నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా….
ఆయన నటనకే పాఠాలు నేర్పిన బడిపంతులు.. అందంలో చందమామాను మించిన మేజర్ చంద్రకాంత్.. అభినయ నర్తన శాలకు ఆయనే సార్వభౌముడు. ఆయన గళం విప్పితే గర్జించే బొబ్బిలి సింహం.. ఆయనే మన నందమూరి తారక రామారావు. ఐదు దశాబ్దాల నటన, అనితర సాధ్యమైన ప్రయోగాలు.. అది సాంఘికమైనా, జానపదమైనా, పౌరాణికమైనా.. పాత్ర ఏదైనా ఆయనకు నల్లేరు మీద నడకే. అందుకే సినీ చరిత్రలో ఎన్టీఆర్ శకం.. తెలుగు సినిమాకు శతకం. ఇరవైలో అరవై పాత్రలు చేశారు.. అరవైలో ఇరవై పాత్రలు చేశారు. ఆయన సాధించిన రికార్డులు అనితర సాధ్యం. అలాంటి నందమూరి తారక రాముడు పరమ పదించి ఈ జనవరి 18కి 25 ఏళ్లు. 1996 జనవరి 18 ఆయన కన్నుమూశారు. మన దేశం నుంచి తెలుగు దేశం వరకూ సాగిన ఆయన పయనాన్ని అవలోకిస్తే ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు.. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం.
మన దేశంతో తొలి అడుగు
మైలు దూరం నడవాలంటే ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి.. ఒక్క ఛాన్స్ తోనే నిరూపించుకోవాలి. అది ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది. ఎన్టీఆర్ నటనా ప్రస్థానంలో తొలి అడుగు ‘మనదేశం’ సినిమాతోనే పడింది. నిజానికి ఆ సినిమా నటుల పేర్లలో ఎన్టీఆర్ ఎక్కడో మారుమూల కనిపిస్తుంది. మరి ఇలాంటి పాత్రను ఆయన ఎందుకు ఒప్పుకున్నట్టు. చరిత్రలోకి వెళితే ఆయన హీరోగానే సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని భావించినట్లు తెలుస్తోంది. ఇంటర్ చదివేటప్పటి నుంచే నాటకాల జీవితం ప్రారంభమైనా అప్పటికి సినిమా ఆలోచన ఆయనకు లేదు. ఆయన బీఏ చదివేటప్పుడే రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఒకటి పి. పుల్లయ్య నుంచి, రెండోది రెండోది జంధ్యాల గౌరీనాధ శాస్త్రి నుంచి. బీఏ పూర్తయ్యే వరకు సినిమాలు చేసేది లేదని పుల్లయ్యకు ఎన్టీఆర్ చెప్పడంతో ఆ సినిమా ఛాన్స్ పోయింది. రెండోది జంధ్యాలవారి సినిమా ప్రారంభ దశలోని ఆగిపోయింది. ఎల్వీ ప్రసాద్ అప్పడప్పుడే పైకొస్తున్న దర్శకుడు. ఆయన తన సినిమా కోసం కొత్త నటులను వెతికే క్రమంలో విజయవాడ రావడం, ఎన్టీఆర్ తో మాట్లాడటం జరిగింది. రంగస్థలంలో ఎన్టీఆర్ ఆవేశపూరిత పాత్రలు ఎల్వీ ప్రసాద్ కి బాగా నచ్చాయి. చిన్న పాత్ర ఉంది. రమ్మనడంతో ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదు. బహుశా ఆయన హీరోగానే చేయాలనుకున్నట్లు ఉంది. పైగా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం ఉంది. ఆ తర్వాత హీరో వేషం ఉందని ప్రసాద్ రమ్మనడంతో ఎన్టీఆర్ మద్రాసు వెళ్లారు. ‘నటుడిగా నేను పైకొస్తాను అని మీరు హామీ ఇస్తే నేను సినిమా రంగంలో ఉంటా. లేకపోతే వెళ్లిపోతా’ అని ఎన్టీఆర్ తెగేసి చెప్పారు. ఎన్టీఆర్ ను తీసుకెళ్లి దర్శకుడు బీ.ఏ. సుబ్బారావుకు అప్పగించారు ఎల్వీ ప్రసాద్. అది ‘పల్లెటూరి పిల్ల’ సినిమా. హీరో వేషం ఎన్టీఆర్ కు ఖరారైపోయింది. పైగా అదికూడా మీర్జాపురం రాజా ఆర్థిక సహకారంతో రూపొందుతున్న సినిమానే.
హీరో వేషం ఎన్టీఆర్ కు ఖరారైపోయింది. పైగా అదికూడా మీర్జాపురం రాజా ఆర్థిక సహకారంతో రూపొందుతున్న సినిమానే. ఆయన తెరవెనుక పాత్రధారుడిగా బీఏ సుబ్బారావుతో ఆ సినిమా నిర్మించారు. చివరిగా ఎన్టీఆర్ తో ఎల్వీ ప్రసాద్ ఓ మాటన్నారు. ‘కెమెరా అంటే ఏమిటో నీకు తెలియాలంటే ఈ చిన్న పాత్ర వెయ్యి’ అంటూ ‘మనదేశం’లో ఇన్ స్పెక్టర్ పాత్ర గురించి చెప్పారు. అలా అనడంవల్లే ఎన్టీఆర్ ఆ పాత్రను ఒప్పుకోవలసి వచ్చింది. నిజానికి ఆయన లక్ష్యం హీరో చెయ్యా లనేదే. హీరో మీదే గురి పెట్టారు… సాధించారు. మడమ తిప్పడం ఆయనకు చేతకాదు.. అడుగు పెట్టాక అంతు తేల్చాల్సిందే.
ఎన్టీఆర్ పలికిన తొలి డైలాగ్…
అప్పట్లో సినిమా షూటింగులు ఎక్కువ భాగం స్టూడియోల్లోనే జరిగేవి. ఎన్టీఆర్ పై తొలి సన్నివేశాన్ని కూడా శోభనాచల స్టూడియోలోనే చిత్రీకరించారు. ఇది రాజాగారి సొంత స్టూడియో, పోలీస్ ఇన్ స్పెక్టర్ వేషంలో ఎన్టీఆర్ మేకప్ తో సిద్ధమయ్యారు. అనుమతి లేకుండా సభ నడుపుతున్నందుకు ఉద్యమకారుడైన హీరో నారాయణరావును అరెస్టు చేసేందుకు ఎన్టీఆర్ వస్తారు. హీరో ఎదురు తిరుగుతాడు. పరిస్థితి అదుపు తప్పుతుంది. దాంతో లాఠీ చార్జి చేయక తప్పలేదు. దర్శకుడు “యాక్షన్’ చెప్పగానే ఎన్టీఆర్ ఏకంగా ఆ పాత్రలో జీవించేశారు. ‘ఈ మీటింగ్ జరగడానికి వీల్లేదు’ అని ఎన్టీఆర్ అంటే “జరుగుతున్న సభను ఆపడానికి వీల్లేదు’ అని హీరో నారాయణరావు బదులిస్తారు. ఇదే ఎన్టీఆర్ తొలి డైలాగ్. నారాయణరావు జవాబుతో ఎన్టీఆర్ చేతిలోని లారీకి పూనకం వచ్చేసింది. ‘ఛార్జ్ ‘అంటూ అడొచ్చిన వాళ్లను చితకబాదారు. సెట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థంకాలేదు. దర్శకుడు ‘కట్…కట్ అంటూ బిగ్గరగా అరిచేశారు. ఎన్టీఆర్ లో పూనకం తగ్గింది. ఆయనను దర్శకుడు ప్రసాద్ దగ్గరకు పిలిచాడు. ‘నటించవయ్యా అంటే నరమేధం సృష్టించేలా ఉన్నావే. చూడబ్బాయ్.. ఇది డ్రామా కాదు సినిమా. దీనికి ఫీల్డు అనేది ఉంటుంది. గుర్తుంచుకో’ అంటూ సున్నితంగా మందలించారు. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఆయన చెప్పే ఓ డైలాగ్ ను ఎప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేరు. ఇంత చిన్న కానిస్టేబుల్ నుంచి ఇంత పెద్దవాడిని అయ్యాను” అంటూ పలికిన డైలాగు మాదిరిగానే నందమూరి తారకరాముడిని నిజంగానే అంతవాణ్ణి చేసి అత్యున్నత శిఖరాల మీద కూర్చోబెట్టింది. ‘మనదేశం’ పాత్రధారుడితోనే ‘తెలుగుదేశం’ పార్టీ పెట్టేలా చేసింది.
మొదటి సినిమాలోనే హీరోతో ప్రశంసలు
నాగయ్య తర్వాత అప్పట్లో పెద్ద హీరో సిహెచ్. నారాయణరావే. ఆ సినిమా షూటింగులో ఎన్టీఆర్ ని చూసి ఆయన అన్నమాట ఏమిటంటే ‘చూడు రామారావ్.. నీకు మంచి కంఠం ఉంది… మంచి రూపం ఉంది. కొన్ని దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏలేస్తావ్’ అన్నారట. ఆ మాట నిజమే అయి మూడున్నర దశాబ్దాల పాటు ఆయన సినిమా రంగాన్ని ఏలేశారు. ఏలడం అంటే పది, ఇరవై కాదు.. ఏకంగా ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగానికి ఆయనే రారాజు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు.. ఏ నటుడూ ఇన్ని రకాల వైవిధ్యమైన పాత్రలతో ఇన్ని చిత్రాల్లో నటించిన దాఖలాలు లేవు. ఇకముందు ఆ రికార్డు మరే హీరోకీ దక్కదు కూడా.
ఎక్కడ నిమ్మకూరు? ఎక్కడ చెన్నై?
ఎన్టీఆర్ సొంతూరు కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు. 1923 మే 28న జన్మించారు. నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకట్రామమ్మ దంపతులకు జన్మించారు. వ్యవసాయ కుటుంబం. స్వయంకృషితో గ్రాడ్యుయేషన్ వరకూ చదువుకుని ఎదిగారు. సైకిల్ పై తిరిగిన ఎన్టీఆర్ అదే సైకిల్ గుర్తుపై గెలుపొంది ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. పల్లెటూరి పిల్ల, షావుకారు సినిమాలతో సినిమాలతో హీరోగా ఆయన పయనం ప్రారంభమైంది. ఒక విధంగా చెప్పాలంటే తొలి పాన్ ఇండియా హీరో కూడా మన ఎన్టీఆరే. ఎందుకంటే 1951లో ఆయన పాతాళభైరవి సినిమా సాధించిన రికార్డులు అంతాఇంతా కాదు. తెలుగు సినిమాకు మరో స్టార్ హీరో దొరికాడని నిరూపించిన సినిమా ఇది. ఆ తర్వాత మల్లీశ్వరి, మిస్సమ్మ, మాయాబజార్ లాంటి సినిమా సాధించిన రికార్డులు అసాధారణమైనవి. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి పాత్రలు చూశాక దేవుడు ఇలాగే ఉంటాడని అందరూ అనుకున్నారు. అందుకే ఆయనను దేవుడిలా తెలుగు ప్రజలు ఆరాధించారు. హిట్ల జాబితా తీసుకుంటే ఇన్ని హిట్లు వచ్చిన హీరో మరొకరు లేరని కూడా మనం చెప్పవచ్చు. ఆంధ్రుల ఆరాధ్య దైవంగా జనం కొలిచి తమ నాయకుడిగానూ ఎన్నుకున్నారు. 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రికార్డును కూడా ఆయనే సొంతం చేసుకున్నారు.
ఐదు దశాబ్దాల నటన ఒక ఎత్తు.. 14 ఏళ్ల రాజకీయం మరో ఎత్తు. ప్రాంతీయ పార్టీల బలం ఎలా ఉంటుందో ఇందిరాగాంధీ లాంటి నేతకు చవిచూపించిన ఘనత మన ఎన్టీఆర్ ది. నాడు ఎన్టీఆర్ నాటిన తెలుగు దేశం అనే బీజం వట వృక్షంగా ఎలా విస్తరించిందో అందరికీ తెలుసు. ఆ మహానటుడు జీవించి ఉంటే ప్రధాని పీఠాన్ని కూడా అధిష్టించి ఉండేవారు. అలాంటి ఘనత కూడా ఒక్క తెలుగు నటుడికే దక్కి ఉండేది. కుటిల రాజకీయాలకు తట్టుకోలేరని కాబోలు ఆ భగవంతుడు త్వరగానే ఆయనను తన దగ్గరకు తీసుకెళ్లిపోయారు.
- హేమసుందర్
👌👌👌🙏
Great leader….