కళాకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

కరోనా కష్టకాలంలో కళా ప్రదర్శనలు లేక కడు దుర్భరంగా బతుకులీడుస్తున్న కళాకారులకు తక్షణ ఉపశమనంగా రూ. 10 వేలు అందించాలని పీఎన్నెమ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులకు వివిధ కళాసంస్థల నుంచి వచ్చిన కళాకారులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విజయవాడ, ఘంటసాల సంగీత కళాశాలలో సాంస్కృతిక శాఖ సంచాలకులు కార్యాలయం వద్ద కొద్ది సేపు ప్లకార్డులు చేబూని తమ సమస్యలపై నినాదాలిస్తూ కళాకారులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ కళాకారుల్ని ఇబ్బందిపెట్టిన ప్రభుత్వాలకు మంచి జరిగిన చరిత్ర లేదన్నారు. కార్యక్రమానికి పీఎన్నెమ్ ఈస్ట్ కృష్ణా అధ్యక్షుడు జి.వి. రంగారెడ్డి అధ్యక్షత వహిస్తూ కళా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు లేఖలు ఇచ్చి కూడా దాదాపు రెండేళ్లకు పైగా సొమ్ము జమచేయకపోవడం అత్యంత శోచనీయమని గర్హించారు. కార్యక్రమంలో ఎస్. జగన్నాథరావు, బొర్రా నరేన్, కవి పి.ఎన్.ఎం; ఎస్కే ఖాసిం, అప్పన్న, బాయన శ్రీనివాసరావు, సూర్యనారాయణ, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కళాకారులకు బకాయిల చెల్లింపు, గుర్తింపు కార్డులు, ఆర్థిక సహాయం కోరుతూ ప్రజానాట్యమండలి, గురజాడ, తపస్వి తదితర సాంస్కృతిక
సంస్థల కళాకారులు వినతిపత్రాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ కు అందించారు.

SA: