ఖమ్మంలో వైభవంగా నాటిక పోటీలు

ఖమ్మంలో ఆగస్టు 7 నుండి 10 వరకు వైభవంగా నెల-నెలా వెన్నెల 8వ వార్షికోత్సవ నాటిక పోటీలు

పోరాటలకు పురిటిగడ్డ మాత్రమే కాదు ఖమ్మం, కళలకు అది ఒక గుమ్మం కూడా. ఇక్కడ ప్రతి నెల మూడవ ఆదివారం నెల నెలా వెన్నెల పేరుతో ప్రధర్సింపజేసే పలు నాటికలు నాటకాలు ఇక్కడ ప్రజలకు నిజంగా ఒక గొప్పవరం అనే చెప్పాలి. క్రమం తప్పకుండ గత ఎనిమిదేళ్లుగా ఇక్కడ భక్త రామాదాసు కళా క్షేత్రంలో ప్రతి మూడో ఆదివారం ఉచితంగా ప్రదర్శించే గొప్ప గొప్ప నాటికలు ఇక్కడ రసజ్నులైన ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రములలో ఎక్కడెక్కడో ఉన్న పలు కళా సంస్థలనుండి కళాకారులను రప్పించి క్రమం తప్పకుండ ప్రతి నెల ఇక్కడ ప్రదర్శింప జేసే పలు నాటికలు నిజంగా వీక్షకులకు గొప్ప వరంగానే భావించాలి.

అమరజీవి అన్నాబత్తుల రవింద్రనాద్ కళా సాంస్కృతిక సంస్థ, ఖమ్మం కళా పరిషద్ మరియు ప్రజా నాట్యమండలి అనే ముచ్చటైన ఈమూడు కళా సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ గొప్ప కార్యక్రమాలను నిర్వహించడం ఒక విశేషం. గత 96 నెలలుగా భక్తరామదాసు కళాక్షేత్రం ఖమ్మం లో ఎన్నేన్నో గొప్ప నాటికలను యేరి కోరి ఇక్కడ ప్రధర్శిమ్పజేయడం వెనుక ఎందరో కృషి వుంది. దానిలో ముఖ్య భూమికను పోషించే వ్యక్తి అన్నాబత్తుల సుబ్రమణ్య కుమార్ గారు. రాష్త్ర వ్యాప్తంగా ఉన్న పలు కళా సంస్థలను సంప్రదించి వారి నాటికలను పరిశీలన చేసి ఎంపిక చేసిన దగ్గరనుండి రేపటి నెల వెయ బోయే నాటిక వివరాలు ఎప్పటికప్పుడు వాట్స్ అప్ సందేశాల ద్వారా ప్రేక్షకులకు తెలియజేసి ఆ రోజు నాటిక విజయవంత మయ్యేవరకు అవిశ్రాంతంగా కృషి చేయడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న వ్యక్తి శ్రీ అన్నాబత్తుల సుబ్రమణ్య కుమార్ గారు. వీరి తపన కృషికి సహకరిస్తూ సంస్థ కార్యక్రమాలు నిరవధికంగా సాగడానికి వెన్నుదన్నుగా నిలిచి ముందుకు నడిపిస్తున్న కళాపోషకులలో మరికొందరు ముఖ్యులు డాక్టర్ నాగబత్హిని రవి గారు, మోటమర్రి జగన్మోహనరావు గారు, డాక్టర్ వేల్పుల విజేత గారు, వి.వి. అప్పారావు గారు కోశాధికారిగా ఉన్న ప్రముఖ గేయ రచయిత దేవేంద్ర గారు తన వ్యాఖ్యానంతో కార్యక్రమాలను ముందుకు నడిపించే కళావాచస్పతి శ్రీ జి.రవీంద్ర గారు ఇంకా ప్రజా నాట్యమండలి గాయకులు వేముల సదానంద్ గారు, నామా లక్ష్మి నారాయణగారు మొదలైన వారు వీటి నిర్వాహణలో ముఖ్యభూమికను పోషిస్తూ ఖమ్మంను కళల గుమ్మంగా మారుస్తున్నారని చెప్పవచ్చు.

ఒక గొప్ప నాటిక ప్రదర్శించాలంటే దానివేనుక ఎన్నో వ్యయ ప్రయాసలు పడాలి. ముందు నాటికను సెలెక్ట్ చేయాలి. సంస్తను ఎన్నుకోవాలి. ఆ తర్వాత ఆయా సంస్థలు ఇక్కడకు చేరుకునేందుకు ఏర్పాట్లు మరియు పారితోషికం తదితర వసతి సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ కళాక్షేత్రం లో స్టేజి ఏర్పాట్లు రంగాలంకరణ, లైటింగ్,సౌండ్ సిస్టం ప్రేక్షకులు సౌకర్యం గా కూర్చునేవిధంగా చల్లటి ఏ సి ఏర్పాట్లు అన్ని చూడాలి. ఎన్ని చేసినా ప్రేక్షకులు లేకుంటే ప్రధర్శించి లాభంలేదు. అందుకే ప్రేక్షకులు నాటకాలను తిలకించేందుకు హాలుకు వచ్చేలా రకరకాల మీడియా ద్వారా ప్రచారం చేయాలి. ఇన్ని ఏర్పాట్లు ప్రతి నెలా వీరు చేస్తున్నారు కాబట్టే ఇప్పటికే 96 నెలలుగా ఎక్కడ ఆటంకం లేకుండా నెలా నెలావెన్నెల పేరుతో దిగ్విజయంగా ఇక్కడ నాటికల ప్రధర్షనలు కొనసాగుతున్నాయి.

నెలా వెన్నెల దిగ్విజయంగా ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆగస్టు మాసం 7,8,9,10 తేదీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణా ప్రభుత్వ సౌజన్యంతో స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో ఉభయ రాష్ట్రములనుండి 09 నాటక పరిషత్తులు పాల్గొని తమ నాటికలని ప్రదర్శించారు. అందులో మొదటిరోజు మొదటి ప్రదర్శనగా శ్రీసాయి కార్తిక్ క్రియేషన్స్ కాకినాడ వారు “ఎడారిలో వాన చినుకు” అనే నాటికను ప్రదర్శించారు.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు పెళ్లి తర్వాత భార్య మాటలతో తల్లిదండ్రులను వృద్దాశ్రమంలో వదిలివేయగా అమెరికానుంచి వచ్చిన మరో వ్యక్తి వారిని దత్తత తీసుకొందుకు ముందుకు వచ్చినపుడు కుమారుడు వారిని పాతిక లక్షలకు బేరం పెట్టడం ఇతివృత్తంగా సాగిన ఈ నాటిక ఆద్యంతం ప్రేక్షులను కదిలించింది.

రెండవ ప్రదర్శనగా కళాంజలి హైదరాబాదు వారు వేసిన “కొత్త భూతం” నాటిక డబ్బు కోసం మానవ సంభందాలు నేడు ఎంతటి నీచ స్థితికి దిగాజారిపోతున్నాయో తెలియజేసింది.
రెండవరోజు మొదటి ప్రదర్శనగా చైతన్యకళా భారతి కరీంనగర్ వారు వేసిన “ఖరీదైన జైళ్ళు “ఆధునిక సమాజంలో స్వచ్చమైన గ్రామాల్లో పూరిగుడిసెలందు బ్రతికే పల్లెవాసులకు పట్టణాలలోని అపార్ట్ మెంటులలో బ్రతుకుతున్న నాగరీకులకు మధ్య జీవన విధానాల్లో ప్రేమానుభందాలమధ్య తేడాలను వ్యత్యాసాలను కళ్ళకుకు కట్టినట్టు చూపించిన గొప్ప నాటిక ఖరీదైన జైళ్ళు.

రెండవ రోజు రెండవ ప్రదర్శనగా వేసిన మైత్రి కళానిలయం విజయవాడ వారిచే ప్రదర్శింపబడ్డ “బ్రహ్మ స్వరూపం” అనే నాటిక కుటుంభ సభ్యుల్లోని ప్రేమానుభందాల గొప్పతనాన్ని ఎంతో హ్ర్యధ్యంగా చూపించారు.
ఇక మూడవరోజు ముచ్చటగా మూడు ప్రదర్శనలు జరిగాయి, అందులో అధికారం కోసం రాజకీయ నాయకులు ఎంతటి దిగాజారుడుకైనా సిద్ధమయ్యే నేటి రాజకీయ నాయకుల వైచిత్రిని కళ్ళకు కట్టినట్లు చూపిన “ఐ ఏట్ ఇండియా” నాటికను మొదటగా న్యూ స్టార్ మోడరన్ దియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారు ప్రదర్శించగా రెండో ప్రదర్శనగా అరవిందా ఆర్ట్స్ తాడేపల్లి వారిచే వేయబడిన “విడాకులు కావాలి “సంసారంలో అప్పుడప్పుడూ వచ్చే చిన్న చిన్న గొడవలకే విడాకుల వరకు వెళ్ళి మరలా సర్డుకున్న అన్న్యోన్యమైన భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలను ఎంతో హృద్యంగా హాస్యభరితంగా చూపించిన నాటిక విడాకులు కావాలి.
మూడో ప్రదర్శనగా మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ వారి “ఇది రహదారి కాదు “నాటికను ప్రదర్శించారు. ఇందులో అంగవైకల్యంతో పుట్టాడన్న కారణంగా చిన్నారి పసిగుడ్డును రహస్యంగా ఒక రోడ్డుపక్క వదిలేసిన సాఫ్ట్ వేర్దంపతుల పిల్లాడిని రోడ్డు ప్రక్క గుడిసే లో పందులు మేపుకునే ఒక పేద స్త్రీ అనుకోకుండా చూసి తీసుకుని తనకు తెలియకుండానే ఆ సాఫ్ట్ వేర్ దంపతుల ఇంట్లోనే పని చేసుకుంటూ పెంచిన ఆ అవిటి కుర్రాడు పద్దవాడై నేషనల్ చెస్ చాంపియన్ గా ఎదిగిన తర్వాత పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టాడన్న కారణంగా రహస్యంగా రోడ్డుపక్క వదిలేసిన ఆ సాఫ్ట్ వేర్ దంపతుల నాటి పసి బిడ్డడే నేటి చెస్ చాంపియన్ అని తెలుసుకున్న ఆ దంపతులు పశ్చాత్తాపపడి తమ తప్పు తెలుసుకున్న వైనాన్ని ఇది రహదారి కాదు నాటికలో చూపించారు.

ఇకచివరిదైన నాల్గవ రోజు మొదటి ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాదు వారి చే “అమ్మ చెక్కిన బొమ్మ” అన్న నాటికను ఆఖరి ప్రదర్శనగా చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి “(అ)సత్యం” నాటికను ప్రదర్శించారు.
సంఘంలో చిన్న చూపుకు గురౌతున్న హిజ్రాగా మారుతున్న తన ఏకైక కొడుకు పట్ల సమాజం చూపే అవహేలనకు బయపడిన తండ్రి తన కొడుకుని భార్య ను వదిలి వాళ్లకు దూరంగా వెళ్ళిపోతే కన్నతల్లి ఎన్నోఅవస్థలు పడుతూ సమాజం గురించి కాకుండా పిల్లవాడి మానసిక స్థితిని అర్ధం చేసుకుని శశిగా ఉన్న కొడుకుని వెన్నెలగా మార్చి హిజ్రాలు కూడా తక్కువకాదని నిరూపించేలా వెన్నెలగా మార్చిన తన కొడుకుని పట్టుదలతో బాగా చదించి ఏకంగా IAS సాదించి జిల్లా కలక్టర్ అయ్యేలా చేసిన ఒక అమ్మ కద ను ఎంతో గొప్పగా చెప్పిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక అందరిని ఆలోచింపజేసింది, ఇక చివరిగా ప్రదర్శించిన నాటిక (అ)సత్యం, గ్రామదేవతను అడ్డం పెట్టుకుని అమాయకుడైన అన్న నుండి ఆస్తిని కాజేయాలని చూసిన తమ్ముడుకి యాదృచ్చికంగా తగిన గుణపాటం జరగడం ద్వారా అసత్యం ఎన్నటికి గెలవదు సత్యమే ఆఖరికి గెలుస్తుందని నిరూపించిన నాటిక (అ)సత్యం.
నాలుగురోజులపాటు జరిగిన ఈ నాటికలకు న్యాయ నిర్నేతలుగా ప్రముఖ సినీ నటుడు సుబ్బరాయ శర్మ గారు, మేకా రామకృష్ణగారు మరియు గోవిందరావుగార్లు వ్యవహరించి పలితాలను ఇలా వెలువరించారు.

*ఉత్తమ ప్రధమ ప్రదర్శన: (ఖరీదైన జైళ్ళు), చైతన్య కళా భారతి, కరీంనగర్
*ఉత్తమ ద్వితీయ ప్రదర్శన: (అమ్మచెక్కిన బొమ్మ), గోవాడ క్రియేషన్స్, హైదరాబాదు
*ఉత్తమ తృతీయ ప్రదర్శన: (విడాకులు కావాలి), అరవిందా ఆర్ట్స్, తాడేపల్లి, గుంటూరు
ఇంకా… పలు నాటకాలకు కన్షోలేషన్ బహుమతులతో, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకుడు లాంటి ఎన్నో బహుమతులు ప్రకటించి కళాకారులను ప్రోత్సహించారు.

07-08-2025, సాయంత్రం 05.30 గంటలకు తెలంగాణా సాంస్కృతిక సారధి చైర్ పెర్సన్ డాక్టర్ గుమ్మడి వి. వెన్నెల గారు జ్యోతి వెలిగించి నాటకాలను ప్రారంబించారు. ప్రతి రోజు ఒక సీనియర్ రంగస్థల నటుడికి సన్మానం జరించడంలో బాగంగా మొదటి రోజు శ్రీ దివి ఎస్ నారాయణ గారికి నెలా నెలా వెన్నెల అవార్డ్ ప్రధానం చేయగా, రెండవరోజు మరో సీనియర్ రంగస్థల కళాకారులు శ్రీ రంగాచార్యులు గారికి, మూడవరోజు సీనియర్ బుర్ర కద కళాకారులు శ్రీ కన్నెబోయిన అంజయ్య గారికి, నాల్గవదైన ఆఖరి రోజున ప్రజా రచయిత నంది అవార్డు గ్రహీత శ్రీ కే. దేవేంద్ర గారికి నెలా వెన్నెల అవార్డ్ ను ప్రధానం చేసారు.

మూడవ రోజు ప్రత్యేక అతిథులుగా వచ్చిన సినీ రచయిత తనికెళ్ళ భరణి దర్శకులు దసరద్ గార్లు పాల్గొని ఎనిమేల్లుగా దిగ్విజయంగా కొనసాగిన్స్తున్న నెలా నెలా వెన్నెల కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఇరువురిని నిర్వాహకులు సత్కరించారు. నాటక ప్రదర్శనలు ప్రారంభం నుండి చివరివరకు మధురరస భరితమైన తన చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్నిఆద్యంతం రక్తి కట్టించారు కళా వాచస్పతి శ్రీ రవీందర్ గారు.
నాటిక ప్రదర్శనలు జరిగిన నాలుగు రోజు కూడా ప్రేక్షకులకు తేనీరుతో పాటు రుచికరమైన స్నాక్స్ కూడా అందించారు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రామ సహాయం రఘురామ రెడ్డి గారు. ఆఖరి రోజున ప్రజాకవి దేవేంద్ర రచించిన అభ్యుదయ గీతాలను ప్రజానాట్యమండలి కళాకారులు ఎంతో ఉత్సాహంగా ఆలపించిన పాటలు ప్రేక్షకులకు ఉత్తేజాన్ని కలించాయి.
మొత్తం మీద నెలనెలా వెన్నెల ఎనిమిదవ వార్షికోత్సవం నాలుగురోజులపాటు ఖమ్మం ప్రజలలో చక్కటి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని ఆలోచనలను రేకెత్తించింది.

-వెంటపల్లి సత్యనారాయణ

1 thought on “ఖమ్మంలో వైభవంగా నాటిక పోటీలు

Comments are closed.

Share via
Copy link
Powered by Social Snap