
అవును, ఎంత ధైర్యం ఉండాలి? తెలుగు నేలపై జీవిస్తూ సంపాదిస్తూ పిల్లలను చదివిస్తూ, ఆస్థులు కూడగట్టుకుంటూ “మాకు తెలుగు వద్దు” అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? అదే తమిళనాడుకు వెళ్లి తమిళ్ వద్దు అనమనండి, ఆధార్ కార్డు చిరునామా రద్దు చేసి ఎక్కడ నుంచి వచ్చావో అక్కడకు వెళ్ళమని ఆదేశాలు వచ్చి ఉండేవి. కేరళలోను అంతే, కర్ణాటక అటు ఉత్తరాది రాష్ట్రాల్లోను అంతే! ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ధైర్యం! ఎందుకంటే ఇక్కడ ఒకరికి ఒకరికి పడి చావదు. అందుకే ఇంత చులకన.
హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్స్ లో చదివే పిల్లల తల్లిదండ్రులు తెలుగు భాషపై నిరసన తెలియచేసారు. తెలుగు వద్దు బాబోయ్ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుగు తప్పనిసరి నేర్చుకోవాలనే నిబంధన పెట్టి అమల్లోకి తీసుకొచ్చింది. పూర్తిగా తెలుగులో చదవడం కాదు. తప్పనిసరిగా తెలుగు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తెలుగు భాష నేర్చుకోవాలి.
హైదరాబాద్ కాస్మోపోలిటన్ మహా నగరం. ఇక్కడ దేశ విదేశాలకు చెందిన జనం జీవిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్లంతా హిందీ మాట్లాడతారు. అందులో తప్పు పట్టడానికి ఏం లేదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తూ తెలుగు నేర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపించక పోవడం విడ్డూరం. తెలుగు నేల పై ఆర్ధికంగా స్థిరపడి కూడా తెలుగులో మాట్లాడటం నామోషీగా భావిస్తూ ఉండటం విచిత్రం. నలుగురు కలసిన చోట ఇంగ్లీష్ లోనో హిందీలోనో మాట్లాడుకోవడం ఫ్యాషన్. వారి వారి మాతృభాషలను తక్కువ చేయడం లేదు కానీ, సుందరమైన అందమైన తెలుగు నేర్చుకోవడం కూడా చులకనగా చూసి “అబ్బే మాకొద్దు తెలుగు” అంటూ ప్లే కార్డ్స్ పట్టుకుని నిరసన తెలిపారు చూడండి. ఎంత ధైర్యం ఉండాలి?
నిజానికి ఇది వారి ధైర్యం కాదు. ఇక్కడి తెలుగు వారి సంస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స అయినా, ఇతర భాషలను గౌరవించే తెలుగు వారి గొప్ప సంప్రదాయం. బతకడానికి వలస వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఆదరించే ఘనమైన సంస్కృతీ. అందుకే ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నిరసనలు చేయగలుగుతారు. స్వేచ్ఛగా ర్యాలీలు, ధర్నాలు కూడా చేస్తారు! స్థానికుల కన్నా బాగా సంపాదించుకుంటారు.
అసలు వారి తప్పేం లేదు. మనలో మనకే పడదు. మనలో చాలామందికి తెలుగు అంటేనే పడదు. మమ్మీ డాడీ సంస్కృతిని అలవాటు చేసుకున్నాం. విదేశాలకు పంపించి చదివించడం మనకు చాలా గొప్ప. ఇక్కడ తెలుగులో చదివి తెలుగులో మాట్లాడుతూ ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవడం మనకు నామోషీ. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో అడుగడుగునా అవమానాలు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ హాయిగా బతకొచ్చు. పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ తెలుగు రాష్ట్రంలో మాత్రం కేవలం పన్నులు మాత్రం కడుతూ రాజకీయంగా జోక్యం చేసుకోకుండా, ప్రభుత్వ సాయం పొందకుండా బతికేయాలి. కేవలం ఓట్లు మాత్రమే వేయాలి. తెలుగు వారంటే తెలుగు వారికే పడనంత కాలం తెలుగు భాషకు కష్టాలు తప్పవు! తెలుగు భాషా వికాసం కేవలం తెలుగు భాషా దినోత్సవం రోజునే గుర్తుకొస్తుంది అంతే. తప్పు అంతా మన తెలుగు వారిలో పెట్టుకుని “తెలుగు వద్దు” అని నిరసనలు చేస్తున్న ఉత్తరాది వారిని తప్పు పట్టి ప్రయోజనం ఏముంది?
–డా. మహ్మద్ రఫీ