సుదీర్ఘమైన కళాయాత్రలో నూతలపాటి

తెలుగు నాటక ప్రేమికుల కందరికీ
ఎంతో ఇష్టమైన పేరది!
తెలుగు నాటక నటీనటులందరూ
ఎంతో ప్రేమించే పేరది!
తెలుగు నాటక నిర్వాహకులందరికీ
తలలో నాలికలా నిలిచే పేరది!
తెలుగు నేలలో జరిగే ప్రతీ కళాపరిషత్తులో
తప్పక విన్పించే పేరది!
తెలుగు నాట గత అరవై సంవత్సరాలుగా
నాటకంతో కలిసి సాగుతున్న పేరది!
తెలుగు నాటక వర్తమాన చరిత్రలో
అసంఖ్యాకమైన సత్కారాలందుకొన్న పేరది!
ఆ పేరే సాంబయ్య…!!
నూతలపాటి సాంబయ్య!!!

పేరులో ఏముంది? అంటారు కొందరు!
కానీ.. ఆ పేరులోనే అంతా వుంది.
సాంబయ్య అంటే శివుడు. సమస్త కళలకూ ఆరాధ్యుడు పరమశివుడు
నటరాజ రూపంలో పరమ శివుడి తాండవం నుండే, సకల కళాప్రపంచం ఆవిర్భవించింది.
పరమశివుడి వాత్సల్య పూరితమైన దృక్కులనుండే, సమస్త కళాసృష్టికీ ఆశీస్సులు అందుతాయి.
కళా ప్రపంచీకు లందరికీ స్ఫూర్తిప్రదాత పరమేశ్వరుడే. అటు వంటి పరమేశ్వర నామాన్ని,ఆ సాంబవుడి… ఆ సదాశివుడి..

ఆ నటరాజు నామాన్ని ఎందుకు పెట్టారోకానీ, నూతలపాటి సాంబయ్య ప్రయాణం మాత్రం, గత అరవై ఏళ్ళుగా, నాటకంతో విడదీయరానిదిగా ముడిపడిపోయి, నాటకంతో కలిసి సాగుతూ, తెలుగు నాటకానికున్న విశేషణాలలో ఒక్కటై, తుదకీ నాటికి పర్యాయపదంగా విన్పిస్తోందనడంలో అతిశయోక్తి లేదు.

నిజానికి ఈనాడు తెలుగు నాటక కళాకారులలో ఆయనపేరు విననివారు ఉండరు. ఈనాటి నాటకరంగ ప్రసిద్ధులలో ఆయనతో పరిచయం లేనివారు ఎవరూ కనరారు. అంతకన్నా ముఖ్యంగా, నూతలపాటి సాంబయ్యను సత్కరించి, సంతోషించని కళాపరిషత్ లు కూడా అరుదేననడం అన్ని విధాల సమంజసం.

తెలుగు నాటకానికి ఆదినుండీ ఊపిరు లూదిన గుంటూరు జిల్లాలో నేటి దాచేపల్లి మండలం. నడికుడిలో 1939 జూన్ 19న సాంబయ్య జన్మించారు. కీ॥శే॥ నూతలపాటి కోటమ్మ, కోటయ్యలు వీరి తల్లిదండ్రులు.

తెలుగు గ్రామీణ తత్త్వం అని మాచిన్ననాట మా గ్రామంలో ఒక వేదాంతి ఒక తత్త్వాన్ని రోజూ గానం చేసేవాడు. అందులో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయా లుండేవి. ఆ చిన్న వయసులో నేను రోజూ, ఆ తత్త్వాల్ని వినేవాడిని. అందులో అన్నీ గుర్తులేవుకానీ… సాంబయ్యగారి జననీ జనకుల గురించి చెప్పినప్పుడు, ఒకటి మాత్రం గుర్తొచ్చింది. తల్లిదండ్రుల పేర్లు ఒక్కటిగా వుంటే, పిల్లలకి అనంతమైన కీర్తి. అపారమైన గౌరవం, నూరేళ్ళ నిండు జీవితం లభిస్తాయిట. నా చిన్ననాట,
ఆ గ్రామీణ వేదాంతి నుండి విన్న తత్త్వ రహస్యం, ఈనాడు నూతలపాటి సాంబయ్య విషయంలో సత్యమయ్యింది.

నూతలపాటి సాంబయ్య విద్యాభ్యాసం అంతా కృష్ణా, గుంటూరు జిల్లాలోనే జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు తన పదిహేనవ ఏట రంగస్థలంపై తళుక్కున మెరిశారు సాంబయ్య.’అలెగ్జాండర్’ ఏక పాత్రలో ఆయన ప్రతిభ అందరి ప్రశంసలందుకొంది.’చెంచునాయకుడు’ వారి మరో ఏకపాత్ర. బందరులో చదువుకొంటున్నప్పుడే, అంతర్ కళాశాలల సాంస్కృతికోత్సవాలలో భమిడిపాటివారి ‘మనస్తత్వాలు’ నాటికకు దర్శకత్వం వహించి, సమర్థవంతంగా ప్రదర్శించడం, ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకత్వానికి బహుమతులందు కోవడం, కళాశాల యాజమాన్యం చేత సత్కారమందుకోవడం… అదిగో అరవై ఏళ్ళ క్రిందట ఆరంభమైన ఆయన సత్కార స్వీకరణ యాత్ర, నేటి వరకూ అవిచ్ఛిన్నంగా, అనంతంగా కొనసాగుతూనే వస్తోంది.

కొందరి జీవితాలలో అనుకోకుండా జరిగిన చిన్న సంఘటనలే వారి భవిష్యత్తుకు శుభ సూచకాలుగా పరిణమిస్తాయి. సాంబయ్య విషయంలోనూ అదే జరిగింది. తొలినాటి ఉద్యోగపు రోజుల్లో వారి బోధనా పటిమకు, అంకితభావానికి మెచ్చి, వారిని ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించి గవర్నరు గారు సత్కరించారు. ఆ సత్కారంలో వారికి లభించిన బహుమతి ఏమిటో తెలుసా? అది నాటక రచయితగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన విలియం షేక్స్పియర్ రచించిన నాటకాలన్నిటికీ సంకలనం. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి?

నూతలపాటి సాంబయ్య నాటక ప్రస్థానం నాలుగు స్తంభాలమీద నిలిచిన ధృడమైన మహాభవనం. అందులో మొదటిది ఆయన నటన. సాంబయ్య తొలి నుండీ ప్రధానంగా నటుడు. ఏకపాత్రలలో ఆరంభమైన ఆయన నటప్రయాణం, ఆ తరువాత నాటికలకు, నాటకాలకు విస్తరించి, ఎన్నో నాటికలలో, నాటకాలలో ఎన్నో మంచి పాత్రల్ని పోషించి, ఎన్నోమార్లు, ఎన్నో వేదికల పైన, ఉత్తమ నటుడి బహుమతులందు కొన్నారు. ప్రేక్షకుల చేత శ్లాఘించబడ్డారు. ‘మాస్టర్’ నాటకంలో శేఖర్ పాత్రకు ఉత్తమ నటుడిగా తొలిరోజుల్లోనే ఆయనకు గొప్ప గుర్తింపు లభించింది.’సమాజం మారాలి’ నాటకంలో ఫణిభూషణరావు పాత్రలో ఆయన ప్రదర్శించిన ప్రతిభకు ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా ఎన్నో బహుమతులు లభించాయి.’రాగరాగిణి’లో కేప్టన్ పతి పాత్రలో వారికి ఉత్తమ నటుడిగా ఎంతో గుర్తింపు లభించింది. ‘మూగవోయిన దేవుడు’ నాటికలో గంగులు పాత్రలో ఉత్తమ విలన్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.

సాంబయ్యగారి కళాయాత్రలో మరొక పార్శ్వం… దర్శకత్వం కళాశాలలో చదువుకొనే రోజుల్లోనే ఆయన దర్శకత్వ కథ ఆరంభమై, ప్రేక్షక జనాదరణనందుకొన్న విషయం మీరింతకుముందే చదివారు. కదా! ఆ తరువాత అనేక నాటికలకు, నాటకాలకు ఆయన దర్శకత్వం వహించి, అవిశ్రాంతంగా నాటకాన్ని పండించారు. ఇదేమిటి, పల్లెపడుచు, అభిమానం, ఛైర్మన్, కెరటాలు, ఇలలోని దేవతలు, నగ్న శిల్పం, గీతోపదేశం, వందే మాతరం, గాలివాన, రాగరాగిణి, పునర్జన్మ, శివరంజని, పెండింగ్ ఫైల్, మనస్తత్వాలు, అక్షింతలు, శిరోమణి, క్షమార్పు, సరస్వతీ నమస్తుభ్యం, సమాధికడుతున్నాం చందాలివ్వండి, దంత వేదాంతం, మనుషు లొస్తున్నారు జాగ్రత్త…ఇలా…ఎన్నో… ఎన్నెన్నో నాటికలతో, నాటకాలతో తన కళాజీవితాన్ని పండించు కొన్నారు నూతలపాటి సాంబయ్య. ఒకవైపు దర్శకత్వం వహిస్తూనే, నాటికలకు, నాటకాలకు రూపకల్పన చేస్తూనే, మరోవైపు ఎన్నెన్నో గొప్ప పాత్రల్ని పోషించారు. అసంఖ్యాకమైన బహుమతుల్ని, అపారమైన ప్రేక్షకాదరణని అందుకొన్నారు.
తన దర్శకత్వంలో ఎందరినో గొప్ప నటీనటులుగా తీర్చిదిద్దారు.

నూతలపాటివారి సుదీర్ఘమైన కళాయాత్రలో మరో చెప్పుకోదగ్గ గొప్ప అంశం… ఆయన గుణ నిర్ణయం. నిష్పక్షపాతంగా గుణనిర్ణయం చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఎన్నో కళాపరిషత్తులు గుణనిర్ణేతగా వారిని ఆహ్వానించి, గౌరవించాయి. సత్తెనపల్లిలోని ప్రగతి కళాపరిషత్ పేరు చెప్పగానే మనకు ఈయనే గుర్తొస్తారు. కావలి, చలపాడు, మాచర్ల, క్రోసూరు, మాదల, నరసరావుపేట, అచ్చంపేట, పొన్నూరు, పొనుగుపాడు, గుంటూరు, బాపట్ల, కాకుమాను, నాగులపాలెం, విజయనగరం, విశాఖపట్నం, పిడుగురాళ్ళ వంటి ప్రదేశాలలో అనేక నాటక పరిషత్తులలో గుణ నిర్ణేతగా ఉత్తమమైన న్యాయనిర్ణయం చేశారు. అన్నీ గొప్పవే అయినా,
గుణ నిర్ణేతగా ఆయన ప్రయాణంలో చెప్పుకోదగినవి. రెండు. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాలకు ప్రాథమిక పరిశీలనకు గుణ నిర్ణేతగా మంచి నాటికలను, నాటకాలను ఎంపిక చేయడం. ఇక రెండోది ప్రవాసాంధ్ర నవ్య కళాపరిషత్, ఖర్గపూర్ లో (పశ్చిమ బెంగాల్) నిర్వహించిన నాటిక పోటీలకు గుణనిర్ణేతగా ప్రవాసాంధ్రులందరి మన్ననలందు కోవడం. వీటన్నిటికి తోడుగా నాటకాన్ని వైభవోపేతంగా చూపపించిన భారతీయానికి కూడా గుణ నిర్ణేతగా వ్యవహరించడం… నిజంగా ఇదంతా ఆయనకు లభించిన అదృష్టమనే అనుకోవాలి.

నూతలపాటి కళాప్రస్థానంలో అన్నింటి కన్నా మిన్నగా చెప్పుకోదగ్గది ఆయనకు లభించిన సత్కారాలు, సన్మానాలు. వర్తమాన తెలుగు నాటక ప్రముఖుల్లో… ఇన్ని సత్కారాలు పొందిన వారు అరుదుగా కనిపిస్తారు. ఒకవేళ అటువంటి వారు ఉన్నా, తనకు లభించిన సన్మాన, సత్కారాల్ని తేదీల వారీగా, క్రమపద్ధతిలో రిజిస్టరుచేసి, భద్రపరచినవారు దాదాపుగా వుండరేమో? నిజంగా ఈ విషయంలో సాంబయ్య గారు. అభినందనీయులు. నాటకం ఎంత ముఖ్యమో, నాటక పరిణామ చరిత్రకూడా అంతే ముఖ్యం. భావితరాలకు నాటక చరిత్ర నిర్మాణంలో ఇలా భద్రపరచిన అంశాలే అన్ని విధాల సహకరిస్తాయి. ఎన్నో విధాలుగా సాయపడతాయి.

1963లో ‘మనస్తత్వాలు’ నాటికకు బహుమతులు వచ్చిన సందర్భంగా కాలేజి యాజమాన్యం చేత సత్కరించబడిన సాంబయ్యగారి సత్కార యాత్రలో వందలాది సత్కారాలు, సన్మానాలు కన్పిస్తాయి. దాదాపుగా పేరొందిన ప్రతి వేదికా ఆయనను సత్కరించాయి. ప్రతి కళాపరిషత్ వారి కృషిని అభినందించాయి. వారి సత్కార, సన్మాన సంఘటనల్లో చెప్పుకోదగ్గవి అనేకం ఉన్నాయి.

1972లో నెల్లూరులోని నెఫ్జా నాటక కళాపరిషత్ లో ‘మూగవోయినదేవుడు’ నాటికలో ఉత్తమ విలన్ గా ఎంపికై, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుగారి చేతుల మీదుగా బహుమతి నందుకొని సత్కారం స్వీకరించడం. ఆయన తొలినాటి సత్కారాలలో చెప్పుకోదగ్గది. 1991లో క్రోసూరు కళాంజలి వారి
నాటకోత్సవాలలో నూతలపాటివారిని ‘దర్శకబ్రహ్మ’ బిరుదుతో సత్కరించడం ఆయన కళాప్రస్థానంలో
మరో మైలురాయి. 2000వ సంవత్సరంలో హాస్యబ్రహ్మ జంధ్యాల చేతుల మీదుగా ‘కళాసారథి’ బిరుదు పొందడం ఆయన అందుకున్న సత్కారాలలో చెప్పుకోదగ్గది. 2004లో గుంటూరులో అందుకొన్న ‘నాటక బంధు’ బిరుదు, 2006లో హైదరాబాదులో పొందిన ‘కళాకౌశల’ పురస్కారం, 2009లో కాకుమాను వారు అందించిన ‘రంగస్థల సేవా సత్కారం’, 2009 లో ఏలూరులో ఇచ్చిన ‘సేవాతపస్వి’ అవార్డ్, 2010లో విశాఖపట్నంలో అందించబడిన ‘ఆంధ్రకళారత్న’, ఇలా ఎన్నో గౌరవాలు, సత్కారాలు సాంబయ్యగారి స్వంతమయ్యాయి- ఇంకా స్వంతమవుతూనే ఉన్నాయి.

తెలుగు నాటకానికి జీవితాంతం సేవచేసిన ఎందరో, కనీస గుర్తింపుకు కూడా నోచుకో కుండా జీవన రంగస్థలంనుండి అనామకంగా నిష్క్రమిస్తుంటారు. వేలాదిమంది కళాకారుల్లో ఏకొద్దిమందికో ఇంతటి గౌరవ సత్కారాలు, అభినందన సన్మానాలు లభిస్తాయి. వారు నిజంగా అదృష్టవంతులు.
కళామతల్లి చల్లని చూపు వారిపై ప్రసరించడం వల్లనే వారికి ఆ అదృష్టం. అంత గౌరవం.
అందుకే… నూతలపాటి సాంబయ్యగారు నిజంగా ఎంతో అదృష్ట వంతులు.
ఇంతకన్నా భాగ్యం మరేముంది?
ఓ కళాకారుడికి….!

-వాడ్రేవు సుందర్రావు,
నంది, గరుడ అవార్డుల గ్రహీత,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap