సుప్రసిద్ధ రంగస్థల సినీ నటులు, రసమయి చెరువు జమ్ములపాలెం వ్యవస్థాపకులు, దర్శకులు నూతలపాటి సుబ్బారావు(77) అకస్మాత్తుగా 19.09.2021 ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించారు.
ఎ.శివరామరెడ్డి గురుత్వాన నటనాలయంలో నాగభూషణం పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో పులీ మేకలొస్తున్నాయి, ఆ ఉదయమెప్పుడో, గరీబి హఠావో వంటి నాటికలను పరిషత్ లలో ప్రదర్శించి పలు అవార్డులు సాధించారు.
అటు పిమ్మట విఖ్యాత నటరచయిత, దర్శకులు డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారి కళావనిలో చేరి వారి శిక్షణలో కొత్త చిగురు, లోక సంగ్రహం, ఆరని పారాణి, కక్ష, మిగిలిన చరిత్ర, భాయీ భజరంగ్, యథా రాజా తథా ప్రజా ఇత్యాది నాటిక నాటకాల్లో కీలక భూమికలు ధరించి ఎనలేని కీర్తి పొందారు. వీరింకా kst శాయిగారి దర్సకత్వంలో కావమ్మ మొగుడు, క్షంతవ్యులు, అక్షింతలు నాటికల్లో నటించి పేరొందారు.
నూతలపాటి చలనచిత్రసీమలో ప్రవేశించి గ్యాంగ్ లీడర్(ఇంటి ఓనర్), ఎర్ర మందారం(ఎస్సై) ఇత్యాది పలు చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందారు.
గ్రామీణప్రాంతాల్లో నాటక వికాసానికి విశేష కృషి చేసిన సుబ్బారావుని ప్రభుత్వం కందుకూరి పురస్కారంతో గౌరవించగా, అనేక సంస్థలు సత్కరించి నటభూషణ ఇత్యాది బిరుదులనేకం ప్రదానం గావించాయి.
సినీ రంగస్థల నటులు, రచయిత, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత kst శాయి, నటప్రయోక్త, సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు మన్నె శ్రీనివాసరావు, నటనాలయ చేరువుజమ్ములపాలెం ఊట్ల బుడ్డయ్య చౌదరి, అడ్డగడ శివ భాస్కరరావు, నరసింగ్ ప్రసాద్, DH.V.రెడ్డియ్య, కారుమూరి సీతారామయ్య(పర్చూరు), దర్భా బాబూరావు, సంకా వెంకట్ రాంకుమార్ ప్రభృతులు సంతాప సందేశాలు అందించారు.