(జనవరి 18, నటరత్న ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా)
ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు. పరిచయం అక్కర్లేని పేరు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి.. నటుడిగా ఎదిగి.. ఆపైన రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది. రాముడెలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కృష్ణుడినీ ఎవరూ చూడలేదు. రావణబ్రహ్మ, దుర్యోధనుడు ఇలా ఉంటారని ఎన్టీఆర్ వేషం కట్టాకనే ప్రేక్షకులకు అవగతమైంది. ఇలా కలకాలం గుర్తుండిపోయే పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ఎన్టీవోడి బొమ్మ కోసం జనం బళ్లు కట్టుకుని వెళ్లేవారు. ఆ యుగ పురుషుడి నటన తీరు, డైలాగుల జోరు ప్రేక్షకుల కరతాళధ్వనుల హోరులో కలిసిపోయేది. ‘మనదేశం’ చిత్రం దగ్గర్నుంచి ‘నాదేశం’ వరకు అప్రతిహతంగా సాగిన సినీ ప్రస్థానం తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో నిదానించింది. ఆ తర్వాత వేళ్లమీద లెక్కించే సినిమాలే చేయగలిగారు. 1996 జనవరి 18న 72 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. శక్తి అని నమ్మి తీరాల్సిందే. ఆయన మన మధ్య లేకపోయినా ‘అన్న’గారని గౌరవంగా పిలుచుకుంటున్నాం. తారకరాముడి జీవితాన్ని పరికించి చూస్తే విజయాలే అధికంగా కనిపిస్తాయి. ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మార్మోగిపోతోంది. ఎన్టీఆర్ పేరిట రాజకీయ పార్టీలు, విద్యాసంస్థలు, వైద్యాలయాలు, కాలనీలు, తపాలæ బిళ్లలు, అవార్డులు ఉన్నాయి. ఇలా ఒకటేమిటి ఎన్నో స్మారకాలు ఆయన్ను సజీవంగా నిలబెడుతున్నాయి. అవేమిటో వివరంగా చూద్దాం.
తొమ్మిది నెలల్లో పండంటి విజయం:
నందమూరి తారక రామారావు పేదలకోసం ఏదైనా చేయాలని తపించేవారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పేరిట కొత్త పార్టీని స్థాపించారు. కేవలం తొమ్మిది నెలల కాల వ్యవధిలోనే శాసనసభ ఎన్నికల్లో నిలిచి గెలిచారు. కాంగ్రెసేతర తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా చైతన్యరథాన్ని తయారుచేయించి దానిమీదే రాష్ట్రమంతా తిరిగారు. ఆయన స్ఫూర్తితో ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ చైతన్యరథాలకు రూపకల్పన చేయించడం గమనార్హం. ఆయన మరణానంతరం సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. చంద్రబాబు ప్రభుత్వం ‘అన్న క్యాంటీన్లు’ ఏర్పాటుచేసింది. అలా అన్నింట ‘అన్న’ మిన్నగా నిలిచారు. విజయవాడలో ఎన్టీఆర్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ వెటర్నరీ కాలనీ ఉన్నాయి. గుంటూరులో ఎన్టీఆర్ బస్ స్టేషన్ తెలియనివారుండరు. అనేక సహకార భవనాలకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ గార్డెన్స్ 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధి ఉంటుంది. భాగ్యనగరంలోనూ ఆయన పేరిట వీధులు, కాలనీలు, పేటలు, స్టేడియం ఉన్నాయి. ఏటా ఆయన జయంతి రోజున మహానాడు నిర్వహిస్తున్నారు. ఇదీ ఒక స్మారకమే. అన్నింటికంటే ఘనమైన విషయం ఏమిటంటే… ఎన్టీఆర్ పేరిట ఒక జిల్లా ఏర్పడ్డం. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు 2022లో కొత్త జిల్లా ఆవిర్భవించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్టీఆర్‌పై అభిమానంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరు మిళితమైఉన్న కృష్ణా జిల్లాను రెండు భాగాలుగా విభజించి ఒకదానికి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేశారు. దీన్ని పార్టీలకతీతంగా అందరూ స్వాగతించారు. రెండ్రూపాయల బియ్యం, వైద్యసేవ, భరోసా, విద్యోన్నతి వంటి పథకాలకు ఆయన పేరే పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ సుజల స్రవంతి.. ఇలా ఎన్నో రకాలుగా ఆయన ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. రామారావు హయాంలో బస్‌స్టేషన్లకు అచ్చమైన తెలుగులో నామకరణం చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ను తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణమని సంబోధించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరిపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు పదం వినిపించగానే గుర్తొచ్చే పేరు అన్న ఎన్టీఆర్.
నటనపరంగా….
ఎన్టీ రామారావు నాటకాలు ప్రదర్శించే రోజుల్లో నేషనల్ ఆర్ట్ థియేటర్ (ఎన్.ఎ.టి.) అనే సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ పలు సినిమాలను నిర్మించింది. ఇంతకుముందే చెప్పినట్లు రాముడు, కృష్ణుడు వేషాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. జీవిత కాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. శత జయంతి సందర్భంగా 2023 ఆగస్టు 28న ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. భారత తంతి తపాల శాఖ తపాలాబిళ్లను ఆవిష్కరించింది. ఊరూరా అన్నగారి విగ్రహాలకు కొదవ లేదు. నటుడు బాలకృష్ణ తండ్రి బయోపిక్‌ను ఎన్టీఆర్ కథనాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేరిట రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఆయన పేరిట ‘ఒకే ఒక్కడు’ పుస్తకాన్ని సీనియర్ ఎడిటర్ ఐ.వెంకట్రావు వెలువరించారు. ఆ తారకరాముడి మనుమడు, హరికృష్ణ కుమారుడికి మళ్లీ తారక రామారావుగా నామకరణం చేయడంతో జూనియర్ ఎన్టీఆర్‌గా వెండితెరపై ఆ పేరు ఇంకా కనిపిస్తూనే ఉంది. కనిపిస్తూనే ఉంటుంది!
–చెన్నాప్రగడ శర్మ
చరవాణి: 9440587567
