ప్రభుత్వ పక్షాన ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రతి యేటా అమరావతి సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిచాలని సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ కు నవ్యాంధ్ర రచయితల సంఘం విన్నపం..!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ ను నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు మంగళవారం సెక్రటేరియట్లోని ఆయన ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కవులు, రచయితలు, కళాకారుల సమస్యల గురించి, వారి జీవితాల్లో కోల్పోయిన నాలుగు ఉగాదుల గురించి పది నిమిషాలపాటు మంత్రితో చర్చించారు. ప్రతి ఏటా ప్రభుత్వం అమరావతి మహోత్సవాల పేరిట సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని… ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించాలని… అధికార భాషా సంఘాల, వివిధ అకాడమీల ఏర్పాటులో రాజకీయ వ్యక్తులకు కాకుండా భాషా, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలలో నిష్ణాతులైన వారిని, ప్రతిభావంతులైన వారిని అకాడమీల చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, మెంబర్లుగా నియమించాలని… ఉగాది పురస్కారం, హంస పురస్కారం పేర భాషావేత్తలకు, కవులకు, రచయితలకు, విమర్శకులకు, జానపద, నాటక, నృత్య, సినీ, సంగీత, కళాకారులను నగదుతో సత్కరించాలని… అర్హులైన కవులు, రచయితలు, భాషావేత్తలు, సాహిత్యకారులు, వివిధ రంగాల కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని…. అధికార భాషా సంఘం ద్వారా ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా మాతృభాష విద్యాబోధనను అమలు చేసేలా జీ.వోను తీసుకురావాలని… అన్ని జిల్లాల్లోనూ సాహిత్య, సాంస్కృతిక, కళలను ప్రదర్శించుకోవడానికి కళావేదికలను నిర్మించాలని మంత్రిని కోరారు. ఇంకా పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, రాష్ట్ర కో ఆర్డినేటర్ కుర్రా సురేష్ బాబు అందజేశారు. మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందిస్తూ, ఈ లేఖను ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి అందజేసి చర్చించి, తప్పనిసరిగా నవ్యాంధ్ర రచయితల సంఘంతో పాటు కలిసొచ్చే అన్ని సంఘాల సమన్వయంతో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగుభాష అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలైనా చేసేందుకు సిద్ధంగా వుందని మంత్రి తెలియజేశారు.
నవ్యాంధ్ర రచయితల సంఘం
విజయవాడ A.P.