితో పరిచయాలు పెరిగిన కొద్దీ నాకున్న సాహిత్య పరిజ్ఞానం ఎంతటిదో తెలిసింది. బాపు కార్టూన్ల సంకలనాన్ని శ్రీరమణ ముందుమాటతో మొట్టమొదటగా ప్రచురించే అదృష్టం నాకు దక్కింది. నండూరి రామమోహనరావుగారి ‘విశ్వ రూపం’ పుస్తకాన్ని నాటి రాష్ట్ర విద్యామంత్రి పీవీ నరసింహారావు ఆవిష్కరించడం మరపురాని ఘట్టం. ‘బాపు రమణీయం’ పుస్తకావిష్కరణ సభ నవోదయ సంస్థకి ఒక తీపి జ్ఞాపకం అనేవారు. కలకత్తాలోని పుస్తక ప్రదర్శనకు వెళ్లి వచ్చాక, ‘ఇటువంటి పండుగను యేటా విజయవాడ నగరంలో నిర్వహిస్తే బాగుంటుంది. అందరూ కలిసి వస్తే అందుకు నేను పెద్దరికం తీసుకుంటాను’ అని పలికి, పాతికేళ్లపాటు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఒక రచయిత పదికాలాల పాటు జీవించి ఉండాలంటే వారి రచనలు పుస్తక రూపంలో ఉండాలి. లేదంటే ఆ వ్యక్తి రచయితగా మరణించినట్లే అనే భావనతో చాలామందిని సజీవులను చేశారు రామమోహనరావు..
1961 నాటికి గొల్లపూడి మారుతీరావు రచించిన ‘చీకట్లో చీలికలు’ పుస్తకానికి బాపుతో బొమ్మలు వేయించారు. ముళ్లపూడి వెంకటరమణ ‘గిరీశం లెక్చర్లు’ పుస్తకం అందంగా ముద్రించడంతో, వారికి నవోదయ మీద నమ్మకం కుదిరింది. “బాపు ఓసారి హైదరాబాద్ వెళ్తూ విజయవాడలో నన్ను కలవటం నా జీవితంలో మేలిమలుపు. నాటి నుంచి వారిద్దరూ నాకు ఆత్మీయులు. అందుకే వారితో అవసరానికి మించి అభిమానం పెంచుకున్నాను” అని వారిని స్మరించుకునే వారు రామమోహనరావు. శంకరమంచి సత్యం రచించిన ‘అమరావతి కథలు’ (100 కథలు) పుస్తకానికి బాపు చేత బొమ్మలు వేయించాలనుకున్న కలను నెరవేర్చుకున్నారు. ఆకాశవాణి మిత్రుల మాటలలో జరుశాస్త్రి పేరు తరచుగా తగిలేది.. ‘ఎవరు ఈ జరుశాస్త్రి? చదువుదామంటే ఎక్కడా కనబడడేమండీ?’ అనుకుని, సమాచారం సేకరించి, ‘శరత్ పూర్ణిమ’ (కథలు), ‘తనలో తాను’ (వ్యాసాలు), ‘జరుక్ శాస్త్రి పేరడీలు’ ప్రచురించారు. ఆరుద్ర కోరికపై, శ్రీరంగం నారాయణబాబు ‘రుధి రజ్యోతి’ ప్రాముఖ్యత తెలియకుండానే ప్రచురించడంవల్ల శ్రీశ్రీ, ఆరుద్రల మధ్య సంబంధాలు నిర్దేశించే స్థాయికి చేరింది. ఆ ప్రచురణ. 1968లో గోపీచంద్ ఫొటోని క్యాలెండర్‌గా ప్రచురించారు.
నవోదయ రామమోహనరావును ఎవరైనా ‘మీరు కమ్యూనిస్టు కదా’ అంటే ‘నేను కమ్యూనిస్టుని కాదు, హేతువాదిని. నా పిల్లలిద్దరి పెళ్లిళ్లూ రిజిస్ట్రార్ ఆఫీసులోనే చేయించాను. మా అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నప్పుడు గర్వించాను. మా నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిర్వహించమని ఎంతమంది ఒత్తిడి చేసినా తలొగ్గలేదు. నా తదనంతరం కూడా నా శరీరం లోని అన్ని భాగాలూ వైద్య విద్యార్థులకే ఉపయోగ పడాలన్నది నా కోరిక’ అనేవారు. ఎన్నో ఆదర్శభావాలు కలిగి, పుస్తక ప్రపంచంలో ఒక శకాన్ని సృష్టించిన నవోదయ రామమోహనరావు, తన ప్రచురణల ద్వారా రచయితతో పాటు చిరయశస్సు సంపాదించుకున్నారు.
(బాపు జయంతి రోజునే నవోదయ రామమోహనరావు కాలం చేయడం యాదృచ్ఛికం కావొచ్చు)
డాక్టర్ వైజయంతి పురాణపండ

2 thoughts on “పుస్తక జగతిలో ‘నవోదయం’

 1. ‘ ప్రచురణ బ్రహ్మ నవోదయ రామ్మోహన రావు అస్తమించిన రోజు –
  ————————- – పుస్తకం విలపించిన రోజు. ‘
  ———————

  ..నామటుకు నేను ఉదయంనుండి దు:ఖంతో ఒక్క అక్షరం కూడా రాయలేకపోయా.

  టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న నన్ను విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్లో నాన్న ASR కృష్ణ అప్రెంటీస్ గా జాయిన్ చేయిస్తే.,
  చిన్నప్పటి నుండి నాకు ఆర్ట్ మీద ఉన్న ఇంట్రె స్ట్ ని, నా అభిమతాన్ని ఎరిగి ‘ ఒరేయ్ కృష్ణా..సున్నితంగా ఉన్న వీడిని ఆ మిషన్లమధ్య వద్దు ‘ అని దెబ్బలాడిన మానాన్న ప్రాణస్నేహితుడు నవోదయ రామ్మోహన రావు గారు.
  ( కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడర్ మా నాన్న ASRని ఏ విషయంలో నైనా నిలువరించగల వ్యక్తి రామ్మోహన రావు తప్ప మరెవరూ లేరని మా ఇంట్లో అందరి భావన.)

  ‘ నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లోనే పెడతా..’ అని
  నన్ను తన బజాజ్ స్కూటర్ మీద ఎక్కించుకుని విజయవాడలో పబ్లికేషన్ హౌసెస్ కి ఆర్టిస్ట్ పెద్ద వీనస్ ఆర్ట్స్ రామాచారిగారి వద్దకు తీసుకెళ్లి..ఆయన దగ్గిర ఆర్టిస్ట్ గా మెళుకువలు దిద్దించి, తదుపరి సినీ పరిశ్రమకే పెద్దలు స్వర్గీయ ఈడుపుగంటి లక్ష్మణరావుగారికి పరిచయంచేసి, ఆయన ద్వారా సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ పి.ఎ.రంగా గారి దగ్గిర శిష్యరికం చేయించి..అక్కడి నుండి నేను ‘ ఉదయం ‘ దినపత్రికలో ఆర్టిస్ట్ గా చేరే వరకు నా గమనాన్ని నిర్దేశించిన మార్గదర్శి రామ్మోహన రావు ఇక లేరు అన్నది నాకు కటిక చేదునిజం.

  నాకు ఒక కన్ను గీత, ఒక కన్ను రాత – బాపురమణల ‘ విద్వత్ ఆవిష్కరణల ఓంప్రథమ ప్రచురణ యవనిక ‘ నవోదయ అన్నది ఎవరూ కాదనలేనిది.

  పత్రికారంగంలో నా ఎదుగుదల విషయమై ఆయన నన్ను అభినందించినపుడు –
  ఇదంతా మీ ప్రోత్సాహచలవే అంటే..’ నీవు కష్టపడ్డావు, నాదేముంది..? ‘ అనే నా ప్రాత: స్మరణీయ నా కుటుంబ శ్రేయోభిలాషి, ప్రచురణ బ్రహ్మ నవోదయ రామ్మోహన రావు గారికి నా అశృ అక్షరాంజలి.

  – శ్రీధర్ అక్కినేని,
  ( ఆర్టిస్ట్’ – జర్నలిస్ట్ )
  పబ్లిషర్ – అక్షరం ఆర్ట్స్ ‘ఎన్’ పబ్స్.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap