సురభి-100 : ఎన్.టి.ఆర్. సందేశం

Surabhi 100-Logo

సురభి నాటక శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ 1989లో ప్రచురించిన ప్రత్యేక సంచిక లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. రాసిన సందేశం…. ఇక్కడ చదవండి…

సందేశం…
ఆంధ్ర నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన ఘనత సురభ వారిది. నాటకం ప్రజలకు వినోదాన్నిచ్చే ప్రధాన కళగా వున్న దశలో పరిమతమైన సంస్థల పరిమితమైన ప్రదర్శనల స్థాయి నుంచి నాటకాన్ని విస్తృతీకరించి ప్రజా జీవవంలో ముఖ్యమైన ప్రదర్శన కళగా పరివ్యాప్తం కావడానికి పట్టణాలను దాటుకుని పల్లెలకు సైతం విస్తరించడానికి, సామాన్యులకు చేరువగా నాటకరంగం చొచ్చుకు పోవడానికి సురభి సంస్థలు బహుధా ప్రశంపనీయమైన పాత్ర వహించాయి. తెలుగు ప్రజల్లో నాటక కళపట్ల అభిమాన ఆదరణలు పెల్లుబకడానికి, ఊరూరా కళాకారులు తయారు కావడానికి, నాటక కళలో అంతర్భాగాలుగా గాత్రం, వాయిద్యం, సంగీతం, చిత్రకళ, దుస్తులు, ఆహార్యం మొదలయినవి. అభివృద్ధి చెందడానికి సురభి నాటక ప్రదర్శనలు విశేషంగా దోహదంచేసాయి. ఒక శతాబ్ది కాలంగా తెలుగు ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయి, తెలుగు ప్రజల కళాభిరుచిని ప్రోదిచేసి, ఉద్దీపం చేసి ఆబాల గోపాలాన్ని అలరించి, ఆనందింపజేసి వినోదాన్నేగాక పౌరాణిక పరిజ్ఞానాన్ని, భక్తి తత్పరతనీ కలిగించడానికి సురభి నాటక ప్రదర్శనలు తోడ్పడ్డాయి.

నాటకాన్ని వృత్తిగా స్వీకరించి, సంచార కుటుంబ నాటక ప్రదర్శనా సంస్థలుగా వందేళ్ల చరిత్ర గలిగిన సురభి వంటి సంస్థలు ప్రపంచంలో మరెక్కడా వున్న దాఖలాలు లేవు. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వల్ల వెలసిన సినిమా, టె.వీ.ల పోటీలను తట్టుకుని యిన్నేళ్లు మనగలగడమే గొప్ప. ఎన్నో ఆటుపోటులను తట్టుకుంటూ, ఈతి బాధల్ని అనుభవిస్తూ ఒక ఉద్యమ స్ఫూర్తితో నాటకరంగానికి సేవ చేస్తున్న వివిధ సురభి సంస్థల వారిని, కళాకారులను, సాంకేతిక వేత్తలను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.

-యన్.టి.రామారావు,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
నవంబర్, 1989

SA: