తెలుగుజాతి యుగపురుషుడు…తారక రాముడు

మీర్జాపురం రాజా 1946లో ఒకవైపు ‘కీలుగుఱ్ఱం’ చిత్రాన్ని నిర్మిస్తూనే భార్య కృష్ణవేణి కోరికపై స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో రాజకీయ దృక్పథాలను అనుసంధానిస్తూ ‘మనదేశం’ పేరుతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రానికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ఆ సినిమాలో పోలీస్ ఇనస్పెక్టర్ పాత్రకోసం కొత్త నటుణ్ణి అన్వేషిస్తూ నందమూరి తారక రామారావుని ఎంపికచేశారు. షూటింగుకు అంతా సిద్ధం అయింది. ఆ సన్నివేశంలో ఆందోళన చేస్తున్న హీరో నారాయణరావును అరెస్టు చేసేందుకు పోలీస్ ఇనస్పెక్టర్ వస్తాడు. హీరో ఎదురు తిరుగుతాడు. పరిస్థితి అదుపు తప్పుతుంది. లాఠీ చార్జి చేయడం అనివార్యమౌతుంది. దర్శకుడు “యాక్షన్” చెప్పారు. ఎన్టీఆర్ తన పాత్రలో జీవించాడు. అతనిచేతిలోని లాఠీకి పూనకంవచ్చింది. అడ్డొచ్చినవాళ్ళను చితకబాదాడు. సెట్లో యేంజరుగుతుందో తెలియని పరిస్థితి. దర్శకుడు “కట్…కట్” అంటూ బిగ్గరగా అరుస్తున్నాడు. “స్టాప్” అంటూ కేకలేశాడు. వాతావరణం చల్లబడింది. రామారావుని దర్శకుడు పిలిచాడు. “నటించవయ్యా అంటే నరమేధం సృష్టించేలా ఉన్నావే. చూడబ్బాయ్. ఇది డ్రామా కాదు. సినిమా. మరీ అంతగా విరుచుకపడి నటించాల్సిన అవసరం లేదు” అంటూ సినిమా సూక్ష్మతను వివరించాడు. అదీ మన తారకరాముడికి పనిమీద వుండే నిబద్ధత, అభినివేశం. “ఇంతవాణ్ణి. ఇంతవాణ్ణయ్యాను” అంటూ పలికిన తొలిడైలాగు నందమూరిని నిజంగానే అంతవాణ్ణిచేసి అత్యున్నత శిఖరాలమీద కూర్చుండబెట్టింది. క్రమశిక్షణే పరమావధిగా, లక్ష్యసాధనే ధ్యేయంగా, సాహసమే ఊపిరిగా నందమూరి వెండితెర జీవితం ఆసాంతం అసాధారణ విజయాలతో కొనసాగింది. 1982లో ప్రజాజీవనంలోకి అడుగిడి “ప్రజలే దేవుళ్ళు. సమాజమే దేవాలయం” అనే సిద్ధాంతంతో ప్రాంతీయ పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆ తారక రాముడిదే. ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్క రూపాయిని మాత్రమే జీతంగా స్వీకరించిన తెలుగుజాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రాముడు. తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన ధీశాలి రామారావు. ఆ అభినవరాముని వర్ధంతి సందర్భంగా ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ప్రస్థానం గుర్తుచేసుకుందాం.

తొలిరోజుల్లో నందమూరి..
కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 28 మే 1923న నందమూరి తారక రామారావు జన్మించారు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకటరామమ్మ. వారిది సామాన్య రైతు కుటుంబం. ఏడేళ్ళ వయసులోనే రామారావుకు రామాయణం, భారతం వంటి పురాణాలు వంటబట్టాయి. బెజవాడ మునిసిపల్ హైస్కూలులో చదువు పూర్తిచేసి 1940లో స్థానిక ఎస్.ఆర్.ఆర్ కాలేజిలో ఇంటర్మీడియట్ లో చేరారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అప్పట్లో తెలుగు విభాగానికి అధిపతిగా వుండేవారు. ఒకసారి కాలేజీలో ప్రదర్శించిన ‘రాచమల్లు దౌత్యం’ అనే నాటకంలో రామారావు ‘నాయకురాలు నాగమ్మ’ వేషం వేయాల్సి వచ్చింది. అయితే మీసాలు తీయనని విశ్వనాథ తో చెప్పి మీసాలతోనే ఆ వేషం వేసి రక్తి కట్టించారు తారకరాముడు. అప్పుడే 1942లో అంటే 19వ యేటనే రామారావుకు మేనకోడలు బసవరామ తారకంతో పెళ్లి జరిగింది. 1943లో గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరి నాటకాల్లో చురుకైన పాత్ర పోషించారు. నేషనల్ ఆర్ట్స్ అనే నాటక సమాజాన్ని స్థాపించి సహ విద్యార్థులు కొంగర జగ్గయ్య, కె.వి.ఎస్. శర్మ, కాలేజి లాబ్ అసిస్టెంటు వల్లభజోస్యుల శివరామ్ తదితరులతో ‘బలిదానం’, ‘మల్లమ్మ ఉసురు’, ’ఆలీ, ది కాబులర్’ వంటి యెన్నో నాటకప్రదర్శనలు ఇచ్చారు. నవజ్యోతి, నాట్యసమితి వంటి స్థానిక నాటక సమాజాలతో కలిసి బృందనాటకాలు ప్రదర్శించారు. ఆరోజుల్లో ముక్కామల కృష్ణమూర్తి ఈ నాటక బృందాలకు మార్గదర్శకునిగా వుండేవారు. 1947లో బి.ఎ. పట్టా పుచ్చుకున్న తరవాత ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. పోలీసు శాఖలో సబ్ ఇనస్పెక్టర్ వుద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది. డెహ్రాడూన్ లో షార్ట్ సర్వీస్ కమీషన్డ్ ఆఫీసరు వుద్యోగానికి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. కానీ తండ్రి వద్దనడంతో రామారావు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. బెజవాడలో వుండగా సారథి స్టూడియో వారు నిర్మించబోయే ‘శ్రీమతి’ అనే చిత్రంకోసం కొత్త ఆర్టిస్టుల వేట ప్రారంభమైంది. పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఈ విషయమై ఎల్.వి. ప్రసాద్ విజయవాడ వచ్చారు. అప్పుడు రామారావును సుబ్రహ్మణ్యం అనే శ్రేయోభిలాషి దుర్గా కళామందిరంలో ‘రైతుబిడ్డ’ సినిమా చూస్తున్న ఎల్.వి. ప్రసాద్ వద్దకు తీసుకెళ్ళాడు. రామారావును చూడగానే ప్రసాద్ కు ఆయన బాగానచ్చారు. తను రాజమండ్రి వెళుతున్నానని, మద్రాసుకు వెళ్ళగానే కబురు పంపుతానని, స్క్రీన్ టెస్టుకు రావలసివుంటుందని చెప్పివెళ్ళారు. కొద్దిరోజుల్లోనే మద్రాసు నుంచి రామారావుకు కబురొచ్చింది.

మద్రాసులో అడుగుపెట్టి…
రామారావు మద్రాసు వెళ్లి శోభనాచల స్టూడియోలో ఎల్.వి. ప్రసాద్ ని కలుసుకున్నారు. అక్కడ ‘ద్రోహి’ చిత్రం షూటింగు జరుగుతోంది. దర్శకుడు ప్రసాద్ మేకప్ మ్యాన్ మంగయ్య చేత రామారావు కు మేకప్ చేయించి టెస్ట్ చేసి, కొన్ని స్టిల్స్ తీసి, చిన్న సన్నివేశాన్ని చిత్రీకరించి వాటిని పరిశీలించిన తరవాత కబురు చేస్తానని చెప్పడంతో రామారావు బెజవాడ వచ్చి ‘ఎన్.ఎ.టి’ సంస్థ తరఫున నాటకాలు ప్రదర్శించసాగారు. తమ్ముడు త్రివిక్రమరావు, అట్లూరి పండరీకాక్షయ్య నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. తరవాత రామారావు మద్రాసు సర్వీస్ కమీషన్ పరీక్ష రాసి సబ్-రిజిస్ట్రారు వుద్యోగం సంపాదించాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వుద్యోగం చేస్తుండగా ఎల్.వి. ప్రసాద్ నుంచి వుత్తరం వచ్చింది. ‘శ్రీమతి’ చిత్ర నిర్మాణం ఆగిపోయిందని, మీర్జాపురం రాజా నిర్మిస్తున్న ‘మనదేశం’ చిత్రంలో మంచి పాత్రవుందని మద్రాసు రమ్మని రాశారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదలి రామారావు మద్రాసు వెళ్ళారు. అప్పట్లో దర్శకనిర్మాత బి.ఎ. సుబ్బారావు శోభనాచల స్టూడియోలో దర్శకత్వ విభాగంలో సహాయకుడిగా పనిచేస్తూ వుండేవారు. ఎన్టీఆర్ మేకప్ స్టిల్స్ ఆయన కంటపడ్డాయి. ఆయన మీర్జాపురం రాజా సహకారంతో సొంతంగా ‘పల్లెటూరిపిల్ల’ సినిమా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. రామారావుని అందులో హీరోగా తీసుకుంటానని ఎల్.వి. ప్రసాద్ తో చెప్పారు. కానీ ప్రసాద్ బి.ఎ. సుబ్బారావు ను వారిస్తూ, “అసలే నీకు నిర్మాతగా, దర్శకునిగా అది మొదటి సినిమా. కొత్త హీరోని తీసుకుంటే రిస్కు కావచ్చు. ఇప్పుడు నిర్మిస్తున్న శోభనాచల వారి ‘మనదేశం’ సినిమాలో అతనికి చిన్న వేషం ఇచ్చి చూద్దాం. అన్నీ బాగుంటే అప్పుడు రామారావుని హీరోగా తీసుకుందువు గాని” అని సలహా ఇచ్చారు. ‘మనదేశం’లో పోలీస్ ఇనస్పెక్టర్ వేషంలో రామారావు మెప్పించారు. ఆ చిత్రం 1949 నవంబరులో విడుదలైంది. వేషం చిన్నదైనా ప్రేక్షకులను రామారావు ఆకట్టుకున్నారు. తరవాత బి.ఎ. సుబ్బారావు శోభనాచల సంస్థతో జాయింటు ప్రొడక్షన్ గా ‘పల్లెటూరిపిల్ల’ సినిమా నిర్మాణం ప్రారంభింఛి జంటహీరోలుగా నాగేశ్వరరావు, ఎన్.టి. రామారావును తీసుకున్నారు. సినిమా బాగా ఆడింది. తరవాత విజయా సంస్థ ‘షావుకారు’ (1950) చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఎల్.వి. ప్రసాద్ కు రావడంతో రామారావుని అందులో హీరోగా నటింపజేశారు. ఆ రెండు సినిమాలూ విజయవంత మయ్యాయి. అలా ఈ రెండు సినిమాల్లో రామారావుకు అవకాశాలు రావడానికి ఎల్.వి. ప్రసాద్ దోహదపడ్డారు.

నందమూరి నటజైత్రయాత్ర…
1950 లో రామారావు నటజైత్రయాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర నిర్విఘ్నంగా 35 సంవత్సరాలు కొనసాగింది. ఆ సంవత్సరం టి.ఆర్. సుందరం నిర్మించిన ‘మాయారంభ’లో రామారావు నలకూబరుడు వేషం కట్టారు. అంజలీదేవి కళావతి గా నటించింది. అదే సంవత్సరం సాధనా సంస్థ అధిపతి సి.వి. రంగనాథదాసు అక్కినేని, ఎన్టీఆర్ జంట హీరోలుగా ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ‘సంసారం’ సినిమా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 1951 లో రెండు అద్భుత సినిమాల్లో రామారావు నటించారు. అవి విజయా వారి ‘పాతాళభైరవి’, వాహినీ వారి ‘మల్లీశ్వరి’. పాతాళభైరవి చిత్రం అఖండ విజయాన్ని సాధించి 10 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. అంతే కాకుండా 200 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. మల్లీశ్వరి చిత్రం గొప్ప కళాఖండంగా పేరుతెచ్చుకొని దేశవిదేశాల్లో క్లాసిక్ గా అందరి ప్రశంసలు అందుకుంది. విజయా సంస్థ ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ‘పెళ్లిచేసిచూడు’ (1952) అనే హాస్యభరిత సినిమాని తెలుగు, తమిళభాషల్లో నిర్మించింది. అందులో ఎన్టీఆర్, జి.వరలక్ష్మి నటించగా ఆ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. బెజవాడ దుర్గాకళా మందిర్ లో 182 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. రామారావుకు స్టార్డం పెరిగింది. అప్పుడే రాయలసీమ కరవు నివారణకోసం తోటినటీనటులను కలుపుకొని 24 రోజులపాటు ఆంధ్రరాష్ట్రం మొత్తం పర్యటించి లక్ష రూపాయల నిధులు వసూలుచేసి ప్రభుత్వానికి అందజేశారు. అంతేకాదు 1962లో చైనా దురాక్రమణ జరిగినప్పుడు ప్రధాని పిలుపు మేరకు మరలా జోలె పట్టి పదిలక్షల విరాళాలు సమీకరించి ప్రధానికి అందజేశారు. ఉద్యోగనిర్వహణలో వికలాంగులైన పోలీసు కుటుంబాలకోసం 1965లో ప్రజలనుండి నిధులు వసూలుచేసి అందించిన రామారావు సేవాగుణాన్ని పలువురు మెచ్చుకున్నారు. అదే సంవత్సరం మనదేశం మీద పాకిస్తాన్ దురాక్రమణ జరిపినప్పుడు కూడా పది లక్షల రూపాయలు విరాళాలు పోగుచేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ సమయంలోనే యోగానంద్ మొదటిసారి దర్శకత్వం వహించిన ‘అమ్మలక్కలు’, భానుమతి రామకృష్ణ మూడు భాషల్లో నిర్మించిన ‘చండీరాణి’(1953) చిత్రాలతోబాటు ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలోమూడు తమిళ చిత్రాల్లో రామారావు నటించారు.

సొంత నిర్మాణ సంస్థ ఆరంభం…
1952లో రామారావు ‘నేషనల్ ఆర్ట్స్’ పేరిట సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి మొదటి ప్రయత్నంగా తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘పిచ్చి పుల్లయ్య’ (1953) చిత్రాన్ని నిర్మించారు. సినిమా గొప్పగా ఆడలేదు. 1954 లో యోగానంద్ దర్శకత్వంలో నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ మీద మరో సొంత చిత్రం ‘తోడుదొంగలు’ నిర్మించారు. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయచిత్ర బహుమతి లభించింది. అయితే ఈ సినిమా కూడా ఆర్ధిక విజయాన్ని సాధించలేకపోయింది. అదే సమయంలో వై.ఆర్. స్వామి దర్శకత్వంలో ‘వద్దంటే డబ్బు’ (1954) ద్విభాషా చిత్రం లోనూ, కమలాకర కామేశ్వరరావు తొలిసారి దర్శకత్వం వహించిన విజయావారి చిత్రం ‘చంద్రహారం’ (1954) లోను రామారావు నటించారు. ఇవి కూడా పరాజయం పాలయ్యాయి. బి.ఎ. సుబ్బారావు నిర్మించిన ‘రాజూ-పేద’ (1954) సినిమాకు ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. ‘ఇద్దరుపెళ్ళాలు’ (1954) చిత్రంలో తొలిసారి రామారావు కృష్ణుడి వేషంలో కనిపించారు. పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘రేచుక్క’(1955)సినిమా బాగా ఆడింది. విజయా సంస్థ పూర్తి వినోదభరితంగా ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన ‘మిస్సమ్మ’(1955) చిత్రం సూపర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎస్.ఎమ్. శ్రీరాములు నాయుడు నిర్మించిన ‘అగ్గిరాముడు’ జానపదచిత్రం రామారావుకు మంచిపేరు తెచ్చిపెట్టింది. పి.పుల్లయ్య నిర్మించిన ‘కన్యాశుల్కము’ (1955) లో రామారావు నెగటివ్ షెడ్ వున్న గిరీశం పాత్రను పోషించి రంజింపజేశారు. సొంత బ్యానర్ మీద నిర్మించిన రెండు సాంఘిక చిత్రాలు ఆర్ధిక విజయాన్ని సాధించకపోవడంతో ఈసారి ‘జయసింహ’ (1955) పేరుతో తొలి జానపద చిత్రాన్ని నిర్మించారు. సినిమా అద్భుత విజయాన్ని నమోదుచేసి రామారావు కు సొంతబ్యానర్ మీద చిత్రాలు నిర్మించేందుకు అవసరమైన ధైర్యాన్ని ఇచ్చింది. తరవాత నిర్మించిన ‘పాండురంగ మహాత్మ్యం’ (1957) సినిమా అద్భుత విజయాన్ని నమోదుచేసింది. ఇక ‘సీతారామ కల్యాణం’, ‘గులేబకావళి’ సినిమాల విజయాలగురించి చెప్పనవసరమే లేదు. అటు రాముడుగా, ఇటు రావణాబ్రహ్మగా కూడా రామారావు తన నటపాటవాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నారు. సీతారామకల్యాణం సినిమాకు రామారావే దర్శకత్వం వహించడం విశేషం. అయితే రామారావు టైటిల్స్ లో తనపేరు వేసుకోలేదు.

కృష్ణుడిగా, రాముడుగా నిలిపిన చిత్రాలు…
ఘంటసాల నిర్మించిన ‘సొంతవూరు’ (1956) లో కృష్ణుడుగా రామారావు గెటప్ ప్రేక్షకులకు రుచించలేదు. ‘చరణదాసి’ (1956) చిత్రంలో రాముడి గెటప్ లో కనిపిస్తే తదనంతర కాలంలో లలితాశివజ్యోతి పిక్చర్స్ నిర్మాత శంకరరెడ్డి నిర్మించిన ‘లవకుశ’ చిత్రంలో రామారావు శ్రీరాముడిగా నటించేందుకు ప్రేరణ అయింది. విజయా వారు నిర్మించిన ‘మాయాబజార్’ (1957)లో రామారావుకు గెటప్ మార్చి తీర్చిదిద్దిన కృష్ణుడి పాత్ర యెంత గొప్పగా అమరిందంటే, ఆరోజుల్లో రామారావు చిత్రపటంతోవున్న ఐదు లక్షల క్యాలండర్ లకు ప్రజలు ఫ్రేములు కట్టించి తమ పూజా గదుల్లో పెట్టి పూజలు చేశారు. అగ్రశ్రేణి తారాగణంతో, భారీ పెట్టుబడితో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాయాబజార్ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా నేటికీ విశేష ప్రజాదరణ పొందుతూ వస్తోంది. అంతేకాదు, తరవాతి కాలంలో రామారావు కృష్ణుడి పాత్రలు పోషించేందుకు ప్రేరణగా నిలిచింది. రాముడుగా నటించిన ‘లవకుశ’ రంగుల చిత్రం 26 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. పి.పుల్లయ్య సొంత చిత్రం ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ (1960)లో వేంకటేశ్వరునిగా రామారావు అద్భుతంగా నటించారు. ఆరోజుల్లో ఈ సినిమా ప్రదర్శించే సినిమాహాళ్ళు ఆలయ శోభను సంతరించుకున్నాయి. 1962 నాటికి రామారావు వంద చిత్రాల్లో నటించారు. బి.ఎ. సుబ్బారావు ‘భీష్మ’, విజయావారి ‘గుండమ్మకథ’, పుండరీకాక్షయ్య చిత్రం ‘మహామంత్రి తిమ్మరుసు’, సుందర్లాల్ నహతా వారి ‘రక్తసంబంధం’ వంటి సినిమాలు విడుదలై ప్రజాదరణ పొందాయి. చేతికి అందివచ్చిన పెద్దకుమారుడు 1962లో అకాలమరణం చెందడం రామారావు ను మానసికంగా కుంగదీసింది. 1963లో రామారావు 14 సినిమాలలోను, 1964లో 16 సినిమాల్లోనూ నటించారు. వాటిలో ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’, ‘అగ్గిపిడుగు’ సినిమాలు కూడా వున్నాయి. ఈ రెండు సంవత్సరాలలో విడుదలైన అధికశాతం సినిమాలు విజయాన్ని సాధించాయి. అలా రామారావు నట ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోయింది. 1968 లో రామారావు, నాగేశ్వరరావు ఇద్దరికీ ఒకే సారి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. హైదరాబాదులో ఎన్.టి.ఆర్ ఎస్టేటు, రామకృష్ణ 70 ఎం.ఎం, 35 ఎం.ఎం జంట థియేటర్ల నిర్మాణం జరిగింది. దీంతో రామారావు కు హైదరాబాదుతో అనుబంధం పెరిగింది. ‘దానవీరశూర కర్ణ’ (1977)లో మూడు పాత్రలు (కర్ణుడు, సుయోధనుడు, కృష్ణుడు), శ్రీమద్ విరాటపర్వం చిత్రంలో 5 పాత్రలు పోషించి సత్తా చాటారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ (1991), ‘సామ్రాట్ అశోక’ (1992) వంటి చిత్రాలు నిర్మింఛి, తనను ఎంతగానో అభిమానించే మొహన్ బాబు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’ (1993) చిత్రంతో నటనకు స్వస్తి చెప్పారు.

రాజకీయంలో రాణించి…
రామారావు జీవితంలో మలిప్రస్థానం రాజకీయ నాయకుడిగా విశిష్ట పాత్ర పోషణ. ‘ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం’ అనే నినాదంతో రామారావు మార్చి 29, 1982 న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 40 రోజులపాటు రాష్ట్రమంతా అవిశ్రాంతంగా పర్యటించి 1983 ఎన్నికల్లో పోటీచేసి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు లేవదీసిన రాజకీయ సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని, సెప్టెంబరు 16 న మరలా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బర్తరఫ్ అయిన నెలరోజుల్లోనే తిరిగి పీఠాన్ని నిలుపుకోవడం భారత రాజకీయ చరిత్రలో రామారావు ఒక్కడికే దక్కింది. భార్య బసవరామ తారకం ఈ సంక్షోభ సమయంలోనే క్యాన్సర్ మహమ్మారి తో మరణించింది. ఒక ప్రాంతీయ పార్టీ గా ఆవిర్భవించిన పార్టీ పార్లమెంటులో 30 సీట్లను గెలుచుకోవడం ఒక రికార్డుగా నిలిచింది. 1989 లో కాంగ్రెసేతర పార్టీలను ఒక్క తాటిమీదకు తెచ్చి నేషనల్ ఫ్రంటు ఏర్పరచి, దానికి చైర్మన్ గా వ్యవహరించి రామారావు కేంద్రంలో చక్రం తిప్పారు. పుట్టినదగ్గరనుంచి తుదిశ్వాస విడిచేవరకు అలుపెరుగని ఆ మహాయోధుడు 1996 జనవరి 18 న మహాభినిష్క్రమణ చేశారు. ఆయన మరణంతో రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ మరణం ఒక యుగపురుషుని జీవిత ప్రస్థానానికి ముగింపు పలికింది.

మరిన్ని విశేషాలు…
పాతాళభైరవి చిత్రంలో తన సహచరుడుగా నటించిన బాలకృష్ణ మద్యానికి బానిసై షూటింగులకు ఆలస్యంగా రావడంతో అతణ్ణి తనచిత్రం నుంచి తప్పించాలని ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తే, దానివలన అతని కుటుంబానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయని ఆ ప్రయత్నాన్ని వారించి, బాలకృష్ణ ను ఇంటికి పిలిచి రామారావు మందలించారు. ఆ తరవాత బాలకృష్ణ ఏనాడూ షూటింగుకి ఆలస్యంగారాలేదు. అలా మానవత్వ విలువల్ని కాపాడే వ్యక్తిత్వం మూర్తీభవించిన మనీషి ఈ తారకరాముడు.

సినిమాల్లో మారువేషాలు వేయడం రామారావు కి ఇష్టం. అది జానపదమైనా, సాంఘికమైనా ఒకటి లేక రెండు మారువేషాలు ఉండేలా స్క్రిప్టు తయారు చెయ్యమని రచయితలకు ప్రత్యేకంగా చెప్పేవారు. విజయవాడలోని దుర్గా కళామందిర్ కి రామారావు కు అవినాభావ సంబంధం వుంది. రామారావు తొలి చిత్రం ‘మనదేశం’ చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ ఈ చిత్రశాలలోనే ఆడాయి. అంతేకాదు, రామారావు నటించిన అధికశాతం సినిమాలు(63) ఆడింది ఈ సినిమా హాలులోనే కావడం విశేషం.

రామారావుది క్రమశిక్షణ గల జీవితం. ఉదయం నాలుగు గంటలకే లేచి వ్యాయామం, యోగాసనాలు వేసి, కాలకృత్యాలు తీర్చుకొని, ఉదయం ఆరు గంటలకే భోజనం చేసిమేకప్ చేసుకొని ఆరున్నరకే తయారై కూర్చొని, తన సొంత సినిమాల విషయాలు చూసుకునేవారు. షూటింగుకి ఏనాడూ ఆలస్యంగా వెళ్ళలేదు. నిర్మాతకు ఏనాడూ తనవలన ఇబ్బంది కలిగే అవకాశం ఇవ్వలేదు.

స్టూడియోలో షూటింగులకు రామారావుకు సొంత కుర్చీ తెచ్చుకోవడం అలవాటు. ఆయనకంటే ముందే సెట్ లోకి కుర్చీ వచ్చిందటే రామారావు వస్తున్నట్లే. వెంటనే సెట్లో వాళ్ళంతా అలర్టై లేచి నిలబడేవారు. తన కుర్చీమీద ఎన్.టి.ఆర్ పేరు అందంగా కుట్టివుండేది. కుర్చీతోబాటు ఒక కంచు మరచెంబు నిండా మంచి నీళ్ళు, గ్లాసు, వెండి కంచం వచ్చేవి. అవసరమైతే ఇంటినుంచి మంచినీళ్ళ బిందె కూడా వచ్చేది. మంచినీళ్లలో తేనె కలుపుకొని తాగడం రామారావుకి అలవాటు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “తెలుగుజాతి యుగపురుషుడు…తారక రాముడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap