సత్యవోలు రాంబాబు గారు, మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, నిజామ్ పేట్ (వి), హైదరాబాద్ లో నివాసం.
కళారంగంలో చిత్ర-విచిత్రమైన ప్రయోగాలు, ప్రక్రియలు, ప్రయత్నాలు చేస్తున్నవారి సంఖ్య రాను రాను పెరుగుతుంది. అలాగే ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు, గుర్తించి రికార్డ్స్ ఇచ్చేందుకు చాలా సంస్థలు వచ్చాయి. అందరు కుడి చేత్తో డ్రాయింగ్-పేయింటింగ్ చేస్తే, ఎడమచేత్తో చేసేవాళ్ళు కొందరు, చేతులే లేనివాళ్లు కాళ్ళతో చేస్తారు కొందరూ…..
సత్యవోలు రాంబాబు గారు కూడా అదే కోవలోకి వస్తారు. ఈయన పెన్సిల్ ను వాడరు, కుంచెలు వాడరు. చివరకి కనీసం తన చేతులను కూడా ఉపయోగించరు. కానీ చిత్రాలు తయారవుతాయి. అదేలా….? విచిత్రం ఏమిటంటే “ముక్కు”తో పేయింటింగ్ చేయడం.
స్కూలుకు వెళ్లే వయసులోనే చిత్రకళపై ఆసక్తి పెంచుకున్నారు. అదే స్కూల్ లోని గురువు గారి ప్రేరణతో మరింత శ్రద్ధ పెరిగింది. పాఠశాల స్థాయిలోనే డ్రాయింగ్ లో లోయర్, హైయ్యర్ పూర్తి చేశారు. కుంచెతో ఎన్నో చిత్రాల్ని వేసారు. రెండు పదుల వయసులోనే రాష్ట్ర, జాతీయ స్థాయి బహుమతులను గెలుచుకున్నారు. ఇంటర్ వరకూ చదువు సాఫీగానే సాగినా, డిగ్రీ చదువు భారమని భావించి, తనకు తెలిసిన కళతోనే జీవన ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. రెండు మూడేళ్లు నెట్టుకొచ్చారు. కూకట్ పల్లిలో వృత్తి మరియు ప్రవృత్తిగా “సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్” పేరుతో ఆర్ట్ స్కూల్ ను ప్రారంభించి ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ, ఆగిపోయిన చదువును పూర్తి చేసారు.
రాంబాబు గారికి, చిన్నప్పటి నుండి కళ అంటే ఎంతో ఇష్టంతో డ్రాయింగ్, పేయింటింగ్ నేర్చుకున్నారు. ఈ కళారంగంలోనే టీచింగ్ లో కూడా అభివృద్ధి చేసుకున్నారు. చాలా మందిలా, ఓ కళాకారుడిగా కాకుండా వినూత్నమైన ఆలోచనతో, ఏడేళ్ల పాటు కఠోరమైన పట్టుదలతో “ముక్కు”తో చిత్రాలు గీయడంలో నైపుణ్యం సాధించారు. ఇప్పటి వరకు ముక్కుతో గీసిన పేయింటింగ్స్ ల సంఖ్య వందకు దాటిపోయాయి. రాంబాబు గారి ప్రతిభను గుర్తించిన బీబీసీ వార్తాసంస్థ ఇతని నాసికా చిత్రాలను ప్రసారం చేసింది. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ప్రజల సమక్షంలో నాసికా చిత్రాలు గీసిన రాంబాబు గారు, విజయవాడ లో ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారి సమక్షంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం బొమ్మను చిత్రించి ఔరా అనిపించుకున్నారు. ఆ తర్వాత సినీ నటుడు చిరంజీవి గారి ముఖ చిత్రాన్ని ముక్కుతో చిత్రించి, ఆ చిత్రాన్ని చిరంజీవి గారికే బహుకరించారు సత్యవోలు రాంబాబు.
ఏ కళైనా సామాజిక సందేశానికి దోహదపడాలే తప్ప కాసులు దండుకునేది కాకూడదు అనే రాంబాబు ముక్కుతో చిత్రాలు గీయడంమామూలు విషయంకాదంటున్నాడు. ఇలాంటి ప్రక్రియలో శారీర శ్రమ అధికమని, రెండు కళ్లు ముక్కు చివరి అంచుపైనే కేంద్రీకరించాలి. ఈ ప్రయత్నంలో కళ్లు బరువెక్కుతాయి.అప్పుడప్పుడు పార్శ్వనొప్పి వస్తుంటుంది. అంతేకాదు ముక్కు పై చర్మం కోతకు గురవుతుంది. అని ఇబ్బందుల్ని వివరించారు. కానీ ఈ కష్టపడటంలో ఆనందముంటుందనీ, గీసిన చిత్రాలు చూసుకున్నాక మనసులో అంతులేని సంతృప్తి కలుగుతుందనీ మెరిసే కళ్లతో చెబుతారు. అలాగే నా ముఖచిత్రం కూడా ముక్కుతో బ్లాక్ రంగుతో అప్పటికప్పుడు చిత్రించారు రాంబాబు గారు.
సోలో ఎగ్జిబిషన్స్ దాదాపుగా ఇరవైకు పైగా ఏర్పాటు చేసారు. వర్క్ షాపులు కూడా 15-20 దాకా ఏర్పాటు చేసారు. మనకు నచ్చిన రంగంలో రాణించడంలోను, ఎంత మందికి వీలయితే అంత మందికి కళాసేవ చేయ్యాలని వుందంటారు రాంబాబు గారు. ఇప్పటి వరకు తన దగ్గర ముప్పై వేలకు పైగానే శిక్షణ తీసుకున్నారు. ఇంకా వేల సంఖ్యలో చిత్రకళతోపాటు, బి.ఆర్క్., నేషనల్ ఇనిస్టిట్యూట్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, డ్రాయింగ్ మరియు క్రాఫ్ట్ టీచర్ ట్రయినింగ్ మొదలగు కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు.
చివరిగా ‘ఏ రంగంలోనైనా యువత చాలా ముందడుగులో వుంటున్నారు. వివిధ రంగాలతోపాటు ఫైనార్ట్స్, ఫ్యాషన్, ఆర్కిటెక్ట్, యానిమేషన్ మొదలగు రంగాలలో పిల్లలకు తల్లి, తండ్రులు ప్రోత్సహించితే తప్పకుండ రాణిస్తారని’ వివరించారు చిత్రకారుడు రాంబాబు.
డా. దార్ల నాగేశ్వర రావు
Excellent work Rambabu garu.
సృజనాత్మకంగా ఏదైనా చేయాలనే తపన,
నిరంతర అభ్యాసం, చిత్రకళా నైపుణ్యం..
వెరసి సత్యవోలు రాంబాబు!
అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో దిట్ట!
ఆయన కుంచె నుంచి జాలువారిన ప్రతి చిత్రం ఓ అద్భుత కళాఖండం!
ఆయన ముక్కుతో చిత్రింపబడిన ప్రతి చిత్రరాజమూ ఒక అద్భుత సృజన!
Excellent Rambabu gaaru