నిక్ అంటే ఒక ప్రేరణ

(యువతకు గొప్ప స్పూర్తి నిచ్చే గ్రంధం నికోలస్ జేమ్స్ వుయిచిన్ విజయ గాధ)

పుస్తకం కొందరికి కేవలం హస్తభూషణం, కొందరికి మంచి నేస్తం కూడా, మనిషికి కాలక్షేపంతో పాటు చక్కని విజ్ఞానాన్నివినోదాన్ని, కళా సాహితీ సాంస్కృతిక విషయాలను తెలియజెసేవి కొన్నైతే, ఆర్ధిక విషయాలను ఆధ్యాత్మిక విషయాలను తెలిపేవి కొన్ని, ఇవన్ని ఒకెత్తయితే మనుషుల చరిత్రలు, మనిషిజీవితాలను ప్రభావితం చేసే సాహిత్యం మరో ఎత్తు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ విదమైన సాహిత్యంతో విరివిగా పుస్తకాలుగా రావడం మనం చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా, జేమ్స్ ఆలెన్, నార్మన్ విసెంట్ పీలే, శివఖేరా, జోషేప్ మర్ఫి, స్టీఫెన్ ఆర్ కోవె, లాంటి అంతర్జాతీయ పేరు మోసిన వ్యక్తిత్వ వికాస రచయితలతో బాటు మన తెలుగులో కూడా సి. నరశింహారావు, బి.వి. పట్టాభిరాం. యండమూరి లాంటి ఎందరో రచయితలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే రచనలు చేయడం మనం చూస్తున్నాం. అయితే అవన్నివ్యక్తిత్వ వికాస రచనలు, కాని ఒక వ్యక్తిని గురించి మనము ఊహించడం కూడా సాధ్యం కాని విషయాలను అతడు వాస్తవంగా చేయడం, నిండైన ఆరోగ్యంతో వున్నటువంటి వ్యక్తులు కూడా చేయలేని ఎన్నో కార్యాలను ఉహకు కూడా సాధ్యం కాని సకల అవకారంతో పుట్టిన ఒక వ్యక్తికి సాధ్యం అయితే నిజంగా గొప్ప విచిత్రమే కదా. అలాంటి వ్యక్తుల జీవిత గాధ లోకానికి స్పూర్తిదాయకం కాకుండా ఎలా వుంటుంది ?. అలాంటి స్ఫూర్తి దాయకమైన రచననే శ్రీమతి సమ్మెట ఉమా దేవి గారు తెలుగులో రాసి మనకందించిన గ్రంధం “నిక్ అంటే ప్రేరణ” నికోలస్ జేమ్స్ వుయిచిన్ విజయ గాధ.

మనిషి పుట్టుకతో సర్వాంగ సుందరంగా జన్మించి, జీవితంలో సకల భోగాలు సంపదలకు సౌకర్యాలకు యే లోటూ లేకుండా పుష్కలమైన అవకాశాలు వున్నప్పటికీ నేటి సమాజంలోని యువతలో కొందరు ఏదో కోల్పోయామన్న ఒక దిగులుతో చిన్నచిన్న సమస్యలకే పెద్దపెద్ద అఘాయిత్యాలకు పాల్పడుతూ జీవితాలను అంతం చేసుకుంటున్న సంఘటనలు నేడు మనం చూస్తున్నాం. అలాంటి నేటి యువతరానికి గొప్ప స్ఫూర్తిని కలిగించే గాధ నికోలాస్ జేమ్స్ వుయుచిన్ జీవన యాత్ర.

మనిషి దేహంలో ఒక కాలు లేదా చేయి పాక్షికంగా వైకల్యం వుంటేనే అయ్యో పాపం ఏంచేస్తాడు అని జాలి చూపే సమాజమే కాక చిన్నపాటి ఆ వైకల్యానికే అన్నీ కోల్పాయానని ఇక జీవితమే లేదని దిగాలు పడి పోయే నేటి తరానికి నికోలాస్ జేమ్స్ వుయుచిన్ పుట్టుక, జీవన యాత్ర అతను సాదించిన నేటికి సాదిస్తున్న విజయాల గురించి తెలిస్తే ఎవ్వరైనా నోరేల్లబెట్టక తప్పదు.

అంతటి స్పూర్తిదాయకమైన నిక్ యొక్క జీవిత ప్రస్థానాన్ని శ్రీమతి ఉమాదేవి గారు ఎంతో చక్కగా గొప్పగా ఆవిష్కరించారు తన రచనలో. నిజానికి వారు రాసిన మరికొన్ని పుస్తకాలతో పాటు ఈ గ్రంధం కూడా నాకు ఖమ్మంలోనే దశాబ్దాలుగా ఒక గొప్ప ఆధర్శభావాలతో ఆర్.ఆర్. హైస్కూల్ పేరుతో నడిపిస్తున్న ఆ పాటశాల కరస్పొండెంట్ట్ శ్రీ చావా ప్రసాద్ గారు ఒక రోజు నా కార్యాలయానికి వచ్చి ఉమాదేవి గారు రాసిన ఐదారు పుస్తకాలతో పాటు ఈ గ్రంధాన్ని కూడా నాకు ఈయడం జరిగింది. కాని ఉద్యోగపరంగా పని వొత్తిడితో తీరిక లేని నేను వాటిని అందుకుని దాదాపు నెల దాటినా వాటిపై ద్రుష్టి పెట్టలేకపోయాను. మొన్నఆదివారం రోజున నా ద్రుష్టి ఈ బుక్ పై పడింది. అంతే ఇక ఏక బిగిన పూర్తయ్యే వరకు వదలిపెట్టడం సాధ్యం కాలేదు.

గతంలో నిక్ గురించి నేను వినివుండలేదు, టివి లో కూడా చూసి వుండలేదు. ఆస్ట్రేలియా కు చెందిన ఈ వ్యక్తిని గురించి ఇంత సమాచారం సచిత్ర సహితంగా ఎలా సంపాదించారు ? ఎంత సమయం దీనిపై వెచ్చించి వుంటారు అని నాకు ఆశ్చర్యం కలిగింది.

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో నివాసముండే దుష్మ, నికోలస్ బోరిస్ ఉయుచిన్ దంపతులకు1982 డిసెంబర్ 4 న తొలి సంతానంగా పుట్టిన పసి గుడ్డు” నిక్ “ని తొలుత చూసిన నర్సులు తీవ్ర విబ్రాంతికి లోనయ్యారట. తల్లి ఆరోగ్య రీత్యా ఏవేవో కారణాలు చెప్పి వెంటనే ఆ బిడ్డను తల్లికి చూపకుండా ఆ పసి గుడ్డును తమవద్దనే వుంచుకున్నారట. తనకు ఏదో దాస్తున్నారని వూహించుకున్నఆ తల్లి (దుస్క్) పదే పదే తపన పడుతూ అడుగుతుండడంతో మూడు రోజుల తర్వాత ఆ తల్లి చేతిలో పెట్టారట ఆ పసిగుడ్డును. కోటి ఆశలతో ఈ భూమిమీదకు రాబోయే తమ బిడ్డ గురించి ఎన్నెన్నో కలలను ఊహించుకుంటూ ఉత్కంటంగా ఎదురు చూస్తున్నఆ తల్లిదండ్రులకు తీరా చూసుకున్నాక కళ్ళు మసకబారి లోకం అంతా అందకారమై కనిపించింది. అక్కడి నర్సులు కూడా తమ చేతుల్లో వున్న పట్టడంత బిడ్డను “వీడు మీ బిడ్డ” అని ఆ తల్లి చేతుల్లో పెట్టడానికి దైర్యం చాల్లేదు అని రాస్తారు రచయిత. కారణం ఆ కుర్రవాడు పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా కేవలం తల మొండెం రూపంలో జన్మించడం. ఒక వింత ఆకారంలో కనబడుతున్న తమ బిడ్డను చూసుకుని చెప్పలేని భయ బభ్రాంతులకి విస్మయాలకు లోనయ్యారని తమ బిడ్డను చూసుకోలేక ఒకరకమైన వికారానికి గురయ్యి ఆ బిడ్డను చూసిన చూసినవెంటనే ఇక్కడ నుండి తీసుకుపోండి అని ఆతల్లి బిగ్గరగా రోదించడం చూసి అక్కడి హాస్పిటల్ నందు నర్సులు కన్నీళ్లు పెట్టుకున్నారంటూ రచయిత చెప్పే విదానం చదివే పాటకున్ని కూడా ఎంతో కలచివేస్తుంది.

చాలా భిన్నరీతిలో జన్మించిన ఆ చిన్ని శిశువుకు రెండు కాళ్ళు రెండు చేతులూ లేవు కేవలం మొండెం మత్రమే వుంది ఒక తొడకు చిన్న పాదం లాంటిది వుంది. కదిలేందుకు అవయవాలు లేని ఆ పసి గుడ్డుకి అందరిలాగే ఆకలి వుంది. ఆ ఆకలి బాధను తెలిపేందుకు స్వరం వున్నది అది విస్వజనీనమైన భాష. అదీ అమ్మకోసం ఆకలికకోసం శిశువు చేసే అప్రయత్న రోదన. అమ్మ స్పర్శ కోసమొ, వెచ్చదనం కోసమో పొత్తిళ్ళలో వున్నా ఒక మాంశం ముద్ద వంటి ఆ ఆకారం పుట్టుకతో అందరిలాగే క్యార్ మనే ఏడ్చింది అంటూ అంటూ ఎంతో హృద్యంగా అప్పటి స్థితిని వర్ణిస్తారు రచయిత ఉమాదేవి గారు.

టెట్రా పోకో మోలియో సిండ్రోం వ్యాది పలితంగా ఇలా పుట్టుకతో శాశ్వత అవకరంగా పుట్టిన తమ బిడ్డను మొదట దగ్గరకు తీసుకునేందుకు బయపడినా తర్వాత వాస్తవం గమనిన్చించిన ఆ తల్లిదండ్రులు నెమ్మదిగా ఆబిడ్డ పట్ల తాము ఎంతో శ్రద్దతో అతని ఉనికి మెరుగుదల కోసం విశ్వ ప్రయత్నాలు చేసేవారు . వైకల్యంతో పుట్టిన కొందరికి కనీసం కృత్రిమ అవయవాలానైన అమర్చేందుకు అవకాసం వుంటుంది కాని నిక్ విషయంలో ఆ అవకాసం లేదు, పోనీ అతని ఒక తొడ దగ్గ చిన్న పాదంలా అనిపించే అవయువం వున్నప్పటికి దానికి వున్నటువంటి వ్రేళ్ళు కూడా అంటుకు పోయీ వుండడంతో అది కూడా వుపయోగం లేకపోవడంతో అతని తలిదండ్రులు మొదటగా డాక్టర్ని సంప్రదించి ఆ చిన్ని పాదానికి శస్త్ర చికిత్స చేయించడంతో వ్రేళ్ళు కాస్త విడివడి కదిలించే అవకాసం ఏర్పడింది .నాటినుండి నిక్ ఎదుగుతున్న క్రమంలో అతను తన సర్వ శక్తులూ కూడదీసుకుంటూ నిలబడడానికి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ మెల్లామెల్లగా తన మొండాన్ని కదిలిస్తూ చిన్న పాదం సహాయంతో అడుగులువేయడం కూడా ప్రారంభించగా ఆ ఇంట్లో ఎక్కాడా అతడికి గాయాలు కాకుండా అతని తల్లిదండ్రులు అంతటా మెత్తటి కార్పెట్లు పరిచి అతని స్వయంశక్తికి కావాల్సిన సకల ఏర్పాట్లు చేసీ జాగ్రత్తగా చూసేవారట .నిక్ కి అందరిలా కదలడానికి మెదలదానికి కాళ్ళు చేతులు లేవు కాబట్టి అతను ఎలాగైనా స్వతంత్రంగా శక్తివంతంగా ఎదగాలని అతని తలిదండ్రులు బాగా ఆలోచించి అతనికి ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసి అతను తన చుట్టూ వున్నా వారిని చూసి మానసికంగా క్రుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగేలా అతన్ని ప్రోత్సహించడంతో కాస్త వయసు వచ్చేసరికి గడ్డం కింద హాకీ స్టిక్ లాంటి స్టిక్ పెట్టుకుని లైట్ , ఫ్యాన్ స్విచ్చులు వేయడం నేర్చుకున్నాడు ,ప్రత్యేక ఏర్పాటుతో స్వయంగా బ్రష్ చేసుకోవడమే గాక తన అవకరంగా వున్న చిన్ని పాదం సాయంతో స్విమ్మింగ్ పూల్ లో ఈదడం, గోల్ఫ్ బాల్ విసరడం ఇలా అసాధ్యమైన పనులన్నీ నెమ్మదిగా సుసాధ్యం చేసుకోవడం మొదలు పెట్టాడు.

నిక్ కి అయిదారేల్ల వయసు రాగానే స్కూల్లో చేర్పించినపుడు అక్కడ టీచర్స్ పిల్లలు విబ్రాంతికి లోనవడమే గాక ప్రతీ రోజు అతన్ని అందరూ వింతగా దూరంనుండి చూస్తూ ఒక్కోసారి రకరకాలుగా అనుకోవడమూ అతని పట్ల జాలిచూపించడము లాంటి చేష్టలు రోజూ అతన్ని మానసికంగా కుంగదీసి ఒక సారి స్నానపుతోట్టిలో మునిగిపొతూ ఆత్మహత్యాప్రయత్నం చేయబోతున్న నిక్ ని చూసిన తన చెల్లి తమ్ముళ్ళు తన తండ్రికి వెంటనే తెలపడంతో తండ్రి బోరిస్ వెంటనే నిక్ ని రక్షించి అతనికి ధైర్యాన్ని నూరిపోసాడు. మొదటినుండి తన పేరెంట్స్ చూపిన ఆ ప్రేమ ఆదరణ నిక్ లో మరింత ఆత్మ స్థైర్యం వచ్చేలా చేసాయి. దానితో అతను మరింత పట్టుదలతో ఎవరికీ తీసుకుపోకుండా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుని తీవ్రమైన తన ప్రయత్నం, తన పేరెంట్స్ తోడ్పాటుతో విస్మయం కలిగించే విజయాలను అతడు సాదించిన తీరు నిజంగా గొప్ప ప్రేరణ ను కలిగిస్తుంది.

తనచిన్ని పాదాన్ని కేవలం పాదంగానే గాక జీవన పోరాటానికి ఆయుధంగా చేసుకున్నాడు. తన భావిజీవితంలో ఆ చిన్నిపాదమే కలమై ఎన్నో పుస్తకాలను రాసే సాధనంలా మార్చుకున్నాడు. ఆ పాదంతోనే బైబిల్ ని చదివేవాడు, దానితోనే బంతాట, హకీ, గోల్ప్ తదితర ఆటలు ఆడేవాడని, టెలీఫోన్ వాడేవాడని, కీ బోర్డ్ వాయించేవాడని కంప్యూటర్ కీ బోర్డ్ మీద నిముషానికి నలబై పదాలు రాసేంత వేగాన్ని సాదించాడని అతని సాధనను ఎంతో గొప్పగా తెలియజేస్తారు రచయిత. ఊహించడానికే సాధ్యం కానంత అవకరంతో పుట్టిన నిక్ పన్నెండేళ్ళ వయసులోనే తన స్కూల్ కి కెప్టన్ కావడమేగాక స్థానిక స్వచ్చంద సంస్తలకోసం నిదుల సేకరణ కై విద్యార్ధి మండలితో కలిసి పనిచేసాడు పదిహేడేళ్ళ వయస్సులో తన ప్రార్ధనబృందంలో ప్రసంగాలివ్వడం ప్రారంబించాడు. ఆ తర్వాత తన లాభాపేక్ష లేని “లైఫ్ వితౌట్ లిమ్బ్స్” అనే స్వచ్చంద సంస్థను స్తాపించాడు.

నిక్ మానసికంగా ధైర్యం పుంజుకుంటున్నఈ తరుణంలో క్వీన్స్ లాండ్ లోని ఒక హైస్కూల్ ఉపాధ్యాయుడు వికలాంగులకోసం పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ కోసం నిధులు సేకరించే భాద్యతను అప్పగించాడు. అందుకు మొదట అక్కడ వున్న అయిదారుగురు విద్యార్దులకోసం అతను మాట్లాడమని నిక్ ని కోరగా తొలిసారిగా అతను చేసిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుందట. అంతే అతను అక్కడ పాటశాల నుంచి జిల్లా రాష్ట్రము దేశందాటి అతని వయసుతో బాటు చదువును, జ్ఞానాన్నిపెంచుకుంటూ అంతర్జాతీయంగా గొప్ప ప్రేరణాత్మక ప్రసంగీకునిగా ఎదిగిన తీరును ఎంతో చక్కగా వివరిస్తారు రచయిత. తాను చదువుతూ ప్రసంగాలతో పంతోమ్మిదేల్లకే సొంతంగా సంపాదించడం మొదలు పెట్టాడు. తన సంపాదనలో పొదుపు చేసిన సొమ్మును తన పంతోమ్మిదేల్లకే తన తల్లిదండ్రులతో తాను సౌత్ ఆఫ్రికా వెళ్తాను అక్కడ అనాదలకు తను దాచుకున్న సొమ్మును అందజేస్తాను అని చెప్పినప్పుడు తన తండ్రి బోరిస్ మొదట బయపడినా కాని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదట. అప్పటి ఆ పర్యటనే తర్వాత కాలంలో ఎన్నోదేశాలను సందర్శించడానికి శుభారంభమయిందని చెప్తారు. ఊహకందని అవకరంతో వున్న నిక్ లోని చురుకుదనం ప్రవహంలా సాగే ప్రేరనాత్మకమైన అతని ప్రసంగాలు అతన్ని గొప్ప అంతర్జాతీయ ప్రసంగీకునిగా మార్చేసాయి.

తన ప్రసంగాలకు వేరే విషయాన్నీ ఎక్కడినుండో వెతకవలసిన అవసరంలేకుండా తన జీవిత కధను జోడించి తనను ప్రత్యక్ష నిదర్శనంగా చూపుకుని ఎక్కడా ఎప్పుడూ దిగులు పడవలదని నిరాశతో సాదించేది ఏమీ లేదని ప్రతీ సమశ్యకు పరిష్కారాన్ని వెతుక్కుని ముందుకు సాగాలని చెప్పేవాడు. రెండు చలనావయాలు లేని తాను ఏమి చేయగలనో అని ఆలోచించుకుని తన శక్తిని అంచనా వేసుకుని తనకున్న వాక్పటిమను చక్కగా వినియోగించుకున్నాడు నిక్. తన ప్రసంగాలను కేవేలం దివ్యాన్గులకోసమే గాక భాదాతప్తులందరికి ఊరటనివ్వడమె తన ధ్యేయంగా భావించి సందర్భానుసారం అతడు చేసే ప్రసంగాలతో ప్రపంచ వ్యాప్తంగా ఒక తిరుగులేని ప్రసంగీకుడిగా మారడమే గాక 2005 లో లైఫ్ వితౌట్ లిమ్బ్స్, 2007 లో ఏటిట్యూడ్ ఈస్ ఆల్టిట్యూడ్, లాంటి ఎన్నో సంస్థలను స్థాపించి తనలా శారీరక వికలాంగులకోసం, అన్నార్తులకోసం ఎన్నో విదాలుగా సేవ సహాయం చేస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపి ఎందరికో గొప్ప స్పూర్తిగా నిలిచాడు.

ప్రపంచవ్యాప్తంగా అతడు ఇచ్చే ప్రసంగాలకు హాజరయ్యే వేలాది ప్రజల్లో కొందరు మీరు ఇంత సంతోషంగా ఎలా వుండగాలుగుతున్నారు అని అడుగుతుంటే నిక్ “ఆకాశం నుండి అద్భుతాలు ఏమీ మనకోసం రాలిపడవు అని ఎంతో మార్దవంగా ఎన్నెన్నో నిజాలను అతడు సూటిగా చెప్తూనే విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు కొద్దిగా స్తిమితపడి ధైర్యాన్ని కూడదీసుకుని వివేచనతో దాన్ని ఎదుర్కొండి అని జవాబిచ్చేవాడు. మనం సంతోషంగా వుండాలంటే ముందు మనం వున్న స్థితిని అంగీకరించగలగాలి. మనం మార్చలేని అంశాలు కొన్ని వుంటాయని తెలుసుకోవాలి అపుడే మనకు స్థిరత్వం వస్తుంది దీనిని నేను ఒక్క రోజులో సాధించలేదు. నాలోని అనేకానేక సంఘర్షణల పలితమే ఈ స్థిరత్వం. ఈ చిరునవ్వులు మన కల్ల ముందు చేతుల్లో వున్నదంతా దేవుని కల్పన అని నమ్మిననాడు మనకు మనకు కలిగే స్థిరత్వం ఇది. దీనిని వ్యతిరేకించేందుకు వీలులేదు. నిశ్చయంగా అందరం దానిని ఆమోదించక తప్పదు. ఆ ఆమోదాన్ని భారంగా గాకుండా దానికి మోదాన్ని జత కలిపి ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం సజావుగా సాగుతుంది. మన అంతరాల్లో చెలరేగుతున్న తుఫాను అందరికి తెలియాల్సిన అవసరం లేదు. దిగులు భారాన్ని మనం మోయగూదడుకూడా వదిలెయ్యండి భారమంతా వదిలేసి చెయ్యవలసిన పనులు చెయ్యండి నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను నిర్వర్తించండి. అంటూ అతడు చేసే భోదలు నిజంగా గొప్ప స్పూర్తిదాయకమైన ప్రసంగీకునిగా అతనికి పేరు తీసుకువచ్చాయి.

ఒక విషయాన్ని గాని గ్రంధాన్నిగాని మనం చదవాలంటే అందలి భాషలో చదివించే గుణం, చక్కగా ముందుకు నడిపించే గుణం వుండాలి. అప్పుడే పాటకుడికి ఆ గ్రంధ పటణంపై ఆసక్తి అనేది ఏర్పడుతుంది. ఉమాదేవి గారు రచించిన ఈ గ్రంధంలో చక్కటిస్పూర్తి దాయక విషయానికి తోడు తెలుగు అనువాదంలో ఆమె ఉపయోగించిన చక్కటి భాష కూడా తోడయ్యింది. పై పేరా నందలి విషయం చదివితే ఇది మనకు అర్ధమౌతుంది. అంతే గాకా పుస్తక ముద్రణలో కూడా రంగుల్లో ఆకర్షనీయంగా వుండాలని ఆమె తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రేమ అడుగడునా మనకు కనిపిస్తుంది.

ఇంతటి గొప్ప స్పూర్తిదాయకమైన నికోలస్ జేమ్స్ ఉయుచిన్ (నిక్)ని గురించి ఇంత సమాచారాన్ని సచిత్ర సహితంగా ఎలా సేకరించగలిగారు అని నేను దీని చదివిన తర్వాత ఉమాదేవి గారికి ఫోన్ చేసి అడిగినప్పుడు ఆమె చెప్పుకొచ్చారు. నిక్ యొక్క జీవన క్రమాన్నంతా తన తండ్రి బోరిస్ RAISING THE PERFECTLY IMPERFECT CHAILD అనే పేరుతో ఇంగీష్ లో బుక్ రాసారని దానితో బాటు యూ ట్యూబు, నెట్ ద్వారా సేకరించిన అంశాలద్వార ఈ నిక్ అంటే ప్రేరణ అనే ఈ గ్రంధాన్ని తెలుగులోకి తీసుకురాగాలిగానని, యూట్యూబ్ లో వీడియోలను మ్యూట్ చేసి కాలసిన ఫొటోస్ అన్ని సేకరించానని చెప్పుకోచ్చినప్పుడు ఆమె ఈ గ్రంధం పట్ల ఎంత శ్రద్ధ పెట్టారో అర్ధమయ్యింది నిజంగా చాల సంతోకరమై వారిని అభినందించకుండా వుండలేకపోయాను.

ఖమ్మం జిల్లాకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారు ఇంకా అమ్మ కథలు, రేలపూలు, తండావాసుల కథలు, జమ్మి పూలు, తన స్కూలు పిల్లకోసం “అల్లరి కావ్య, పిల్లల దండు, నిజాయితి, పిల్లి ముసుగు, ఇంకా, చిలుక పలుకులు, తన స్కూలు అనుభవాలతో “మా పిల్లల ముచ్చట్లు ఇలా పలు గ్రంధాలను రచించారు. 128 పేజీలతో వున్న ప్రస్తుత గ్రంధం “నిక్ అంటే ప్రేరణ –నికోలస్ జేమ్స్ వుయిచిన్ విజయగాధ నిజంగా ఎంత స్పూర్తిదాయక మైన రచన. ప్రతీ పేజీ కూడా రంగుల్లో సచిత్రంగా మిత్రులు పుక్కల్ల రామకృష్ణ గారు ఎంత చక్కగా ఆకర్షనీయంగా డిజైన్ చేసారు. కవీర్ణ ప్రచురణ సంస్థ వారు చాలా క్వాలిటీ పేపర్తో ముద్రించారు. ప్రతీ ఒక్కరూ చదివి తన లైబ్రేరీలో దాచుకోదగిన ఈ గ్రంధం.

వెల 250/-రూపాయలు.
ప్రతులకు : రచయిత్రి సమ్మెట ఉమాదేవి, మొబైల్ 9849406722


వెంటపల్లి సత్యనారయణ
9491378313

1 thought on “నిక్ అంటే ఒక ప్రేరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap