ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి స్నేహశీలి. నాకు మంచి మిత్రుడు. నాకే కాదు చాలామందికి మంచి స్నేహితుడు. అందరితోను కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తిత్వం. అజాత శత్రువు, అతనికి విరోధులున్న విషయం నేనెప్పుడు వినలేదు. సంగీత, సాహిత్య నాటకరంగ మిత్రులన్నా, సామాజిక, రాజకీయ ప్రముఖులన్నా అక్కున చేర్చుకునే సుగుణం.

కోనసీమలో పుట్టిన గోపాలరావు పుట్టుకతోనే కళలు పట్ల, ముఖ్యంగా నాటకాల పట్ల ఆసక్తితో పెరిగాడు. ఎంతోమంది రంగస్థల కళాకారులతో మమేకమయిపోయాడు. నాటకమే శ్వాసగా, ధ్యాసగా బతికిన ధన్యజీవి. చిన్ననాడే ప్రారంభమయిన నటజీవితం, తుది శ్వాస వరకు అవిరామంగా కొనసాగింది.
వాళ్ళ నాన్నగారు ఏడిద సత్తిరాజుగారు ఉద్యోగ రీత్యా విజయనగరంలో వున్నప్పుడు, చిన్నప్పుడే ‘రాఘవ సాటకోత్సవాల’లో నిష్ణాతులయిన నటీనటులు ప్రదర్శించిన నాటకాలు చూసి స్ఫూర్తి పొందాడు. ఆ నాటకాల వల్ల తను కూడా నటించాలని, కళామతల్లికి సేవ చేయాలనే దృఢ నిశ్చయానికి వచ్చాడు.

ఆ నిశ్చయంతో మిడి మిడి జ్ఞానంతో, తనకున్న పరిధిలో ఒక నాటకం ప్రదర్శించాడు. కానీ అది విజయవంతం కాలేదు. మనస్థాపం చెందాడు. విజయాన్ని చవి చూడాలంటే, ఓటమి దారి తొక్కాలి. అనుభవనీయులైన దర్శకుల సలహాలను పాటించి ముందుకు నడవాలని తీర్మానించుకున్నాడు. అతనికి మొదటి గురువు వాళ్ళ అన్నయ్య సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, రెండవ గురువు తెలుగు నాటకానికి ఊపిరి పోసిన పద్మభూషణ్ A.R కృష్ణ. మూడవ గురువు అనేక మంది నటులను తీర్చిదిద్దిన కె. వెంకటేశ్వరరావు. ఆ తర్వాత కాకినాడలో వాళ్ళ అన్నయ్య ప్రారంభించిన ‘రాఘవ కళాసమితి’లో సభ్యుడిగా చేరి, అనేక నాటకాల్లో చేరి వైవిధ్యభరితమయిన పాత్రలు పోషించాడు. “ఇన్ స్పెక్టర్ జనరల్” “కప్పలు’, ‘నాటకం’, ‘పంజరం’ మొదలయిన నాటకాల్లో పాల్గొని దర్శకత్వపు మెళకువలు నేర్చుకున్నాడు.
ఆ తరువాత Hyderabad లో ఒక పక్క ఉద్యోగం చేస్తూ, మరో పక్క “పద్మభూషణ్ A.R. కృష్ణగారి ఆధ్వర్యంలో నట విద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ లో డిప్లమా కోసం చేరి నాటకానికి సంబందించిన అనేక విషయాలు నేర్చుకుని తోటి విద్యార్థులతో కలిసి థియరితో బాటు ప్రాక్టికలనూ పాల్గొన్నారు. అక్కడున్న అధ్యాపకులు సహకారంలో అనేక నాటకాల్లో పాల్గొన్నాడు. Diploma in Theatre Arts Certificate తీసుకున్నా ఏ మాత్రం విర్రవీగలేదు. అదే తరహాలో ఢిల్లీకి వెళ్ళి తన ప్రతిభని నిరూపించుకున్నాడు. ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా ఎన్నిక కావడం అతని జీవితంలో పెద్ద మలుపు. ఢిల్లీలో అతని జీవితం చాలా ఆనందంగా గడిచింది. ఎంతోమంది ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. స్వతహాగా చొరవ వున్నవాడు కావడం వల్ల అన్ని రంగాల్లోని గొప్ప వ్యక్తులతో కలసిపోయేవాడు. ఆఖరికి అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నీలం సంజీవరెడ్డి గారి అభిమానాన్ని కూడా చూరగొన్న ఘనత గోపాలరావుది. అలాగే తెలుగు వాళ్ళెవరయినా రాజధాని వస్తే వాళ్ళకి నిస్వార్ధంగా అతిధి మర్యాదలు చేసేవాడు. ఈ విషయంలో
అతనికి మొదటి భార్య రాధారాణి పూర్తిగా సహకరించేది. ఢిల్లీలో నాటకాలు ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులికి దగ్గరయ్యాడు. నాటకాలు తయారు చేయడంలో ఏలోటు వచ్చినా భరించలేకపోయేవాడు. ఒకసారి ఒక నాటకంలో స్త్రీ పాత్రధారణి రాలేకపోతే, ఆవిడ స్థానంలో తన సహధర్మచారిణి చేత ఆ నాటకంలో నటింపచేసిన ధైర్యవంతుడు. ఈ విషయంలో అతని భార్య సహకారం ఎంతో గొప్పది.

ఆకాశవాణిలో వార్తలు బాగా చదవడం వల్ల, అతని శక్తి, సామర్థ్యాలు గుర్తించి అతన్ని ఆకాశవాణి మాస్కోకి డిప్యుటేషన్ మీద బదిలి చేసారు. అక్కడ కూడా తెలుగు కార్యక్రమాలు అనేకం నిర్వహించి మంచి పేరు సంపాదించాడు.
పదవి విరమణ అనంతరం “సరస నవరస” అనే సాంస్కృతిక సంస్థను నెలకొల్పి వైవిధ్య భరితమైన కార్యక్రమాలను నిర్వహించాడు. 1998లో జాతీయ నాటకోత్సవాలు నిర్వహించి ఎనలేని కీర్తిని సంపాదించాడు. అతనికి గాంధీ పాత్ర వెయ్యాలనే కోరిక వుండేది. ప్రఖ్యాత నాటక రచయిత డా. డి. విజయభాస్కర్ కి తన కోరికని తెలిపి, తన కోసం ఒక నాటిక రాయమని కోరాడు. వెంటనే విజయభాస్కర్ “బాపు చెప్పిన మాట” అనే నాటికను రాసిచ్చారు. దీంట్లో గోపాలరావు గాంధీ పాత్ర పోషించి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు. ఈ నాటిక ప్రదర్శనల ద్వారా “రంగస్థల గాంధీ” గా అతని పేరు స్థిరపడిపోయింది.

Edida Gopalarao, Vijayachandar, Panduranga

83 యేళ్ళ వయసులో నవంబర్ 12 న గోపాలరావు కంఠం మూగబోయింది. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, సేవా తత్పరుడిగా, తన సహజమయిన గంభీరకంఠంతో శ్రోతల అభిమానాన్ని పొందిన వాడిగా ప్రజా సంబంధాలు పోషకుడిగా మన్ననలందుకున్న ఆత్మీయమిత్రుడు దూర తీరాలకి వెళ్ళిపోయాడన్న వార్త నాకు గుండెల్లో గునపాలు గుచ్చుకున్నట్లుగా వుంది. అతనికి అశ్రునివాళి.

పి.పాండురంగ, మాజీ సంచాలకులు, ఆకాశవాణి

Invitation

1 thought on “ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

  1. వారి మృతి కళారంగానికి తీరని లోటు….ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ….
    ఆరాధ్యుల కన్న,
    అద్దేపల్లి లక్ష్మణ్ శాస్త్రి….
    సూపర్ స్టార్ కృష్ణ చిల్డ్రన్ అకాడెమీ(బాలల నాటికలు పరిషత్)తెనాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap