నీవే ప్రశ్న అయిన చోట…?

“నీవే ప్రశ్న అయిన చోట…?” కవితా సంపుటి లో 66 కవితలు ఉన్నాయి. కవి తన కవిత్వంతో నిద్ర నటిస్తూ ఉన్న వాళ్ళని తట్టి లేపుతున్నారు అని అనుకోవచ్చు. ఈ కవితల హారంలో మానవ సంబంధాల మధ్య ఘర్షణ, హృదయాలలో మరుగుతున్న ఆవేదన, సమాజపు అస్తిత్వం ఎలా నశిస్తున్నది విశ్లేషించే ప్రయత్నం చేశారు.

కవికి కృతజ్ఞత ఎక్కువగానే ఉన్నది. తను పుట్టిన పల్లె, తాను ఆడుకున్న చెఱువు, మర్రి చెట్టు ఇలా అనేకానేక విషయాలు గుర్తు చేసుకున్నారు . ఉమ్మడి కుటుంబాలలో మారుతున్న పరిస్థితులు, విభజన మనుషులనే కాదు, మనసులను నిర్వీర్యం చేస్తుంది అని అంటారు. “ప్రాణవాయువులు స్థంభించి పోతున్నాయి”
“పల్లె పడుచు పట్నంలో రెడ్ లైట్ అయిపోతోంది” అని బాధపడుతూ అయినా నా శ్వాస పల్లె, పల్లెను ప్రేమిస్తూనే ఉంటాను అంటారు కవి. నేనొక వలస పక్షిని అనే కవితలో నా గుండె కు గాయాన్ని కానీయకు, అంటూ, “ఉరి నేత” కవితలో బట్ట కట్టించే నీవు, బ్రతికి బట్ట కట్ట లేక పోతున్నావా? అంటారు.

ప్రకృతి వికృతిగా మారితే జరిగే అనర్ధాలు గుర్తు చేస్తూ, హెచ్చరించారు. ప్రకృతి చర్య ప్రశ్నార్థకమే! అంటారు.
“ఒక చినుకు” లక్ష కాల్వలై ప్రవహిస్తుంది అనటంలో ఓ ఆశాభావం వ్యక్తంచేశారు.
సి.నారాయణ రెడ్డి గారి మీద అభిమానంతో భళారే సినారె అంటూ కవితలు వ్రాశారు.
హృదయం ఉన్నవారికే ఉదయాలు ఉంటాయి అంటారు కవి, నిజమే కదా!
భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరవడితే, వచ్చే మనో సంఘర్షణ “నీలో నేను”.
పరీక్షలు వస్తే పిల్లల మన స్థితి ని చెపుతూ, స్వేచ్ఛ కోల్పోయిన ఖైదీల బాధ, పరీక్షలు అయిపోతే మాష్టారి బెత్తం దెబ్బలు తప్పించుకున్నంత సంతోషం అంటారు.

పంజరంలో నుంచి బయటపడ్డ పక్షులైపోతారు అంటూ పిల్లల మానసిక వ్యధ, చదువు పెను భారంగా పిల్లలపై పడుతుంది అని తల్లితండ్రులను హెచ్చరించారు.
వాళ్ళు ఎదగటం కోసం , ఇతరుల ను తక్కువ గా చూపే ప్రయత్నం చేసి అసమర్థుల గురించి “సెల్ఫ్ గోల్” లో ప్రస్తావించారు. “నగరం కబేళా కాదు” అని మానసిక కాలుష్యం – మనిషికి ముప్పు తేకూడదు! అని గట్టిగానే చెప్పారు.

ఇందులో కవితలు చాలావరకు రేడియో లో, వార్తాపత్రికలలో వచ్చినవే, అయినా అన్ని కవితలు మళ్ళీ మరోసారి చదవాలి అనిపిస్తుంది.
సమాజ అస్థిత్వాన్ని విశ్లేషించి చూపించిన కవి సాధనాల వేంకట స్వామి నాయుడు గారు అభినందనీయులు.

-శిరిపురపు అన్నపూర్ణ

ప్రతులకు: నీవే ప్రశ్న అయిన చోట…?
రచయిత: సాదనాల వెంకట స్వామి నాయుడు
వెల: రూ. 200/-
మొబైల్: 8555838516

2 thoughts on “నీవే ప్రశ్న అయిన చోట…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap