తెలుగు సినిమా అంటే మనలో విపరీతమైన ఇష్టం, ఇంకొంతమందికి అంతే అయిష్టం, కానీ అందరికీ ఆసక్తి. నాక్కూడా అలానే తెలుగు సినిమాలంటే ఆసక్తి. ఎంతైనా పదహారణాల తెలుగువాణ్ణే కాబట్టి. అయితే, అందుకని రాసేశానా ఒక పుస్తకాన్ని అంటే కాదు. అంతకన్నా లోతైన, ఆసక్తికరమైన కారణాలున్నాయి.
తెలుగు నేలకి, సినిమాకు వందేళ్ళ పైగానే అనుబంధం ఉంది. ఎప్పుడో 1910 ల్లోనే తెలుగువాళ్ళు సినిమా అనే సాంకేతిక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మొదట్లో అమెరికాలోని హాలీవుడ్ ప్రాంతంలోని సినిమా కంపెనీలు తీసిన సినిమాల్లో అరిగిపోయి, కొద్దిగా పాడైన రీల్స్ ఇక్కడికి పంపితే అవే గొప్ప అనుకుని ఊళ్ళలో వేసిన డేరాల్లో టిక్కెట్టు పెట్టి సినిమాలు చూసిన రోజుల నుంచి ఈరోజున తెలుగు నటులు, సాంకేతిక నిపుణులు తీసే తెలుగు మాస్ సినిమాలకు అదే హాలీవుడ్‌లో ప్రేక్షకులు ఏర్పడే రోజుల వరకూ సాగిన ప్రయాణం మంచి తెలుగు సినిమా స్క్రిప్టులానే ఆసక్తికలిగిస్తుంది.
చాలా సినిమా పుస్తకాలు సినిమా వాళ్ళూ, వాళ్ళ లోకం అన్నది ఏదో వేరే గ్రహంలో జరుగున్నట్టు, బయట జరుగుతున్న పరిణామాలతో వారికి ఏ సంబంధం లేనట్టు సాగుతూ ఉంటాయి. కానీ, సినిమా కూడా సమాజంలో భాగమే, విడదీయరాని భాగం. ఈ కాలంలో తెలుగువాళ్ల జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. ప్రపంచ యుద్ధాల ప్రభావాలూ, కరువూ కాటకాలూ, ఆర్థిక మాంద్యాలూ, బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం, జమీందారీల నుంచి భూస్వాముల చేతికి భూములు, కులాల మధ్య సామాజిక స్పర్థలు, కొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులూ, హరిత విప్లవమూ, కమ్యూనిజం వ్యాప్తి, పట్టణాలకు వలసలు, మధ్యతరగతి పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు – ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి.
సమాజంలో జరిగే ఈ మార్పులన్నీ తెలుగు నాట సినిమా రంగం మీద తమ ముద్ర వేస్తూనే వచ్చాయి.
1929 అక్టోబరు నెలలో ఎక్కడో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వాల్‌స్ట్రీట్‌లో కంపెనీల స్టాక్స్ విలువ కుప్పకూలిపోవడానికీ, ఆ తర్వాత ఏడెనిమిది ఏళ్ళకు కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర మారుమూల పల్లెటూరులో వ్యవసాయ కుటుంబానికి చెందిన అక్కినేని నాగేశ్వరరావు అనే కుర్రాడిని అన్న, తల్లి చదువు మానిపించి నాటకాల్లోనూ, తర్వాత సినిమాల్లోనూ పెట్టడానికి లంకె ఉంది.

మహాత్మా గాంధీ తనకు సినిమాల పట్ల ఉన్న అయిష్టాన్ని అందరికీ చెప్తూ, రాస్తూ ఉండడానికీ, ఆయన చనిపోయిన పదహారేళ్ళ తర్వాత వచ్చిన ఓ తెలుగు సినిమా పాటలో “నువ్వు నేను ముద్దుకు ముద్దు” అన్న వాక్యం సైతం సహించలేని సెన్సార్ అధికారులు “నువ్వు నేను ఊహుహు ఊహూ” అని మార్పించడానికి మధ్య సంబంధం ఉంది.
సంప్రదాయ కళల నుంచి ప్రేక్షకులను, నాటక రంగం సంపాదించుకుంటే, నాటక రంగం నుంచి సినిమా రంగం తెచ్చుకుంది. నాగార్జున సాగర్ కట్టి, ఎక్కువ దిగుబడి వచ్చే వరివంగడాలు తీసుకురావడానికి, సినిమా రంగం హఠాత్తుగా విస్ఫోటం చెందినట్టు విస్తరించడానికి ముడి ఉంది – ఇలా చెప్పాలంటే ఉదాహరణలు కోకొల్లలు.
సినిమా రంగం గురించి, సామాజిక చరిత్ర గురించి – ఆసక్తితో చదువుకున్న నాకు, ఈ రెంటికీ ఉన్న ముడి చాలా ఆసక్తికరంగా తోచింది. తెలుగు సినిమా చరిత్రను ఇప్పటికే తెలుగులో చాలామంది పుస్తకాలు రాసినా వాటి పరిధి మొత్తం సినిమాల చుట్టే ఉండడం చూశాను. ఆ రచనల్లో దృక్పథం ఇలా ఉండేది: ప్రతీ దశాబ్దంలోనూ ఏయే గొప్ప సినిమాలు విడుదలయ్యాయి, ఎవరెవరు నటీనటలు రంగప్రవేశం చేశారు, ఏ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు ముద్రవేశారు. వీటికి తోడు, ఇంకొంత ట్రివియా కలిపి ఆసక్తికరంగా రాశారు. ఇవన్నీ మంచి ప్రయత్నాలే కానీ వీటిలో ఎక్కడా బయటి సమాజంలో జరుగుతున్న మార్పులు, వాటికి సినిమాకు సంబంధం వివరించడం అంతగా ఉండదు. సినిమా రంగం పూర్తిగా బయటి ప్రపంచంతో ఏ సంబంధమూ లేని వేరే ప్రపంచం అన్నట్టే వీటి ధోరణి సాగుతుంది. ఇందుకు భిన్నంగా, తెలుగు, తమిళ సినిమాల గురించి కొన్ని భారతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఫిల్మ్ స్టడీస్ చెప్పే అధ్యాపకులు సినిమాలకూ, సమాజానికి మధ్య ఉన్న సంబంధాన్ని రాశారు. కానీ, వారంతా తెలుగు సినిమాల గురించి ఇంగ్లీషులో, పరిశోధకుల పదజాలంతో, వారికి అర్థమయ్యే భాషలో రాశారు. ఈ పరిశోధనల్లో కూడా పట్టుకోని కొన్ని కోణాలు ఉండడం అటుంచితే, ఉన్న రచనలు కూడా తెలుగు సినిమాల పట్ల ఆసక్తి ఉన్న తెలుగు వారికి అందుబాటులో లేవు.
తెలుగులో, తెలుగు వారి కోసం, ఆసక్తికరంగా తెలుగు సినిమా చరిత్రను సామాజిక, రాజకీయ కోణాలను వదిలిపెట్టకుండా, నోరూరగ చవులు పుట్టే రీతిలో ఎవరైనా రాస్తే బావుణ్ణు కదా అన్న నా ఆశ అలానే చాన్నాళ్ళ పాటు ఉండేది. కొన్నాళ్ళకు నేను పోగేసిన సమాచారమూ, సంపాదించుకున్న దృక్కోణాలూ, కొత్తగా చేసిన విశ్లేషణలూ చూసి నా మిత్రులు కొందరు అలాంటి పుస్తకం నేనే రాస్తే బావుంటుందని సూచించారు. అలా ఈ పుస్తకం మొదలైంది.
ఈ పుస్తకాన్ని నేను రాయడానికి పెట్టుకున్న సూత్రాలు ఇవి –
ఒకటి – ఈ పుస్తకం సినిమా ప్రియులైన పాఠకులకు ఆసక్తి కలిగిస్తూనే చరిత్ర మీద పట్టు ఉన్నవారికి కూడా ఉపయోగపడేలా ఉండాలన్నది మొదటి, ముఖ్యమైన సూత్రం.
రెండు – సినిమా రంగం సమాజంలో భాగం. ఈ పుస్తకంలో సినిమా రంగంలోని మార్పులు, అభివృద్ధి చెప్పే క్రమంలో అవసరమైన సామాజిక, రాజకీయ చరిత్రను కూడా సవివరంగానే చెప్పాను. ఈ పుస్తకం మూడుదారాలను ముడివేస్తూ వేసిన అల్లిక అనుకుంటే వాటిలో ఒక దారం సినిమా, ఇంకో దారం సామాజిక చరిత్ర, మూడో దారం రాజకీయ చరిత్ర.
మూడు – ఈ పుస్తకంలో సినిమా చరిత్ర సాగిన తీరును, పరిణామాల రాశాను తప్పించి వ్యక్తులు, సంస్థల చరిత్రగా రాయలేదు. సినిమా గమనంలోని ముఖ్య పరిణామాలు వివరించడానికి వ్యక్తులు, సంస్థల వివరాలు ఏమేరకు అవసరం అనుకున్నానో ఆమేరకు రాశాను. ఆ క్రమంలో కొందరు సినీ ప్రముఖుల వివరాలు వచ్చాయి, ఇంకొందరివి వచ్చి ఉండవకపోవచ్చు.
నాలుగు – నేను ఈ పుస్తకం రాయగలిగానంటే చాలామంది సినిమా జర్నలిస్టులు, ఫిల్మ్ స్టడీస్ అధ్యయనకారుల కృషి వల్లనే. కాబట్టి, వేరేవారి నుంచి సమాచారాన్ని సేకరించినా, వేరేవారి విశ్లేషణను ఉపయోగిస్తున్నా ఆ అంశాన్ని నేరుగానో, రిఫరెన్సుల రూపంలోనో చెప్తూనే వచ్చాను. అయితే, ఈ పుస్తకం పూర్తిగా వేరేవారి విశ్లేషణల సంకలనం కాదు. నేను స్వంతంగా చేసిన విశ్లేషణలు, ఆలోచనలు, ప్రతిపాదనలు ఇందులో చాలానే ఉన్నాయి.
ఇలా కొన్ని పద్ధతులు పెట్టుకుని పుస్తకం రాయడం మొదలుపెట్టాకా నాకు ఒక దశలో ఇది ఒక్క పుస్తకంగా రాయలేనని అర్థమైంది. అందుకోసం, దీన్ని రెండు భాగాలుగా విభజించాను. 1965 ముందు వరకూ బ్లాక్ & వైట్ యుగంగానూ, 1965 నుంచి 2009 వరకూ కలర్ యుగంగానూ విడదీసి రెండు పుస్తకాలుగా రాస్తున్నాను. అందులో మొదటి పుస్తకం ఇప్పుడు మీచేతిలో ఉంది. ఇలా విడదీయడానికి 1965నే ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 1960ల తర్వాత కలర్ సినిమాలు పెరిగాయి కాబట్టి అని సులువుగా చెప్పేయలేం. 1965 ప్రాంతంలో జరిగిన మరికొన్ని మార్పులు కూడా అందుకు కారణం. తెలుగు సినిమాలు తీసే పద్ధతి, హీరోలకు – నిర్మాతలకు మధ్య ఉన్న సంబంధం, విడుదలయ్యే సినిమాల అంకె, అవి చూపించే థియేటర్ల సంఖ్య, వాటిలో చూసే జనం లెక్క, అసలు వీటన్నిటికీ వెనకాల తెలుగు నేలపై కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక సంబంధాలూ – అన్నీ 1965 ప్రాంతంలో అంతకుముందు ఎవరూ ఊహించని విధంగా మారిపోయాయి. ఆ మార్పులేమిటో మీరు ఈ పుస్తకంలోనే చదివి తెలుసుకోవడం బావుంటుంది.
గత డిసెంబరులో నేను దాదాపు నాలుగేళ్ళ కాలాన్నీ, శ్రమనీ, పరిశోధననీ వెచ్చించి, సాధ్యమైనంత ఆసక్తికరంగా ఉండేలా ప్రయత్నించి రాసిన నేడే చూడండి పుస్తకం విడుదల అయింది. మీలో కొందరు చదివి ఉంటారు. మీరు చదవక పోతే అమెజాన్ లింక్ లో చూడండి. https://amzn.in/d/6gATaKx
–పవన్ సంతోష్ సూరంపూడి
