బాలకృష్ణ చేతుల మీదుగా విజేతల లిస్ట్ విడుదల
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకుని “నందమూరి తారక రామారావు – ఆయన వ్యక్తిత్వం” అనే అంశం పై కలయిక ఫౌండేషన్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యారికేచర్ మరియు కవితల పోటీ ఫలితాలను యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.
క్యారికేచర్ విభాగంలో బెంగుళూర్(ఇండియా)కు చెందిన కె. కుముద మొదటి బహుమతి(ఒక లక్ష రూపాయలు), హైదరాబాద్ (ఇండియా)కు చెందిన కె. భవాని రెండవ బహుమతి( డెబ్భై ఐదు వేలు), ఇండోనేషియా దేశానికి చెందిన నుర్వేదా జనియార్థ మూడవ బహుమతి (యాభై వేలు) గెలుచుకున్నట్లు బాలకృష్ణ తెలియజేశారు. అలాగే ప్రత్యేక బహుమతుల కింద ఆంధ్రప్రదేశ్ (ఇండియా)కు చెందిన ఎన్నార్ కుమార్, మధు మంద, తెలంగాణ (ఇండియా)కు చెందిన అశ్వక్, వెంకటేష్ జక్కుల మరియు బెల్జియం దేశానికి చెందిన రెడ్ ఖలీల్ లు ఒక్కొక్కరు పదివేల రూపాయల బహుమతిని గెలుచుకున్నట్లు ఆయన ప్రకటించారు.
అలాగే కవితల పోటీ విభాగంలో డాక్టర్ పెళ్లూరు సునీల్ రాసిన “తెలుగు అక్షరం” అనే కవిత మొదటి బహుమతి(ఇరవై అయిదు వేలు), డాక్టర్ కొప్పాడ శ్రీనివాసరావు రాసిన “జగమునేలిన జగదేక వీరుడు” అనే కవిత రెండవ బహుమతి(ఇరవై వేలు), ఎస్. ఆసియా రాసిన “చెరగని నీడ” అనే కవిత మూడవ బహుమతి(పదిహేను వేలు) కింద ఎంపికైనట్లు హీరో బాలకృష్ణ ప్రకటించారు.
ప్రత్యేక బహుమతుల కింద డాక్టర్ ప్రసాద్ కల్లూరి రాసిన “నటనంటే నందమూరి”, దోసపాటి వెంకట రామచంద్రరావు రాసిన” ఆదర్శవంతం – ఆచరణీయం”, వై.మంజులత రాసిన “నట సార్వభౌములు”, ఎం. లక్ష్మి శాంతి రాసిన “సినీ శిరోమకుటం”, గొంటుముక్కల గోవిందు రాసిన “కారణ జన్ముడు తారక రాముడు”, సనత్ జయసూర్య రాసిన “నందమూరి రామ తారకం”, మాజీ ఎంపీ డాక్టర్ డి.వి.జి.శంకరరావు రాసిన “స్ఫూర్తి దాత ఎన్ఠీఆర్ “, వాడపర్తి వెంకటరమణ రాసిన “అతడో హిమోన్నత శిఖరం”, శ్రీధర్ కొమ్మోజు రాసిన “అన్నగారు” కె. శివకృష్ణ రాసిన “చూడముచ్చటగా ఉండి” అనే కవితలు ప్రత్యేక బహుమతి కింద (ఒక్కొక్కరికి ఐదు వేలు) ఎంపికైనట్లు బాలకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణను హీరో బాలకృష్ణ అభినందించారు. అలాగే ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేశారు.
ఎన్ఠీఆర్ పై ఉన్న అభిమానంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించినట్లు కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ తెలియజేసారు. ఆరు ఖండాల్లోని 60 దేశాల్లో ఈ పోటీ వివరాలను ప్రచారం చేసినట్లు ఆయన తెలియజేశారు. 21 దేశాలకు పైగా కళాకారులు ఈ పోటీలో పాల్గొన్నట్లు నారాయణ వివరించారు. విజేతలకు ప్రయిజ్ మనీ ఇవ్వడంతో పాటు క్యారికేచర్ మరియు కవితల సంపుటాలను కూడా ప్రచురించి ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. బహుమతి కార్యక్రమం, పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమ వివరాలు త్వరలో వెల్లడిస్తామని నారాయణ పేర్కొన్నారు.