ఎన్టీఆర్ 20 యేళ్ళ సినీ ప్రయాణం …

(మే 20 న, తారక్ 38 వ పుట్టినరోజు సందర్భంగా …)

జూనియర్ ఎన్టీఆర్, తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఇప్పుడొక సంచలనం. నటనకు నిలువెత్తు నిదర్శనంగా డైలాగ్ డెలివరీ కి సరైన గొంతుక గా, నటనలో పర్ఫెక్షన్ కు పర్ఫెక్ట్ నటుడిగా కొన్ని కోట్ల మంది హృదయాలు గెలుచుకున్న మన ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ మే 20న వస్తుండగా ఇప్పటినుండే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొనింది. ఇండస్ట్రీ లో అందరూ తారక్ అని ముద్దుగా ప్రేమతో పిలుచుకునే మన ఎన్.టి.ఆర్ విశ్వవిఖ్యాత ఆంధ్రుల అన్న నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా, ఆయన రూపంతో అచ్చు గుద్దినట్టుగా అదే విధమైన హావభావాలు పలికించడంలో దిట్ట. ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు మే 20,1983 న జన్మించాడు.

చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. తరువాత బలరామాయణం సినిమాతో బాలనటుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న తారక్ 2001లో నిన్ను చూడాలని చిత్రం ద్వారా హీరో గా తెరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే అచ్చం సీనియర్ ఎన్టీఆర్ కు వారసుడిగా నందమూరి అభిమానులతో గుర్తించబడిన తారక్ ఆ సినిమాతో ఇండస్ట్రీ పెద్దలను కూడా ఆకర్షించాడు.

ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా ఘన విజయం సాధించారు. ఆ సినిమాను ఎన్టీఆర్ కు మంచి కమర్షియల్ హిట్టుతో పాటు పరిపూర్ణ నటుడిగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో తారక్ నటన చూసి యావత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం తారక్ ని అభిమానుల సంఘం గా మారింది అంటే తారక్ నటన స్థాయి గురించి అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా అయితే మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో తారక్ అప్పటి అగ్ర నటులలో ఒకనిగా ఎదిగారు. ఆ తరువాత ఆంధ్రావాలా, నరసింహుడు, సాంబ వంటి సినిమాలు చేసిన ఎన్టీఆర్ కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన రాఖి సినిమా ద్వారా మంచి టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు పొందారు. కాగా అప్పటికే కొంచెం హెవీ వెయిట్ గా ఉన్న తారక్ 2008 లో “మెహర్ రమేష్” దర్శకత్వంలో నటించిన “కంత్రి” సినిమా కోసం ఫుల్ స్లిమ్ లుక్ లోకి వచ్చి అందరిని షాక్ చేసాడు. 2010 లో “వి.వి.వినాయక్” దర్శకత్వంలో వచ్చిన “అదుర్స్” మంచి విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం “వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన “బృందావనం” ఆ సంవత్సరపు అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాదా, రామయ్య వస్తావయ్యా, రభస, వంటి సినిమాలో నటించిన తారక్ ప్రతి సినిమాతో తన మార్కెట్ పరిధులు పెంచుకుంటూ టాప్ హీరోల రేసులో ఎప్పుడూ తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు.

ఆ తరువాత డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాలో అయితే తన నటవిశ్వరూపం చూపించి సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టు చేసారు. ఆ సినిమాలో మనం తారక్ నటన, స్థాయిని పూర్తిగా చూడొచ్చు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా తారక్ ఎంతో సునాయాసంగా చేయగలరు అని నిరూపించుకున్నారు. ఆ తరువాత లెక్కలు మాస్టారు గా పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో నటించిన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో కూడా ఒక పరిపూర్ణ నటుడిగా మరోసారి నిరూపించుకొని, ఆ సినిమాలో ఎమోషనల్ వేవ్ లెంత్ ఉన్న క్యారక్టర్ ని అత్యద్భుతంగా ప్లే చేసారు తారక్. తరువాత కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో, 2017 దసరాకి జై లవ కుశ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించారు తారక్, ఎటువంటి క్యారక్టర్ అయినా ఆ క్యారక్టర్ కు ఎన్ని షేడ్స్ ఉన్నా నటుడిగా మాత్రం తారక్ ప్రతి సినిమాతో తనలో బెస్ట్ ఇస్తూ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ లెవల్ గుర్తింపు సాధించారు. మధ్య బుల్లితెరలో కూడా “బిగ్ బాస్” అనే రియాలిటీ షో కి హెస్ట్ గా వ్యవహరించి తను అంటే ఏంటో నిరూపించుకుంటున్నారు. 2018 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ద్వారా కూడా బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం ఆర్. ఆర్. ఆర్. లో నటిస్తున్నాయి. ఈ సినిమాలో తారక్ కొమరమ్ భీమ్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి తారక్ వెర్షన్ గా విడుదల అయిన కొమరం భీం టీజర్ 50 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొలిపింది. అంతేకాక ఇండస్ట్రీ లో ఉన్న అందరి హీరోస్ ని ఒకటిగా ఒక తాటి మీదకు తీసుకొచ్చి హీరోల అభిమానుల, మధ్య సన్నిహిత సంబంధాలకు తారక్ శ్రీకారం చుట్టారు అని చెప్పుకోవచ్చు. కాగా మే 20 న తన 38 వ పుట్టినరోజు సంతోషంగా జరుపుకోనున్న తరుణంలో మేము బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తారక్ మరెన్నో గొప్ప గొప్ప సినిమాలు చేయాలనీ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోవాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap