స్త్రీలసాహిత్యంలో ఆద్యురాలు ‘నాయని’

తెలుగు రచయిత్రి. ఆమె తొలితరం తెలుగు జానపదసాహిత్యం, స్త్రీలసాహిత్యంలో విశేషకృషి చేసిన ఆద్యురాలు, జానపదవాఙ్మయానికి సాహిత్యస్థాయికి గుర్తింపు తెచ్చిన వారు, కథ, కవిత్వం, నవల, చరిత్ర, విమర్శ, ప్రక్రియల్లో రచనలు చేసిన వారు, భావకవి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు నాయని సుబ్బారావు గారి కుమార్తె నాయని కృష్ణకుమారి జన్మదిన జ్ఞాపకం.

నాయని కృష్ణకుమారి (మార్చి 14, 1930 – జనవరి 30, 2016) తెలుగు రచయిత్రి. ఆమె తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు నాయని సుబ్బారావుగారి కుమార్తె. నాయని కృష్ణకుమారి గుంటూరు జిల్లాలో 1930, మార్చి 14 న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు హనుమాయమ్మ, నాయని సుబ్బారావు. ఈమెకు ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. ఆమె అక్షరాలా బాల్యం నుంచి కవిత్త్వ తత్త్వం ఆకళించుకున్న కవయిత్రి. సుబ్బారావుగారు ప్రముఖ సాహితీవేత్తలతో జరుపుతున్న చర్చలు వింటూ చిన్నతనంలోనే నలుగురిలో నిర్భయంగా మెలగడం, మాట్లాడడం నేర్చారు. వారు పాఠశాల చదువు నరసరావుపేట, శ్రీకాకుళం లలో పూర్తిచేశారు. గుంటూరులో కాలేజీచదువు పూర్తి అయిన తరువాత 1948లో ఆమె తెలుగు ఎం.ఎ. చెయ్యడానికి విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఉన్న మూడేళ్లూ ఆమె సాహిత్యాభిలాషని తీర్చిదిద్దడానికి ఎంతగానో తోడ్పడినాయి. అంతకుముందే, ఆమె బి.యే. చదువుతున్న రోజులలో ఆంధ్రులచరిత్ర క్లాసులో రాసుకున్న నోట్సు ఆధారంగా “ఆంధ్రులకథ” అన్న పుస్తకం రాసి ప్రచురించారు. అప్పటికి ఆమె వయసు 18 ఏళ్లు. ఆపుస్తకం ఆనాడు స్కూళ్లలో పాఠ్యపుస్తకంగా తీసుకుంది ఆంధ్రప్రభుత్వం. విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఆమెకి అనేకమంది రచయితలతో పరిచయం అయింది. కృష్ణకుమారిగారు విశేషంగా సాహిత్యసభలలో, నాటకాలలో పాల్గొంటూ, తన సాహిత్య కృషికి బలమైన పునాదులు వేసుకున్నారు. ఆమె తెలుగు యం.ఏ. అయినతరువాత, మద్రాసులో ఒక ఏడాది లెక్చరరుగా పనిచేసి, తరువాత హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరరుగా మొదలు పెట్టి, రీడరయి, ప్రొఫెసరయి, ఆ తరువాత, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటి వైస్ ఛాన్సలర్‍గా 1999 లో పదవీ విరమణ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో తిక్కన కవితావైభవంమీద పి.హెచ్.డి మొదలు పెట్టేరు కానీ పూర్తి చేయ్యలేదు. ఆతరువాత, ఆమె భర్త మధునసూదనరావు, మిత్రులు అంతటి నరసింహం ప్రోత్సహించగా, తెలుగు జానపదసాహిత్యంలో పరిశోధన చేసి, పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఆమె సిద్ధాంతగ్రంథం, “జానపదగేయగాథలు” అన్న శీర్షికతో 1977లో ప్రచురించారు. ఆ తరువాత ఆమె తన దృష్టి అంతా జానపదసాహిత్యంమీదే కేంద్రీకరించింది.

కృష్ణకుమారిగారు జానపదసాహిత్యం, స్త్రీలసాహిత్యంలో విశేషకృషి చేసిన ఆద్యులలో ఒకరు. ఆమె రంగంలో ప్రవేశించేనాటికి, జానపదవాఙ్మయానికి సాహిత్యస్థాయికి గుర్తింపు మొదలవుతున్నరోజులు. ఆనాటిపండితులదృష్టిలో అది కేవలం పామరులు ఎవరికి తోచినట్టు పాడుకున్న పాటలూ, చెప్పుకున్న కథలూ మాత్రమే.

ఆనాటిపరిస్థితిలో జానపదవాఙ్మయ అధ్యయనాన్ని ఆమె మూడు భాగాలుగా విభజించారు. మొదటిది జానపదవాఙ్మయాన్ని సాహిత్యంగా గుర్తించనిరోజులు, రెండోదశలో జానపదుల పాటలూ కథలూ సేకరించడం జరిగింది. అంతకు పూర్వం ఖండవల్లి లక్ష్మీ రంజనంగారు జానపదసాహిత్యానికి సాహిత్యస్థాయి కల్పించారు. మూడో దశలో బిరుదురాజు రామరాజుగారితో కలిసి కృష్ణకుమారిగారు రంగంలో ప్రవేశించి జానపదవాఙ్మయానికి సాహిత్యవిలువలు ఆపాదించి, సాధికారంగా నిరూపించారు.

జానపద సాహిత్యాన్ని విశ్లేహించేవిధానంలో నూతనపద్ధతులు ప్రవేశపెట్టిన ఘనత కృష్ణకుమారిగారిదే. గణితశాస్త్ర సూత్రాలు ప్రాతిపదికగా జానపదసాహిత్యం విశ్లేషించాలని సశాస్త్రీయంగా నిరూపించి చూపించారు.

ఈసాహిత్యప్రక్రియని అధ్యయనం చేయడానికి మడతకుర్చీ అధ్యయనం (armchair research) పనికిరాదంటారు కృష్ణకుమారిగారు. ఆఫీసులోనో లైబ్రరీలోనో కూర్చుని పుస్తకాలు చదివి జానపదసాహిత్యాన్ని అవగాహన చేసుకోడం జరగదు. జనపదాలకి వెళ్లి, ఆ కథలు చెప్పేవారితోనూ, పాటలు పాడేవారితోనూ మాటాడాలి. దానికి ఎంతో ఓపిక కావాలి. జనపదులతో మాటాడుతున్నప్పుడు వారికి అర్థమయే భాషలో మాటాడాలి. వారు చెప్పింది సావధానంగా విని, నిశితంగా పరిశీలించి, ఒక అవగాహన ఏర్పరుచుకోవాలి. విశ్లేషించేవిధానంలో కొన్ని ప్రత్యేకసూత్రాలు పాటించాలి అంటారామె.

తాను స్వయంగా అనేక పల్లెలికి వెళ్లి లెక్క లేనన్ని స్త్రీలపాటలూ, కథలూ సేకరించారు. టేపురికార్డులవంటి పరికరాలు లేనిరోజుల్లో, ప్రయాణసౌకర్యాలూ అంతంత మాత్రమే అయిన ఆ రోజుల్లో ఆమె ఎంత సమాచారం సేకరించేరో చూస్తే ఆమె నిష్ఠ ఎంత పటిష్ఠమయినదో తెలుస్తుంది మనకి. కృష్ణకుమారిగారు స్వభావతః ఎంతో ఔచిత్యం పాటించే వ్యక్తి. చిన్నా పెద్దా అన్న వివక్షత లేకుండా ఎవరు సాహిత్యసభలకి ఆహ్వానించినా అంగీకరించి వారిని తృప్తిపరచడం ఆమెకి ఆనందం. ఒకసారి, అంతటి నరసింహంగారు, “ఇలా మీటింగులంటూ కాలం వ్యర్థపుచ్చక పుస్తకప్రచురణలకి వెచ్చించవచ్చు కదా“ అన్నారట. దానికి జవాబుగా, “పాపం, వాళ్లు ఎంతో ఉత్సాహంతో నేను ఒప్పుకుంటానన్న ఆశతో వస్తారు. వారిని తిరస్కరించడం ఏంబాగుంటుంది?“ అన్నారుట.

ఆమె లెక్చరరుగా పని చేస్తున్నరోజుల్లో విద్యార్థులతో కాశ్మీర్ విహారయాత్రకి వెళ్లినప్పటి అనుభూతులు “కాశ్మీర దీపకళిక”లో ఆవిష్కరించి, యాత్రారచనకి కొత్తబాట వేశారు. “అది కేవలం ఒక యాత్రాకథనం కాదు, అది ఒక వచన కావ్యం” అంటారు ప్రొఫెసర్ చేకూరి రామారావుగారు ఈ పుస్తకానికి ముందుమాటలో. ఇందులో కాశ్మీరదేశపు విశేషాలతోపాటు రచయిత్రి కవితాత్మ కూడా అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది అంటారు డా. వైదేహి శశిధర్

ఉస్మానియా యూనివర్సిటీలో తిక్కన కవితావైభవంమీద పి.హెచ్.డి మొదలు పెట్టేరు కానీ పూర్తి చేయ్యలేదు. ఆతరువాత, ఆమె భర్త మధునసూదనరావు, మిత్రులు అంతటి నరసింహం ప్రోత్సహించగా, తెలుగు జానపదసాహిత్యంలో పరిశోధన చేసి, పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఆమె సిద్ధాంతగ్రంథం, “జానపదగేయగాథలు” అన్న శీర్షికతో 1977లో ప్రచురించారు. ఆ తరువాత ఆమె తన దృష్టి అంతా జానపదసాహిత్యంమీదే కేంద్రీకరించింది.
2016, జనవరి 30 న మరణించారు.

సాహిత్య కృషి :
• అగ్నిపుత్రి (1978)
• ఆయాతా (కథల సంకలనం)
• ఏం చెప్పను నేస్తం (కవితాసంకలనం. 1988)
• పరిశీలన (వ్యాససంకలనం. 1977)
• పరిశోధన (వ్యాససంకలనం. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురణ. 1979)
• తెలుగు జానపద వాఙ్మయము. సంఘము, సంస్కృతి, సాహిత్యం. పరిశోధన గ్రంథం. (పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము. 2000)
• జానపద సరస్వతి. (జానపద సాహిత్య పరిషత్. 1996)
• కాశ్మీర దీపకళిక (యాత్రాచరిత్ర)

సత్కారాలు :
• గృహలక్ష్మి స్వర్ణకంకణం
• పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి బహుమతి
• ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ బహుమతి

SA: