
నందమూరి తారకరామారావు NTR తెలుగుజాతి గుండె చప్పుడు 26వ వర్థంతి సందర్భంగా 64కళలు ఘననివాళులు అర్పిస్తున్నది. తెలుగోడి, గుండెచప్పుడు, పౌరుషాన్ని ప్రపంచం నలుదిశలా చాటిచెప్పిన మహనీయుడు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీథులలో తాకట్టుపెట్టబడితే వెండితెరపై ఇలవేల్పుగా వెలుగొందుచున్న తరుణంలో 1982లో తెలుగుజాతి కి పార్టీని పెట్టి 9నెలల కాలంలోనే ఉమ్మడి ఆంథ్రప్రదేశ్ ఎన్నికలలో విజయదుంధుభి మ్రోగించి ప్రభంజనం సృష్టించారు.
నందమూరి తారకరామారావు ది 28-05-1923లో కృష్ణాజిల్లా, పాత గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. విజయవాడ దత్తత వచ్చారు. విజయవాడ గాంథీజీ మునిసిపల్ హైస్కూల్ లో పాఠశాల విద్య పూర్తిచేసి స్థానిక SRR కళాశాలలో పియుసి చదివారు. విద్యార్థి దశలోనే కళారంగంలో రాణించారు. విశ్వనాథవారు వీరికి తెలుగు మాస్టారు. డిగ్రీ గుంటూరులో చదివి రిజిష్టార్ గా మంగళగిరిలో పనిచేశారు. సినిమాపై మక్కువతో ఉద్యోగం మానేసి మద్రాసు సినీరంగ ప్రవేశం చేసి మనదేశం సినిమాతో తెరంగేట్రం చేశారు.అంచెలంచెలుగా ఎదిగి తెలుగుకళామతల్లి ముద్దుబిడ్డగా సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల కథానాయుకుడిగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడై తెలుగుప్రజల హృదయాలలో స్థిరపడి నీరాజనాలు అందుకున్నారు. రాముడు, కృష్ణుడు, శ్రీనివాసుడు పాత్రలలో భగవంతుడిగా లీనమైపోయారు. అదే కాలంలో రావణుడు, దుర్యోధనుడీ లాంటి ప్రతినాయకుడిగా కూడా అదేస్థాయిలో నటించి ఆబాలగోపాలంతో శభాష్ అనిపించుకున్నారు.
ఉమ్మడి ఆంథ్రప్రదేశ్ కు 3సార్లు 7సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.పలు పాలనా సంస్కరణలు తెచ్చారు. మండల వ్యవస్థ ఏర్పాటు, మునసబ్, కరణాలురద్దు, ఆడపిల్లలకు ఆస్తిహక్కు, రూపాయకే కిలోబియ్యం, ప్రజలవద్దకే పాలన, టీచర్ ఉద్యోగాలకు డి.యస్సి. లాంటి అనేక సంస్కరణల ద్వారా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలచారు. ది 18-01-1996న మహనీయుడు పరమపదించారు. ఆ రోజు తెలుగువాడి గుండెపగిలింది. అందరూ తమ ఆప్తుని కోల్పోయినట్లు రోదించారు. నేడు ఆ మహనీయుని 64కళలు ఘన నివాళులు అర్పిస్తున్నది. 2022 మే 28 నుండి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమౌతాయి. కారణజన్ముల పుట్టక, మరణం చరిత్రలో శాశ్వత స్తానం పొందుతుంది.