నాయనమ్మ కథలు నిండైన నీతిచంద్రికలు

దృశ్యమాధ్యమాల రంధిలో పడి కొట్టుకుపోయే నేటి విద్యాధికులు తమదైన ఆశ్వాదనను, ఊహను, మనోదృశ్య చిత్రణను కోల్పోతున్నారు.
మన కబుర్లు వినేందుకు, ఆ మాటల్లోని అజ్ఞానాన్ని నివృతి చేసేందుకు, స్వాంతననిచ్చే కబుర్లు తిరిగి సోదాహరణగా చెప్పాలన్నా అమ్మమ/ నాయనమ్మలను మించిన వాళ్ళెవరు. జ్ఞానవృద్ధులు, మాడుతరాల మానవ సంబంధాలకు అనుసంధాన కర్తలు. ఐదుతరాలకు ప్రత్యక్ష సాక్షలు నాయనమ్మలు!

నాయనమ్మ స్థానంలో భమిడిపాటి బాలాత్రిపురసుందరి ఈ కథలను మనకు వినిపించారు. తనమాటగా చెప్పుకున్ను ముందుమాటలో “ఈ కథలు రాయడానికి బడికివెళ్లే పిల్లలే స్ఫూర్తి. ఈ పుస్తకంలో నాయనమ్మ పిల్లలకు చెప్పిన కథలే కాదు; నాయనమ్మ పిల్లలతో చెప్పించిన కథలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంలో ముందుమాట కూడా పిల్లలే చెప్తున్నారు. పిల్లల మనోభావాలు ఎలా ఉన్నాయో పెద్దల మనం తెలుసుకోవాలి కదా!…”అంటారు రచయిత్రి. చదవటం, వ్రాయటం రాని ఈ తరం తెలుగు పిల్లల మాటలను ముందుమాటగా కూర్చారు. రచయిత్రి కోరుకున్నట్లు ఇటు వంటి పుస్తకాలు చదవడం “తల్లిదండ్రులే పిల్లలకి నేర్పించాలి.” భాషతోపాటు, మంచి నడవడిక అలవడుతుంది. రచయిత్రి ఈ గ్రంథ రచనలో వాడిన శైలి నారికేళ పాకంలా స్వచ్ఛంగాను, సరళంగాను ఉంది. పిల్లలు సునాయాసంగా చదువుకునే వీలు ఉంది.
ఇప్పటికి 30 కి పైగా పుస్తకాలను రచించిన రచయిత్రి, ఈ పుస్తకంలో ముప్పై కథలను కూర్చి మనకు సమర్పించారు. ఇందులో ఏ కథ కూడా మూడు నాలుగు పేజీల పరిధిని మించకుండా, సంక్షిప్తంగా నిక్షిప్తమైన నీతి చంద్రికలుగా అలరిస్తాయి.

‘గుంటలో నక్క’ అన్న కథ ద్వారా మోసం ఎంతో కాలం దాగదు అన్న నీతిని, ‘కలుగులో చిట్టెలుక’ అన్న కథ ద్వారా అల్ప ప్రాణినైనా అలుసుగా చూడరాదని, ‘ఎలుగు బంతితో మంచి తనం’ అన్న కథ ద్వారా పరులపై అసూయతో తీసే గోతుల్లోతామే పడాల్సి వుంటుందని, ‘కూయని కోడి’ అన్న కథ ద్వారా తాను కూస్తేనే తెల్లారుతుందనుకునే కోడి సామెతను కథలా చెప్పి. అటువంటి నైజానికి మంచి పరిషారం చూపారు.

పాతసారా కొత్తసీసా అన్నట్లు కొన్ని పాత కథలను ఈ పుస్తకంలో చెర్చారు. బహుళ ప్రచారంలో ఉన్న కథలను తమదైన శైలిలో చెప్పుకొచ్చారు నాయనమ్మ(రచయిత్రి). ప్రతి కథ ఆరంభంలో మనుమలకు నానమ్మకు మధ్య సాగే సంభాషణ, కథ చెప్పేందుకు ముందు ఎత్తుగడ చక్కగా కథలన్నింటిని చదివించేలా ఉన్నాయి. కథ కథకి ఆశక్తిని పెంచారు. జంతువులు, పక్షులు మధ్య నడిచిన కధలు పంచతంత్ర కథలను అడుగడుగునా గుర్తు చేస్తాయి. పుస్తకంలో చివరి ఘట్టంగా నాయనమ్మ కథలను ఉపసంహరిస్తూ, సెలవులు ముగించుకుని ఊరువెళ్ళే పిల్లలకి చెప్పిన ముచ్చట్లు అంటూ చెప్పిన మూడుపేజీలను అద్భుత వాక్యాలతో నింపారు. రచయిత్రి జీవితానుభం, నడవడి, జ్ఞానం ఇందులో ప్రస్పుటంగా కనిపిస్తుంది.

ఆత్మకూరు రామకృష్ణ – కవి చిత్రకారుడు

1 thought on “నాయనమ్మ కథలు నిండైన నీతిచంద్రికలు

  1. నూతన రచనలకు, రచయితలకు మీరిస్తున్న ప్రోత్సాహము ప్రశంసనీయము. సకాలంలో సమీక్ష ముద్రించిన మీకు ధన్యవాదములు.

Comments are closed.

Share via
Copy link
Powered by Social Snap